Former Union Minister P. Chidambaram: పహల్గాంపై ప్రతీకారానికి నిరీక్షణ
ABN, Publish Date - May 06 , 2025 | 03:09 AM
ప్రధానమంత్రి మోదీ పహల్గాం ఉగ్రదాడిపై తన గాయం, సంఘీభావం వ్యక్తం చేసినా, కశ్మీర్‌లో శాంతి సవాలు మరియు ప్రజాస్వామిక వ్యవస్థలో మార్పులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పహల్గాం దాడి తరువాత, భద్రతా ఏర్పాట్ల లోపాలు, రాజకీయ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కి బాత్’ ప్రసంగం (ఏప్రిల్ 27)లో ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాద దాడి, దాని అనంతర పరిణామాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన ఇలా అన్నారు: ‘మీతో నా మనసులోని మాట పంచుకుంటున్న వేళ నా హృదయం తీవ్ర వేదనతో నిండి ఉంది. పహల్గాంలో ఉగ్రదాడి ప్రతి భారతీయుని హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడూ తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఆ ఉగ్రదాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఆ ఉగ్రదాడి చిత్రాలను చూస్తుంటే ప్రతి భారతీయుని రక్తం మరిగిపోతోంది’. నూట నలభై కోట్లకు పైగా భారతీయుల మనోభావాలను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. దేశ సమైక్యత, సమస్త భారత ప్రజల సంఘీభావం, దృఢసంకల్పం ఉగ్రవాదంపై పోరులో అతి పెద్ద బలం అని ఆయన అన్నారు. ఒక జాతిగా భారత్ తన సంకల్ప బలాన్ని నిరూపిస్తుందని ఆయన వాగ్దానం చేశారు. ప్రధానమంత్రి దృఢ నిశ్చయాన్ని నేను హర్షిస్తున్నాను. ఆయన ఉత్తేజకర మాటలు కేవలం మాటలుగా మిగిలిపోవని ఆశిస్తున్నాను.
ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెప్పినవన్నీ యథార్థాలు కావేమో?! పహల్గాం దాడికి ముందు కశ్మీర్‌లోని పరిస్థితుల గురించి ఆయన ఇలా చెప్పారు: ‘కశ్మీర్‌లో మళ్లీ ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలు సరికొత్త విద్యావాతావరణంతో మళ్లీ కళకళలాడుతున్నాయి. నిర్మాణ రంగ కార్యకలాపాలు మునుపెన్నడూ లేని విధంగా వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం మరింతగా శక్తిమంతమవుతోంది. పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. యువత ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టించడం జరుగుతోంది..’ అందరూ ఆయనతో ఏకీభవించడం కష్టం. అంతెందుకు, మోదీయే తన మాటలపై ప్రగాఢంగా ఆలోచించుకుంటే తాను చెప్పినవి అతిశయోక్తులు అని తప్పక భావిస్తారు! మరింత వివరంగా చూద్దాం:
కశ్మీర్‌లో శాంతి ఒక సుదూర లక్ష్యంగా ఉన్నది. ఏప్రిల్ 24, 2025న జరిగిన అఖిలపక్ష సమావేశంలో హోం మంత్రిత్వ శాఖ అధికారులు నివేదించిన వివరాల ప్రకారం జూన్ 2014 నుంచి మే 2024 మధ్య కాలంలో 1643 ఉగ్రవాద సంఘటనలు సంభవించాయి. 1925 చొరబాటు ప్రయత్నాలు జరిగాయి, వాటిలో 726 ప్రయత్నాలు సఫలమయ్యాయి; ఉగ్ర దాడుల్లో 576 మంది భద్రతా దళ సిబ్బంది మరణించారు. పాఠశాలలు విద్యావాతావరణంతో కళకళలాడడం లేదు. విద్యారంగ పరిస్థితులపై ప్రథమ్ అనే ఎన్జీఓ ఏటా ప్రచురించే ప్రామాణిక నివేదిక ప్రకారం కశ్మీర్‌లో 2018 అనంతరం ప్రాథమిక పాఠశాలల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. ఉన్నత పాఠశాల బాలల్లో ఏడవ తరగతి వాచకాలు తప్పుల్లేకుండా చదివే బాలల శాతం చాలా తక్కువగా ఉంది.
