ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Author Ramachandra Guha: భారతీయులకు పహల్గాం పరీక్ష

ABN, Publish Date - May 03 , 2025 | 03:35 AM

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం కశ్మీరీల మానవీయ ప్రవర్తన ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించింది. విభజన కాలంలో కశ్మీర్‌ లోయలో మత సామరస్యాన్ని కాపాడిన కశ్మీరీలు, పహల్గాం ఘటనలోనూ తమ మానవత్వాన్ని ప్రదర్శించారు.

విషాదం నడుమ భరోసాకు ఆలంబన లభించడం నిస్సందేహంగా ఉదాత్త భావోద్వేగాన్ని కలిగిస్తుంది. పహల్గాంలో ఉగ్రవాదులు హతమార్చిన పర్యాటకులలో ఒకరు కేరళవాసి ఎన్‌. రామచంద్రన్‌. ఆయన కుమార్తె ఆరతీ శరత్‌ స్వస్థలానికి తిరిగివచ్చిన అనంతరం ఆ కష్ట సమయంలో తనకు అవసరమైన సహాయాన్ని ఇద్దరు యువకుల నుంచి ఎలా పొందిందీ చాలా ఉద్వేగంతో చెప్పారు. ఆమె మాటలను ‘ది హిందూ’ ఇలా ఉటంకించింది: ‘ముసాఫిర్‌, మరో స్థానిక డ్రైవర్‌ సమీర్‌ చివరివరకు నాతోనే ఉన్నారు. ఆస్పత్రిలో శవాల గది వెలుపల తెల్లవారుజాము 3 గంటలదాకా నిలబడి ఉన్నప్పుడు కూడా వారు నా పక్కనే ఉన్నారు. వారిరువురూ నన్ను ఒక చెల్లెలుగా ఆదరించారు. కశ్మీర్‌ నాకు ఇద్దరు సోదరులను ఇచ్చింది’. పహల్గాంలో 26 మంది అమాయకులను బలిగొన్న ఉగ్రవాదుల రాక్షసచర్యకు సమస్త కశ్మీర్‌ ప్రజలు ప్రతిస్పందించిన తీరుకు ముసాఫిర్‌, సమీర్‌ ప్రతినిధులని పలు దినపత్రికలలో వెలువడిన వార్తా కథనాలు ధ్రువీకరించాయి. ఘటన ప్రదేశంలో ఉన్న పలువురు పర్యాటకులను కశ్మీరీ గైడ్‌లు స్వయంగా సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్లారు. తన వృత్తి సహచరుల వలే ముస్లిం మతస్తుడు అయిన ఒక గైడ్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. భయాందోళనలలో ఉన్న పర్యాటకులకు ముస్లిం మతాచార్యులు మసీదులలో ఆశ్రయం కల్పించారు.


ఆ క్లిష్ట సమయంలో టాక్సీ డైవర్లు డబ్బులు తీసుకోకుండా పర్యాటకులను వారి వారి హోటళ్లకు, విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. పహల్గాం ఘటన మరుసటి రోజు కశ్మీర్‌ అంతటా ప్రజలు సంపూర్ణ హర్తాళ్‌ పాటించారు. ఉగ్ర హింసాకాండ బాధితులకు సంతాపంగా దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు అన్నిటినీ మూసివేశారు. పాలక ప్రతిపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులను, సరిహద్దుల ఆవల నుంచి వారికి మద్దతునిస్తున్న వారి అమానుషత్వాన్ని ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. ఉగ్రవాద దాడి సందర్భంలో కశ్మీరీల మానవీయ ప్రవర్తనా ఉదంతాలు చరిత్రకారుడినైన నాకు దేశ విభజన వెనువెంటనే కశ్మీర్‌ లోయపై పాకిస్థాన్‌ ప్రప్రథమంగా దాడి చేసినప్పుడు సమస్త కశ్మీరీలు ఎలా ఆదర్శపూర్వకంగా వ్యవహరించిందీ గుర్తుచేశాయి. 1947 శరత్కాలంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో, తూర్పు, పశ్చిమ పంజాబ్‌లలో మతోన్మాద హింసాకాండ తీవ్ర స్థాయిలో జరుగుతుండగా కశ్మీర్ సంపూర్ణంగా మత సామరస్యానికి నెలవుగా ఉన్నది. ముస్లింలు, హిందువులు, సిక్కులు దృఢ సంఘీభావంతో సమైక్యంగా దురాక్రమణదారును ఎదుర్కొన్నారు. పహల్గాంలో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ముస్లింలకు హిందువులు పూర్తిగా వ్యతిరేకులు అవుతారని, మత ఘర్షణలు ప్రజ్వరిల్లుతాయని భావించారు. ఈ లక్ష్య సాధనలో వారు కనీసం కశ్మీర్‌కు సంబంధించినంత వరకు విఫలమయ్యారు. సరే ఆ విషాద ఘటన అనంతరం మన దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నివసిస్తున్నవారూ కశ్మీరీల వలే ప్రవర్తించారా? రాజస్థాన్‌లో ఒక బీజేపీ ఎమ్మెల్యే శుక్రవారం ప్రార్థనల సమయంలో ఓ మసీదులోకి వెళ్లి ‘జై శ్రీరామ్‌ ’అని అరిచాడు. ‘


