ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu Poet Shikamani: ఇస్మాయిల్ ఫ్రూఫ్‌లు దిద్దారు

ABN, Publish Date - May 12 , 2025 | 04:57 AM

మువ్వల చేతికర్ర' నా తొలి కవితా సంపుటి, 1987లో విడుదలైనది. ఈ పుస్తకం నా కవిత్వ ప్రయాణానికి మైలురాయి అవుతుంది, వివిధ అవార్డులను కూడా పొందింది.

నా తొలి కవితా సంపుటి ‘మువ్వల చేతికర్ర’. ఎం.ఎ. రెండో సంవత్సరంలో ఉండగానే మాస్టారు అత్తలూరి నరసింహా రావుతో పుస్తకం వేద్దాం అంటే ఒక సంవత్సరం ఆగండి మరిన్ని మంచి కవితలతో వేద్దురు గాని అన్నారు. అలా 1987కి గాని నా కవితా సంపుటి గ్రంథ రూపంలో రాలేదు. ముందుమాటలు ఎవరితో రాయించాలనుకుంటున్నారు అని అడిగారు. అజంతా, మో, ఇస్మాయిల్, సంజీవ్ దేవ్... ఇలా పేర్లు చెప్పాను. ఆయన వేల్చేరు నారాయణరావుతో ముందుమాట, చంద్రగారితో ముఖచిత్రం వేయిద్దాం అని ప్రయత్నించారు. కానీ ఇద్దరూ దొరకలేదు. చివరికి ఇస్మాయిల్ గారు ఉత్తరం రాస్తే శీలా వీర్రాజు గారు రెండు బొమ్మలు వేసి పంపి నచ్చింది వాడుకోమన్నారు. మో ముందుమాట రాసి రెండు శీర్షికలు పెట్టి పంపారు నచ్చింది తీసుకోమని. ‘ఏదారీలేదాయె నాకీ జగాన’ శీర్షిక తీసుకున్నాం. ఆంధ్రా యూనివర్సిటీ స్కాలర్స్ హాస్టల్ రూంలో అది అందుకున్న రోజున ఎన్నిసార్లు చదువుకున్నానో! ఇక ఇస్మాయిల్ ఎంతకీ ముందుమాట రాయడం లేదు. ఒకసారి విశాఖపట్నం నుండి యానాం వెళ్తూ కాకినాడలో దిగి లచ్చిరాజువారి వీధి లోని వారి ఇంటికి వెళ్లి, ‘మీ పీకల మీద కూర్చోడానికి వచ్చాను’ అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి ‘మీకా శ్రమ అక్కర్లేదు, నా పీకల మీద నేనే కూర్చున్నాను, అయినా పలకడంలేదు’ అన్నారు. ఆ తర్వాతెప్పుడో ఇస్మాయిల్ శ్రీమతి నా కవితలు అటూ ఇటూ తిరగేసి, ‘ఆ అబ్బాయి బాధపడుతున్నాడు. నాలుగు మాటలు రాసి ఇచ్చేయం’డంటే ఎట్టకేలకు ఇచ్చారు. అత్తలూరి నరసింహారావు ‘సంజీవరావు- శిఖామణి’ అని నా పరిచయ వ్యాసం రాసారు.


