Ambedkar Constitutional Ideals: ఇప్పుడు అంబేడ్కర్ ఉంటే ఏం చేసేవారు
ABN, Publish Date - May 24 , 2025 | 05:52 AM
మావోయిస్టుల హింసామార్గం ప్రభుత్వానికి సవాల్ గా ఉంది, అయితే హింసతో వారిని అంతం చేయడంపై రాజ్యాంగ నైతికత ప్రశ్నార్థకం. రాజ్యాంగ ఆదర్శాలు పాటించకపోవడం వల్లే అసమానతలు పెరిగి తిరుగుబాట్లు ఉద్భవిస్తున్నాయని ఆలోచన.
మావోయిస్టులది ప్రకటిత హింసామార్గం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. హింసామార్గాన్ని చేపట్టిన మావోయిస్టుల్ని హింసతోనే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. కగార్, బ్లాక్ ఫారెస్ట్ తదితర ఆపరేషన్లు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. అయితే, ప్రభుత్వం చేపట్టిన హింసామార్గం రాజ్యాంగ ఆదర్శాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది వర్తమాన ప్రజాస్వామికవాదుల్ని కుదిపేస్తున్న సందేహం. అంబుజ్‌మడ్‌లోని నారాయణ్‌పూర్ అడవుల్లో మే 21న సీపీఐ –మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతాదళాలు హతమార్చాయి. ఆయనతో పాటు మరో పాతికమంది స్త్రీ–పురుష మావోయిస్టుల్నీ మట్టుబెట్టారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదిక మీద స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ‘‘నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం’’ అన్నారు. హింసావాదుల్ని హింసతోనే అంతం చేయడం ధర్మబద్ధమే అని కొందరు అనవచ్చు. కేంద్ర హోం మంత్రి ప్రకటనలు కొందరికి సమంజసంగా అనిపించవచ్చు. మరికొందరికి గొప్ప ఉత్సాహాన్ని కూడ కలిగించవచ్చు. ఇంకొందరు ఉన్మాదంతో ఉగిపోనూవచ్చు. కమ్యూనిస్టుల్ని చీదరించుకునేవారో, విప్లవ వ్యతిరేకులో అలా అనుకుంటే అదో ఇది. కానీ, ప్రజలకూ ప్రభుత్వానికి మధ్య భారత రాజ్యాంగం అనే ఆధునిక పవిత్రగ్రంథం ఒకటుందని మరచిపోవడం ఆలోచనాపరులకు సమంజసం కాదు. రాజ్యాంగ ప్రకటిత ఆదర్శాలను మార్గదర్శకాలనూ ప్రభుత్వాలు సరిగ్గా పాటిస్తే తిరుగుబాట్లు తలెత్తాల్సిన అవసరమే ఉండదు. ప్రభుత్వాలు రాజ్యాంగ ఆదర్శాలను తుంగలో తొక్కినపుడే తిరుగుబాట్లు తలెత్తుతాయి. ఇది అందరికీ తెలిసిన సమాజ నియమం. జాతీయోద్యమ కాలంలోనే రాజకీయాల్లో రెండు స్రవంతులు ఏర్పడ్డాయి. మనం ఎంతగానో ఉద్వేగభరితంగా తలచుకునే భగత్‌సింగ్, అల్లూరి శ్రీరామరాజు, ఉద్ధామ్‌సింగ్ తదితరులది బాహాటంగా హింసామార్గం. గాంధీ, నెహ్రు, అంబేడ్కర్‌లది అహింసామార్గం. వాళ్ళ మధ్య అభిప్రాయ బేధాలు, ఇతర వివాదాలు కూడ ఉండవచ్చుగాక; ఉన్నాయి కూడ. అయితే, అంతిమంగా వాళ్ళది అహింసామార్గం. చాలామంది వాళ్ల మధ్య ఘర్షణను మాత్రమే చూస్తుంటారు గానీ ఐక్యతను చూడరు. ఇదొక సెలెక్టివ్ విజన్. రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే పొరుగుదేశం చైనాలో రక్తపాత విప్లవం విజయవంతమై ఒక రకం సామ్యవాద సమాజం ఏర్పడింది.
మనదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాట పంథాను కొనసాగిస్తున్నది. పైగా, అల్లూరి, భగత్‌సింగ్‌ల మీద ప్రజలకు ఆరాధనాభావం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాల పనితీరుతో విసిగిపోయిన ప్రజలు సాయుధులై తిరగబడే ప్రమాదాన్ని నివారించాలనేది భారత రాజ్యాంగ రచనకు ప్రధాన లక్ష్యంగా మారింది. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేడ్కర్ ఇదే విషయాన్ని ఇంకో పద్ధతిలో చెప్పాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత... ముందు రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధిస్తుంది. ఆ తరువాత, భావి ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి అన్నాడు. పాలకులు అలా చేయకపోతే, వివిధ రంగాల్లో కొనసాగుతున్న అసమానత్వానికి బాధితులైనవారు తిరగబడి ఏకంగా ‘ప్రజాస్వామ్య భవనాన్ని’ పేల్చేస్తారు అని హెచ్చరించాడు. వివిధ రంగాల్లో కొనసాగుతున్న అసమానత్వాన్ని రూపుమాపని ప్రభుత్వాలను మనం ఏమీ అనం. వాళ్ళు అసమానత్వాన్ని పెంచిపోషిస్తున్నా అభ్యంతరం చెప్పం. అసమానత్వం మీద తిరగబడే ప్రజల్ని మాత్రం దోషులుగా, దారితప్పినవారిగా, హింసావాదులుగా, నైరాశ్యంలో కూరుకుపోయినవారిగా నిందార్థంలో చూస్తాం. మన ఆలోచనల్లో ఇదొక ద్వంద్వం. 19వ శతాబ్దం చివర్లో మద్రాసు–కలకత్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ నిర్మించడానికి, దారి కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసుల్ని అడవి నుంచి తరిమేసింది. రైలు పట్టాల కింద వేసే చెక్క స్లీపర్ల కోసం తూర్పు కనుమల్లోని అడవుల్ని విచక్షణా రహితంగా నరికి వేసింది. అడవిని కోల్పోయి, రోడ్డు నిర్మాణ కూలీలుగా మారిన ఆదివాసుల్ని అణా (6 నయాపైసలు), అర్ధణా (3 నయాపైసలు) వేతనం ఇవ్వడానికి కూడ వేధించింది. అణిచివేత ఈ స్థాయికి చేరుకోవడంతో అత్యంత సహజంగానే మన్యంలో తిరుగుబాటు తలెత్తింది. మన్యంకు వాయువ్య దిశలోనే బస్తర్ ఉంటుంది. అక్కడా అప్పట్లో మన్యం వంటి తిరుగుబాట్లు సాగాయి. అక్కడా అల్లూరి వంటి పోరాట వీరులు పుట్టుకొచ్చారు. అక్కడి ఆదివాసులు ఇప్పటికీ ఆ వీరుల్ని ఏడాదికి ఒకసారైనా తలుచుకుంటుంటారు. ఇప్పుడూ బస్తర్‌లో వందేళ్ల నాటి వేధింపులు సాగుతున్నాయి.
ఆదివాసుల్ని అడవుల నుంచి తరిమేసి అటవీ సంపదనీ, ఖనిజ వనరుల్ని అస్మదీయ కార్పొరేట్లకు అప్పగించేందుకు ఒక మహాయజ్ఞం అక్కడ సాగుతోంది. ఆదివాసులకు అప్పుడూ, ఇప్పుడూ అణిచివేత స్వీయ అనుభవమే. తెల్లవాళ్ళ మీద తిరగబడడం న్యాయమేగానీ, నల్లవాళ్ల మీద తిరగబడడం అన్యాయం అని ఆదివాసులకు మన మైదానవాసులు హితవు చెపుతారా? అల్లూరిని చంపినపుడూ ఇంగ్లండులో సహితం మారుమోగేలా అదొక మైలురాయి విజయం అంటూ చాలా గట్టిగానే వికటాట్టహాసం చేశారు బ్రిటిష్ అధికారులు. భగత్‌సింగ్‌ను ఉరి వేసిన తరువాత 1931 ఏప్రిల్ 13 నాటి జనతా వార్తాపత్రికలో ‘ముగ్గురు బాధితులు’ శీర్షికతో అంబేడ్కర్ ఒక వ్యాసం రాశాడు. న్యాయదేవత మీద భక్తివిశ్వాసాలతో వాళ్ళీ పని చేయలేదు; ఇంగ్లండ్‌లోని కన్జర్వేటివ్ పార్టీ పెద్దల్నీ, అక్కడి మూర్ఖులయిన జనాన్నీ సంతృప్తిపరచడానికి ఒక బలిదానాన్ని ఉరికంబం ఎక్కించారన్న వాస్తవం ఈ ప్రభుత్వానికే కాదు; మొత్తం ప్రపంచానికి కూడ స్పష్టంగా తెలుసు అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడు నంబాల కేశవరావును