Pahalgam Attack Impact: పహల్గామ్‌తో మారుతున్న రాజకీయాలు
ABN, Publish Date - May 28 , 2025 | 06:29 AM
దేశ రాజకీయాలు కీలక మార్గమలుపులో ఉన్నాయి. మోదీ నేతృత్వంలో బీజేపీ తన దిశను మళ్లించుకోగా, కాంగ్రెస్ పునరుత్థానానికి తహతహలాడుతోంది.
దేశ రాజధానిలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. విపరీతంగా ఉక్కబోస్తున్న సమయంలో వర్షాలు ముంచెత్తుతున్న కాలమిది. ప్రస్తుతం రాజకీయ వాతావరణం కూడా ఇదే విధంగా ఒక సంధి దశలో ఉన్నట్లు కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తమ దారిని వెతుక్కునే క్రమంలో ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పరివర్తనం చెందకుండా, ప్రజల ఆలోచనలను పసిగట్టకుండా మార్పులను ప్రతిఘటించేవారు క్రమంగా పలుకుబడిని, ప్రభావాన్ని కోల్పోతారని చాణక్యుడుతో సహా పలువురు చరిత్రకారులు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు, నేతలు తమను తాము మార్చుకునే క్రమంలోనో, మార్పుకు సిద్ధమవుతున్న క్రమంలోనే ఉన్నట్లనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉండగా భారతీయ జనతా పార్టీకి మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు. బీజేపీకి బలం, ఆత్మస్థైర్యం ఆయనే. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించిన నరేంద్రమోదీ, ఈ యుద్ధం నాలుగు రోజుల్లోనే ముగిసిన తర్వాత దాని గురించి ప్రచారం చేసే బాధ్యత పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తిరంగా యాత్ర వంటి కార్యక్రమాలతో పార్టీని ప్రజల్లోకి వెళ్లమని ఆదేశించినా, నీతీ ఆయోగ్, ఎన్డీఏ వంటి సమావేశాల్లో కూడా ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించేలా నరేంద్రమోదీ మాట్లాడినప్పుడే దానికి బహుళ ప్రచారం లభిస్తోంది. ఎందుకంటే పాక్‌పై యుద్ధం ప్రారంభించేందుకు, దాన్ని ముగించేందుకు కర్త, కర్మ, క్రియ నరేంద్రమోదీయే. యుద్ధం ముగిసిన తర్వాత ఆయన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ నెలలో బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
యుద్ధం ప్రారంభించడంపై, ముగించిన తీరుపై ప్రశ్నల వర్షానికి ఆస్కారం లేకుండా ఆయన ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కార్గిల్, పుల్వామా అనంతర పరిణామాలు దేశ రాజకీయాలను నిర్దేశించినట్లే పహల్గామ్ అనంతర పరిణామాలు దేశ రాజకీయాలను నిర్దేశిస్తాయా? అన్న చర్చ సాగుతోంది. 1999 ఏప్రిల్ 17న వాజపేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటుతో అధికారం కోల్పోయింది. కాని 1999 జూలైలో కార్గిల్‌లో చొరబాటు జరిగినప్పుడు భారతీయ సైన్యం పాకిస్థాన్‌కు బలంగా గుణపాఠం చెప్పిన తర్వాత సెప్టెంబర్ – అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో 20 పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభంజనం వీచింది. 303 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏలో 29 సీట్లతో తెలుగుదేశం కీలక భాగస్వామ్యంగా నిలిచింది. కాని యుద్ధం వల్ల వచ్చిన ఊపు పెద్దగా నిలవలేదు. 1999లో బీజేపీకి లభించిన 182 సీట్లు 138కి పడిపోయాయి. మెజారిటీ కేంద్ర మంత్రులు ఓడిపోయారు. ఆ తర్వాత పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించి పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన నరేంద్రమోదీ గత ఎన్నికల్లో 240 సీట్లు సాధించినప్పటికీ తన ప్రభావం కోల్పోలేదు. కాంగ్రెస్ 99 సీట్లకే పరిమితం కావడంతో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మోదీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. తన సారథ్యంలో బీజేపీ తక్కువ సీట్లు లభించాయని తెలిసినప్పటికీ గడచిన ఏడాదిగా మోదీ తన ఆకర్షణ, ఆదరణ తగ్గకుండా చూసుకుంటున్నారు. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఆయన విలువను మరింత పెంచింది. తన స్వభావానికి భిన్నంగా మిత్రపక్షాలను సంతోషపెట్టే ప్రయత్నం చేయడంలోనూ, పార్టీలో అసంతృప్తి స్వరాలు తలెత్తకుండా చూడడంలోనూ ఆయన విజయం సాధించారు.
