Tribute Poem: మృత్యువిహంగం
ABN, Publish Date - Jun 15 , 2025 | 03:53 AM
గగనాన ఎగరాల్సిన కలలు రెక్కలు తెగి నేలరాలడమేమిటి అనుబంధాల దారప్పోగులు పుటుక్కున తెగి చితిపై కాలడమేమిటి...
గగనాన ఎగరాల్సిన కలలు
రెక్కలు తెగి నేలరాలడమేమిటి
అనుబంధాల దారప్పోగులు
పుటుక్కున తెగి చితిపై కాలడమేమిటి
చంద్రమండలం మీద కాలుమోపిన మానవుడు చటుక్కున
చతికిలపడటమేమిటి
యంత్రానికి ప్రకృతికి నడుమ
నిరంతర సంఘర్షణ
పెనువిధ్వంసం జరిగాక
బ్లాక్ డే గా ప్రకటించాక
బ్లాక్ బాక్స్ కై వెతుకులాటెందుకు
ఎక్స్‌గ్రేషియా టిష్యూ పేపర్‌తో
కంటితుడుపు చర్యలెందుకు
పెనువిధ్వంసం జరిగాక
పోస్టుమార్టమ్ రిపోర్టులెవరికోసం...
కుటుంబాలకు కుటుంబాలే
బుగ్గిపాలైన ఘోరవిపత్తు
ఆకాశమంత ఎదిగిన
సంతానం సజీవదహనమైతే
ఆ బూడిదను ఏ పుణ్యతీర్థంలో
నిమజ్జనం చేయాలి
విమానంలో ప్రయాణించే
మనుషులు వేరు కావచ్చు
ఎదురొచ్చిన చావు ఒక్కటే
ఐనా ఎవ్వడికీ ఏమీ పట్టదు
ఈ రోజు పతాక శీర్షికలో నెత్తురోడినవార్త...
అనాథశవంలా రేపు చెత్తకుప్పలోకే...
కాలం నేర్పే గుణపాఠాలను
గుండెగోడలకు వేలాడదీసే
కనువిప్పు కావాలిప్పుడు
వర్తమానం కాన్వాసు మీద మనిషి
వాస్తవాల వర్ణచిత్రం కావాలిప్పుడు
కానీ ఎప్పటికీ ఒక్కడుంటాడు
సమాధి మీద ఎగిరే విజయపతాకై
ఒక్కడుంటాడు
బతుకుపోరులో మృత్యుంజయుడై....
---సరికొండ నరసింహరాజు
(అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించినవారి కోసం)
Updated Date - Jun 15 , 2025 | 03:55 AM