Constitutional Amendment Bill 130: 130 రాజ్యాంగ సూత్రాలకు సమాధి
ABN, Publish Date - Aug 30 , 2025 | 05:02 AM
రాజ్యాంగానికి సవరణ చేసేందుకు పార్లమెంటుకు గల అధికారాలు, అందుకు అనుసరించవలసిన విధానాన్ని అధికరణ 368 విశదీకరించింది...
రాజ్యాంగానికి సవరణ చేసేందుకు పార్లమెంటుకు గల అధికారాలు, అందుకు అనుసరించవలసిన విధానాన్ని అధికరణ 368 విశదీకరించింది. ఆ అధికరణ లోని నిబంధన 2, ఇతర విషయాలతో పాటు ఇలా ఉన్నది: ‘రాజ్యాంగంలో ఏమి పేర్కొన్నప్పటికీ ఈ రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా సవరించే, లేక మార్పు చేసే, లేక తొలగించే రాజ్యాంగబద్ధమైన అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగ సవరణ విధానం ఈ క్రింద ఉదహరింపబడిన విధంగా ఉంటుంది. ‘‘రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో గాని, లేక రాజ్యసభలో గాని మాత్రమే ప్రవేశపెట్ట వలెను. ఆ బిల్లును సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదించవలెను. ఆ విధంగా ఆమోదించిన వారి సంఖ్య సభ మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కన్న ఎక్కువగా ఉండవలెను. లోక్‌సభలోను, రాజ్యసభలోను ఇదే విధంగా ఆమోదింపవలెను. ఆ విధంగా రెండు సభలు ఆమోదించిన తరువాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవలెను. రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించవలెను. అప్పుడు బిల్లులో ఉదహరింపబడిన విధంగా రాజ్యాంగం సవరింపబడుతుంది’’.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందగల సంఖ్యా బలం ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంటు ఉభయ సభలలోనూ లేదు. లోక్‌సభలో ఎన్డీఏ సభ్యులు 293 (మొత్తం సభ్యుల సంఖ్య 543) మంది మాత్రమే కాగా రాజ్యసభలోనూ పాలక కూటమికి కేవలం 133 మంది సభ్యులే (మొత్తం సభ్యుల సంఖ్య 245) ఉన్నారు. ఏ సభలో నైనా ఒక బిల్లు ఆమోదం పొందాలంటే, సభ్యులు అందరూ సభకు హాజరై బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటువేసినప్పుడు మాత్రమే అది చట్ట ప్రతిపత్తి పొందడానికి అర్హమవుతుంది (ఓటింగ్‌కు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ సవరణ బిల్లును ఆమోదించాలి. ఆ విధంగా ఆమోదించిన వారి సంఖ్య మొత్తం సభలోని స్థానాలలో సగం కన్నా ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు ఒక సభలో మొత్తం సభ్యుల సంఖ్య 300 అనుకుందాం. సభకు 150 మంది హాజరయినారు. వారిలో 100 మంది ఆ సవరణను ఆమోదించారు. అయినా ఆమోదించినట్లు కాదు. ఎందుకంటే ఆ సవరణ మొత్తం సభ్యులలో మెజారిటీ ఆమోదం పొందలేదు కనుక. సభకు కనీసం 200 మంది హాజరై వారిలో 151 మంది ఆ సవరణను ఆమోదిస్తే సభ ఆమోదం పొందినట్లుగా పరిగణితమవుతుంది. ఉభయ సభలలోను ఇదే విధంగా ఆమోదం పొందాలి. ఇలా ఏ సభలోను ఆమోదం పొందలేక పోతే రాజ్యాంగ సవరణ వీగిపోయినట్లే). అయితే ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మెజారిటీ పాలక ఎన్డీఏకు ఏ సభలోనూ లేదు.
ప్రతిపక్షాలు అన్నిటికీ కలిపి లోక్‌సభలో 250 మంది సభ్యులు, రాజ్యసభలో 120 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కనుక ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ సభలోను ఆమోదం పొందలేదు. లోక్‌సభలో 182 మంది సభ్యులు, రాజ్యసభలో 82 మంది సభ్యులు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అది ఆమోదం పొందదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతిపక్షాలు అన్నీ ఎన్డీఏకు వ్యతిరేకంగా లేవు. వైఎస్‌ఆర్‌సీపీ, బిజూ జనతాదళ్, భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ, ఇంకా కొన్ని చిన్న పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతునిస్తున్నాయి. ఏఐటీసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్డీఏను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇండియా కూటమికి వాటి మద్దతు అంశాల ప్రాతిపదికన ఉంటుంది. ఈ పరిస్థితులలో ఎన్డీఏ ప్రభుత్వం ‘రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు–2025’ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వెన్వెంటనే ఆ బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు నివేదించారు. చాలా సరళంగా కన్పిస్తున్న ఈ బిల్లు లక్ష్యమేమిటి? ఐదు సంవత్సరాలు, అంతకు మించి జైలుశిక్షకు అర్హమయ్యే నేరాభియోగాలతో అరెస్టయిన మంత్రులు (ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సైతం) జైలులో 30రోజులు ఉంటే పదవీచ్యుతులు అవుతారు. ఆ ముప్పై రోజులలో దర్యాప్తు పూర్తికావడం అసాధ్యం. చార్జిషీటును దాఖలు చేయడమూ జరిగే పని కాదు. ఆరోపణలు ఉండవు, విచారణ జరగదు, శిక్ష నిర్ధారణ కాదు. అయినప్పటికీ 31వ రోజున ‘నేరస్తుడు’ అనే కళంకంతో పదవిని కోల్పోతాడు! ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ, రాజకీయ నైతికతకు పరాకాష్ఠ అని భారతీయ జనతా పార్టీ ఘోషిస్తోంది. ఏమిటి ఆ పార్టీ వాదన? ‘అవినీతిపరుడు’ అయిన ఒక మంత్రిని పదవి నుంచి తొలగించడం కంటే ఉన్నతాదర్శం మరేముంటుంది? ఒక మంత్రి (లేదా ముఖ్యమంత్రి) జైలు నుంచి పరిపాలన చేయవచ్చా? చెప్పవచ్చిన దేమిటంటే బీజేపీ దృష్టిలో ఈ బిల్లును సమర్థించే వారు నిజమైన దేశభక్తులు, జాతీయవాదులు; వ్యతిరేకించే వారు జాతి వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్, పాకిస్థానీ ఏజెంట్లు.