ప్రజాస్వామ్యం మరింతగా శక్తిమంతమవుతుందన్న వాదనను గట్టిగా సవాల్ చేయవలసివుంది. జమ్మూ– కశ్మీర్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కుదించివేసిన అనంతరం ప్రజాస్వామ్యం బాగా క్షీణించిపోయింది. జమ్మూ –కశ్మీర్ ఇప్పుడు ఒక అర్ధ ప్రజాస్వామిక వ్యవస్థ మాత్రమే. ఎందుకని? కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ విస్తృత అధికారాలు చెలాయిస్తుండగా ప్రజలు ఎన్నుకున్న మంత్రి మండలికి, ప్రజాప్రతినిధులకు కనీస అధికారాలనూ నిరాకరిస్తున్నారు! కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయడం (అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామన్న హామీ హామీగానే ఉండిపోయింది) తమను అవమానించడమేనని కశ్మీరీలు భావిస్తున్నారు. ఆ అగౌరవం ఇంకా కొనసాగుతుండడం పట్ల వారు అమితంగా మనస్తాపం చెందుతున్నారు. మాటల్లో చెప్పలేనంతగా బాధపడుతున్నారు. జమ్మూ–కశ్మీర్‌లో 2023–24లో నిరుద్యోగిత అధికారిక గణాంకాల ప్రకారమే 6.1 శాతంగా ఉన్నది. తలసరి ఆదాయం కూడా జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే తక్కువ. అయితే కశ్మీర్‌కు వస్తున్న పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోందన్న వాదన వాస్తవమే. అయితే ఉగ్రవాద దాడితో పర్యాటకుల వెల్లువ నిలిచిపోయింది. సామాన్య కశ్మీరీల ప్రయోజనాలకు తీవ్ర భంగం వాటిల్లింది.
పహల్గాంలో ఉగ్రవాద దాడి చోటుచేసుకున్న వెనువెంటనే ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజలు తమంతటతామే అంతర్ ప్రేరణతో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్య చేపట్టినా తాము సంపూర్ణంగా మద్దతునిస్తామని కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు స్పష్టంగా ప్రకటించాయి. ఆ సంఘీభావం ఇప్పుడు అంత దృఢంగా లేనట్టు కనిపిస్తోందంటే అందుకు ప్రభుత్వాన్నే తప్పుపట్టవలసి ఉంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. పహల్గాం దాడిపై ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందేగానీ ప్రగాఢ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ప్రభుత్వంలో బాధ్యతాయుత స్థానాలలో ఉన్నవారెవరూ భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లొసుగులు లోపాలు ఉన్న వాస్తవాన్ని అంగీకరించలేదు. సౌదీ అరేబియాలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనను మధ్యలోనే ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చారుగానీ వెన్వెంటనే పహల్గాంనుగానీ శ్రీనగర్‌నుగానీ సందర్శించలేదు. కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రధానమంత్రి ఆ సమావేశానికి హాజరు కాకుండా ఒక ర్యాలీలో పాల్గొనేందుకు పాట్నా వెళ్లారు. పహల్గాంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తదాది పార్టీలు, వ్యక్తులు భిన్న వైఖరులతో ప్రతిస్పందిస్తున్నారు. ‘పహల్గాం విషాదాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తన అధికారిక, పరోక్ష సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రయత్నిస్తోందని, ఐక్యత, సంఘీభావం అవసరమైన సమయంలో విభేదాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో విభజనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని’ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం దుయ్యబట్టింది. ఆ తీర్మానం ఇంకా ఇలా పేర్కొంది: ‘పహల్గాంలో భద్రతా ఏర్పాట్లను ఛేదించి ఉగ్రవాదులు తమ ఘాతుకానికి పాల్పడడానికి గూఢచార వర్గాల వైఫల్యమే ప్రధాన కారణమని భావించక తప్పదు. ఈ వైఫల్యానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లలో లోపాలను సమగ్రంగా విశ్లేషించాలి’.
