ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం మహానాడు
ABN, Publish Date - May 27 , 2025 | 01:20 AM
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రతియేటా మే 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు రాష్ట్ర పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ నిర్వహించడం ఆనవాయితీ. రాజకీయాలలో పలు సంచనాలకు చిరునామా అయిన ఎన్టీఆర్...
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రతియేటా మే 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు రాష్ట్ర పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ నిర్వహించడం ఆనవాయితీ. రాజకీయాలలో పలు సంచనాలకు చిరునామా అయిన ఎన్టీఆర్.. వివిధ పథకాలకు, కార్యక్రమాలకు వినూత్నమైన పేర్లు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచిన కోవలోనే పార్టీ ప్రతినిధుల మహాసభకు ‘మహానాడు’ అని నామకరణం చేశారు. తొలి మహానాడును 1982, సెప్టెంబర్‌లో నిర్వహించినా... పార్టీ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు 1983లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మే 27, 28, 29 తేదీలను ఖరారు చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయిస్తే.. దశాబ్దాలుగా ‘మహానాడు’ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పండగగా భావించే తెలుగుదేశం ‘మహానాడు’కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యున్నత కమిటీ ‘పోలిట్‌బ్యూరో’తో పాటు రాష్ట్ర, జిల్లాల కార్యవర్గం; అనుబంధ సంఘాల కార్యవర్గాలు, ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మూడు రోజులపాటు కొలువుతీరి వివిధ అంశాలపై చర్చిస్తుంది. ఏడాది కాలంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్ని సమీక్షిస్తుంది. ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, సాధించిన విజయాలు, వాటి లోటుపాట్లు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తుంది. పార్టీకి, ప్రభుత్వానికి దశ, దిశను నిర్దేశిస్తుంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామి చేయడం లక్ష్యంగా జరిగే ‘మహానాడు’లో పార్టీ శ్రేణుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం; ప్రజల ఆకాంక్షల మేరకు విధానాలను సవరించుకోవడం, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని ప్రజా సేవకు పునరంకితం కావడం లక్ష్యంగా మహానాడు సాగుతుంది.
పార్టీలో పారదర్శకత, పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయడం తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కనిపిస్తుంది. మహానాడు తొలిరోజున ఆ ఏడాదిలో దివంగతులైన పార్టీ నేతలకు నివాళులు అర్పించే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించడం ఓ విశేషం. ఇటువంటి ఆనవాయితీ చాలా రాజకీయ పార్టీలలో కన్పించదు. అదేవిధంగా ప్రతి రెండేళ్లకొకసారి ‘మహానాడు’లోనే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. మే 28న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించే తీర్మానం ప్రవేశపెడతారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశేషాలను, ప్రత్యేకించి ఆయన రాజకీయరంగ ప్రవేశం; యువత, మహిళలు, చదువుకొన్నవారు, బడుగు, బలహీన వర్గాలకు ఆయన అందించిన రాజకీయ ప్రోత్సాహం.. అధికారంలోకి వచ్చాక చరిత్రను తిరగరాసిన పథకాలు, కార్యక్రమాలు మొదలైన అంశాలతో వక్తల ప్రసంగాలు ఉంటాయి. మహానాడులో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ చరిత్రకు సంబంధించి.. 1982 నుంచి 1995 ఆగస్టు మాసం వరకు నందమూరి తారకరామారావు; 1995 సెప్టెంబర్ నుంచి నేటివరకు నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో పార్టీ సాగిస్తున్న ప్రస్థానంలో రాష్ట్ర, దేశ రాజకీయాలలో పోషించిన క్రియాశీల పాత్ర, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి; దేశ లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు బలోపేతం కావడానికి తొలుత ఎన్టీఆర్, తదుపరి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగించిన ఉద్యమాలు–పోరాటాలు, ఎదురైన సవాళ్లు, చేసిన త్యాగాలు మొదలైన కీలక అంశాల ప్రస్తావన ఉంటుంది. ఇక వర్తమాన రాజకీయాలకు సంబంధించి పార్టీ విధానాన్ని స్పష్టం చేస్తుంది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందకముందు నుంచీ తెలుగుదేశం పార్టీ దేశ, విదేశాంగ విధానం ఏ విధంగా ఉంటే దేశ ప్రయోజనాలు గరిష్టంగా నెరవేరుతాయో