ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gaddam Satish Bapu: తెలంగాణ జీవన స్పర్శ బాపు

ABN, Publish Date - Jun 09 , 2025 | 01:05 AM

ఎవరికైనా తల్లిదండ్రులే ఆదర్శం. బిడ్డలకు వారే నిజమైన హీరోలు. హీరోలంటే ‘రీల్‌’ జీవితంలోని వారు కాదు, ‘రియల్‌’ జీవితంలోని వారు. ఆ తల్లిదండ్రులు లేని రోజొకటి వస్తుందనే విషయం ఊహకు కూడా రాదు...

వరికైనా తల్లిదండ్రులే ఆదర్శం. బిడ్డలకు వారే నిజమైన హీరోలు. హీరోలంటే ‘రీల్‌’ జీవితంలోని వారు కాదు, ‘రియల్‌’ జీవితంలోని వారు. ఆ తల్లిదండ్రులు లేని రోజొకటి వస్తుందనే విషయం ఊహకు కూడా రాదు. అకస్మాత్తుగా కన్నవారు దూర మైతే ఆ దుఃఖం ఎంత వేదనాభరితమో ఊహించాల్సిందే. గడ్డం సతీష్‌ పుస్తకం ‘బాపు’ అలాంటి వేదనాభరిత తలపోత. గడ్డం సతీష్‌ తండ్రి రామస్వామి తెలంగాణ పల్లె పేద రైతు. తల్లి అజ్జిరవ్వ (వజ్రమ్మ). 30 గుంటల తరిపొలం, 10 గుంటల శెల్క (పెరడి)లో జీవితమంతా ఆ మట్టితోనే బతికిన పేద రైతు. ఆరుగాలం కష్టించి పనిచేసినా ఆ పూటకు ఎల్లదీసుకోవటమే కనాకష్టంగా జీవితాన్ని గడిపిన కష్టబోతు. ఉన్నొక్క బిడ్డ పెండ్లి కోసం తరిపొలాన్ని, కన్న కొడుకు కాలేజీ ఫీజు కోసం ఇంటి పైకప్పుగా ఉన్న రేకులను అమ్మిన కూలి రైతు. ఆయన జీవితాన్ని చెప్పే క్రమంలో తెలంగాణ జీవన సౌందర్యం ఈ పుస్తకం పేజీల నిండా పరుచుకున్నది. ‘బాపు’లో విజువల్‌ ఫ్రేమ్‌ లన్నీ రవివర్మ గీసిన అందమైన సహజమైన తెలంగాణ జీవన చిత్రాల వంటివి. ఈ పుస్తకంలో ఉన్న ఇరవై రెండు దృశ్య ఖండికలలో మొదటి మూడు సతీష్‌ తండ్రి గడ్డం రామస్వామి స్మరణలో రాసినవి కాగా, తర్వాతి ఆరు ఆయనతో ఉన్న ఆవిరవని అనుభవాలు, జ్ఞాపకాలు. సతీష్‌ రాతలో ఉత్తర తెలం గాణ యాస వన్నెలద్దుకున్నది. తెలంగాణ మట్టి పరిమళం అద్దుకున్న భాష ఎంత అందమైనదో సతీష్‌ రాసిన ప్రతి వాక్యం లోనూ కనపడుతుంది:

‘‘ఎప్పుడు అడ్లమ్మినా లాగోడి కర్సులు, కైకిలోళ్ల కర్సులు అన్నివోను మిగిలేటియి రెండు వేలో, మూడు వేలో. అవిదెచ్చి అజ్జిరవ్వకిస్తే వాటిని ఓరకు వెట్టేది అమ్మ. ఓరకు వెట్టుడంటే బ్యాంకు లాకర్లనో, అల్మార్లనో గాదు. ఇటుకపెల్లల కిందనో, బియ్యం సంచిల్నో.. సందుగుల్నో దాసివెట్టేది. ఇగ ఇంట్ల పైసలుంటే బాపు చేతులుత్తగుండయి. వాటిని నాల్గయిదు సార్లు లెక్కవేడ్తడు. అట్లెందుకు, అన్ని సార్లు లెక్కవెడ్తవే బాపు.. అని నేనోసారి అడిగిన. ‘మీ అయ్య ఊకె లెక్కవెడ్తే పైసలు డబులైతయిరా’ అని అజ్జిరవ్వ పరాష్కమాడుకుంట ఇల్లూడుస్తున్నది. ‘నిజమేనానె బాపు’ అని అడిగిన. ‘దాని మొకం.. అదట్లనే ఒర్రుతది బిడ్డా. మన జేతుల గిన్నిగనం పైసలెప్పుడుంటయిరా, అడ్ల పైసలొచ్చినప్పుడేనాయె! రెండు మూడ్రోజులైతే ఎక్కడియక్కడ గడ్తం. అట్లా గట్టినంక మనకేం ఉంటయి. ఐదార్నెల్లు కట్టవడ్తె అచ్చిన పైసల్ని నాలుగైదు సార్లనన్న లెక్కవెట్టుకోవద్దారా? కట్టాన్ని కండ్ల నిండా సూసుకోవద్దారా కొడుకా?’’ (‘రేకుల కింద రెక్కలు’)

ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చినంక పెట్టుబడులు, చేసిన అప్పులు పోను ఏమీ మిగలని జీవితాలకు, వడ్లు మార్కెట్‌కు పంపి అమ్మిన తర్వాత వచ్చిన బిల్లు పైసలనే తనివిదీరా లెక్కవెట్టి తుర్తిపడే తెలంగాణ రైతు జీవితాల మురిపాలు, ఆనందాలకు ఇదొక తార్కానం.

