TUCI State General Secretary: మేడే స్ఫూర్తితో సమస్యలపై పోరాడుదాం
ABN, Publish Date - May 01 , 2025 | 03:28 AM
చికాగో మేడే పోరాట స్ఫూర్తితో నేడు భారత కార్మికులు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా, సమాన వేతనాల కోసం మరియు ఉద్యోగ భద్రతకై పోరాటం కొనసాగిస్తున్నారు. పెన్షన్ పెంపు, రెగ్యులరైజేషన్, మరియు కార్మిక హక్కుల పరిరక్షణ ప్రధాన డిమాండ్లు అవుతున్నాయి.
మే 1, 1886న పాలకవర్గాల దమనకాండలో చికాగో(అమెరికా) కార్మికవర్గం రక్తం చిందించింది. ఉరికొయ్యలను సైతం లెక్కచేయక సాధించిన పోరాట ఫలితంగానే 8 గంటల పనిని ప్రపంచం ఆమోదించవలసి వచ్చింది. ఒకనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది అమానుషంగా మరణించారు. వ్యవసాయరంగం విప్లవాత్మక మార్పులలో ప్రపంచానికే తిండి గింజలు అందించే శక్తి వచ్చింది. కరువు కాటకాల నుంచి బయట పడ్డారు. కాని పాలకుల చర్యల ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి రావడం సిగ్గుచేటు. నేడు యాంత్రీకరణతో శ్రామికుడు 8 గంటల పనిని 4 గంటల్లో చేస్తున్నాడు. కాని పెట్టుబడిదారులు కార్మికుల రక్తాన్ని మరింతగా పీల్చిపిప్పి చేసి, సంపద పోగేసుకోవడానికి 12 గంటల పని పెంపుదలను ముందుకు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌లో పని గంటల పెంపు ప్రతిపాదించింది. దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులలో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ భద్రత, తగిన వేతనాలతో జీవిస్తున్నారు. మిగతావారు బతుకు భద్రత లేక కొట్టుమిట్టాడుతున్నారు. రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులు ‘సమాన పనికి సమాన వేతనం’ అనే సుప్రీం తీర్పును ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలి? శ్రామిక వర్గం జీవించడానికి సరిపడే వేతనాలకై పోరాడాలి. కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో, 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ, మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా ఆమోదించి అమలుచేయడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారు.
ట్రేడ్ యూనియన్ హక్కులైన సమ్మె, వేతనాల గురించి బేరసారాలు లేకుండా చేయడం, అధిక పని గంటలు, నియమిత కాల పరిమితి గల ఎంప్లాయిమెంట్ ఉండే విధంగా నిబంధనలు, పరిశ్రమల మూసివేత, కార్మికుల తొలగింపునకు సులభతర అవకాశాలను కోడ్స్‌లో పొందుపర్చారు. ఇది హక్కులను హరించడమే. అసంఘటిత కార్మిక వర్గానికి ఏ విధమైన సామాజిక భద్రత లేదు. ఒక పక్క కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రాయితీలు, కారుచౌకగా ప్రభుత్వరంగ సంస్థల అప్పగింత, విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచారు. మరోపక్క పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై కోత వేస్తున్నారు. పేదలకిచ్చే సంక్షేమాలను ఉచితాలనీ, వీటితో ప్రజలు సోమరులుగా తయారవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరి, వీరికి లక్షల కోట్ల రాయితీ పొందే కార్పొరేట్లు, బ్యాంకులను లూటీ చేసే చోక్సీ, విజయమాల్యాలు కనబడలేదా? చాలీచాలని జీవితాలతో బతుకు బండి లాగుతున్న శ్రమజీవులపై ఇంత కంటగింపా? కార్మికులకు కనీస పెన్షన్ వేయి రూపాయలా? సేవ పేరుతో ఎంపీ, ఎమ్మెల్యేలైన వారు లక్షలాది రూపాయల పెన్షన్ పొందుతున్నారు. మరి కార్మిక, ఉద్యోగులు కూడబెట్టిన సొమ్ముపై ఎందుకు పెన్షన్ పెంచడం లేదు? కాంట్రాక్ట్–అవుట్ సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రతకై, జీవించడానికి సరిపడే వేతనాలు, పెన్షన్ పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం మేడే స్ఫూర్తిగా పోరాడుదాం.
– కె. సూర్యం
టీయుసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Updated Date - May 01 , 2025 | 03:28 AM