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నేర విచారణ చట్టం అమలవుతున్న తీరు తెన్నులు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. న్యాయం సమకూరడమనేది సందేహాస్పదమవుతోంది. ఎందుకో చూద్దాం: జీఎస్టీ చట్టాలతో సహా అన్ని చట్టాలను రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారు; (కానిస్టేబుల్‌తో సహా) ఏ పోలీసు అధికారి అయినా వారంట్‌తోనో లేక వారంట్ లేకుండానో ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయవచ్చు... కేసు పెట్టదగిన నేరానికి పాల్పడినట్టు ఎవరిపైన అయినా సహేతుకమైన అనుమానం ఉంటే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉన్నది; ‘బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు’ అని జస్టిస్ కృష్ణయ్యర్ ధర్మ ప్రవచనం చేసినప్పటికీ ట్రయల్ కోర్టులు బెయిల్ మంజూరు చేసేందుకు ఇష్టపడడం లేదు; ప్రథమ విచారణలో హైకోర్టులు బెయిల్ మంజూరు చేయవు. ఏదో ఒక సాకుతో బెయిల్ ఇవ్వకుండా విచారణ కొనసాగించి, 60–90 రోజుల అనంతరం బెయిల్ మంజూరు చేయడం పరిపాటిగా ఉన్నది; ఈ శోచనీయ వ్యవహారాల ఫలితంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రోజూ డజన్ల కొద్దీ బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు సైతం ట్రయల్ కోర్టు విధులు నిర్వర్తించవలసి వస్తోంది; 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రధానమంత్రిని కూడా చేర్చడం హాస్యాస్పదం. ఏ పోలీసు అధికారీ ప్రధానమంత్రిని అరెస్ట్ చేసేందుకు సాహసించడు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేసేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఇండియా కూటమి, తృణమూల్ కాంగ్రెస్ సులువుగా కూడగట్టుకోగలుగుతాయి. అయినప్పటికీ ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయమనే ఆత్మ విశ్వాసంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఉభయ సభలలోను కొన్ని ప్రతిపక్షాల లేదా ఎంపీల మద్దతు పొందగల ఉపాయమేదో ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఉంది. బహుశా, ఓటింగ్ రోజున కొంత మంది విపక్ష ఎంపీలు ‘అదృశ్యమయ్యే’ చాణక్యానికి ప్రభుత్వం పాల్పడవచ్చు. లేదూ, ఇంకేదైనా వ్యూహం ప్రభుత్వానికి ఉన్నదేమోగానీ అది నా అవగాహనకు మించినది.
ఈ బిల్లు విషయమై ప్రధానమంత్రి, హోంమంత్రి ఇప్పటికే సమర నాదాలు చేశారు. అది తప్పక పార్లమెంటు ఆమోదం పొందుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. సరే, ‘విధేయ’ మీడియా వారి మాటలు, వాదనలు వల్లె వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు బిహార్ (2025), అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ (2026) ముగిసేంతవరకు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై జాయింట్ సెలెక్ట్ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోదు. మీడియా వార్తల ప్రకారం 2014 నుంచి ప్రతిపక్షాలకు చెందిన 12 మంది మంత్రులను అరెస్ట్ చేశారు. వారిలో చాలా మందికి నెలల తరబడి బెయిల్ మంజూరు కాలేదు. అలాగే 2014 నుంచి తీవ్ర నేరాభియోగాల నెదుర్కొంటున్న 25 మంది రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు. చేరిన వెంటనే వారందరూ నేరారోపణల నుంచి విముక్తులయ్యారు! నాకు గుర్తున్నంతవరకు 2014 నుంచి బీజేపీకి చెందిన ఏ మంత్రి కూడా అరెస్ట్ కాలేదు. రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు–2025 పార్లమెంటు ఆమోదం పొందితే, ప్రతిపక్ష నాయకులను పదే పదే అరెస్ట్ చేసి జైలుపాలు చేసే బెలారస్, బంగ్లాదేశ్, కంబోడియా, కెమెరూన్, కాంగో (డిఆర్‌సి), మయన్మార్, నికరాగువా, పాకిస్థాన్, రష్యా, రువాండా, ఉగాండా, వెనిజులా, జాంబియా, జింబాబ్వేల సరసన చేరుతుంది. ఇది ప్రతిష్ఠాకరమేనా? సమాధానం స్పష్టమే. రాజకీయ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తే ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో విఫలమవుతుంది.
-పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Aug 30 , 2025 | 05:02 AM