Sulochana Gadgil: రైతుకు తోడై నిలిచిన పరిశోధన
ABN, Publish Date - Jul 31 , 2025 | 06:04 AM
ఋతుపవనాల ఎగుళ్ళు దిగుళ్ళు, ఉష్ణ మండల ప్రాంతపు సముద్ర తలాల ఉష్ణోగ్రతలూ, తత్కారణంగా జరిగే ఉష్ణ సంవహన ప్రక్రియలకు సంబంధించి నాలుగున్నర దశాబ్దాల క్రితం తన పరిశోధనతో భారతదేశపు వ్యవసాయాన్ని...
ఋతుపవనాల ఎగుళ్ళు దిగుళ్ళు, ఉష్ణ మండల ప్రాంతపు సముద్ర తలాల ఉష్ణోగ్రతలూ, తత్కారణంగా జరిగే ఉష్ణ సంవహన ప్రక్రియలకు సంబంధించి నాలుగున్నర దశాబ్దాల క్రితం తన పరిశోధనతో భారతదేశపు వ్యవసాయాన్ని, పంటలనూ, దేశ ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేసిన ప్రొ. సులోచనా గాడ్గిల్ 81 సంవత్సరాల వయసులో ఈ జూలై 24న బెంగళూరులో కన్నుమూశారు. ఆమె పరిశోధనల్లో స్థూలంగా గణిత, భౌతిక శాస్త్రాలు; వాతావరణ, సముద్ర శాస్త్రాలు; వ్యవసాయం, ఆర్థిక శాస్త్రం మొదలైన విభాగాలు కలగలిశాయి. భారత ఋతుపవనాల గురించి అమోఘంగా కృషి చేసి, మూడు వందల ఏళ్ళుగా మనకు ఉన్న అవగాహనను విస్తృతం చేసిన ప్రపంచ స్థాయి శాస్త్రవేత్త డా. సులోచనా గాడ్గిల్. భారత స్వాతంత్ర్యోద్యమంలోనే కాదు, మహిళా విమోచనా కార్యక్రమాలలో కూడా ఒకటిన్నర శతాబ్దం చరిత్ర ఉన్న పూణె నగరంలో సులోచన 1944 జూన్ 7న వేశ్వంత్ పాథక్, ఇందుమతి దంపతులకు జన్మించారు. వీరికి కలిగిన నలుగురు ఆడపిల్లల్లో ఈమె మూడవ సంతానం. ఈమె తాత వైద్యుడిగా సేవలందిస్తూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. కనుక వాళ్ళింటికి ఎప్పుడూ ఆయన మిత్రులైన పోరాట యోధులు వస్తూ వెడుతూ ఉండేవారు. తండ్రి అల్లోపతిలో ఎం.డి. పట్టాతో పాటు ఆయుర్వేద, -యోగ విధానాలలో పూర్తిగా అవగాహన ఉన్న వైద్యులు. తల్లి మరాఠీ సాహిత్యరంగంలో ప్రముఖులు. పూణెలో ప్రాథమిక విద్య తర్వాత ఆమె హైస్కూల్ విద్య కోసం ఏపీ లోని మదనపల్లి దగ్గర ఉన్న ఋషి ర్యాలీలో చేరారు.
మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా ఇష్టమైన అంశాన్ని, ఇష్టమైన రీతిలో చదివే అవకాశం తనకు అక్కడ లభించిందని; అదే దృష్టి తన చదువును, జీవితాన్ని తీర్చిదిద్దిందని ఆమె చెప్పేవారు. పూణెలోని ఫెర్గ్యూసన్ కాలేజీలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ చేసిన తర్వాత; పూణె విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ 1965 లో పూర్తి చేశారు. ఒకసారి బోర్ కొట్టే క్లాసు ఎగ్గొట్టడానికి కిటికీలోంచి దూకుతున్న సులోచన రెండేళ్లు సీనియరైన మాధవ్ గాడ్గిల్ దృష్టిని ఆకర్షించారు. సులోచన ఎమ్మెస్సీ చదివే సమయంలో మాధవ్ గాడ్గిల్‌తో ఆమె పెళ్ళి జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ ఫెలోషిప్ మీద హార్వర్డు యూనివర్సిటీలో చేరారు. పక్షులు, సీతాకోకచిలుకలు, ఏనుగులు, మేఘాలు, నక్షత్రాలు, తోకచుక్కలు పరిశీలించడం తన హాబీ అని చెప్పుకునే సులోచనా గాడ్గిల్ ప్రకృతి ప్రపంచం మీద ఆసక్తి కలిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ‘ఫిజికల్ ఓషనోగ్రఫీ’ అంశాన్ని ఎంచుకున్నారు. తనకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లలో లోతైన అవగాహన ఉందనీ; అదే సమయంలో తన భర్త మాధవ్‌కు మ్యాథమెటికల్ ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ ఆసక్తికరమైన విషయాలు కావడం వల్ల తన అధ్యయనం హాయిగా సాగిందనీ ఆమె చెప్పేవారు. ప్రొఫెసర్ ఎ.ఆర్. రాబిన్‌సన్ వద్ద ఫిజికల్ ఉష్ణోగ్రఫీ పూర్తి చేసిన తర్వాత; అక్కడే ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొ. జూల్స్ చర్నీ వద్ద ‘ప్లానిటరీ ఫ్లూయిడ్ డైనమిక్స్’లో పీహెచ్డీ పూర్తి చేశారు. తర్వాత ఋతుపవనాల మీద ఆసక్తి కలిగి చర్నీ వద్దనే ఎమ్ఐటీలో పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ ముగించారు. అమెరికాలో ఆరేళ్ల పాటు మూడు విలక్షణమైన విభాగాలను శోధించి భర్తతో కలిసి 1971లో భారతదేశం తిరిగి వచ్చారు. అప్పటికి ఆమె ఋతుపవనాల తీరుతెన్నుల గురించి పట్టు సాధించడంతో వాతావరణంలో మార్పులను విశ్లేషించే రీతిలో పరిశోధన చేపట్టడానికి సాహసం చేశారు. ఈ పరిశోధన కొనసాగింపుగా పంటలకొచ్చే తెగుళ్లు, రోగాలు, కరువు పరిస్థితులు వంటివి ముందుగా వివరించే రీతిలో దేశానికి దోహదపడ్డారు. 1971లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సులోచనా గాడ్గిల్ సీఎస్ఐఆర్ పూల్ ఆఫీసర్‌గా పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరాలజీలో ఓ రెండేళ్ల పాటు పనిచేయడంతో వాతావరణానికి సంబంధించి నిష్ణాతులైన ఆర్.