పాకిస్థాన్‌ మూర్దాబాద్‌’ అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. అస్సోంలో బీజేపీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్‌ చేయించేందుకు చొరవ చూపాడు. ఆ రాజకీయ ప్రత్యర్థులు ‘భారత్‌ వ్యతిరేకులు’ అనీ అస్సోం రాష్ట్ర పాలనా యంత్రాంగం ఆరోపించింది. సామాజిక మాధ్యమాలలో కూడా అటువంటి ఆరోపణలే చేసింది. మధ్యప్రదేశ్‌లో ముస్లిం మతస్తుడైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు, అజ్ఞాత వ్యక్తుల నుంచి చంపివేస్తామనే బెదిరింపులు వచ్చాయి. గుజరాత్‌లో ‘చొరబాటుదారులు’ అనే ఆరోపణతో వందలాది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి వారిలో అత్యధికులు నికార్సైన భారత పౌరులు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లలో మితవాద వర్గాల గూండాలు కశ్మీరీ విద్యార్థులు హాస్టళ్లను వీడిపోయేలా బలవంతపెట్టారు. చాలా మంది కశ్మీరీ విద్యార్థులు విద్యాభ్యాసాన్ని విరమించి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ముస్సోరిలో కశ్మీరీ శాలువాల విక్రేతలు తమ వ్యాపారానికి స్వస్తి చెప్పి కశ్మీర్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్‌లో పహల్గాం ఘటనతో ఎటువంటి సంబంధంలేని ఎంతో మందిని అరెస్ట్‌ చేశారు. బుల్డోజర్లతో పలువురి కూల్చి వేశారు. ఈ చట్ట విరుద్ధ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఘటన అనంతరం ప్రధానమంత్రి తన తొలి బహిరంగ ఉపన్యాసాన్ని బిహార్‌లో వెలువరించడం నిరుత్సాహం కలిగిస్తోంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ప్రధాని ఆ ఉపన్యాసం చేయడం గమనార్హం. ఆ ఉపన్యాసంలోను, ఆ తరువాత ‘మన్‌ కి బాత్‌’ ప్రసంగంలోను ఆసేతు హిమాచలం అన్ని భాషల వారూ పహల్గాం ఘటనను ముక్తకంఠంతో ఖండించారని పేర్కొన్నారు. ఈ దేశంలో బహుళ మతాలు విలసిల్లుతున్నాయని, ఆ మత బాహుళ్యం మన దేశానికి ఒక విశిష్టతను సమకూర్చుతుందనే వాస్తవాన్ని ఆయన అంగీకరించి ఉన్నట్టయితే ఉదాత్త రాజనీతిజ్ఞత అయివుండేది.


మతాలకతీతంగా సమస్త ప్రజలూ పహల్గాం ఘటనను ఖండించారనే విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఘటన సందర్భంలోనూ, ఆ తరువాత కశ్మీరీలు మానవీయంగా వ్యవహరించిన వైనం ఆయనకు తెలీకుండా ఎలా ఉంటుంది? ఉగ్రవాద ఘటనపై చర్చించేందుకు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి హాజరుకాకపోవడం ప్రజాస్వామిక కార్యసరళి పట్ల ఆయన నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా సూచించింది. ప్రధానమంత్రి భాషా వైవిధ్యాన్ని గౌరవించారుగానీ మత బహుళత్వాన్ని విస్మరించారు (ఇతర బీజేపీ నాయకులు మరింత సంకుచితత్వంతో వ్యవహరించారు. వారి దృష్టిలో హిందీయే సర్వోన్నత భాష, హిందూమతమే సర్వోన్నత మతం). ఈ దృష్ట్యా, పహల్గాం మారణకాండకు వ్యతిరేకంగా సమస్త భారతీయులు మతాలకతీతంగా సమైక్యంగా నిలబడ్డారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించడం ఉత్సాహజనకంగా ఉన్నది. సరిహద్దు ఆవలివైపువారి అండదండలతో గతంలో సంభవించిన ఉగ్రవాద దాడుల వలే పహల్గాం ఘాతుకం కూడా రెండు పరీక్షలు పెట్టింది. ఒకటి భారత రాజ్యవ్యవస్థకు, రెండోది భారత ప్రజలకు. ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలు, బహుత్వవాద సంప్రదాయాలను సమర్థించే ఆలోచనాపరుడుగా పహల్గాం ఘటనకు సహచర పౌరులు ఎలా ప్రతిస్పందించాలనే విషయమై నాకు స్పష్టమైన భావాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అవి చాలా వరకు జవహర్‌లాల్‌ నెహ్రూ భావాలతో ఏకీభవిస్తాయి. దేశ విభజన అనంతరం రెండు నెలలకు అక్టోబర్‌ 15, 1947న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ ఇలా పేర్కొన్నారు: ‘మన దేశంలో ముస్లిం మైనారిటీ ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు, ఈ దేశం నుంచి వెళ్లి పోదల్చుకున్నప్పటికీ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి వారిది. వారు ఈ దేశంలోనే నివసించాలి. పాకిస్థాన్‌ ఎంతగా రెచ్చగొట్టినా, ఆ దేశంలోని ముస్లిమేతరులను ఎంతగా వేధింపులకు గురి చేస్తున్నా మనం మాత్రం మన దేశంలోని ముస్లిం మైనారిటీలను గౌరవాదరాలతో చూడాలి. వారికి పూర్తి భద్రత కల్పించాలి. ఒక ప్రజాస్వామిక రాజ్యంలో పౌరులకు ఉండే హక్కులు అన్నిటినీ మన ముస్లిం మైనారిటీలకు కల్పించాలి’. నెహ్రూ ఇప్పుడు చాలా నిందలు ఎదుర్కొంటున్న నాయకుడు. ఆయనను అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రస్తుత పాలకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


