Operation Sindoor: చై–పాక్‌పై భారత్ భావి యుద్ధం
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:57 AM
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ గత నెల 31న సింగపూర్‌లో బ్లూమ్ బెర్గ్, రాయిటర్ వార్తాసంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సమయం, జరిగిన ప్రదేశం ఆశ్చర్యపరిచినా ఆయనేమీ ప్రమాదకరమైన పొరపాటు చేయలేదు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ గత నెల 31న సింగపూర్‌లో బ్లూమ్ బెర్గ్, రాయిటర్ వార్తాసంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సమయం, జరిగిన ప్రదేశం ఆశ్చర్యపరిచినా ఆయనేమీ ప్రమాదకరమైన పొరపాటు చేయలేదు. ఆపరేషన్ సిందూర్ గురించిన సత్యాలు ఏదో ఒక రోజు అధికారికంగా చెప్పవలసిందే కదా. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి లేదా రక్షణమంత్రి ఆపరేషన్ సిందూర్‌పై ఒక ప్రకటన చేసి, చర్చను ప్రారంభించి ఉంటే మరింత సముచితంగా ఉండేదని నేను భావిస్తున్నాను. భారత ప్రభుత్వ అత్యున్నతస్థాయి బాధ్యుల ఆదేశాలు, అనుమతి లేకుండా జనరల్ అనిల్ చౌహాన్ ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండరు. ఆయన చెప్పింది సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉన్నది: భారత సైన్యం తన లక్ష్యాలను సాధించింది. అయితే నష్టాలనూ చవి చూసింది. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమయినప్పుడు భారత సైన్యం వ్యూహపరంగా చేసిన తప్పులను సీడీఎస్ అంగీకరించారు. అయితే వెన్వెంటనే తన తప్పులు సరిదిద్దుకుందని, మే 9–10 రాత్రి పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కొత్త దాడులు ప్రారంభించిందని ఆయన తెలిపారు. భారత్‌కు సంభవించిన నష్టాల గురించి ఆయన విపులీకరించలేదు. అయితే స్వతంత్ర సైనిక నిపుణులు, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం భారత్ ఐదు యుద్ధ విమానాలను నష్టపోయింది: 3 రాఫెల్, 1 సుఖోయి, 1 మిగ్. ‘వ్యూహాత్మక తప్పులు’, ‘నష్టాలు’ను సైనిక నిపుణులు లోతుగా, నిగ్రహంగా విశ్లేషించవలసిన అవసరమున్నది. స్పష్టంగా తెలుస్తున్న, ధ్రువపరిచిన వాస్తవాలను పేర్కొంటాను: మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పుడు భారత్‌కు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. భారత యుద్ధ విమానాలు, మిస్సైళ్లు పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి; పాకిస్థాన్ మే 8న ప్రతిదాడులు ప్రారంభించింది. భారత్‌లోని లక్ష్యాలపై డ్రోన్ దాడులు నిర్వహించింది. గైడెడ్ మిస్సైల్స్‌ను కూడా మోహరించింది. మే 8న భారత వాయుసేన విమానాలు కూలిపోయాయి. జూన్ 4న పూణేలో సీడీఎస్ జనరల్ చౌహాన్ వ్యాఖ్యల ప్రకారం భారతీయ విమానాలకు భారత వాయుతలంలోనే నష్టం వాటిల్లింది. మే 8, 9న ఇతర విమానాలు తమ స్థావరాలకు తిరిగి రాగలిగాయి; వ్యూహాత్మక తప్పులు సరిదిద్దుకున్న తరువాత మే 9, 10 తేదీల్లో యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, డ్రోన్‌లను నియోగించారు. భారత్ యుద్ధ విమానాలు భారత్ వాయుతలంలోనే ఉండి బ్రహ్మోస్ మిస్సైల్‌తో సహా పలు మిస్సైళ్లను ప్రయోగించాయి.
