ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Policy: బడిబాటలో.. ముళ్ళు, రాళ్లు

ABN, Publish Date - Jun 12 , 2025 | 06:16 AM

పేదవాళ్లకైనా, పెద్దవాళ్లకైనా ‘ఒకే చదువు, ఒకే బడి’ అది కామన్‌ స్కూల్ విధానంలో అందరికీ సమానంగా అందించబడాలన్న రాజ్యాంగ స్ఫూర్తి పాలకుల విధానాల వల్ల నీరుగారిపోయింది. పర్యవసానంగా డబ్బు ఉన్నవాళ్లకి కార్పొరేట్ విద్య, ఏ ఆధారం లేని పేద బిడ్డలకు ప్రభుత్వ విద్య..

పేదవాళ్లకైనా, పెద్దవాళ్లకైనా ‘ఒకే చదువు, ఒకే బడి’ అది కామన్‌ స్కూల్ విధానంలో అందరికీ సమానంగా అందించబడాలన్న రాజ్యాంగ స్ఫూర్తి పాలకుల విధానాల వల్ల నీరుగారిపోయింది. పర్యవసానంగా డబ్బు ఉన్నవాళ్లకి కార్పొరేట్ విద్య, ఏ ఆధారం లేని పేద బిడ్డలకు ప్రభుత్వ విద్య.. ఇలా రెండు ‘క్లాస్’ల విధానం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షిస్తూ దాని మూలాలను మార్చే ప్రయత్నంలో భాగంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ అంశమే. ఆ విద్యా కమిషన్ సూచించినట్టుగా మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ దశలవారీగా ఏర్పాటు చేయడానికి సూచించిన బడ్జెట్‌ను ఆమోదించకపోవడం విచారకరం. మే నెలలో దాదాపు లక్షన్నర ఉపాధ్యాయులకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఆయా సబ్జెక్టులలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం శిక్షణా తరగతులు జరిగాయి. ఆ శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయులు కాస్త ప్రేరణ పొందుతున్నా, తీరా బడి దాకా వచ్చాక.. విద్యార్థుల సంఖ్య పెరగటం లేదు. విద్యా ప్రమాణాలు కనీస స్థాయిలో ఎందుకు సాధించటం లేదు అనే ప్రశ్నలు టీచర్ల మీదకు బాణాల్లా వస్తున్నాయి. అసర్ లాంటి నివేదికలు, యుడైస్ రిపోర్టుల ప్రకారం ప్రభుత్వ బడుల్లో గతంతో పోల్చితే రెండు లక్షల వరకు ప్రవేశాలు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు విద్యార్థుల సంఖ్య పెంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి హైదరాబాదులో టీపీ జేఏసీ ఆధ్వర్యంలో చర్చ జరిగినప్పుడు అనేక అంశాలు, ఉపాధ్యాయుల, ప్రజల, విద్యార్థుల అభిప్రాయాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ విద్యారంగం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన అంశాల్లో విద్య అనేది ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో కొనసాగడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. ఏకోపాధ్యాయ పాఠశాలలే 5వేలకు పైగా ఉండడం, అన్ని సబ్జెక్టులను ఒకరో, ఇద్దరో టీచర్లు బోధించలేకపోవడం వంటి సమస్యల వల్ల ప్రాథమిక విద్యారంగంలో ఒక భయంకరమైన గడ్డుస్థితి కొనసాగుతున్నది.