ఆయన అనుసరించిన ఆర్థిక, దౌత్య విధానాలలో లొసుగులు ఉండవచ్చుగానీ భాషా, మతపరమైన బహుళతత్వాన్ని కాపాడడంలో ఆయన నిబద్ధత, దార్శనికత వర్తమాన భారతదేశానికి మరింతగా అవసరం. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో నెహ్రూ భావాల, విధానాల ఉపయుక్తత మరింతగా విశదమవుతుంది. పహల్గాం ఘటనకు కొన్నిరోజులు ముందు కశ్మీర్‌ పాకిస్థాన్‌ కంఠ రక్తనాళం అని ఆ సైనికాధికారి నొక్కి చెప్పాడు. పహల్గాంలో పర్యాటకుల ఊచకోత అనంతరం పాకిస్థాన్‌ మిలిటరీ అకాడమీలో మాట్లాడుతూ, ద్విజాతి సిద్ధాంతం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులు అని– మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలలో పూర్తిగా భిన్నమైనవారని, ఒక సమాజంలో ఇరువురూ సహజీనం నెరపడం అసాధ్యమని పాక్‌ ఆర్మీ చీఫ్‌ స్పష్టం చేశారు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ మొదలైన మితవాద నాయకులు ఇటువంటి భావాలతో తమ సొంత ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. హిందువులు, ముస్లింల మధ్య శాంతియుత సహజీవనం అసాధ్యమని ఘోషించారు. దేశ విభజన అనంతరం కోట్లాది ముస్లింలు భారత్‌లోనే ఉండిపోయారు. అయితే ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా హిందువులకు లోబడి ఉండి తీరాలని హిందుత్వ వాదులు తెగేసి చెప్పుతున్నారు. ఈ హానికర ఆలోచనా ధోరణులను, రాజకీయ కార్యక్రమాలను నెహ్రూ దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్య తొలి సంవత్సరాలలో పాకిస్థాన్‌లో ముస్లిమేతర పౌరులు ఎంతగా అవమానాలు, తిరస్కరణలకు గురవుతున్నప్పటికీ భారత్‌లో ముస్లింలను గౌరవాదరాలతో చూడాలని, దేశ పౌరులకు రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు అన్నిటినీ వారికి ముస్లిం మతస్తులకు కల్పించాలని పదే పదే స్పష్టం చేశారు. తుదివరకూ ఆయన ఆ వైఖరికే కట్టుబడి ఉన్నారు. పాకిస్థాన్‌ ఉసిగొల్పిన ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులు, హిందువులు అయిన పర్యాటకులను ఊచకోత కోసిన నేపథ్యంలో మన సమున్నత భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య సంస్థాపక విలువలను గౌరవించే మనం, మన రిపబ్లిక్‌ భవిష్యత్తు భద్రంగా ఉండాలని కోరుకునే మనం మత విశ్వాసాల రీత్యా ముస్లింలు అయిన భారతీయులను గౌరవాదరాలతో చూసేందుకు, ఈ దేశ సంపూర్ణ, సమాన పౌరులుగా పరిగణించేందుకు మన ప్రయత్నాలను మరింత ద్విగుణీకృతం చేయాలి.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - May 03 , 2025 | 03:40 AM