Punjab Religious Law: శాసన వివేకం
ABN, Publish Date - Jul 19 , 2025 | 01:53 AM
పొరుగు దేశం పాకిస్థాన్‌లో పవిత్ర గ్రంథాలు, పవిత్ర ప్రదేశాలు, పుణ్య పురుషులను అగౌరవపరిచినట్టు ఆరోపణలు ఎదుర్కొనే వారికి విధించే ..
పొరుగు దేశం పాకిస్థాన్‌లో పవిత్ర గ్రంథాలు, పవిత్ర ప్రదేశాలు, పుణ్య పురుషులను అగౌరవపరిచినట్టు ఆరోపణలు ఎదుర్కొనే వారికి విధించే అసాధారణ శిక్షలను గమనిస్తే మత భావోద్రేకాల కాఠిన్యత విస్మయపరుస్తుంది. ఇటువంటి ధర్మోల్లంఘన చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు మన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ‘పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ ఎగెనిస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్– 2025’ను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా శాసనసభలో ప్రవేశపెట్టారు. శ్రీగురు గ్రంథ్ సాహిబ్, శ్రీమద్ భగవద్గీత, హోలీ బైబిల్, ఖురాన్ షరీఫ్‌తో సహా ఏ మత పవిత్ర గ్రంథాలనైనా అపవిత్రం చేస్తే పది సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదు నుంచి పది లక్షల రూపాయల జరిమానా విధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఏ పవిత్ర గ్రంథాన్ని అయినా చింపివేయడం, కాల్చివేయడం, ధ్వంసం చేయడం, వికృతం చేయడం, వివర్ణం చేయడం, మౌఖికంగా లేదా భౌతికంగా అగౌరవపరచడాన్ని నేరంగా పరిగణించాలని ఆ బిల్లు పేర్కొంది. మత సామరస్యాన్ని సంరక్షించేందుకు, పంజాబ్లో నివసిస్తున్న భిన్న మతాల అనుయాయుల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. భారత్‌లో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని ముఖ్యమంత్రి మాన్ సగర్వంగా ప్రకటించారు.
ఒక మత వ్యవస్థలో పవిత్రమైనవిగా భావించే వాటిని అగౌరవపరచడం సహజంగానే సంబంధిత మతస్థుల మనసులను గాయపరుస్తుంది. అక్టోబర్ 12, 2015న ఫరీద్‌కోట్ జిల్లాలోని బర్గారీ గ్రామంలో, సిక్కు మత పవిత్ర గ్రంథం శ్రీగురుగ్రంథ్ సాహిబ్ నుంచి చింపిన పేజీలను కనుగొన్నారు. ఇది పంజాబ్ అంతటా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ సందర్భంగా పోలీసు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తదాది పంజాబ్‌లో ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి ధర్మోల్లంఘన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల పరంపర పంజాబ్ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశాయి. పర్యవసానంగా 2017 ఎన్నికలలో అకాలీదళ్– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పరాజయం పాలయింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మతపరమైన భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి విఫలమయింది. కొత్తగా రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ యాదృచ్ఛికంగా లబ్ధి పొంది 2022లో అధికారానికి వచ్చింది. అకాలీ–బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఈ ధర్మోల్లంఘన సంఘటనలను అరికట్టేందుకు కఠినమైన బిల్లులను తీసుకువచ్చాయి. అయితే భిన్న కారణాలతో అవి రాష్ట్రపతి ఆమోదం పొందలేకపోవడంతో చట్టాలు కాలేదు. ఇప్పుడు భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తాజాగా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. శాసనసభలో చర్చ అనంతరం మరింత విస్తృత చర్చలకు గాను ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించారు.
ఆప్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లును ప్రవేశ పెట్టిందని తప్పుపడుతున్నారు. ‘ఇదొక రాజకీయ జూద’మని ఒక విజ్ఞుడు వ్యాఖ్యానించారు. ధర్మోల్లంఘన ఘటనలకు పాల్పడినవారిని శిక్షించేందుకు కొత్త చట్టం అవసరం లేదని, ప్రస్తుతమున్న చట్టాలు సరిపోతాయని పంజాబ్ పౌర సమాజ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక, ఆర్థిక, భద్రతాపరమైన సవాళ్ల నెదుర్కొంటున్న సరిహద్దు రాష్ట్రంలో ఒక భావోద్వేగ అంశాన్ని రాజకీయ చర్చల్లోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పౌర వివేకాన్ని పెంపొందించకుండా శాసనాలతో మతపరమైన భావోద్రేకాలను ఉపశమింపచేయడం సాధ్యమవుతుందా? ఇతరేతర ప్రయోజనాలను ఆశించి ఒక సమస్యను సాకుగా చూపి తీసుకువచ్చే చట్టాలు సార్థకమవుతాయా? నిగూఢ రాజకీయ ప్రయోజనాలు లేని శాసన నిర్మాణమే ఫలప్రదమవుతుంది. సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్న బిల్లుపై విస్తృతస్థాయిలో చర్చలు, సంప్రదింపుల ద్వారా పౌర వివేకాన్ని పెంపొందించాలి. పవిత్ర గ్రంథాలను అగౌరవపరిచిన వారిని శాసనాలు శిక్షించగలవేగానీ ఆ దివ్య గ్రంథాలు ప్రబోధించే మానవ జీవిత ధర్మాలను అర్థం చేసుకుని అనుష్ఠానించేలా ప్రజలను పురిగొల్పగలుగుతాయా? శాసన వివేకానికి విధిగా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు నిగూఢ రాజకీయ ఆరాటాలతో సంబంధమున్నవి అయితే ప్రమాదకర పర్యవసానాలకు కారణమవుతాయి. ఈ విపత్కర పరిస్థితి శాసన మూఢత్వం (లెజిస్లేటివ్ స్టుపిడిటీ–లక్ష్య శుద్ధి లేని శాసనాల నిర్మాణం)కు తార్కాణం. దీన్ని ప్రోత్సహించకూడదు. త్యజిస్తేనే పౌర విజ్ఞతను పెంపొందించే శాసన వివేకం వర్ధిల్లుతుంది. మరి అటువంటి శాసనాలను నిర్మించే పరిణతి మన రాజకీయాలకు ఎప్పుడు వస్తుంది?
Updated Date - Jul 19 , 2025 | 01:53 AM