Osmania University Anniversary: విద్యాభారతికి తలమానికం ఓయూ
ABN, Publish Date - Apr 25 , 2025 | 05:47 AM
ఉస్మానియా విశ్వవిద్యాలయం 107 వసంతాలను పూర్తి చేసి, 108 వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంలో, విశ్వవిద్యాలయం స్థాపన నుండి ఇప్పటి వరకు అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికలను పరిక్షించి, విద్య, పరిశోధన, డిజిటల్ సేవలు, హాస్టల్ సౌకర్యాలు, ప్రత్యేక విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు వంటి మలుపులు వెల్లడయ్యాయి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 26 నాటికి 107 వసంతాలు పూర్తి చేసుకుని, 108 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ విశ్వవిద్యాలయ గమనాన్ని గతం నుంచి వర్తమానం వరకు అవలోకనం చేసుకొని, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించాల్సిన ఒక చారిత్రక సందర్భం నేడున్నది. ఉదాత్తమైన ఆశయంతో, అత్యంత దూరదృష్టితో హైదరాబాద్ ఏడవ నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీనికి సంబంధించిన ఫర్మానాను 1917 ఏప్రిల్ 26న జారీచేశారు. ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమై, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి దాకా నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ, భారతదేశ ఉన్నత విద్యారంగంలో ఏడవ ప్రాచీన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భారతదేశంలో మూడవ ప్రాచీన ఉన్నత విద్యా సంస్థగా సమున్నతమైన స్థానాన్ని ఆక్రమించి, నేడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో తలమానికంగా నిలిచింది. ఇంతటి గొప్ప విద్యావారసత్వం ఉన్న విశ్వవిద్యాలయానికి 26వ ఉపకులపతిగా 19 అక్టోబర్ 2024న బాధ్యతలు స్వీకరించి ఏప్రిల్ 19 నాటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆరు మాసాల కాలంలో విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యచరణ ఉన్నత విద్యను మరింత బలోపేతం చేస్తున్నది. ఇటీవలే విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి వివిధ వృత్తిపరమైన అంశాలతో మూడు రోజులపాటు కార్యశాల నిర్వహించాం. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను, నిపుణుల ద్వారా వర్క్‌షాప్ నిర్వహించి, పూర్తి స్థాయిలో న్యాక్‌కు సిద్ధం అవుతున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ చెల్లింపులు, కాగిత రహిత సేవలు ప్రవేశపెట్టి డిజిటల్ పరిపాలనను వేగవంతం చేశాం.
క్యాంపస్, అనుబంధ కళాశాలల్లో హాజరుశాతం పెంచటం ద్వారా తరగతుల నిర్వహణ, సకాలంలో పరీక్షల నిర్వహణలో పురోగతి సాధించాం. రానున్న పదేళ్ళ కాలం వరకు విద్యార్థులకు హాస్టల్ వసతి విషయంలో ఇబ్బంది లేకుండా నూతన వసతి గృహాల నిర్మాణానికి కృషిచేస్తున్నాం. పరిశోధనలలో కూడా ఉస్మానియా అగ్రగామిగా ఉన్నది. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆచార్యులు సుమారు 300 కోట్ల రూపాయల విలువైన పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. రూసా ద్వారా విశ్వవిద్యాలయానికి 107 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. వాటిలో ఇప్పటికే 37 కోట్ల రూపాయలు ఖర్చు అయి, వివిధ పనులతో ప్రగతి సాధిస్తున్నాం. విశ్వవిద్యాలయంలో దాదాపు అన్ని కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఒక విశేష సంఖ్యతో కూడిన గుర్తింపు కార్డు (యూనిక్ ఐడి) ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేశాం. దీని ద్వారా విద్యార్థులకు సంబంధించిన ప్రతి సమాచారం ఒకే నంబర్‌పై కొనసాగించవచ్చు. ఇటీవలే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వికలాంగుల కోసం, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించటానికి ‘సెంటర్ ఫర్ డిసెబుల్డ్’ నెలకొల్పాం. గ్రామీణ ప్రాంతం నుంచి యూనివర్సిటీ విద్యలో ప్రవేశించిన విద్యార్థుల కోసం CELT (సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్) ద్వారా ప్రతి 45 రోజులకు ఒకసారి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఇంగ్లీష్ భాష పట్ల విద్యార్థులలో ఉన్న భయాన్ని పోగొట్టి, మంచి సమాచార నైపుణ్యాలను పెంపొందిస్తున్నాం. 2021లో ప్రారంభించిన మొదటి బ్యాచ్ ILM (కృత్రిమ మేధ) కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు నూరు శాతం ప్లేస్‌మెంట్స్ సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారిని జాయింట్ రిజిస్ట్రార్‌గా నియమించి, విశ్వవిద్యాలయ పరిపాలన పదవులలో మహిళలకు సముచిత స్థానం కల్పించాం. డా. బాబు జగ్జీవన్‌రామ్, మహాత్మా జ్యోతిబాఫూలే, డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను అకడమిక్ కార్యక్రమాలుగా నిర్వహించి, సమాజంలో వివిధ రంగాలలో నిష్ణాతులుగా ఉన్న మేధావులచే ఉపన్యాసాలు ఏర్పాటు చేశాం.
