Rakta Kanniru: చెక్కుచెదరని రక్త కన్నీరు రికార్డు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:30 AM
ఒకే ఒక టీమ్, ఒకే ఒక వ్యక్తి సారథ్యంలో 1956 నుండి 1986 మధ్య కాలంలో 5432 ప్రదర్శనలతో టికెట్ పెట్టి మరీ ప్రజల్ని రప్పించిన నాటకం రక్త కన్నీరు. దీన్ని అంత విజయవంతంగా నడిపిన చుండి నాగభూషణం పేరు దరిమిలా ‘రక్తకన్నీరు నాగభూషణంగా మారిపోయింది...
ఒకే ఒక టీమ్, ఒకే ఒక వ్యక్తి సారథ్యంలో 1956 నుండి 1986 మధ్య కాలంలో 5432 ప్రదర్శనలతో టికెట్ పెట్టి మరీ ప్రజల్ని రప్పించిన నాటకం ‘రక్త కన్నీరు’. దీన్ని అంత విజయవంతంగా నడిపిన చుండి నాగభూషణం పేరు దరిమిలా ‘రక్తకన్నీరు నాగభూషణం’గా మారిపోయింది. పాతికేళ్ల కాలం పాటు తెలుగు రాష్ట్రాల్లో అప్రతిహాత విజయాలతో సంచలనం కల్గించిన ఈ నాటకానికి మాతృక తమిళంలో యం. ఆర్. రాధా ప్రదర్శించిన ‘రక్త కన్నీర్’. అప్పట్లో రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లి చిన్నా చితకా వేషాలు మాత్రమే వేస్తున్న నాగభూషణం యం.ఆర్. రాధా ‘రక్త కన్నీర్’ నాటకాన్ని చూశారు. దానికి స్క్రిప్ట్ ఏదని అడిగితే స్క్రిప్ట్ లేదు, కాపీ రైటూ లేదు. దాంతో పాలగుమ్మి పద్మరాజు గారితో కలిసి అనేకసార్లు యం.ఆర్. రాధా నాటకాన్ని చూసిన నాగభూషణం ఆయన చేతే స్క్రిప్ట్ రాయించుకుని జైత్రయాత్ర ప్రారంభించారు.
ఈ నాటకం ప్రదర్శన ప్రదర్శనకూ డైలాగులు మారి పోతాయి. స్థానిక రాజకీయాలపైన, నాయకులపైన సెటైర్లు, చెణుకులు విసురుతూ జనరంజకంగా ప్రదర్శనలను రూపుదిద్దేవారు నాగభూషణం. ఈ నాటకంపై ఆధారపడి 50– 60 కుటుంబాలు బతికేవి. నటీనటులు సాంకేతిక సిబ్బంది ఒక బస్సు లోనూ, ఆ వెనుక నాగభూషణం దంపతులు ఒక కారు లోనూ బయలుదేరేవారు. ప్రముఖ నటీమణులు వాణిశ్రీ, శారదలు మొదట్లో ఈ నాటకంలో నటించారు. డబ్బింగ్ జానకి, తెలంగాణ శకుంతల కూడా నటించారు. ప్రజా నాట్యమండలి కళాకారుడు బి. గోపాలం సంగీతం సమకూర్చేవాడు. నాటకంలో సుందరి పాత్ర కోసం ఎన్నుకున్న సీత అనే నటినే నాగభూషణం తన జీవిత భాగ స్వామిగా చేసుకున్నారు.
క్లుప్తంగా ఈ నాటక కథ – జమీందారీ కుటుంబానికి చెందిన గోపాలం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి పాశ్చాత్య సంస్కృతిని నరనరానా జీర్ణించుకుని భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ఈసడించుకుంటూ సుందరి అనే వేశ్య వలలో పడతాడు. తల్లి పోరు పడలేక అయిష్టంగా ఇందిరను పెళ్లి చేసుకొని శోభనం రోజే ఆమెను వదిలేస్తాడు. సర్వసంపదలను సుందరికి కైంకర్యం చేసి చావుబతుకుల్లో ఉన్న తల్లిని చూడటానికి కూడా వెళ్లడు. గోపాలానికి కుష్టువ్యాధి సంక్రమించటం, సుందరి ప్రమాదంలో మరణించటం, ఆ ఇంట్లోవాళ్లు ఇతణ్ణి బయటకు గెంటటం, భిక్షగాడిగా మారిన గోపాలం అంత్యదశలో భార్య ఇందిరను గుర్తించి క్షమాపణ కోరి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన మిత్రుడు రమణతో ఇందిరకు పెళ్లి చేసి కన్నుమూయడం... ఇదీ దీని కథ.
పురుషుల చెడు వ్యసనాలకు బానిసలై, ధనమదం, అహంకారంతో సాంసారిక జీవితాన్ని నాశనం చేసుకొంటూ స్త్రీల రక్త కన్నీరుకు కారణం కాకూడదనే ముగింపు గొప్ప సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చింది. తన స్వంత ఊరైన నెల్లూరులో మొదటి ప్రదర్శనతో ప్రారంభించి చివరి ప్రదర్శనను కూడా నెల్లూరు లోనే ముగించారు నాగభూషణం. ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బులో ఖర్చులు, నటీనటుల భత్తెం పోను మిగిలిన డబ్బుని ఆయా ప్రాంతాలలోని కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా సంఘాలకి పంచటమే గాక 70 దశకంలో పునర్నిర్మాణం గావించబడిన ప్రజా నాట్యమండలికి 19 సంవత్సరాల పాటు అధ్యక్షునిగా కూడా పని చేసి 1993లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ‘రక్త కన్నీరు’ నాటకం విజయ పరంపర కారణంగా సినిమాల్లో కూడా నాగభూషణానికి ముఖ్యమైన పాత్రలు వచ్చాయి. ఐతే అక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి నెలా మొదటివారం మాత్రం సినిమాలకు కాల్షీట్లు ఇవ్వననే షరతుతో ఆ వారాన్ని నాటక ప్రదర్శనకు కేటాయించేవారు. 350 చిత్రాల్లో నటించిన నాగభూషణం ప్రతి నాయకుడి పాత్రకు అప్పటి వరకు ఉన్న ఫైటింగ్‌లు కత్తయుద్ధాలనే ఇమేజ్‌ని పక్కకు పెట్టి ‘కన్నింగ్ విలనిజాన్ని’ ప్రవేశపెట్టారు. నాగభూషణం తర్వాత రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్ తదితరులు ఈ ఒరవడిని కొనసాగించారు. ‘రక్త కన్నీరు’ నాటకాన్ని యం.ఆర్. రాధా తమిళంలో చలనచిత్రంగా నిర్మించి తెలుగు లోకి డబ్ చేయగా, యం.ఆర్. రాధాకు తెలుగులో నాగభూషణమే డబ్బింగ్ చెప్పారు. మళ్లీ తెలుగులో ఇలాంటి నాటకం రావాలని కోరుకుందాం.
-చెరుకూరి సత్యనారాయణ
Updated Date - Jun 30 , 2025 | 12:39 AM