PV Narasimha Rao: జాతి నిర్మాణంలో శిఖరసమానుడు
ABN, Publish Date - Jun 28 , 2025 | 02:56 AM
ఆర్థిక, రాజకీయ, దౌత్య, సామాజిక, బహుభాషా విద్యావేత్త; దార్శనికుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, తత్త్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణక్యుడు; ఆర్థిక సంస్కరణల రూపకర్తగా స్వపక్షం నుంచి, ప్రతిపక్షాల నుంచి, ఖండాంతర ఆర్థిక నిపుణుల నుంచి...
ఆర్థిక, రాజకీయ, దౌత్య, సామాజిక, బహుభాషా విద్యావేత్త; దార్శనికుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, తత్త్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణక్యుడు; ఆర్థిక సంస్కరణల రూపకర్తగా స్వపక్షం నుంచి, ప్రతిపక్షాల నుంచి, ఖండాంతర ఆర్థిక నిపుణుల నుంచి మన్ననలనందుకున్న వ్యక్తి మాజీ ప్రధానమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన విద్యా సామర్థ్యం, పరిపక్వతయుత సేవలకు గుర్తింపుగా, గత సంవత్సరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఎన్నికల్లో పోటీ చేయనని, లోక్‌సభ టిక్కెట్టు కూడా వద్దని, మూటా ముల్లె సర్దుకుని సొంత రాష్ట్రానికి పయనమయిన వ్యక్తి. అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అనూహ్య రీతిలో ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి, 1991 నుంచి 1996 దాకా అయిదేళ్లూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలపడం భారత రాజకీయాలలో కీలక మలుపు. నెహ్రూ–గాంధీ కుటుంబేతరుడుగా, తొలి దాక్షిణాత్యుడిగా, తెలుగువాడిగా, ప్రధాని పీఠాన్ని అందుకుని, ఆ పదవిలో అయిదేళ్లు కొనసాగటం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. అప్పటికి 70 సంవత్సరాల వయసున్న పీవీ తన రాజకీయ ప్రస్థానంలో హిమాలయాలంత ఎత్తెదిగారు. ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన తెలంగాణ బిడ్డ. పీవీ... స్వాతంత్య్ర సమరయోధుడిగా, స్వామీ రామానందతీర్థ శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా అగ్రభాగాన ఉన్నారు.
1971 సెప్టెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన పీవీ అహర్నిశలూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. అభివృద్ధికర, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చారు. 1972 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ఎంపికలో యువకులకు, బలహీనవర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అత్యధిక మెజార్టీ సీట్లను గెల్చుకుని మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. చరిత్రాత్మక భూసంస్కరణల బిల్లుకు ఆయన హయాంలోనే శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక అసమానతలు తొలగించడానికి, ఉత్పత్తి పెరుగుదలకు ఉద్దేశించిన ఓ సామాజిక సంస్కరణగా దానిని ఆయన అభివర్ణించారు. ఈ చర్య గిట్టని సొంత పార్టీకి చెందిన ప్రగతిశీల వ్యతిరేక ముఠా ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితికి తీసుకొచ్చింది.
పీవీ జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఆ పదవిలో జవహర్‌లాల్ నెహ్రూ విదేశాంగ విధానాన్ని, దౌత్యనీతిని, దశదిశలా ప్రచారం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పీవీ చేసిన ఉపన్యాసం పాత రోజులనాటి కృష్ణమీనన్ ఉపన్యాసాన్ని మరిపించింది. కొంతకాలం హోం శాఖను నిర్వహించారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోను అబ్బురపరచారు.
పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేయడం, ప్రముఖులను కశ్మీరు తీవ్రవాదులు అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ఆ ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో రక్షణశాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. నూతన విద్యావిధానాన్ని రూపొందించారు. ఆయన హయాంలోనే జాతీయ శిక్షణ విధానాన్ని కూడా రూపొందించారు. అయిదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో, శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి పలువురికి పంచిపెట్టిన మేధావి. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని ధీశాలి. ఆలోచనల్లో, అమల్లో విజ్ఞాన సర్వస్వం.
జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ స్వర్గీయ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ తెలుగు పుస్తకాన్ని హిందీలోకి ‘సహస్రఫణ్’గా అనువదించారు పీవీ. అది ఆయన తెలుగు, హిందీ భాషల ప్రావీణ్యానికి నిదర్శనం. క్షణమైనా తీరికలేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నా, అన్ని భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. 17 భాషలలో నిష్ణాతుడు కావడంతో పాటు ఆర్థికశాస్త్రం, చట్టం, చరిత్ర, రాజకీయాలు, కళలలో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది. తెలంగాణ సాయుధపోరాటం ఇతివృత్తం ఆధారంగా పీవీ రాసిన గొల్ల రామవ్వ కథలో... ఒక గొప్ప సాయుధ పోరాటవీరుడిని రామవ్వ ఏ విధంగా కాపాడిందో అద్భుతంగా వర్ణించారు పీవీ.
నవభారత నిర్మాతల్లో మొట్టమొదటి ‘కంట్రీ ప్లానింగ్’కు శ్రీకారం చుట్టి అమలుచేసిన వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అయితే, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు ‘గ్లోబల్ ఇండియా’ సృష్టించిన వ్యక్తి. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థికవేత్తల, దౌత్య సంబంధాల మహోద్దండ నాయకుల సరసన, పీవీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయం. పీవీ నిరంతర సంస్కరణశీలి. ఏ రంగంలో అయినా సంస్కరణలు తేవడమే ఆయన చేసిన పని. భారత రాజకీయ చరిత్రలో అజరామర నేత. అందుకే పీవీని స్మరించుకోవటం సదా మన కర్తవ్యం. ఆ మహనీయుడికి నివాళి.
– వనం జ్వాలానరసింహారావు
(నేడు పీవీ నరసింహారావు జయంతి)
Updated Date - Jun 28 , 2025 | 02:57 AM