Presidential Reference India: ఆ ప్రశ్నల ఆంతర్యం
ABN, Publish Date - May 17 , 2025 | 03:23 AM
సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి అడిగిన 14 ప్రశ్నలు రాజకీయ ఉద్దేశ్యాలపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ముదిరిన వివాదాన్ని సూచిస్తుంది.
ప్రశ్న మంచిదే. అయితే, ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనాలకోసం? రాష్ట్రపతి సుప్రీంకోర్టును పద్నాలుగు ప్రశ్నలు వేశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితులు విధిస్తూ సుప్రీంకోర్టు గతనెల తీర్పు వెలువరించినప్పుడు, అధికారపక్షం నుంచి ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో తెలిసిందే. ఇలా రాష్ట్రపతిని రంగంలోకి తెచ్చి ఇంకా యుద్ధం కొనసాగించడం ఎందుకూ, సుప్రీంకోర్టు తీర్పుమీద అంత కోపం ఉంటే, రాజ్యాంగాన్నే మీకు నచ్చినట్టుగా మార్చేసుకోండి అని కొందరు న్యాయకోవిదులు ఆగ్రహంతోనో, అభిమానంతోనో ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. న్యాయవ్యవస్థకూ, కార్యనిర్వాహక వ్యవస్థకూ మధ్య వివాదం కొనసాగడం, అగాధం పెరగడం అధికులకు నచ్చడం లేదు. ప్రశ్నించినంతమాత్రాన సవాలు చేసినట్టు కాదు, వివరణ అడిగితే విమర్శించినట్టూ కాదు. కానీ, ఈ ప్రెసిడెన్షియల్ రిఫెరెన్స్ లక్ష్యం అంత సున్నితంగా, ఉన్నతంగా కనిపించకనే ఈ అనుమానాలు, విమర్శలు. రాజ్యాంగంలో లేని కాలపరిమితులను గవర్నర్లమీదా, రాష్ట్రపతిమీదా విధించడమేమిటంటూ, న్యాయసలహా పేరిట పద్నాలుగు ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంధించి రాష్ట్రపతి దానిని జవాబుదారీని చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటివరకూ పద్నాలుగుసార్లు మాత్రమే ఈ న్యాయసలహా ప్రయోజనాన్ని రాష్ట్రపతి వినియోగించుకున్నందున, మొన్నటి తీర్పు విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థ ఎంత పట్టుదలగా ఉన్నదో అర్థమవుతుంది. రాజ్యాంగపరమైన హద్దులు, అధికారాల విభజన ఇత్యాది అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి చక్కని ప్రశ్నలు వేశారు. గవర్నర్ల అధికారాలు, రాష్ట్రపతి విచక్షణాధికారాల గురించి ఆరాతీశారు.
గట్టిగా గుదిగుచ్చిన ఆ ప్రశ్నల మధ్యన మీ తీర్పు ఎలా చెల్లుబాటవుతుందన్న అసలు ప్రశ్న కూడా వేశారు. రాష్ట్రపతి సంధించిన ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు విలవిలలాడి, ఈ వివాదానికి మూల కారణమైన తీర్పును సమీక్షించుకుంటుందనీ, రద్దుపరుచుకుంటుందనీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొత్త ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి, సమాధానాలు సిద్ధం చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదించని బిల్లులను సైతం రాజ్యాంగ అధికరణం 142 ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని చెల్లుబాటైనట్టుగా నిర్థారించిన సుప్రీకోర్టును 143వ అధికరణం కింద రాష్ట్రపతి ప్రశ్నించడం బాగున్నది కానీ, ఈ ప్రశ్నలు కొత్తవీ కావు, వీటిని తెరవెనుకనుంచి అడుగుతున్నవారికి సమాధానాలు తెలియనిదీ కాదు. ఆర్టికల్ 142ను నూక్లియర్ మిసైల్‌గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సహా ఆ నాటి తీర్పును తూర్పారబట్టిన నాయకులంతా బిల్లుల ఆమోదానికి నిర్దిష్టమైన గడువు విధించడాన్ని సహించలేకపోతున్నారు. ఈ తీర్పు తమిళనాడు గవర్నర్‌కో, అధికారపక్షంతో ఆయన క్రీడించిన ఓ డజను బిల్లులకో పరిమితమైనది కాదు. ఆర్.ఎన్. రవి తరహాలో వ్యవహరిస్తున్న విపక్షపాలిత రాష్ట్రాల గవర్నర్లందరికీ లక్ష్మణరేఖ దాటవద్దన్న ఘాటైన హెచ్చరిక అది. రాజ్యాంగం ఆశయాలకు అనుగుణంగా, ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసిన తీర్పు ఇది. బిల్లుల ఆమోదానికి గవర్నర్లకు, రాష్ట్రపతికి రాజ్యాంగం గడువులేమీ విధించలేదు కనుకనే, ఆ పని మొన్నటి తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం చేసింది. గడువు లేని కారణంగా గవర్నర్లు విపక్షపార్టీల ప్రభుత్వాలతో ఆడుకుంటున్నారు కనుకనే, ప్రజాభీష్టాన్ని పరిరక్షించడానికి వీలుగా కాలపరిమితులు విధించింది. గడువుదాటిన గవర్నర్ల చర్యలు న్యాయసమీక్షకు నిలవాల్సివస్తుందని హెచ్చరించింది. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న రవి వంటివారిని వల్లనే ఇదంతా చేయవలసి వచ్చింది.
ఇప్పుడు సుప్రీంకోర్టును ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాష్ట్రపతి ఎప్పటికప్పుడు రవి వంటివారిని హద్దుల్లో ఉంచివుంటే ఈ గొడవే ఉండేదికాదు. కాలపరిమితి దాటిన బిల్లులను కూడా తెలివిగా రాష్ట్రపతి బరిలోకి తోసినప్పుడే రవిని ఆ రాజ్యాంగాధిపతి కన్నెర్ర చేసివుంటే బాగుండేది. సుప్రీంకోర్టు తీర్పును మన పాలకులు పలు రకాల పిటిషన్లతో పునఃపరిశీలించమని అడగవచ్చు, విస్తృత ధర్మాసనం కోసం విజ్ఞప్తి చేయవచ్చును. కానీ, ఇవేమీ కాకుండా ఇలా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌తో ప్రశ్నించి, దాని హద్దులను తెలియచెప్పాలని కోరుకుంటున్నట్లుంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని నివేదించినప్పటికీ, దానికి కట్టుబడాలన్న నియమం ఏమీ లేదు కనుక, కార్యనిర్వాహక వ్యవస్థ తనకు తోచిన విధంగా వ్యవహరించవచ్చు. కాకపోతే, రాష్ట్రాల హక్కులు, గవర్నర్ల విధులకు సంబంధించి కొన్ని కొత్త అంశాలతో లోతైన చర్చ జరిగేందుకు ఈ పరిణామం ఉపకరించవచ్చు.
Updated Date - May 17 , 2025 | 03:25 AM