ఇందులో భాగంగా 20కి పైగా రీసెర్చ్ పేపర్స్‌ను ఒక పుస్తక రూపంగా తీసుకురాబోతున్నాం. విశ్వవిద్యాలయాన్ని ‘గ్రీన్ క్యాంపస్’గా మార్చటానికి HMDA సహకారంతో ప్రణాళిక రూపొందించాం. 2011లో ‘ఐదు నక్షత్రాల’ గుర్తింపును, 2008లో న్యాక్ ‘A’ గ్రేడ్‌ను, 2017లో న్యాక్ ‘A+’ గ్రేడ్‌ను పొందింది. 2018లో యూజీసీ చేత ‘మొదటి క్యాటగిరీ’ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. 2024లో NIRF ర్యాంకింగ్‌లో రాష్ట్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఆరవ స్థానాన్ని పొందింది. ‘ఎమర్జింగ్ ఎకనామిక్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ 2022’ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఇండియాటుడే – నీల్సన్, వీక్ హాన్సా రీసెర్చ్ సంస్థల సర్వేలలో గత 15 సంవత్సరాలుగా వరుసగా భారతదేశంలో ఉన్న టాప్ పది విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించింది. 2012 నుంచి ‘యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఎక్సెలెన్సీ’ (UPE)గా గుర్తింపు పొందుతోంది. యూనివర్సిటీలో 66 రకాల అకడమిక్ సబ్జెక్ట్స్, 56 విభాగాలు, ఎనిమిది క్యాంపస్ కళాశాలలు, ఆరు అనుబంధ కళాశాలలు, ఐదు జిల్లా పీజీ కేంద్రాలు కలిగి, తెలంగాణలో అతి పెద్ద విశ్వవిద్యాలయంగా ఉన్నది. 125 రకాల సబ్జెక్ట్స్‌తో 69 డిగ్రీ స్థాయి కోర్సులు, 114 పీజీ కోర్సులు, 66 సబ్జెక్ట్‌లలో PhD పోగ్రామ్‌లు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి DBT- ఇస్‌లార్ ప్రాజెక్టు క్రింద 15 కోట్ల రూపాయలు, DST-PURSE పథకం క్రింద 17.10 కోట్ల రూపాయలు, రూసా 2.0 క్రింద 107 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇంగ్లండ్, మలేసియా, తైవాన్, వియత్నాం, సాల్వోనియా దేశాలతో పదిశోధనలలో భాగస్వామ్యం కలిగివున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన రంగంలో CBCS ఛాయిస్ బేస్ట్ (కైడిట్ సిస్టం) ఇంటర్నల్ పరీక్షలు లాంటి నూతన పద్ధతులను కలిగి వుండటంతో పాటు డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఎనాలసిస్ లాంటి నూతన కోర్సులను ప్రవేశపెట్టింది. వీటితో పాటు CFRD, NCAM, O-TBT వంటి పరిశోధన సౌకర్యాలను కలిగివున్నది. విశ్వవిద్యాలయ ఆచార్యులు 207 పేటంట్లను కలిగివున్నారు, మరికొన్ని ఆమోదిత జాబితాలో ఉన్నాయి. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, జాబ్ మేళాలు, హెల్త్‌కేర్, మానసిక కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను నెలకొల్పింది. ప్రస్తుతం 735 ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలలో 3.5 లక్షల మంది చదువుతున్నారు. భారతదేశ ఉన్నత విద్యారంగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తలమానికంగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యకు దశ – దిశ చూపించటంలో తన పాత్ర క్రియాశీలకంగా అగ్రగామిగా ఉంటుందని విశ్వసిస్తున్నాం.
ప్రొఫెసర్ కుమార్ మొలుగరం వైస్ ఛాన్సలర్,
ఉస్మానియా యూనివర్సిటీ
(రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం)
Updated Date - Apr 25 , 2025 | 05:49 AM