ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi Warning: కశ్మీర్‌ సందేశం

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:41 AM

పహల్గాం ఉగ్రదాడి తరువాత, ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో కాలూని, అనేక భారీ ప్రాజెక్టుల ఆరంభోత్సవాలతోపాటు పాకిస్థాన్‌కు ఘాటైన హెచ్చరికలు కూడా చేశారు.

హల్గాం ఉగ్రదాడి తరువాత, ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో కాలూని, అనేక భారీ ప్రాజెక్టుల ఆరంభోత్సవాలతోపాటు పాకిస్థాన్‌కు ఘాటైన హెచ్చరికలు కూడా చేశారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ పర్యటనమీద ప్రత్యేక దృష్టిపెట్టినందువల్ల, మోదీ సందేశం ప్రపంచం నలుమూలలకూ చేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్‌ రైల్వేబ్రిడ్జిని ఆరంభించడంతోపాటు, మువ్వన్నెల జెండా చేతధరించి కదిలిన ఆ దృశ్యం శత్రువులకు ఒక బలమైన హెచ్చరిక. చినాబ్‌, అంజీ వంతెనలమీదుగా వందేభారత్‌ పరుగులు, అందులో ప్రధాని ప్రయాణం చూడచక్కని దృశ్యాలు. రైలుమార్గం ద్వారా కశ్మీర్‌ను మిగతాదేశంతో అనుసంధానించే ఈ కృషిలో భాగంగా ఉదంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్‌ లింక్‌ ప్రాజెక్టును ముప్పయ్యేళ్ళక్రితమే పి.వి. నరసింహారావు ప్రభుత్వం ఆమోదించిన విషయాన్ని కాంగ్రెస్‌ ఈ సందర్భంగా గుర్తుచేసింది. కీర్తి మొత్తం తన ఖాతాలో వేసుకొనే లక్షణం మోదీకి ఉన్నది కనుకనే, కాంగ్రెస్‌ హయాంలో మొత్తం జమ్మూకాశ్మీర్‌లో జరిగిన రైల్వేలైన్ల అభివృద్ధినుంచి ఈ ప్రాజెక్టు అంకురార్పణవరకు ప్రతీదీ గుర్తుచేయాల్సివస్తున్నదని ఆ పార్టీ వాదన. 2002లో వాజపేయి ప్రభుత్వం దీనిని జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. 2013నాటికే 135కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరిగిపోయిందని చెప్పుకుంది. ఇక, ప్రధాని తన ప్రసంగంలో జమ్మూకాశ్మీర్‌కోసం ఎన్నివేలకోట్లు ఖర్చుచేశామో, విద్యార్థులనుంచి రైతులవరకూ ప్రతీ ఒక్కరికీ ఎంత లబ్ధిని సమకూర్చామో చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ను ఇకమీదట కూడా ఎంతో ప్రేమగా చూసుకోబోతున్నామని హామీ ఇవ్వడంతో పాటు, పాకిస్థాన్‌ను దులిపేయడానికి, హెచ్చరించడానికి ఈ పర్యటనను చక్కగా ఉపయోగించుకున్నారు. పొరుగుదేశం పర్యాటకానికి, పేదలకు వ్యతిరేకమని, ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్‌లో అభివృద్ధి ఆగదని మాటిచ్చారు. భారీ ప్రాజెక్టుల ఆరంభోత్సవాలకంటే, ప్రధాని స్వయంగా పర్యటించడం, అభివృద్ధికీ సంక్షేమానికీ ఏ లోటూ ఉండదని హామీ ఇవ్వడం కశ్మీరీలకు ఉపశమనం కలిగించే విషయం. పహల్గాం దారుణం జరగగానే కశ్మీరీలను విలన్లుగా చిత్రీకరించే ఒక కుట్రపూరితమైన ప్రయత్నం జరిగింది.


దాడిలో స్థానికుల సహకారం, భాగస్వామ్యం ఉన్నదన్న విపరీత దుష్ప్రచారం ద్వారా దేశప్రజలను కశ్మీరీలకు దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఉగ్రదాడి వారి పొట్టగొడితే, ఈ వ్యతిరేక ప్రచారం వారిని మరింత కుంగదీసింది. మోదీ తన ప్రసంగంలో పోనీవాలా ఆదిల్‌ హుస్సేన్‌ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించడం బాగుంది. పహల్గాంలో పర్యాటకులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలను వమ్ముచేయడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈ పోనీవాలాలమీద కూడా విషం చిమ్మిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తన ప్రసంగంలో చిన్ననాటినుంచీ తాను కలలుగన్న చీనాబ్‌ వంతెన ఇప్పటికి సాకరమైనందుకు మోదీని ప్రశంసించడంతో పాటు, తన ప్రమోషన్‌ ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చారు. 2014లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను కేంద్రపాలిత ప్రాంత సిఎంగా డిమోట్‌ అయితే, రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న మనోజ్‌ సిన్హాకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ప్రమోషన్‌ వచ్చిందన్న చమత్కారం బాగుంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా గురించి ఆయన అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రానికి గుర్తుచేస్తూనే ఉన్నారు. వేదికమీద ఉన్న మోదీ ఈ మాటలు విననట్టు ఊరుకోవచ్చునుగానీ, సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వమే ఈ మేరకు హామీపడిన విషయాన్ని విస్మరించకూడదు. మెహబూబ్‌ ముఫ్తీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవడం నుంచి, 370అధికరణ రద్దుద్వారా ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చీల్చడం వరకూ తమ పదేళ్ళకాలంలో జమ్మూకశ్మీర్‌తో ఇష్టారీతిన వ్యవహరించిన విషయం మరిచిపోకూడదు. న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు నిర్వహించినప్పటికీ, పలు చట్టసవరణలతో గవర్నర్‌ను బలోపేతం చేయడమే తప్ప, రాష్ట్రహోదా ఊసెత్తడం లేదు. ఒమర్‌ ప్రభుత్వం గద్దెనెక్కేలోగా దాదాపు లక్షమందికి స్థానికతనివ్వడం, పెట్టుబడుల పేరిట సాగే వనరుల దోపిడీకి తలుపులు బార్లా తెరవడం స్థానికులకు ఆగ్రహం కలిగిస్తున్న విషయాన్ని గుర్తెరగాలి. పొరుగుదేశంమీద పైచేయి సాధించాలంటే ఇక్కడి ప్రజల మనసులు గెలవడం ముఖ్యం. అటల్‌జీ ప్రవచిత ఇన్‌సానియత్‌, కశ్మీరీయత్‌ వంటి ఉన్నతమైన పదాలు పునరుద్ఘాటిస్తున్నప్పుడు, స్థానికులతో వ్యవహారం కూడా సున్నితంగానే ఉండాలి. కశ్మీర్‌ను రైలుమార్గంతో మిగతాదేశానికి అనుసంధానించిన పాలకులు త్వరలోనే దానికి రాష్ట్రహోదా ఇచ్చి, స్థానికుల మనసులు గెలుచుకుంటారని ఆశిద్దాం.

Updated Date - Jun 07 , 2025 | 12:42 AM