పహల్గాం ఘటనపై తక్షణమే ప్రతీకార చర్యలు చేపట్టాలనే డిమాండ్లు సహజంగానే వెల్లువెత్తుతున్నాయి. యుద్ధోన్మాద ప్రకటనలపై కశ్మీర్ వ్యవహారాలపై నిపుణుడు, గూఢచార సంస్థ ‘రా’ మాజీ అధిపతి అయిన ఎఎస్ దులాత్ ప్రతిస్పందిస్తూ ‘యుద్ధం ఒక ప్రత్యామ్నాయం కాదు. యుద్ధం అసలు ఒక చివరి ప్రత్యామ్నాయం కూడా కాదు, అదొక చివరి చెడ్డ ప్రత్యామ్నాయం’ అని స్పష్టం చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై పాకిస్థాన్‌లో మాజీ హైకమిషనర్ శరత్ సబర్వాల్ ప్రతిస్పందిస్తూ, ఇది ఇప్పుడు చేపట్టవలసిన చర్య అని తాను భావించడం లేదని, అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేందుకు తాను సుముఖంగానే ఉన్నానని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కూడా దాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ (టిఆర్‌ఎఫ్)ను గానీ, లష్కరే తోయిబాను గానీ తప్పుపట్టలేదు. చైనా వైఖరి సైతం ఎంతమాత్రం నిష్పాక్షికంగా లేదు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాకిస్థాన్ దృఢ సంకల్పంతో చర్యలు చేపట్టడాన్ని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి ప్రశంసించారు. తమ జాతీయ భద్రతపై పాక్ ఆందోళనలు న్యాయసమ్మతమైనవని ఆయన అన్నారు. తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతునిస్తుందని వాంగ్ యి అన్నారు.
పహల్గాం ఉగ్ర దాడి సంభవించి పదమూడు రోజులు గడిచిపోయాయి. గతంలో వలే ఇప్పుడు కూడా పాక్ భూభాగాలలోని ఉగ్రవాదుల స్థావరాలపై ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించడం చకితపరిచే ఘటనలు కాబోవని మెరుపుదాడులకు పాల్పడే విమానాలను పాక్ సైనిక దళాలు ముందుగానే పసిగట్టి అడ్డుకుంటాయని సైనిక నిపుణులు గట్టిగానే చెబుతున్నారు. అటువంటి దాడుల ఫలితాలు ఆశించినవిగా ఉండకపోవచ్చని కూడా నిపుణులు అంటున్నారు. భారత్ సైనిక పాటవ ఆధిక్యత దృష్ట్యా సర్జికల్ స్ట్రైక్స్‌కు ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాను. పహల్గాం దాడులకు ప్రతిస్పందనగా ఎప్పుడు? ఎలా? ఎలాంటి చర్య తీసుకోవాలి? అనే విషయమై సైనిక దళాలకు ప్రధానమంత్రి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినట్టు ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో జాతీయ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది ప్రధానమంత్రి. ఆ నిర్ణయాలను అమలుపరిచేది సైనిక దళాలు. పహల్గాంపై భారత్ ప్రతిస్పందన.. కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రు ప్రభుత్వాలు, ప్రభుత్వేతర వ్యక్తులు, సంస్థలపై నిర్ణయాత్మక నిరోధక ప్రభావం చూపేదిగా ఉండితీరాలి. అటువంటి చర్య కోసం భారత్ నిరీక్షిస్తోంది.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - May 06 , 2025 | 03:09 AM