శాంతిచర్చల వెనుక వ్యూహం!
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:57 AM
మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన కొత్తది కాదు. పరిస్థితులు దెబ్బతిన్న ప్రతీసారి, వారు చర్చల జపంతో ముందుకు వస్తారు. మావోయిస్టులు ఈ ప్రతిపాదనను కేవలం వ్యూహాత్మకంగా...
మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన కొత్తది కాదు. పరిస్థితులు దెబ్బతిన్న ప్రతీసారి, వారు చర్చల జపంతో ముందుకు వస్తారు. మావోయిస్టులు ఈ ప్రతిపాదనను కేవలం వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా పరిశీలిస్తే, ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో వరుస ఎన్‌కౌంటర్లలో అనేకమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం, వారి కంచుకోటలు బీటలు వారడం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో నక్సలిజాన్ని అణచివేసేందుకు తీవ్రమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, మావోయిస్టులు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇది నిజమైన శాంతి కాంక్ష కంటే, విధిలేని పరిస్థితుల్లో వెసులుబాటు కోసం చేయాల్సి వచ్చిన వ్యూహాత్మక చర్య.
2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో, నక్సలైట్లతో శాంతి చర్చలు జరిగాయి. ఆ సమయంలో వారు హింసను తగ్గిస్తామని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, చర్చలకు అవకాశం కల్పించింది. కానీ, ఒకవైపు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే, మరోవైపు మావోయిస్టులు భారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టారు. ఆయుధాల సరఫరా పెంచుకున్నారు, నిధులు సమీకరించుకున్నారు. చర్చలు విఫలమైన తర్వాత, వారు మరింత బలంగా హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ హయాంలో జరిగినట్లుగానే, ఇప్పుడు కూడా రిక్రూట్‌మెంట్, ఆయుధాల సేకరణ, నిధుల సమీకరణ వంటి కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారి ప్రతిపాదన మేరకు నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం ప్రభుత్వాలకు దీర్ఘకాలంలో నష్టం కలిగించవచ్చు. అందువల్ల చర్చలు జరిగినా, మరోపక్క మావోయిస్టుల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలి. గతంలో మాదిరిగా వారికి వ్యూహాత్మక వెసులుబాటు దొరకకుండా చూడాలి. నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని ఆపకుండా చర్యలు, చర్చలూ కొనసాగించాలి.
శ్రీనివాస్ గౌడ్ ముద్దం
సామాజిక విశ్లేషకులు
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
Updated Date - Apr 17 , 2025 | 05:57 AM