ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Rythukooli Sangam: పోలవరం పునరావాసం కాగితాలకే పరిమితమా

ABN, Publish Date - Jul 02 , 2025 | 02:53 AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సుమారు అయిదు లక్షల మందిలో మూడు లక్షల మంది ఆదివాసులే! ప్రాజెక్టు రాకముందు వరకూ వారికి ఇదేమిటో ఏమాత్రం తెలియదు. తమ గ్రామాలు, అడవులు, నదులు, వాగులు...

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సుమారు అయిదు లక్షల మందిలో మూడు లక్షల మంది ఆదివాసులే! ప్రాజెక్టు రాకముందు వరకూ వారికి ఇదేమిటో ఏమాత్రం తెలియదు. తమ గ్రామాలు, అడవులు, నదులు, వాగులు... మొత్తంగా తమ జీవన ప్రపంచంలో నుంచే వారు హఠాత్తుగా గెంటివేయబడినారు. ప్రాజెక్టు ప్రారంభమై ఇరవయ్యేళ్ళు గడిచాయి. ఒక లక్ష ఆరు వేల కుటుంబాలలో కేవలం 13వేల కుటుంబాలకే కాగితాలపై పునరావాసం కల్పించారు. వీరిలో కూడా కొందరికి ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ & రీసెటిల్మెంట్) పరిహారాలు అందితే, కొందరికి వాళ్ళ ఇళ్ళ నష్ట పరిహారాలు కూడా అంద లేదు. కత్తెనపల్లి గ్రామంలో 70 కుటుంబాల్లో ఏ ఒక్కరికీ ఇళ్ళకు నష్టపరిహారం కానీ, ఆర్ అండ్ ఆర్ పరిహారం కానీ ఈ రోజుకూ అందలేదు. కొండమొదలు పంచాయితీకి చెందిన నేలదోనెలపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని మొత్తం 500 కుటుంబాలలో 87 మందికి అన్ని అర్హతలు ఉన్నా నష్టపరిహారాలు, ఆర్ అండ్ ఆర్ పరిహారాలు అందలేదు. వారి వారి గ్రామాల నుంచి ఖాళీ చేయించడానికి అధికారులు ఎన్నో మాయమాటలు చెప్పారు. ‘‘మీరు ముందు ఖాళీ చేయండి, మీ డబ్బులు మీకు పడతాయ’’ని చెప్పారు. బలవంతంగా ప్రజలను తరలించారు. గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేసారు. రేషన్ ఆపివేసారు, వైద్య సహాయకులను గ్రామాలకు వెళ్ళకుండా ఆపివేసారు. ఆదివాసులు ఖాళీ చేసి వచ్చాక ఇప్పుడు– ‘‘పోర్టల్ ఓపెన్ కావడం లేదు. అది ఓపెన్ అయినప్పుడు మీకు డబ్బులు పడతా’’యని చెప్తున్నారు. చివరకు తమ భూములను, తమ అడవినీ కోల్పోయిన ఆదివాసులు ఈ కాలనీలలోకి వచ్చారు. దున్ను కోవడానికి భూమిలేదు. అడవి లేదు, కూలిపనులు తప్ప మార్గం లేదు. వీరంతా ఇప్పుడు తీవ్ర శ్రమదోపిడీకి గురౌతున్నారు. మహిళలు అర్థరాత్రి పనుల కోసం చాలా దూరాలు ప్రయాణించి మరలా సాయంత్రాలకు ఇళ్ళకు చేరుతున్నారు.

అక్కడా కూలీ ఎగవేతలు జరుగుతున్నాయి. నిరాశ నిస్పృహలతో తాగుడుకు బానిసలవుతున్నారు. పునరావాస కాలనీలలోకి తరలించే వరకూ ప్రతి ఆదివాసీ కుటుంబమూ రైతు కుటుంబమే. ఆదివాసులను రైతు జీవితం నుంచి తొలగించి వారిని చౌక కూలీలుగా మార్చడమే ఇప్పుడు పునరావాసంలో వెల్లడవుతున్న అసలు నీతి! ఆదివాసులకు భూమే ఆత్మవిశ్వాసం. వారి భూమి హక్కులు కాలరాచే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, 2015లో హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొన్నారు. అధికారులు ‘‘మీరు కేసులు వెనక్కి తీసుకొంటే మీ భూములు 426 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగిస్తాం’’ అని చెప్పారు. దీనికోసం ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎం.ఓ.యూ) చేసుకొందామని చెప్పారు. మీరు ఇదే విషయంగా, హైకోర్టులో చెపితే మేము అంగీకరిస్తామని ఆదివాసులు చెప్పారు. అలా 22–6–2017న ప్రభుత్వం వారితో ఒక ఎం.ఓ.యు.ను కుదుర్చుకుంది. చెప్పిన విధంగానే ఆదివాసులు హైకోర్టులోని నాలుగు కేసులను ఉపసంహరించుకొన్నారు. ఇది జరిగి ఎనిమిదేళ్ళు అవుతున్నా, భూములలో ఒక్క సెంటు కూడా ఈ రోజుకూ ఆదివాసులకు ఇవ్వలేదు. అయినా అదివాసులు, వారి నాయకులు నిరంతరం గిరిజన సంఘ నాయకత్వాన పోరాడుతూనే వస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం భూములకు నోటిఫికేషన్లు ఇచ్చింది. భూముల కొనుగోలు కోసం రూ.43కోట్లు కేటాయించింది. 426 ఎకరాలలో 167 ఎకరాలు ఇప్పటికే సేకరించింది. కానీ ఈ తొలకరి నాటికి మొదటి విడతగా ఈ భూములనైనా ఇమ్మని ఆదివాసులు కోరుతున్నారు. పంచాయతీ కేంద్రానికి 2కి.మీ.లో దూరంలో ఉండి, 500మందికి పైగా ఓటర్లు ఉన్న ఆదివాసీ గూడేలను ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించాలన్న జి.ఓ. ఎం.ఎస్.63 ప్రకారం కొండమొదలు పెదకాలని (నేలదోనెలపాడు), పెదభీంపల్లి – 3 కాలనీ తదితర కాలనీలను ప్రత్యేక అదివాసీ పంచాయితీలుగా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పంచాయితీ లోని గ్రామాలు దూరంగా విడిపోయాయి. వాటికి నిధులను ప్రభుత్వం కేటాయించనందున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రత్యేక పంచాయితీలు ఏర్పరచాలని అక్టోబరు 2024 లోనే గ్రామసభలు తీర్మానాలు చేసి పంపాయి. కనుక జీవో 63ను అమలు చేయాలి. పోలవరం నిర్వాసితుల కష్టాలు, బాధలు లోతైనవి. ఆదివాసీలలో ఒక తెగ తమ పూర్తి ఉనికిని కోల్పోయిన తీవ్రమైన సంక్షోభం ఇది. భూమి, వనరులపై జీవించే అవకాశం ఆదివాసుల జీవితాలకు కీలకం. పోలవరం నిర్వాసితుల మౌలిక సమస్యను అర్థం చేసుకొని, దాన్ని పరిష్కరించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలి.

- సింహాద్రి ఝాన్సీ

ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం అధ్యక్షులు

Updated Date - Jul 02 , 2025 | 02:55 AM