ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ngugi wa Thiongo: ఆఫ్రికా సాహితీ ఆత్మ గూగీ

ABN, Publish Date - May 30 , 2025 | 05:41 AM

గూగీ వా థియాంగో కెన్యా ప్రముఖ రచయిత, తన ప్రజల భాష గికుయులో రచనలు చేసి ఆఫ్రికా సాహిత్యంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారు. ఆయన రచనలు వలసవాదానికి వ్యతిరేకంగా నిలుస్తూ ప్రజల హక్కుల కోసం పోరాటానికి ప్రేరణగా నిలవడమే ప్రధాన లక్ష్యం.

గూగీ వా థియాంగో కెన్యా రచయిత. ఆయన ప్రసిద్ధ నవల ‘వీప్‌ నాట్‌ చైల్డ్‌’ (1964) తూర్పు ఆఫ్రికన్‌ రచయిత రాసిన ప్రప్రథమ ప్రధాన ఆంగ్ల నవల. ఆఫ్రికాలో వలసవాద ప్రభావాలను నిశితంగా నిరసించి తన ప్రజల భాషలో రాయడం ప్రారంభించారు. ఒక రచయితగా గూగీలో వచ్చిన ఈ మార్పే ఆయనకు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిని సమకూర్చింది. గూగీ సాహిత్యంపై పరిశోధన చేసి నేను పిహెచ్‌.డి పట్టా పొందాను. తనకు నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించగలదని ఆయన ఆశించారు. అయితే పురస్కార నిర్ణేతలు తమ సొంత పరిగణనలనే ప్రమాణంగా తీసుకున్నారు. మహాత్మాగాంధీ కూడా ఇదేవిధంగా భారత్‌, దక్షిణాఫ్రికా ప్రజలకు, విశాల ప్రపంచానికి చేసిన సేవలకు నోబెల్‌ శాంతి పురస్కార నిర్ణేతల గుర్తింపును పొందలేకపోయారు. గూగీ తన ప్రవాస జీవితాన్ని అట్లాంటాలోనే గడిపారు. ఆయన కుమార్తె తండ్రి మరణాన్ని ‘ది గార్డియన్‌’లో రాసిన వ్యాసం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. ‘I Will Marry When I Want’ అనే నాటకాన్ని గూగీ రాశారు. ఈ నాటక రచనా సమయంలో ఆయన నైరోబి విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ప్రధానాచార్యుడుగా ఉన్నారు. ఆయన తన ప్రజలు మాట్లాడే గికుయు భాషలో రచనలు చేశారు. ఈ కారణంగానే అసంఖ్యాక ప్రజలు ఆయన నవలలు, నాటకాలు, ఇతర రచనలను అమితంగా అభిమానించారు.


ప్రజల ప్రతిస్పందనలకు ముగ్ధుడైన గూగీ సొంత భాషలోనే రాయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు, తుదిదాకా కట్టుబడి ఉన్నారు. గికుయు భాషలో రాసిన ‘Citani Marthabani’ని ఆంగ్లంలోకి ‘Devil on the Cross’గా అనువదించారు. ప్రవాసం నుంచి నైరోబికి రెండో పర్యాయం వెళ్లినప్పుడు, మొదటిసారి వెళ్లినప్పుడు గురైన నిర్బంధం కంటే చాలా ఘోరమైన పరిస్థితిని ఆయన చవిచూడవలసి వచ్చింది. నేను కాకతీయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రధానాచార్యుడుగా ఉన్నప్పుడు గూగీ సాహిత్యాన్ని ఎంఏ సిలబస్‌లో చేర్చాను. నేను గూగీ సాహిత్యంపై డాక్టొరేట్‌ తీసుకున్నానని, తాము ఒక గొప్ప ఆఫ్రికన్‌ సాహిత్యవేత్త రచనలను చదువుతున్నామని తెలిసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నా విద్యార్థులు సంతోషించేవారు. ప్రతి జనవరి 1న ఆయనకు నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేవాణ్ణి. ఆయన ఎంతో ప్రేమాదరాలతో ప్రతిస్పందించేవారు. నేను నాలుగున్నర సంవత్సరాల పాటు ఆఫ్రికాలో బోధించాను. అక్కడ ఉన్నప్పుడు ఆయన్ని చాలా పర్యాయాలు కలిశాను. ఆయననూ, ఆయన భార్యను ఒకసారి నా గృహానికి ఆహ్వానించాను. భారతీయ దైవ పురుషులలో ఒకరైన కృష్ణుడు తన మాదిరిగానే నలుపు రంగులో ఉంటాడని చెప్పినప్పుడు గూగీ చాలా సంతోషించారు.

- కంచర్ల ఇంద్రసేనారెడ్డి

విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం

Updated Date - May 30 , 2025 | 05:43 AM