Prasad Suri: నా పేరు మీద ఓ పది నవల లైనా ఉండాలి
ABN, Publish Date - Jun 23 , 2025 | 02:24 AM
ప్రసాద్ సూరి పాతికేళ్ళ వయసులో తన మూడవ నవల ‘మైరావణ’కు గాను ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మూడు ప్రశ్నలు..
ప్రసాద్ సూరి పాతికేళ్ళ వయసులో తన మూడవ నవల ‘మైరావణ’కు గాను ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మూడు ప్రశ్నలు:
విశాఖ జిల్లా తీరప్రాంతాల్లో చేపలు పట్టే బెస్తవాళ్ళ (వాడ బలిజెల) జీవితాల నేపథ్యంలో మైరావుడు అనే ప్రధాన పాత్రను అనుసరిస్తూ మీ ‘మైరావణ’ నవల సాగుతుంది. మైరావణలో మీరు చిత్రించిన బెస్త నేపథ్యానికి సంబంధించి మీ సొంత అనుభవాలు చెబుతారా?
బెస్తలు, జాలర్లు, పల్లెకార్లు, మత్స్యకారులు, గంగపుత్రులు, అగ్నికుల క్షత్రియులు... పేర్లు ఏవైనా, పని ఒకటే. ఊహ తెలిసిన తర్వాత నా చుట్టూ నేను చూసిన, అనుభవించిన జీవితం ఇది. కొన్నేళ్ళ క్రితం వరకూ మా నాన్నతో కలిసి చేపలు పట్టాను. మా కుటుంబం ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి దగ్గర్లో బుగ్గవాగు రిజర్వాయర్ ఒడ్డున స్థిరపడి, చేపలు పట్టడమే వృత్తిగా గత యాభై ఏళ్లుగా బతుకుతుంది. మాలాంటి మరికొన్ని కుటుంబాలు కలుపుకొని అక్కడొక ఊరు ఏర్పడింది. నా చిన్నప్పుడు చదువుకోవడానికి అక్కడ బడి లేదు. ఐదో తరగతి అక్కడా ఇక్కడా చదువుకుని హై స్కూల్ చదువుకు మా స్వస్థలం, విశాఖ జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో) రాంబిల్లి మండలంలో సముద్ర తీరంలో వాడ నర్సాపురం గ్రామం వచ్చాను. శ్రీకాకుళం నుంచి కాకినాడ దాకా ఉన్న తీర ప్రాంత గ్రామాలన్నీ మా వాడ బలిజలవే. నేను అక్కడే మా అమ్మమ్మ, మావయ్యల దగ్గర వాడరాంబిల్లిలో ఉంటూ హైస్కూల్లో చదువుకున్నాను. సెలవుల్లో మా అమ్మానాన్నల దగ్గరికి (బుగ్గ వాగు) వెళ్లినప్పుడు నాన్నతో చేపలు పట్టేవాడిని. నవలలో రాసిన ఎన్నో విషయాలు, నా స్వీయ అనుభవాలే. అలాగే మా పెద్దవాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచీ విన్న కథలు, ముఖ్యంగా ఓడలు తయారు చేసే మేము చేపలు పట్టే వృత్తిలోకి ఎలా వచ్చాము అని చెప్పే కథ మా నానమ్మ దగ్గర విన్నాను. దాన్ని ఆవిడ చెప్తుంటే రికార్డు చేసుకొని మళ్ళీ ఆవిడ మాటల్లోనే చెప్పడానికి ప్రయత్నించాను. విశాఖపట్నం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకి జరిగిన మా వలస జీవితపు కథ కూడా మా పెద్దల నుంచి విన్నాను. ఇది చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కనిపించని ఒక subaltern history. ఇవన్నీ నమోదు కావాలి.
ఈ నవలలో భారతదేశ సామాజిక గతం, రాజకీయ వర్తమానం కలిసి సాగుతాయి. మైరావుడి పాత్రను జానపద కథానాయకుడి శైలిలో చిత్రించారు. ఇలా రాయాలని ఎందుకు అనిపించింది?
తెలుగులో ఇప్పుడు అనేక నేపథ్యాల నుంచి రచయితలు వాళ్ళ సమూహాల చరిత్రని కథలు, కవితలు, నవలల రూపంలో రికార్డు చేస్తున్నారు. నాకూ అలా మా వాడబలిజ సమాజపు చరిత్రని, జీవనాన్ని, కష్టాన్ని సాహిత్యంలో రికార్డు చెయ్యాలని అనిపించింది. దీన్ని ఒక జానపద కథానాయకుడి కథలా చెప్పాలనుకోవడానికి నాకు అలాంటి సాహిత్యం, సినిమాలు అంటే ఉన్న ఇష్టమే కారణం. జానపద సాహిత్యం మ్యాజిక్ రియలిజం శైలికి దగ్గరగా ఉంటుంది. అందులో ఊహ చెయ్యడానికి చాలా స్కోప్ ఉంటుంది. అలాగే అమితావ్ ఘోష్ లాంటి ఇండియన్ ఇంగ్లీష్ రైటర్ల రచనలు చదివిన ప్రభావం, నేను చూసిన కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రభావం కూడా ఈ నవల విషయంలో నా రచనా శైలిని కొంత ఇంపాక్ట్ చేశాయి. చదివినవాడికి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. మీరు ఇప్పటికి మూడు నవలలు రాశారు. కథా రచన కంటే నవలా రచన మీదే దృష్టిపెట్టడానికి కారణం ఏమిటి? నవల నాకు ఇష్టమైన ప్రక్రియ. ఎంతో చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. సరళంగా, క్లిష్టంగా... ఏమైనా చెప్పొచ్చు. ఒక రోజులో జరిగే కథని వెయ్యి పేజీలు రాయచ్చు. వందేళ్ల కథని వందపేజీల్లో చెప్పేయొచ్చు. నేను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్‌ని కాబట్టి ఆ భాషలో ఇది ‘‘చాలా ఫ్లెక్సిబుల్ మీడియం’’ అంటాను. కథలు కూడా ఒకటి రెండు రాశాను. కానీ నవల చదవడంలోనూ, రాయడంలోనూ మజానే వేరు. ఒక సుదీర్ఘమైన ప్రయాణంలా ఉంటుంది నవల చదవడం, రాయడం కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఒక నవల రాయడం మొదలయ్యాక నా మీద ఒక బాధ్యత ఉన్నట్టు ఫీల్ అవుతా, అది రాయడం పూర్తి చెయ్యాలి, అది చెయ్యడం కోసం అన్నా బతికి ఉండాలి. జీవితేచ్ఛ అంటారు కదా! అలాంటిది కలిగిస్తుంది అన్నమాట. కథలు కూడా రాద్దాం అని కొంతకాలంగా అనుకుంటున్నాను. కానీ నవలా రచయితగానే పేరు తెచ్చుకువాలనేది నా లక్ష్యం. నా పేరు మీద ఓ పది నవలలు అయినా ఉండాలనేది నా కోరిక.
- 91336 08072
Updated Date - Jun 23 , 2025 | 02:30 AM