Gangishetti Sivakumar: కొడవటిగంటికి ఏకలవ్యశిష్యుణ్ణి
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:20 AM
పిల్లల బాధ్యత సమాజ బాధ్యత అని నమ్మి బాల సాహిత్యంలో 58 ఏళ్లుగా ప్రయాణిస్తున్న సాహితీవేత్త గంగిశెట్టి శివకుమార్. పిల్లల కథల్లో అడవులు, మృగాలు, రాజులే ఇతివృత్తాలుగా ఉన్నా....
పిల్లల బాధ్యత సమాజ బాధ్యత అని నమ్మి బాల సాహిత్యంలో 58 ఏళ్లుగా ప్రయాణిస్తున్న సాహితీవేత్త గంగిశెట్టి శివకుమార్. పిల్లల కథల్లో అడవులు, మృగాలు, రాజులే ఇతివృత్తాలుగా ఉన్నా అవి బాలలను అభ్యుదయం వైపు నడిపించగలగాలి, మంచి ఆలోచనలు కల్పించగలగాలి అంటారాయన. ఇప్పటి దాకా పది బాలల కథా సంపుటాలు వెలువరించిన శివ కుమార్ 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సంభాషణ.
బాలసాహిత్యంతో మీ పరిచయం గురించి చెప్పండి?
నెల్లూరు జిల్లా, రాపూరు మా సొంత వూరు. చెట్టు కింద బళ్ళో నా గురువులు తెలుగు చదవడం రాయడం నాలుగవ తరగతికే బాగా నేర్పించారు. అప్పటి నుండే మా ఊర్లో వున్న గ్రంథాలయానికి వెళ్ళి బాలసాహిత్యాన్ని చదవ సాగాను. అది గమనించి మా నాన్న బొమ్మల రామాయణం, భాగవతం, భారతం కొని తెచ్చి చదివించారు. ఏడవ తరగతి వరకు రాపూరులో చదివిన తర్వాత నాన్నకు ట్రాన్సఫర్ కావడంతో గూడూరు చేరాను. గూడూరు గ్రంథాలయం లోని బాల సాహిత్యం అంతా చదివాను. తిరుపతిలో యూనివర్సిటీలో ఎం.ఏ చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ జి. నాగయ్య బాలసాహిత్యం మీద పరిశోధనకు ప్రోత్సహించి తానే గైడ్‌గా వ్యవహరించారు. బాలల పత్రిక ‘చందమామ’లో రెండేళ్ళ పాటు ఉపసంపాదకుడిగా పనిచేశాను. ఎనిమిదవ తరగతి చదివేటప్పుడే మొదటి కథ రాశాను. ఇప్పటికీ రాస్తున్నాను. కొడవటిగంటివారికి నేను ఏకలవ్యశిష్యుణ్ణి. ఆయనలా రాయాలని ఇప్పటికీ ప్రయత్నిస్తుంటాను.
ఇక్కడ బాలసాహిత్యంపై కొంత చిన్నచూపు ఉంది, నిజమేనా?
కొంతమందిలో వుండవచ్చు. అందరిలో కాదు. చిన్ననాటి నుండే మౌలిక భావాలను నాటేది బాలసాహిత్యమే. మొక్కై వంగనిది మానై వంగదు కదా. ఇది చాలామంది ఇప్పుడు గుర్తించి బాల సాహిత్యాభివృద్ధికి దోహదం చేస్తున్నారు. కానీ ఇంకా చాలా జరగాలి. ప్రతి పాఠశాల లోనూ గ్రంథాలయం వుండాలి. పిల్లలకోసం వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. తెలంగాణలో పిల్లల చేత రచనలు చేయించి పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. ఆ సంప్రదాయం ఇంకా పెరగాలి. పిల్లల పత్రికల ప్రచురణకు ప్రభుత్వం తోడ్పడాలి. బాల సాహిత్యం అనగానే బాలలకు మాత్రమే అనీ అనుకోకూడదు. ఈ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివే పెద్దలు కూడా ఉంటారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రతి నెలా ‘చందమామ’ కోసం ఎదురు చూసేవారట. ‘చందమామ’ ముందు బాలల పత్రికగా ప్రారంభం అయినప్పటికీ క్రమంగా అది ‘ఆబాలగోపాల పత్రిక’ అయిందని చక్రపాణి గారు చెప్పేవారు.
ఇంటర్వ్యూ:
-ఈతకోట సుబ్బారావు
Updated Date - Jun 30 , 2025 | 12:20 AM