Nuclear Threats: రణగొణ ధ్వనులు
ABN, Publish Date - Aug 13 , 2025 | 04:37 AM
చివరకు బెనజీర్ భుట్టో ముద్దుల కొడుకు కూడా మనని యుద్ధం పేరిట బెదిరిస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం..
చివరకు బెనజీర్ భుట్టో ముద్దుల కొడుకు కూడా మనని యుద్ధం పేరిట బెదిరిస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసినందుకు పాకిస్థాన్‌నుంచి రణనినాదాలు బాగానే వినిపిస్తున్నాయి. ఒప్పందాన్ని నిలిపివేసి 20కోట్లమంది పాకిస్తానీయులకు దక్కాల్సిన నీటిని అడ్డుకోవడం కనుక జరిగితే, భారత్‌ను యుద్ధంలో ఓడించి, ఆరునదులనూ స్వాధీనం చేసుకోవడం వినా తమకు మరోమార్గం లేదని బిలావల్ బెదిరిస్తున్నారు. యుద్ధం వస్తేగిస్తే పాక్ తలవంచదనీ, ప్రతీ పౌరుడూ పోరాడతాడని ఆయన దేశభక్తియుత వ్యాఖ్యలు చాలా చేసుకున్నాడు. సింధుజలాల గురించీ, యుద్ధం గురించీ సింధ్ ప్రావిన్సులో, ఏదో సభలో, ఏదో సందర్భంలో ఈ రాజకీయనాయకుడు ఏమి మాట్లాడినా, ఎంతకాలుదువ్వినా మనకు పోయేదేమీ లేదు. ఆ వ్యర్థప్రలాపనలకు అంత విలువేమీ ఉండదు. కానీ, దీనికి ముందురోజు, ఇంతకుమించిన ఉన్మాదంతో ఊగిపోతూ, ఏకంగా అణుయుద్ధం హెచ్చరికలే చేస్తూ భారత్‌ను పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ బెదిరించడం తేలికగా తీసిపారేయగలిగేది కాదు. మునీర్ ఏం మాట్లాడారన్న కంటే, ఆయన ఎక్కడ నిలబడి ఆ మాటలన్నాడన్నది ముఖ్యం. ఒక కాలమిస్టు వ్యాఖ్యానించినట్టుగా ట్రంప్ కాంపౌండ్‌లో నుంచి ఆయన మొరిగాడు. యజమాని పక్కన ఉన్నప్పుడు పెంపుడుజీవులకు ఎక్కడ లేని ధైర్యమూ వస్తుంది. విశ్వాస ప్రదర్శన వీరంగాల స్థాయిలో సాగుతుంది. అన్నం పెట్టినవాడు, ఎర్రతివాచీ పరిచి ఆతిథ్యమిచ్చినవాడు పక్కనే ఉన్నాడన్న ధైర్యం కాబోలు, మునీర్ ఏకంగా అణ్వాయుధ ప్రయోగం గురించి మాట్లాడాడు. ఆనకట్టలతో సింధుజలాలను అడ్డితే వాటిని పేల్చేస్తాం, కూల్చేస్తామన్న హెచ్చరికలతో ఆయన సరిపెట్టలేదు. తమ ఉనికికి ప్రమాదం వాటిల్లిన పక్షంలో కేవలం భారత్‌నే కాక, సగం ప్రపంచాన్ని తమతో తీసుకుపోతామని కూడా ఆయన బెదిరించాడు. ఫ్లోరిడాలో ఆయన చేసిన ప్రసంగం మొత్తం పాకిస్తానీ సైనికమీడియా విభాగం నుంచి వెలుగుచూడలేదు కానీ, ఆయన ఈ ప్రసంగంలో భారతదేశాన్ని ఆర్థికంగానూ, అణ్వాయుధాలతోనూ ధ్వంసం చేస్తామని గట్టిగానే బెదిరించాడు. భారతదేశం ఎదగకుండా పాకిస్థాన్ ఏమి చేయగలదో, ఎలా అడ్డుపడగలదో, గతంలో ఏం జరిగిందో కూడా ఆయన పరోక్షంగా చెప్పాడు.
ఆపరేషన్ సిందూర్ తరువాత ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి లభించిన ఆసిమ్‌మునీర్ తన వీరత్వాన్ని ప్రదర్శించడానికీ, ఆ ఉన్నత స్థానాన్ని పదిలపరుచుకోవడానికీ ఈ విధంగా మాట్లాడటం అవసరమని అనుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం బలహీనమైనది కావడం, తన దయాదాక్షిణ్యాలమీద ఆధారపడివుండటం కూడా మునీర్ అహంకారానికి కారణం. పాకిస్థాన్‌లో పౌరప్రభుత్వాల మీద సైన్యం పెత్తనం అనాదిగా ఉన్నదే కానీ, ప్రజామోదం విస్తృతంగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను జైల్లోకి నెట్టి, ఆయన పదవిలోకి రాకుండా అడ్డుపడి, కాళ్ళబేరానికి వచ్చిన షరీఫ్ సోదరులను గద్దెనెక్కించిన సైన్యానికి ఈ మారు తిరుగేలేదు. కశ్మీర్‌ను పాక్ ప్రాణాన్ని నిలబెట్టే కంఠసిరగా అభివర్ణించిన వారంలోనే పహల్గాం దాడి జరిగింది. పాక్ సైన్యానికీ, ఉగ్రవాదులకు మధ్య ఉన్న అనుబంధం తెలిసిందే కనుక, ఆ సందేశంతోనే ఆదేశాలు వెళ్ళాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇప్పుడు ఫ్లోరిడా సభలో కూడా మునీర్ మళ్ళీ కశ్మీర్ ఊసును అదేరీతిలో ప్రస్తావించినందున విశ్లేషకులు దీనిని మరింత ప్రమాదకరమైన హెచ్చరికగా చూస్తున్నారు. పాక్ ఉడుత ఊపులకూ, అణు బెదిరింపులకూ భారతదేశం బెదరదని ఆపరేషన్ సిందూర్ స్పష్టంచేసింది. ఇప్పుడు కూడా మునీర్ అణు హెచ్చరికలకు జడిసేది లేదనీ, దేశభద్రతలో తగ్గేది లేదని చెబుతూనే, స్వయంగా పాక్ సైన్యాధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి అత్యంత ప్రమాదకరమైన అణ్వస్త్రాలు ఒక ధూర్తరాజ్యం చేతిలో ఉన్న విషయాన్ని మిగతా ప్రపంచం ఇప్పటికైనా గుర్తించాలని కోరింది. రెండోసారి అమెరికాలో కాలూనగానే, భారతదేశాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తానని పాక్ సైన్యాధ్యక్షుడు అక్కడ నిల్చొని మరీ బెదిరించగలిగాడు. మోదీ–ట్రంప్ మధ్య చెడిన స్నేహం, పాక్–అమెరికా మధ్య పెరిగిన సాన్నిహిత్యం, ట్రంప్ కుటుంబంతో వాణిజ్యం మునీర్‌కు శక్తినిచ్చాయి. ట్రంప్ ప్రేమలు ఎంతోకాలం కొనసాగవన్నది అటుంచితే, నోబెల్ శాంతికోసం అర్రులు చాస్తున్న ఆయన మునీర్‌కు ముకుతాడు వేస్తే బాగుంటుంది.
Updated Date - Aug 13 , 2025 | 04:37 AM