తెలంగాణ జన జీవితంలోని కష్టనష్టాలు, కన్నీళ్లు, చిన్న చిన్న ఆనందాలు, పిల్లల మురిపాలు ఒక ఎత్తు అయితే, శ్రమజీవుల జీవనంలోని ప్రజాస్వామికత మరో ఎత్తు. స్త్రీ పురుష సమానత్వం విలువల గురించి సిద్ధాంతాలు, వాద సంవాదాలు ఎన్నో ఉన్నాయి. కానీ, సహజంగానే తెలంగాణ జన జీవితంలో ప్రజాస్వామికత, స్త్రీ పురుష సమానత్వం అడుగడుగునా కనిపిస్తుంది. గడ్డం సతీష్‌ తండ్రి రామస్వామి, తల్లి అజ్జిరవ్వనే తీసుకుంటే– రామస్వామి పొద్దున ఎగిలివారంగనే (అంటే ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు) లేసి పొయ్యి అంటివెడ్తడు. కిరసనాయిల్‌, ఇంకా ఇతర చెత్తా చెదారం లేకుండనే పొయ్య అంటివెట్టుట్ల అతనికి అతనే సాటి. పొయ్యి అంటివెట్టి ఇంటిల్లి పాదికి ఆ పొయ్యి మీద చాయ వెడ్తడు. ఆ తర్వాత అజ్జిరవ్వ లేసి బాసన్లు తోమి పొయ్యి అల్కి, ఇంటిముంగట వాకిలు ఊడుస్తది. అప్పుడు రామస్వామి బోరింగ్‌ కాన్నుంచి బిందెల నీళ్లు తెచ్చి వాకిట్ల సల్లుతడు. రామస్వామి నీళ్లు జల్లితే అజ్జిరవ్వ ముగ్గులేస్తది. అజ్జిరవ్వ బట్టలుతికితే రామస్వామి ఆరేస్తడు. ఏడెనిమిది గంటలకల్ల ఇంత వండి బిడ్డకు బడికి సద్దిగట్టి, మిగిలింది గిన్నెల వెట్టుకొని, నెత్తిమీద గంప ఎత్తుకొని బాయికాడికి బయల్దేరుతరు. ముంగట రామస్వామి, ఎనుక అజ్జిరవ్వ. రామస్వామి వాడ్కకల్లు ఇంత తాగి సొలుగుకుంట వచ్చినా అజ్జిరవ్వ పరాష్కం ఆడుకుంటనే మొట్టీలు మొత్తినా, రామస్వామి నవ్వుకుంటనే, ‘‘ఇగ సాల్‌ తియ్యె.. ఎగసెక్కాలు. నేను కొంచెం సొల్గిన కనీ.. కిందవడి ఇజ్జిత్‌ కచ్‌రా చేసుకొని ఎచ్చీర్కం కాలె తియ్యే’’ అని చెప్పుకుంటడు. ఎన్ని కష్టాలొచ్చినా కలిసి మాట్లాడుకొని ఎల్లదీసుకునే ఉపాయం జేస్తరు. ఆలు మొగలుగా స్త్రీ పురుషుల సహజీవనం ఎంత ప్రజాస్వామికంగా ఉంటదో తెలంగాణ జన జీవితమే తార్కానం.

ఈ ప్రజాస్వామిక జీవనం యాంత్రిక మధ్యతరగతి నగర జీవితాల్లో చూడటం సాధ్యం కాదు. పిల్లలను నాలుగైదేండ్ల నుంచే ప్రత్యేక పడకగదుల్లో బంధించే నవనాగరిక జీవనంలో అమ్మానాన్నల అనురాగ స్పర్శ వారికి అందుతున్నదా? నిజానికి ఇవ్వాళ పిల్లల్లో ఉన్న మానసిక వికారాలకు పునాది ఇక్కడనే ఉన్నదా? ఈ మధ్యన బంధువు పురుడు పోసుకుంటే– పరామర్శ కోసం ఓ హాస్పిటల్‌కు పోయిన. పుట్టిన ఒక రోజు పసికందు ఏడుస్తుంటే, ఆపరేషన్‌ తర్వాత ఇంకా కదల్లేని స్థితిలో ఉన్న తల్లి దగ్గర పడుకోబెడితేనే పాపకు తల్లి స్పర్శ అందుతుందనీ, అప్పుడే పాప ఏడుపు మానుతుందని నర్సులు చెప్పటం విని కదిలిపోయాను. తల్లి స్పర్శ లేకుండా చేయటమే నాగరికత అయితే, అది అనవసరం. ఈ నేపథ్యంలో గడ్డం సతీష్‌ రాసిన ‘బాపు’ తెలంగాణ తల్లి స్పర్శ.

-ఎస్‌. మల్లారెడ్డి

80966 77255

Updated Date - Jun 09 , 2025 | 01:06 AM