చరిత్ర సృష్టించిన దౌత్య విజయం
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:08 AM
ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పాలన్న పరమాశయంతో ‘పంచశీలాలు’ రూపొందించిన దేశం– భారత్. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు విదేశాంగ వ్యవహారాల శాఖను తన వద్దనే ఉంచుకొన్నారు...
ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పాలన్న పరమాశయంతో ‘పంచశీలాలు’ రూపొందించిన దేశం– భారత్. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు విదేశాంగ వ్యవహారాల శాఖను తన వద్దనే ఉంచుకొన్నారు. భారతదేశ సంప్రదాయాలు, చరిత్ర, తత్త్వశాస్త్ర విధానాలను విదేశాలకు తెలియజెప్పి సమభావం, పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలతో భారత్ సహజీవనం చేయాలనుకొంటున్నట్లు నెహ్రు పలు అంతర్జాతీయ వేదికలపై నుంచి చెప్పేవారు. ఇందుకు అనుగుణంగానే ఏ దేశానికీ అనుకూలం కాని తటస్థ వైఖరిని భారతదేశం అనుసరించింది. ఏ కూటమితోనూ పొత్తు కుదుర్చుకోకుండా తటస్థంగా ఉన్న దేశాలే ప్రపంచంలో శాంతి వాతావరణాన్ని సృష్టించగలవని ప్రధాని నెహ్రు తరచుగా చెప్పేవారు.
తొలుత నెహ్రు అనుసరించిన విదేశాంగ విధానం విమర్శల పాలైంది. అనివార్యంగా సాంకేతిక పరిజ్ఞానం కోసం సోవియెట్ రష్యాతో చెలిమి చేయాల్సి రావడం వల్ల చాలాకాలం అమెరికాలోని అధికార వర్గాలు భారతదేశం పట్ల విరోధభావాన్ని ప్రకటించాయి. అంతేకాకుండా శాంతికి, ప్రజాస్వామ్యానికి మరో రూపం అంటూ పాకిస్థాన్‌ను అమెరికా భుజాలకెత్తుకొని మోసింది. అయితే.. కెన్నెడీ అధ్యక్షుడయ్యాక భారత్ పట్ల అమెరికా వైఖరి క్రమంగా మారింది. భారతదేశం అనుసరించే తటస్థ వైఖరి శక్తివంతమైనదనీ, భారతీయులు ప్రచ్ఛన్నయుద్ధంతో సంబంధం పెట్టుకోకపోయినా శాంతికి, స్వాతంత్య్రానికి బద్ధులై ఉంటారని జాన్.ఎఫ్.కెన్నడీతో సహా నాటి పలువురు దేశాధినేతలు భారత్ విదేశాంగనీతిని కొనియాడారు.
నెహ్రు తర్వాత దేశానికి ప్రధానులైన లాల్‌బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ అదే పథాన్ని అనుసరించారు. ప్రపంచంలోని చిన్న దేశాలు, బలహీన దేశాలు, అభివృద్ధి చెందుతున్న తృతీయ దేశాలు.. తప్పనిసరిగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక సహాయం లేకుండా తమంతట తాముగా అభివృద్ధి చెందలేవు. కాబట్టి ఆనాడు మూడు శక్తివంతమైన పక్షాలుగా విడిపోయి ఉన్న ఉత్తర అమెరికా, యూరప్, సోవియెట్ యూనియన్ల సహాయ సహకారాలు పొందడం అవసరం. అయితే ఏదో ఒక పక్షంలో చేరితే, మిగతా రెండు పక్షాల నుంచి దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి, తటస్థంగా ఉన్నప్పుడు ఆ పక్షాల మధ్య పరస్పరం ఉన్న వైరుధ్యాలకు సంబంధం లేకుండా ఈ దేశాలు అందరి సహాయ సహకారాలు పొందవచ్చునని ‘పండిట్ నెహ్రు’ చేసిన సూత్రీకరణకు అనేక దేశాలు ఆమోదం తెలిపాయి. పండిట్ నెహ్రు, నాటి ఈజిప్ట్ ప్రధాని నాసర్, నాటి యుగోస్లేవియా మార్షల్ టిటోల చొరవ కారణంగానే అలీన దేశాల కూటమి ఏర్పడింది. ఆ తర్వాత పలు దశాబ్దాల పాటు కూటమిలోని దేశాలు అన్ని పక్షాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొని, వాటి సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో ముందుకెళ్లాయి.
నెహ్రు అనుసరించిన విదేశాంగ విధానానికి సర్వత్రా ఆమోదం లభించింది. మొరార్జీదేశాయ్, ఆ తర్వాత మళ్లీ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వి.పి. సింగ్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అనుసరించే విదేశాంగ నీతిలో పెద్దగా మార్పులేదు. వారందరూ కూడా నెహ్రు బాటలోనే తటస్థ వైఖరినే అనుసరించారు. ఆ కారణంగానే నేడు భారత్ అన్ని దేశాలతో సవ్యమైన ఆర్థిక, వాణిజ్య, దౌత్య సంబంధాలను ఏర్పర్చుకోగలిగింది. కాగా, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లిన పరిస్థితులలో రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం కూడా గతం నుంచి వస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వచ్చినపుడు దేశం యావత్తూ ఒక్క గొంతుకగా మారింది. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులు దేశ ప్రధానులుగా ఉండగా, యునైటెడ్ నేషన్స్ సదస్సులలో పాల్గొన్న భారత్ దౌత్య బృందానికి నాటి విపక్షనేత వాజపేయి నేతృత్వం వహించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా పాకిస్థాన్‌కు దగ్గరవ్వడానికి కృషి చేసినప్పుడు ఆయనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అలాగే, కార్గిల్ యుద్ధం చేయాల్సి వచ్చినపుడు జాతి అంతా ఒక్కటైంది. స్వల్ప విభేదాలు మినహాయిస్తే.. పొరుగుదేశం పాకిస్థాన్ పాల్పడే క్రాస్‌బోర్డర్ టెర్రరిజంను ఖండించడంలో రెండో మాట లేకుండా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారికి మద్దతు తెలుపుతున్నాయి.
