PM Modi Foreign Policy: విదేశాంగ విధానంలో మోదీ తడబాట్లు
ABN, Publish Date - Aug 26 , 2025 | 05:02 AM
భారత్ పాక్ మధ్య తానే యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముప్పైసార్లు ప్రకటిస్తే, పార్లమెంట్ వేదికగా జరిగిన చర్చలో ప్రధానమంత్రి మోదీ మాటమాత్రమైనా ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు. దాయాది దేశమైన పాక్ విషయంలో కానీ, మన కశ్మీర్...
భారత్ పాక్ మధ్య తానే యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముప్పైసార్లు ప్రకటిస్తే, పార్లమెంట్ వేదికగా జరిగిన చర్చలో ప్రధానమంత్రి మోదీ మాటమాత్రమైనా ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు. దాయాది దేశమైన పాక్ విషయంలో కానీ, మన కశ్మీర్ విషయంలో కానీ భారత్ ఏనాడూ మూడోదేశం జోక్యాన్ని అనుమతించలేదు. అయితే, ఈ విషయంలో మోదీని వాణిజ్యం సాకుగా చూపి ఒప్పించానని ట్రంప్ పదేపదే చెప్పారు. అయితే, ఏ వాణిజ్య అంశం ఆపరేషన్ సిందూర్ ద్వారా పీఓకేను తిరిగి తెచ్చుకునే అవకాశానికి అడ్డంకిగా మారిందో, ఇప్పుడు ఆ వాణిజ్య ప్రయోజనం కూడా దక్కలేదు. మొన్నటి ఆగస్టు 1 నుంచి 25శాతం సుంకంతో పాటు, ఈ నెల 27 నుంచి మరో 25శాతం జరిమానాను కలిపి, మొత్తం 50శాతం సుంకాలను భారత ఉత్పత్తులపై విధిస్తున్నామన్న ట్రంప్ ప్రకటనతో మన దేశ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అయింది. కరోనా భయాలు పోయి వాణిజ్యం గాడిన పడుతున్నదనుకుంటున్న దశలో పులి మీద పుట్రలా ట్రంప్ సుంకాలు దాపురించాయి. ఒకవైపు ఐటీ కంపెనీల లే ఆఫ్‌లు, ఎంఎస్ఎంఈల మూసివేతలు కొనసాగుతుండగానే ఇప్పుడీ అమెరికా వాణిజ్య సుంకాల బరువుతో మనదేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎంత పెరుగుతుందో అన్న ఆందోళన కలుగుతున్నది.
విదేశాంగ విధానం దేశానికి పట్టుగొమ్మలా ఉండాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అలీన విధానంతో ప్రపంచంలోనే భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. తొలి ప్రధాని నెహ్రూ విధానంతో ప్రతీ ఒక్కరూ మన దేశాన్ని గౌరవించారు. నాటి ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనూ మన దేశం అటు సోవియట్ యూనియన్‌తో సన్నిహిత సంబంధాలను నెరుపుతూనే ఇటు అమెరికాతోనూ స్నేహ సంబంధాలను కొనసాగించింది. 1971 ఇండో–పాక్ యుద్ధ సమయంలోనూ అమెరికా తమ భాగస్వామి పాకిస్థాన్ కోసం మన దేశంపై ఎంత ఒత్తిడి తెచ్చినా, నాటి ప్రధాని ఇందిర ఏ మాత్రం లొంగలేదు. మరో కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించేదాకా యుద్ధాన్ని విరమించేది లేదని తెగేసి చెప్పి సాధించింది. ఆ తర్వాత పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్షల సమయంలోనూ అదే తెగువను అమెరికాకు చూపించింది భారత్. పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అమెరికా–రష్యాలతో పాటు ప్రపంచ దేశాలతో మన సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. అణు పరీక్షలు వద్దని ఆంక్షలు విధించిన అదే అమెరికా 2008లో మన్మోహన్ సింగ్ హయాంలో మనతో అణు ఒప్పందాలు చేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాలు విదేశాంగ విధానంలో అనుసరించిన అత్యద్భుత విధానాలు మనకు అందించిన గొప్ప విజయాలు ఇవి. కానీ గత పదకొండేళ్లుగా బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంత గందరగోళంతో వ్యవహరించింది. ఒక దేశాధినేతగా మరో దేశం అంతర్గత ఎన్నికల అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరం లేనిది. కానీ 2019లో అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ పేరుతో ఏకంగా అగ్రరాజ్య ఎన్నికల్లో ట్రంప్‌కు, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మోదీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు. 2020లో గుజరాత్‌లో ‘నమస్తే ట్రంప్’ పేర ఆయనతో ర్యాలీ చేయించారు. ఇవి వ్యక్తిగత ప్రతిష్ఠకు, తమ పార్టీ బలోపేతానికి పనికొచ్చాయి కానీ, దేశ ప్రయోజనాలకు కాదన్న సత్యం ఇప్పుడు వారికి బోధపడుతున్నది. మరోవైపు బంగ్లాదేశ్, చివరికి శ్రీలంక, మాల్దీవులు సైతం భారత్‌తో వైరి భావనలో ఉన్నాయి.
ఒకవైపు ‘మేకిన్ ఇండియా’ అనే నినాదాన్ని ఎత్తుకొని, మరోవైపు మార్కెట్లను మన వస్తువులకు మూసేసే విధంగా విదేశాంగ విధానాలు ఉంటే నష్టపోయేది మన ప్రజలే. ఇప్పటికే జీఎస్టీ వసూలుతో కుదేలయిన భారత వస్త్ర పరిశ్రమ ఇప్పుడు అమెరికా సుంకాల పరిధిలోకి రావడంతో పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆక్వా రైతులు అల్లల్లాడుతున్నారు. మరోవైపు రష్యా చమురు ద్వారా దక్కుతున్న ప్రయోజనం వినియోగదారుడికి చేరడమే లేదు. బ్యారెల్ ముడి చమురు 150 డాలర్లు ఉన్నప్పుడే యూపీఏ ప్రభుత్వం రూ.60కి లీటరు పెట్రోలు అందించింది. ఇప్పుడు 80డాలర్లకు దొరుకుతున్నా రూ.110కి పెట్రోలు కొంటున్నారు సామాన్యులు. మరోవైపు ఈ లాభాలు అంబానీ, అదానీల రిఫైనరీల కోసమే అనే వార్తల్నీ మనం చూస్తున్నాం. ఇదే నిజమైతే అటు విదేశాంగ విధానంలో విఫలమై, ఇటు ఆప్త మిత్రులైన గుజరాతీ వ్యాపారుల కోసం దేశాన్నే తాకట్టు పెట్టే స్థితికి వెళ్లడం మోదీ నియంతృత్వ, అసమర్థ పోకడలకు తార్కాణం.
అమెరికా సుంకాల యుద్ధం నుంచైనా మోదీ, ఆయన ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా మారబోతున్నాం అన్న పేరుతో ప్రజల కష్టాన్ని దొంగిలించడం కన్నా మన ఎగుమతుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లను సృష్టించి ఆ మార్పులో నిజమైన భాగస్వామ్యాన్ని పొందాలి. విదేశాంగ విధానమంటే వ్యక్తిగత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నంత ఈజీ కాదని తెలుసుకోవాలి.
-పున్నా కైలాస్ నేత
జనరల్ సెక్రటరీ, టీపీసీసీ
Updated Date - Aug 26 , 2025 | 05:02 AM