అదే సమయంలో కులగణన వంటి అంశాలపై పట్టువిడుపులతో వ్యవహరించారు. తమిళనాడులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే తొలగించి అన్నాడీఎంకేకు స్నేహహస్తం చాచారు. నిజానికి వాజపేయి హయాంలో జరిగినట్లు పాకిస్థాన్‌తో యుద్ధం మరికొన్ని రోజులు జరిగి ఉంటే మోదీ ప్రభంజనానికి తిరుగు ఉండేది కాదు. కాని అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఏర్పడడం, విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడం ఈ యుద్ధ విరమణ జరగడం ప్రజల్లో తీవ్ర చర్చలకు దారి తీసింది. నరేంద్రమోదీ దాదాపు 90 విదేశీ పర్యటనలు చేసినా, పదిసార్లకు పైగా అమెరికా వెళ్లి వచ్చినా పాకిస్థాన్‌ను ఉగ్రవాదం విషయంలో ఏకాకి చేయలేకపోవడం, కొన్ని దేశాలు పాక్‌కు మద్దతునీయడం చాలా మందికి ఆశాభంగం కలిగించింది. పాకిస్తాన్ మరోసారి చిన్న ఉగ్రవాద చర్యకు పాల్పడినా తేరుకోలేనంత బుద్ధి చెబుతాం అని భారత నేతలు అంటున్నారు. కాని అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు రానంతవరకూ, పాకిస్థాన్‌ను ఏకాకి చేయనంతవరకూ భారతదేశం ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెబుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ మోదీకి ఇప్పట్లో పార్టీలో, ఎన్డీఏ తిరుగుండదని మోదీ శకం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం మోదీ స్థానంలో అంతటి బలమైన ప్రత్యామ్నాయ నాయకుడు లభించగలడా అన్న సందేహాలు వారిలో నెలకొనడమే. అయినా ప్రజల మనోభావాలను తమకు అనుకూలంగా తిప్పుకోవడం, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడం మాత్రమే కాక, బీజేపీ కొన్ని అంతర్గత సమస్యల్ని కూడా పరిష్కరించుకోవల్సిన పరిస్థితిలో ఉన్నది. గత ఆరునెలలుగా మోదీ, అమిత్ షాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థానంలో తమకు అనుకూలమైన నేతను నియమించలేకపోతున్నారు.