తాజాగా, ప్రధాని నరేంద్రమోదీ పహల్గాం ఉదంతంలో ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహణకు దారితీసిన పరిస్థితులు; తదనంతరం మే 10న కాల్పుల విరమణ, ఒకవేళ మళ్లీ పాకిస్థాన్ కనుక భారత్‌లో ఉగ్రవాద చర్యలకు ఊతం ఇస్తే ఏ విధంగా జవాబు చెప్పాలనుకొంటుందో ప్రపంచ దేశాలకు వివరించేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటుచేసిన ఏడు అఖిలపక్షాల బృందాలను 33 దేశాలకు పంపడం.. భారత్ దౌత్యనీతిలో సాధించిన గొప్ప విజయం. ప్రారంభంలో అఖిలపక్ష బృందాల కూర్పులో వివిధ రాజకీయ పార్టీల నడుమ అభిప్రాయబేధాలు పొడసూపినా, ఆ తర్వాత అన్నీ సర్దుకొని ప్రభుత్వం–ప్రజలు ఆశించిన లక్ష్యాలు నెరవేరడం విశేషం. భారత అఖిలపక్ష బృందాలు పర్యటించిన దేశాలలో కొన్ని పాకిస్థాన్ పాటపాడేవి కూడా ఉన్నాయి. అయితే, దేశ విభజన నాటి నుంచి నేటి వరకు పాకిస్థాన్ పాల్పడుతున్న ఉగ్రవాద చర్యలు, 1999లో కార్గిల్ ఉదంతం, 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి, కాందహార్ విమాన హైజాక్, 2008లో ముంబయి మారణకాండ మొదలుకొని ‘యురి’ ఉదంతం, పహల్గాం దుర్ఘటనతో సహా ఎప్పుడెప్పుడు భారత్‌పై పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిందో సమగ్రంగా వివరించారు.
ప్రధాని మోదీ ఈ చొరవ చూపడం ద్వారా రెండు విజయాలు సాధించారు. ఒకటి– ప్రపంచ దేశాలకు పాకిస్థాన్ ఉగ్రవాద రూపాన్ని బహిర్గతం చేసి అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం. రెండు– మళ్లీ దాడి చేసే దుస్సాహసానికి ఒడిగడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పాకిస్థాన్‌కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం. భారత్ అఖిలపక్ష బృందాలకు నేతృత్వం వహించిన శశిథరూర్, బైజయంత్‌పాండా, అసదుద్దీన్ ఒవైసీ, కనిమొళి వంటివారు విదేశీ వేదికలపై ఎటువంటి శషబిషలు లేకుండా భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రష్యా, జపాన్ వంటి దేశాలు విస్పష్టమైన హామీ ఇవ్వడం విశేషం.
‘ఆపరేషన్ సిందూర్’ ఉద్దేశాల్ని చాటిచెప్పి.. ఆయా దేశాల మద్దతు కూడగట్టడంలో మన ఎంపీలు సమర్ధవంతంగా వ్యవహరించారు. దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లే సమయంలో సంకుచిత రాజకీయాలకు తావులేదని వారు స్పష్టం చేశారు. భారత్ ఏనాడూ ఎవ్వరిమీద కాలు దువ్వలేదని, పైగా విపత్కర సమయాల్లో పొరుగు దేశాలకు అండగా నిలబడి సాయం చేసిన వైనాన్ని సమగ్రంగా వివరించారు.
నిజానికి, విదేశాంగ విధానంలో నెహ్రు అవలంబించిన ‘తటస్థత’ కారణంగానే నేడు పాకిస్థాన్ మినహా అన్ని దేశాలతో.. వాటి మధ్యనున్న వైరుధ్యాలకు అతీతంగా భారత్ సన్నిహితం కాగలిగింది. వాటి సహాయ సహకారాలతో ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగగలుగుతోంది. ‘భిన్నత్వంలో ఏకత్వమే మా బలం’ అని భారత్ విశ్వవేదికలపై సగర్వంగా చాటుకోగలుగుతోంది. అయితే.. ఆనాడు నెహ్రు వేసిన పునాదిపై.. తర్వాతి కాలంలో దేశ ప్రధానులుగా ఉన్నవారు, నేటి ప్రధాని నరేంద్రమోదీ దేశ దౌత్య విధానాన్ని, విదేశీ వ్యవహారాలను ఎటువంటి రాజీధోరణి లేకుండా మరింత సుదృఢం చేయడం అభినందనీయం. ఇదేవిధంగా దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య కొన్ని కీలకాంశాలలో ఏకాభిప్రాయం కుదిరితే, భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోగలదు.
సి. రామచంద్రయ్య
శాసనమండలి సభ్యులు
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:08 AM