చంపి, సరిగ్గా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు ఏలినవారు. ఇప్పుడు అంబేడ్కర్ ఉంటే ఏం రాసేవాడో? చరిత్ర ఒక ప్రహసనంగా పునరావృతం అవుతోందో లేదో గానీ, మన మధ్యనే మరో ప్రపంచం, మరో సమాజం, మరో జాతి, మరో తెగ కొనసాగుతున్నాయని గుర్తించకపోవడం మాత్రం మన కాలపు విషాదం. రాజ్యాంగం తొలి ప్రతిలో ప్రజాస్వామ్యం అనే ఆదర్శం ఒక్కటే ఉంది. దానికి మరింత వివరణ ఇస్తూ, దాని పరిధిని పెంచుతూ సామ్యవాద, మతసామరస్య రాజ్యాంగం అని పునర్ నిర్వచించుకున్నాం. ఆ తరువాత లెక్క ప్రకారం ప్రజల కష్టాలు తగ్గిపోవాలి. కానీ, అలా జరగడంలేదు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నవారు, పార్లమెంటు భవన మెట్లను ముద్దాడుతున్నవారు అనుక్షణం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. దేశ సంపదలో 70 శాతం కేవలం పది శాతం కుటుంబాల చేతుల్లో ఉందట. 40 శాతం సంపద ఒక శాతం కుటుంబాల చేతుల్లో ఉందట. 70 నుంచి 80 శాతం జనాభా కేవలం 3 శాతం దేశ సంపదతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నది.
రాజ్యాంగ ఆదర్శమయిన సామ్యవాదాన్ని ఇంతగా అపహాస్యం చేస్తున్నది ఎవరూ? దేశంలో మతసామరస్యం గురించి ఇక చెప్పనక్కరలేదు. దేశంలోని ఒక సమూహాన్ని బాహాటంగా శత్రువర్గం జాబితాలో పడేశారు. ఒక చట్టం తెచ్చి వాళ్ళ పడకగదుల్లోకి ప్రవేశించారు. ఇంకో చట్టం తెచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని సందిగ్ధంలో పడేశారు. మరో చట్టంతో వాళ్ళ ఆస్తి హక్కుని నిరాకరిస్తామన్నారు. వాణిజ్య కూడళ్ళలో హాకర్లు, చిరు వ్యాపారులుగా మారి, కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా సహించలేక వాళ్ళ బతుకుల్ని బుల్‌డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అయినా, మతసామరస్యం అనే అక్షరాలు రాజ్యాంగంలో మెరుస్తూనే ఉన్నాయి. ఇంతటి వైరుధ్యాన్ని భరించడం మనుషులకు ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు. మైదాన ప్రాంతాల్లో ముస్లింలను భయపెట్టి కొత్త అస్పృశ్యులుగా మార్చాలనీ, అడవుల్లో ఆదివాసుల్ని తుడిపెట్టేయాలనీ ఏలినవారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్టు ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనపడుతోంది. చర్యల మీద మనకు అభ్యంతరాలు లేనపుడు ప్రతిచర్యల మీద మాత్రమే అభ్యంతరాలుండడం సబబు కాదు. బస్తర్ ఆదివాసులు మావోయిస్టులుగా మారాలని ఏమీ అనుకోలేదు. అణిచివేతను అడ్డుకోవాలనుకున్నారు. అందుబాటులో మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్లలో చేరారు. రేపు మరొకరితో చేతులు కలపవచ్చు. ఆయుధాలను చేపట్టడాన్ని తప్పుపడు తున్నవాళ్ళు అణిచివేతనూ తప్పుపట్టాలి. లేకుంటే మనలోనే ఏదో తప్పు ఉన్నట్టు లెక్క. నారాయణపూర్ మృతుల ఫొటోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు సర్వత్రా అవి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ తలలకు గురిపెట్టి తుపాకులు కాల్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ్యాంగం చెడ్డదయినా సరే అమలు చేసేవాడు మంచోడయితే అది మంచిదయిపోతుంది. రాజ్యాంగం మంచిదయినా సరే అమలు చేసేవాడు చెడ్డోడయితే అది చెడ్డదయిపోతుంది అని అంబేడ్కరే అన్నాడు. ఇప్పుడు అంబేడ్కర్ ఉంటే ఏం చేసేవాడో?
- డానీ సమాజ విశ్లేషకులు
Updated Date - May 24 , 2025 | 05:55 AM