Supreme Court: సవరణ చట్టంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం
ABN, Publish Date - Aug 07 , 2025 | 05:40 AM
1982 సెప్టెంబర్ 17న జస్టిస్ వైవి. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
1982 సెప్టెంబర్ 17న జస్టిస్ వైవి. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ‘పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరినీ విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలి’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చివరగా పొందిన జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పెన్షనర్లకు సంబంధించి ఈ తీర్పు ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 17ను ‘పెన్షనర్ల దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025న ‘ఆర్థిక బిల్లు 2025’లో పెన్షనర్లకు సంబంధించిన ధృవీకరణ చట్టానికి సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా పెన్షనర్ల నడ్డి విరగ్గొట్టడానికి పూనుకుంది. ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వంటివారు కోరినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా బిల్లును ఆమోదింపజేసింది. ఈ సవరణ వలన పెన్షనర్లలో వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు, డీఏ పెరుగుదలను అరికట్టవచ్చు. ఇతర పెన్షన్ లాభాలను కూడా తగ్గించవచ్చు. లేక పెన్షన్‌నే తగ్గించవచ్చు. చివరకు పెన్షన్‌ను నిలిపేయవచ్చు. పెన్షనర్లందరూ ఇది గమనించాలి. ఈ చట్టం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల పైనే గాక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ సవరణ చట్టాన్ని వెంటనే కేంద్రం ఉపసంహరించుకునేలా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాల్సిన బాధ్యత పెన్షనర్ల సంఘాలపై ఉంది.
– పి.రాజేశం, సికింద్రాబాద్
Updated Date - Aug 07 , 2025 | 05:40 AM