కొన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకం కూడా పెండింగ్‌లో పడిపోయింది. దేశంలో హిందూత్వ ప్రాబల్యం పూర్తిగా పెరిగింది కనుక ఒకే వ్యక్తి ఆధారిత నాయకత్వం కాకుండా సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావడం అవసరమని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రోజురోజుకూ విస్తరిస్తోంది. భారతదేశం ఇప్పటికే హిందూ రాష్ట్రమని ఇటీవల ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఆర్గనైజర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. వ్యక్తి ప్రాధాన్యత తగ్గి విలువల ప్రాధాన్యత పెరగాలని చెప్పిన భాగవత్ బీజేపీని మరింత బలమైన సైద్ధాంతిక పార్టీగా మార్చాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్, బీజేపీల అంతర్గత సంబంధాల తీరుతెన్నులపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విషయం అలా ఉంటే బిహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీకి విజయం సాధించిపెట్టడమే కాదు, దక్షిణాదిన విస్తరించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడం నరేంద్ర మోదీ ముందున్న కర్తవ్యం. మూడో టర్మ్‌లో తనకు తిరుగులేకుండా చేసేందుకు మోదీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రానున్న కొద్ది నెలల్లో మోదీ తన సమస్యలను ఎలా అధిగమించగలరన్నది తేలుతుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్నదని చెప్పేందుకు ఎలాంటి రుజువులు కనిపించడం లేదు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమవుతోది. అనేక నిర్ణయాలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఢిల్లీ వస్తున్న నేతలకు సరైన సమాధానం చెప్పగల నేతలు కనపడడం లేదు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ నాలుగోసారి పరాజయం చెందకుండా 2029 నాటికి బలమైన పార్టీగా మారుతుందా లేదా అన్న విషయంలో పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా 21.2 శాతం ఓటు ఉన్న కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాని మోదీని ఎదుర్కొనగల బలమైన నాయకత్వం, సాహసోపేతమైన సైద్ధాంతిక ఎజెండాతో పాటు విశ్వసనీయమైన జాతీయ సంకీర్ణాన్ని ఏర్పాటు చేయగల శక్తి కాంగ్రెస్ సమకూర్చుకోగలగాలి.
అధికార వికేంద్రీకరణ, జిల్లా స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయడం అవసరం. సామాజికన్యాయమే ఎజెండాగా ప్రకటిస్తూ కాంగ్రెస్‌ను బలహీన వర్గాల పార్టీగా ప్రజలు అక్కున చేర్చుకోవాలని రాహుల్ భావిస్తున్నారు. కాని బీజేపీ శక్తిమంతమైన జాతీయవాదానికి వ్యతిరేకంగా ప్రజలు స్వీకరించే ఒక సైద్ధాంతిక భావనను ఏర్పర్చడంలో కాంగ్రెస్ ఇంకా విజయవంతం కాలేకపోతున్నది. రాహుల్ భారత్ జోడో యాత్ర, వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు పార్టీని ఉనికిలో ఉండేలా చేస్తున్నాయి కాని ఒక సంస్థగా పార్టీ ప్రజల్లో పుంజుకోవాల్సిన మరింత క్రియాశీలక నాయకత్వం కాంగ్రెస్‌కు అవసరం. ప్రాంతీయ పార్టీలు కూడా పరిణామ క్రమంలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ మొదలైన కీలక పార్టీలు తమను తాము బీజేపీ నుంచి రక్షించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే తిరిగి అధికారంలోకి రావడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నిలదొక్కుకునేందుకు యత్నిస్తుండగా బీఆర్ఎస్ అంతర్గత కలహాల్లో కూరుకుపోయింది. కురువృద్ధ నేత కేసిఆర్ పార్టీపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తనకు లభించిన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో విజయవంతం అయిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు తాను, తన పార్టీ మనుగడ కాపాడుకోలేని ప్రమాదంలో ఉన్నారు. 43 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని గద్దెదించి దేశంలో ప్రత్యామ్నాయ పాలనకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం కూడా భావి మార్పులకు సిద్దమవుతోందని మహానాడు జరుగుతున్న తీరుతో అర్థమవుతోంది. దేశంలో గత నాలుగు దశాబ్దాల్లో జరిగిన అనేక కీలక రాజకీయ పరిణామాల్లో భాగస్వామి అయిన చంద్రబాబునాయుడు నిర్దిష్టమైన, పరిమితమైన లక్ష్యాలను పెట్టుకుని చరిత్రలో నిలిచిపోవాలన్న ధ్యేయంతో అడుగులు వేస్తున్నారు. 1989లో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్‌లోనూ, 1998లో చంద్రబాబు హయాంలో వాజపేయి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం నేడు మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడమే ఆ పార్టీ కీలక ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. తెలుగుదేశం చారిత్రక పయనం ప్రాంతీయ పార్టీలు అవలంబించాల్సిన తీరుకు గుణపాఠం అని వేరే చెప్పనక్కర్లేదు.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - May 28 , 2025 | 06:32 AM