Manipur Crisis: ఆరని అగ్ని
ABN, Publish Date - Jun 12 , 2025 | 06:02 AM
మణిపూర్‌లో శాంతినెలకొనాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా గట్టిగా కోరుకుంటున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించేందుకు ఆయన సానుకూలంగా ఉన్నారని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ బుధవారం వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో శాంతినెలకొనాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా గట్టిగా కోరుకుంటున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించేందుకు ఆయన సానుకూలంగా ఉన్నారని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. ఢిల్లీనుంచి వచ్చి ఇంఫాల్‌లో వాలగానే చుట్టూచేరిన మీడియాతో ఆయన తన పర్యటన విశేషాలు పంచుకున్నారు. అమిత్‌షాతో గంటలతరబడి చర్చోపచర్చలు చేశానని, పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆయన తనకు కొన్ని బాధ్యతలు అప్పగించారని, వాటిని బహిర్గత పరచకూడదు కానీ, రాష్ట్రం గాడినపడేందుకు వార్డు సభ్యుడినుంచి ఎమ్మెల్యేవరకూ అంతా ఏకతాటిమీద నడవాలన్నారు బీరేన్. అలా అంతా కలసిమెలసి ఉండకుండా, తెగలమధ్య వైషమ్యాలు పెంచి, మణిపూర్ ఇంకా మండుతూనే ఉండటానికి ప్రధాన కారకుడు బీరేన్. అటువంటి వ్యక్తికి హోంమంత్రి ఏ రహస్య కర్తవ్యాన్ని బోధించారో మరి. ఆదివారం రాజుకున్న అగ్ని క్రమంగా చల్లారుతోంది. కర్ఫ్యూ ఉన్నప్పుడు కూడా మీతీలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించిన దశను కూడా చూశాం కనుక, ఇప్పుడు సదరు నిరసనలు, ప్రదర్శనలు తగ్గుముఖం పట్టినందుకు సంతోషించాల్సిందే. మీతీ రాడికల్ సంస్థ ‘అరంబై తెంగోల్’ నాయకుడు కనాన్ సింగ్‌ను సీబీఐ అరెస్టుచేయడంతో ఈ అగ్గిరాజుకుంది. తమ నాయకుడిని పట్టుకుపోయినందుకు ఆ సంస్థ సభ్యులు, తమ రక్షకుడిని జైల్లోకి నెట్టినందుకు మీతీలు కలిసి ఈ విధ్వంసకాండ సృష్టించారు. పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసిన ఈ కనాన్‌సింగ్ 2020లో ఈ సంస్థను ఆరంభించడం వెనుక పొలిటికల్ పెద్దల ఆశీస్సులున్నాయని అంటారు. మీతీలకు ఎస్టీహోదా కట్టబెట్టే ఒక ప్రయత్నం కుకీల గుండెలు రగల్చడంతో, 2023 మే౩నుంచి రాష్ట్రం తగలబడుతున్న దశలో, ఈ సంస్థ అనూహ్యమైన వేగంతో ఎదిగింది.
పేరుకు మీతీల ఘనమైన గతాన్ని కీర్తించే ఒక సాంస్కృతిక సంస్థ కావచ్చును గానీ, ప్రత్యేక సాయుధ శిక్షణతో ఆయుధాల వినియోగంలోనూ, ప్రయోగంలోనూ దీనికి తిరుగేలేదని అంటారు. చేతిలో ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాకీటాకీలతో ఈ సంస్థ సభ్యులు బహిరంగంగా తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది జనవరిలో ఈ సంస్థ ఆదేశించిన మేరకు అన్ని పార్టీలకు చెందిన మీతీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశానికి హజరై డిమాండ్ల పత్రం మీద సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇంతటి శక్తిమంతమైన ఈ సంస్థ నాయకుడి అరెస్టుతో మణిపూర్ లోయ మళ్ళీ భగ్గుమన్నది. బీరేన్ అధికారంలో ఉండివుంటే, కుకీ–జో తెగలను ఊచకోతకోసే ఇటువంటి మీతీ మిలిటెంట్ సంస్థలమీద ఈగవాలనిచ్చేవారు కాదు. పైగా వాటిని ఆయుధాలతో బలోపేతం చేసిందీ, పోలీసు బలగాలను వాటివైపు పోకుండా ఇంతకాలమూ నిరోధించిందీ ఆయనే. ‘వాళ్ళను ఆయుధాలు దోచుకోనివ్వండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఆడియోటేపుల రూపంలో లీకై, అమిత్ షా పంపిన ప్రత్యేక కమిషన్లు కూడా బేఖాతరుచేసిన నేపథ్యంలో, వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ పోయి, ఆ గొంతు బీరేన్‌దేనని నిజనిర్థారణ జరగడంతో బీరేన్‌తో పాటు బీజేపీ పెద్దలు కూడా పరువుపోగొట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటికే బీరేన్‌మీద పార్టీలో వ్యతిరేకత తీవ్రమై, స్పీకర్ కేంద్రంగా కొత్త రాజకీయం ఆరంభంకావడం, దానిని రాజకీయంగా వాడుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ అవిశ్వాసతీర్మానానికి సిద్ధపడటం తెలిసిందే. సమావేశాలు జరగకుండా చేసి రాష్ట్రం చేజారిపోకుండా బీజేపీ చూసుకోగలిగింది కానీ, రాష్ట్రపతిపాలన విధించి కూడా పరిస్థితిలో పూర్తిమార్పు సాధించలేకపోయింది. బీరేన్ నిష్క్రమణ తరువాత మీతీల జోరు తగ్గి, కుకీ–జోలకు కాస్తంత నమ్మకం హెచ్చి గతంతో పోల్చితే హింస స్థాయి కాస్తంత తగ్గినమాట నిజం. కానీ, బీరేన్ నాటిన విషాలు, వైషమ్యాల ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా బయటపడని నేపథ్యంలో ఆయన మళ్ళీ తెరమీద చురుకుగా కనిపించడం ఏ మాత్రం మంచిదికాదు. రెండేళ్ళుగా మోదీ మణిపూర్‌మీద నోరువిప్పలేదు. అంతా సవ్యంగా ఉందని అమిత్‌షా భరోసా ఇస్తూంటారు కానీ, స్వల్ప విరామం తరువాత ఏదో ఒక చిన్నకారణంతో మణిపూర్ మళ్ళీ రాజుకుంటోంది. ప్రధాని స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు, సాధ్యమైనంత వేగంగా రాష్ట్రపతిపాలన ఎత్తివేసి, అన్ని జాతులు, తెగల సముచిత ప్రాతినిథ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగితే మార్పు కనిపించవచ్చు.
Updated Date - Jun 12 , 2025 | 06:02 AM