అవి పాకిస్థాన్‌లోని 11 వాయుసేన స్థావరాలను ధ్వంసం చేశాయి. మే 10న యుద్ధం నిలిచిపోయింది. ఆపరేషన్ సిందూర్‌తో తాను ఒక కొత్త యుద్ధ పరిస్థితిలో ఉన్నానన్న వాస్తవం భారత్‌కు తెలిసివచ్చింది. ఈ అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికే ఈ వ్యాసాన్ని ఉద్దేశించాను. పాకిస్థాన్ రక్షణ –దాడి (డిఫెన్స్–అఫెన్స్) వ్యూహంలో చైనీస్ యుద్ధ విమానాలు (జె–10), చైనీస్ మిస్సైళ్లు (పీఎల్–15), చైనీస్ వాయుతల రక్షణ వ్యవస్థలు పూర్తిస్థాయిలో పాల్గొన్నాయని ఇప్పుడు సందేహాతీతంగా ధ్రువపడింది. చైనీస్ యుద్ధ విమానాలలో పాకిస్థానీ పైలెట్‌లు ఉన్నారు. చైనీస్ మిస్సైళ్లను పాకిస్థానీ సైనికాధికారులు ప్రయోగించారు; చైనీస్ జనరల్స్ రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళికలను పాకిస్థానీ సైనికాధికారులు అమలుపరిచారు. అంతేకాదు, చైనీస్ సైనిక ఉపగ్రహాలు, చైనీస్ కృత్రిమ మేధ (ఎఐ) పాటవం పాకిస్థాన్ సైనిక చర్యలకు మార్గదర్శకత్వం వహించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే చైనా తన ఆయుధ వ్యవస్థల శక్తిసామర్థ్యాలను యుద్ధ రంగంలో పరీక్షించుకునేందుకు భారత్–పాకిస్థాన్ యుద్ధం ద్వారా లభించిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. భారత్‌కు వ్యతిరేకంగా చైనా పరోక్ష యుద్ధం చేసింది. చైనా పరోక్ష ప్రమేయంతో మౌలికంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన కొత్త సిద్ధాంతం ఉపయుక్తమైనదీ, కార్యసాధకమైనదేనా? ఉగ్రవాదులు, వారికి మద్దతునిస్తున్న ప్రభుత్వాల మధ్య తేడా చూపం అనేది మోదీ సిద్ధాంతంలోని ఒక ముఖ్య సూత్రం. దీని ప్రకారం ఉగ్రవాద ఘాతుకాలు చోటుచేసుకున్నప్పుడు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ యుద్ధానికి ఉపక్రమిస్తుంది. అయితే ఇది ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. భారత్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దితే, ఒకే ఒక శత్రువుగా ఏకమైన పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా యుద్ధం చేయవలసి ఉంటుంది. పాకిస్థాన్–చైనాల సంయుక్త సైనిక బలగాలతో తలపడవలసి ఉంటుంది. ఒక యుద్ధ రంగంలోనో లేక రెండు యుద్ధరంగాలలో ఒకేసారి పోరాడే లక్ష్య ప్రాతిపదికన భారత్ యుద్ధ సన్నద్ధత కొత్త ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలుగుతుందా? భవిష్యత్తులో భారత్ చేయవలసివచ్చే ఏ యుద్ధమైనా చాలా పెద్ద, శక్తిమంతమైన ఈ సంయుక్త శత్రుసేనతో చేయవలసి వస్తుంది.
ప్రతి ఉగ్రవాద దాడికి దీటైన ప్రతిస్పందన ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. ఉరి ఘటనకు ప్రతిస్పందనలో సరిహద్దులకు ఆవల భారత సైనికదళాల రహస్య దాడి, పఠాన్ కోట్ ఘటనకు ప్రతిస్పందనలో భారత వాయుసేన ఏకైక వైమానిక దాడి లాంటి చర్యలు ఇంకెంత మాత్రం ఉగ్రవాదాన్ని నిరోధించలేవు. కనుకనే పహల్గాంకు ప్రతిస్పందనగా నాలుగురోజుల యుద్ధం సంభవించింది. మరి ఇప్పటికీ ఉగ్రవాద దాడులు నిలిచిపోకపోతే? చై–పాక్ (చైనా–పాకిస్థాన్) సంయుక్త సైనిక బలగాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ యుద్ధం అనివార్యమవుతుందా? నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఈ కొత్త పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోలేదని రుజువయింది. భారత్ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఐఎమ్‌ఎఫ్ మే 9న పాకిస్థాన్‌కు 100 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేసింది. పాక్‌కు 800 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఈ నెల 3న ఏడీబీ ఆమోదించింది. రాబోయే పదేళ్లలో 40బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. పాకిస్థాన్ ఆర్థిక సత్తువకు దోహదం చేసే ఈ నిర్ణయాల విషయంలో అమెరికా, చైనాల సంయుక్త ప్రోద్బలం ఉన్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాలిబన్ శాంక్షన్స్ కమిటీ చైర్మన్గా, భద్రతామండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ వైస్ చైర్మన్‌గా పాకిస్థాన్ ఎన్నికయింది! ఈ పరిణామాలన్నీ, ఆపరేషన్ సిందూర్ సమయంలోను, ఆ తరువాత, మన ఎంపీల బృందాలు దేశ దేశాల ప్రభుత్వాధినేతలకు పాక్ దుశ్చర్యలను ఏకరువు పెడుతున్నప్పుడు సంభవించినవే సుమా! నాకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ప్రతి దేశమూ ఉగ్రవాదాన్ని ఖండించింది. అయితే ఏ దేశమూ పాకిస్థాన్‌ను గర్హించలేదు. మన సైనిక వ్యూహమూ, విదేశాంగ విధానంపై పునరాలోచన తప్పనిసరి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Jun 08 , 2025 | 01:03 AM