నేను నా కవిత్వమూ చేసుకున్న అదృష్టం ఏమిటంటే ‘మువ్వల చేతికర్ర’ కవితా సంపుటికి ఇస్మాయిల్ ప్రూఫ్‌లు దిద్దడం. కాకినాడ మసీదు సెంటర్లో జిలానీ పాన్ షాప్ ఎదురు వీధిలో వరలక్ష్మి ప్రెస్‌లో పుస్తకం కంపోజ్ అవుతోంది. ప్రూఫ్ ఫారాలను మడత పెట్టి సైకిల్ క్యారేజీకి పెట్టి ఇంటికి తీసుకువచ్చి చిలకలు వాలిన చెట్టు లాంటి పచ్చని సిరాతో జాగ్రత్తగా ప్రూఫ్‌లు దిద్ది, మళ్ళీ సైకిల్ మీద తీసుకెళ్లి ప్రెస్‌లో ఇచ్చేవారాయన. ఇది నా కవిత్వం చేసుకున్న అదృష్టంగా ఇప్పటికీ భావిస్తాను. ఇక అట్టవెనక మంచి ఫోటో కావాలన్నారు. యానాం పిల్లరాయ వీధిలో పట్నాల రమణప్రసాద్ రెయిన్బో స్టూడియో ఉంది. ఆయన కాలేజీలో మాకు సూపర్ సీనియర్. స్టూడియోకి వెళ్తే రెండు మూడు ఏంగిల్స్‌లో ఫోటోలు తీసాడు. అందులో ఒకటి ‘మువ్వల చేతికర్ర’ వెనక అట్ట మీద వేసాం. పుస్తకం దుబాయ్‌లో ఉన్న మా పెద్దన్నయ్య కర్రి శివాజీ రావు ఆర్థిక సౌజన్యంతో అచ్చయింది. అందుకు అమ్మ లాంటి వదిన ధనలక్ష్మి అభిమానం మర్చిపోలేనిది. ‘మువ్వల చేతికర్ర’ జూలై 1987లో కాకినాడ శ్రీ వెంకటలక్ష్మీ ప్రింటింగ్ ప్రెస్ లోనూ, మల్టీకలర్ కవర్ పేజీ రాంషా గారి ధర్మచక్ర ప్రెస్, సామర్లకోట లోనూ అచ్చయ్యాయి.


ఇక ఆవిష్కరణ సభ 18 అక్టోబర్ 1987న ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తరఫున యూనివర్సిటీ అసెంబ్లీ హాలులో జరిగింది. తెలుగు శాఖ అధ్యక్షులు డా. లకంసాని చక్రధరరావు అధ్యక్షత వహించగా, స్మైల్ ఆవిష్కరించారు. అంకితం గురువుగారు కందర్ప వెంకట నరసమ్మ, తొలి ప్రతి త్రిపుర స్వీకరించారు. కవిత్వం గురించి చందు సుబ్బారావు, భైరవయ్య, వాడ్రేవు చినవీరభద్రుడు, అత్తలూరి మాట్లాడారు. పల్లికొండ ఆపదరావు ఆహ్వానం పలకగా కోలవెన్ను మలయవాసిని ముగింపు వాక్యాలు పలికారు. మాట్లాడని అతిథులు ఇస్మాయిల్, మో లు సభకు రాలేదు. సభ రోజు ఉదయం ఒక ప్రమాదం, సాయంత్రం ఒక ప్రమాదం జరిగాయి. ఉదయం ప్రమాదం ఏమిటంటే కాకినాడ నుండి వస్తున్న మిత్రుడు పొట్నూరి ప్రభునాథ్ అనకాపల్లి వద్ద రైలు నుండి జారిపడిపోవడం. ప్రాణాపాయం తప్పింది. ఇక సాయంత్రం ప్రమాదం: స్మైల్ మంచి ఫోటోగ్రాఫర్ కదా! తన కెమెరా ఎవరికో ఇచ్చి ఆవిష్కరించి, ప్రసంగించి, ఫోటోలు తీయడానికి కిందకు వెళ్లిపోయారు. ఓ ఎన్ని క్లిక్‌లో, ఎన్ని ఫ్లాష్‌లో! సభ అయ్యాక కెమెరాలో రీల్ లోడ్ చెయ్యడం మర్చి పోయిన సంగతి తెలిసింది! ‘మువ్వల చేతికర్ర’ అమలాపురం సరసం అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, ఉమ్మడిశెట్టి పురస్కారం వంటివి అందుకుంది. అప్పట్లో సాహిత్య వ్యాసాలు, ఇంటర్వ్యూలలో ‘మువ్వల చేతికర్ర’ ప్రస్తావన లేనివి అరుదు. చేరాతల్లో మువ్వల చేతికర్ర వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. ఆ రెండేళ్లు గొప్ప కవిత్వ జ్వరంతో నన్ను భుజాలు పట్టుకుని ఊపేసింది, అప్పటికీ ఇప్పటికీ నన్ను కవిత్వంలో ఐడెంటిఫై చేసి చూపుతోంది నా ‘మువ్వల చేతికర్ర’.

- శిఖామణి

98482 02526

Updated Date - May 12 , 2025 | 04:57 AM