ఇలాంటి స్థితి నుంచి అయిదవ తరగతి పూర్తి చేసుకుని వచ్చిన పిల్లలు నిజంగానే అసర్ నివేదిక చెప్పినట్టు రెండో తరగతి పుస్తకంలోని అంశాలు లేదా మూడో తరగతి లెక్కల్ని చేయలేని స్థితి కొనసాగుతున్నది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మంచినీళ్లు, మరుగుదొడ్లు మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించాలి. ఒక జిల్లా హెడ్మాస్టర్ల శిక్షణ తరగతుల్లో ‘ఎందుకు పాఠశాల విద్యార్థుల సంఖ్యను, ప్రమాణాలను పెంచలేకపోతున్నార’న్న ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఎవరికీ అవసరంలేని ఎవరూ పట్టించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. తల్లిదండ్రులతో వారి పిల్లల అభ్యసన స్థితి గురించి మాట్లాడదామంటే.. ‘వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితి వల్ల పేరెంట్స్ మీటింగ్‌కు వాళ్లు ఏనాడూ రారు. పిల్లలు వివిధ సామాజిక మాధ్యమాలు, సినిమాల ప్రభావం వల్ల చదువు పట్ల నిరాసక్తత కనబరుస్తున్నారు. తప్పుడు ధోరణుల్లో పెడదోవ పడుతున్న విద్యార్థులను మందలించలేని స్థితిలో వారి తల్లిదండ్రులున్నారు. ఇలాంటి సమస్యలెన్నో ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు ఆ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు కొన్ని సబ్జెక్టులు చెప్పకుండా కేవలం మ్యాథ్స్ సైన్స్ పట్ల దృష్టి పెట్టి, ఐఐటీ సీట్లే పరమావధిగా కొనసాగుతున్నాయి. అలాంటి బోధన ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. కానీ ఆ విద్యార్థులకు పోటీగా నిలబడాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకూ ఇతర సబ్జెక్టులతో పాటు, పోటీ పరీక్షలకూ శిక్షణనివ్వాల్సిన అవసరం ఉంది. ఈ భేదాలను తగ్గించడానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పనివేళలు, పాఠ్యప్రణాళికలు, పరీక్ష విధానం ఒకే రకంగా ఉండవలసిన స్థితిని గుర్తించవలసి ఉంది. పాఠశాల బోధన సమయాల్లో సహపాఠ్య కార్యక్రమాలతో పాటు.. నిరంతరం పాఠశాల సమయాన్ని విద్యార్థుల సంక్షేమం కోసం తమ బోధన నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం ఆలోచించాల్సిన, చర్చించాల్సిన స్టాఫ్ రూములు స్టాఫ్ మీటింగ్‌లు వాటికి దూరంగా జరిగిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా తరగతి గదిలో, బడిలో నిరంతరం సెల్‌ఫోన్ వినియోగించడం కూడా ఉపాధ్యాయులు తగ్గించుకోవాలి. ఇన్ని సమస్యల మధ్య పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు, ప్రమాణాలను పెంచడానికి బడిబాటను ఒకరకంగా ప్రభుత్వ టీచర్లు సవాలుగా స్వీకరించవలసి ఉన్నది. విద్యార్థుల హాజరు, టీచర్లు హాజరు సరిగ్గా ఉన్న పాఠశాలల్లో కూడా ఎందుకు విద్యా ప్రమాణాలు పెరగట్లేదు అన్న ప్రశ్నకు కారకులు ఎవరో సమీక్షించుకోవాల్సి ఉంది. తగిన అర్హతలు, కనీస వేతనం, సెలవులు, ఉద్యోగ భద్రత లేని ప్రైవేటు టీచర్లు కొంతమేర కనీస సామర్థ్యాలు సాధిస్తున్నప్పుడు అవన్నీ ఉన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందుకు వెనుకబడిపోతున్నారో సమీక్షించుకోవాలి. ఆచార్య జయశంకర్ అన్నట్లుగా ‘ఆర్థికంగా, సామాజికంగా కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు. కానీ విద్యా సాంస్కృతిక పరంగా ఏమైనా కోల్పోతే మళ్లీ పొందలేము’ అన్న స్ఫూర్తితో తెలంగాణ విద్యా రంగాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది.

-ప్రభాకర్ కస్తూరి కన్వీనర్,

తెలంగాణ విద్యావికాస వేదిక

Updated Date - Jun 12 , 2025 | 06:18 AM