అనంతకృష్ణన్, డి.ఆర్. శిక్కా లతో పరిశోధన చేసే అవకాశం కలిగింది. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ డైరెక్టర్‌గా ప్రముఖ అంతరిక్ష విజ్ఞానవేత్త సతీష్ ధావన్ ఫ్లూయెడ్ డైనమిక్స్‌లో ఋతుపవనాల గురించి పరిశోధన చేయాలని సెంటర్ ఫర్ థియరిటికల్ స్టడీస్ విభాగాన్ని ప్రారంభించి, సులోచనా గాడ్గిల్‌ను ఆహ్వానించి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తీసుకున్నారు. అదే సమయంలో అదే విభాగంలో మ్యాథమెటికల్ ఎకాలజీకి సంబంధించి మాధవ్ గాడ్గిల్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం పొందారు. క్రమంగా ఈ విభాగమే ‘సెంటర్ ఫర్ అట్మాస్పియరిక్ అండ్ ఓషనిక్ సైన్సెస్’గా మారి ఇక్కడ విశేషమైన పరిశోధనలు జరిగాయి. ఉష్ణమండల సముద్రాల పైన ఉండే మేఘమాలికల వర్షస్వభావం అనేది ఆయా సముద్రతలాల ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత 28డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు అత్యధిక వర్షపాతం పడే అవకాశం ఉందని సులోచనా గాడ్గిల్ బృందం చేసిన పరిశోధనలలో తేలింది. నేరుగా జన సామాన్యంతో, దేశ ఆర్థిక భద్రతతో ముడిపడిన పరిశోధనాంశం కనుక ఆమె సదా రైతులతో ముచ్చటిస్తూ క్షేత్రస్థాయి నివేదికలను అధ్యయనం చేసేవారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం లోని పావగడ ప్రాంతపు రైతుల నుంచి తెగుళ్లు, చీడపీడల గురించి సమాచారం అందుకొని పరిశోధన కొనసాగించడం విశేషం. 2016లో భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ‘ఏ ఆర్థిక శాస్త్రవేత్తా సాధించని రీతిలో సులోచనా గాడ్గిల్ విజయం సాధించార’ని పేర్కొన్నది. గత ఐదు దశాబ్దాలలో మనదేశపు జీడీపీలో వ్యవసాయం పాత్ర తగ్గినా; కరువు ప్రభావం మాత్రం అలాగే రెండు నుంచి ఐదు శాతంగా దాదాపు స్థిరంగా ఉందని ఈమె పరిశోధన తేల్చింది. సులోచన భర్త మాధవ్ గాడ్గిల్ జీవావరణ శాస్త్రవేత్త మాత్రమే కాకుండా రచయితగా, కాలమిస్ట్‌గా కూడా ప్రఖ్యాతులు. పశ్చిమ కనుమల జీవావరణాన్ని అధ్యయనం చేయడానికి 2010లో ఏర్పరిచిన గాడ్గిల్ కమిషన్‌తో సుప్రసిద్ధులు. సులోచనా గాడ్గిల్ కూతురు జర్నలిస్టుగా ఉంటూ స్పానిష్ భాషను బోధిస్తుంటారు. కుమారుడు సిద్ధార్థ గాడ్గిల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో గణిత శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నారు. విద్యా సంస్కార సంపద పుష్కలంగా ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన సులోచనా గాడ్గిల్ ఋతుపవనాల గురించి విశేషమైన పరిశోధన చేసిన ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా కలకాలం గుర్తుండిపోతారు.
డా. నాగసూరి వేణుగోపాల్
Updated Date - Jul 31 , 2025 | 06:04 AM