తెలియజేస్తూనే ఉంది. ఈసారి కూడా ఆ అంశాల ప్రస్తావన ఉంటుందని భావించివచ్చు. దేశంలో రెండో దశ సంస్కరణలను సాహసోపేతంగా ప్రవేశపెట్టి సంస్కరణల పట్ల ప్రజల్లో కలిగిన దురభిప్రాయాలను పారద్రోలి మిగతావారికి మార్గదర్శకంగా నిలిచిన చంద్రబాబు... విద్యుత్‌తో సహా ఇతర రంగాలలో సాధించిన విజయాలు, తన విజన్‌తో అందరికంటే ముందుగా ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల ప్రాధాన్యాన్ని గుర్తించి, వాటికి అందించిన ప్రోత్సాహం కారణంగా యువతకు అందివచ్చిన అవకాశాలు; విజన్ 2020, పేదరిక నిర్మూలనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొన్న వైనం, ప్రజల్ని సాధికారుల్ని చేయడానికి ప్రవేశపెట్టిన వివిధ పథకాల ప్రస్తావన ఉంటుందని చెప్పవచ్చు. 43 ఏళ్ల చరిత్రగల తెలుగుదేశం దాదాపు 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 1984 ఆగస్టులో ఎన్టీఆర్‌ను అక్రమంగా అధికారం నుంచి దింపినప్పుడు నెలరోజుల పాటు సాగించిన ప్రజాస్వామ్య పోరాటం, తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం ఓ ఉజ్జ్వల అధ్యాయం. అలాగే 1989–94, 2004–2014, 2019–24 మధ్య కాలంలో ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేసిన ఉద్యమాలు, నిరాహార దీక్షలు, అసెంబ్లీ వేదికగా నాటి ప్రభుత్వాల వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతుతో సాగించిన పోరాటాలు.. ఆ క్రమంలో ఎదుర్కొన్న అక్రమ కేసులు, అరెస్టులు.. ప్రతికూల పరిస్థితులలో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించిన తీరు అపూర్వం. ప్రాంతం, కులం, మతం వంటి సంకుచిత భావాలకు అతీతంగా తెలుగు ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని చంద్రబాబు కాంక్షించారు. అందుకోసం నిరంతరం కృషి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా, ద్వేషం వెళ్లగక్కినా సంయమనం పాటించారు. రాష్ట్ర విభజనలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కూడదని చెప్పారు.
అయితే ఇటీవల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సభలో మాట్లాడుతూ ‘‘చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా తెలంగాణ పదాన్ని వాడకుండా అసెంబ్లీలో నిషేధించారు’’ అని చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవం. చంద్రబాబు అనని మాటల్ని అన్నట్లుగా దుష్ప్రచారం చేయడం ఇది కొత్త కానప్పటికీ.. వాటిని తగిన రీతిలో ఖండించకపోతే అవే వాస్తవాలుగా స్థిరపడిపోతాయి. ఇటువంటి అంశాలను ఈ ‘మహానాడు’ స్పృశించి, వాస్తవాల్ని ప్రజలకు తెలియజెప్పాలి. రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాలు, 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టిన అమరావతి, పోలవరం తదితర కార్యక్రమాల్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసిందో చర్వితచరణం అయినా చెప్పకతప్పదు. ఐదేళ్ల ఆ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో నడవడం; వ్యవస్థలు కుప్పకూలడం; నాటి పాలకుల అవినీతి వల్ల ప్రజలపై పడిన ఆర్థికభారం, తదితర అంశాల ప్రస్తావన కూడా ఉంటుందని ఆశించవచ్చు. ఆ నేపథ్యంలోనే యువనేత నారా లోకేష్ చేపట్టిన నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర; దానికి లభించిన స్పందన, ఆ సమయంలోనే చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు, దరిమిలా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు, రాజకీయంగా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన, తదనంతరం బీజేపీ కలిసి రావడంతో ఎన్టీఏ కూటమి ఏర్పాటు కావడం తదితర అంశాలు ప్రస్తావనకు వస్తాయి. 2024 ఎన్నికలలో కూటమికి ప్రజలు అందించిన ఘనవిజయం, అధికారంలోకి వచ్చిన తదుపరి ఈ 11 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల ప్రస్తావనతోపాటు ప్రజా రాజధాని అమరావతి పునర్‌నిర్మాణం, ఆంధ్రుల కలల ప్రాజెక్టు పోలవరం తిరిగి పట్టాలెక్కడం.. వాటికి కేంద్రం అందించిన సాయం మొదలైన అంశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ మహానాడు విశాల వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన ‘విజన్ 2047’ లక్ష్యాల సాధనతో పాటు పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపునకు చేపట్టిన పి–4 పథకాన్ని విజయవంతం చేయాలన్న సందేశాన్ని బలంగా పంపించవచ్చు. పార్టీ సంస్థాగత విషయాలకొస్తే– ఈ మహానాడులోనే ప్రతిపాదిత మార్పులకు అనుగుణంగా తీర్మానం రూపొందించి ఆమోదిస్తారు. ఎప్పటికప్పుడు పార్టీలోకి కొత్త రక్తం రావాలని యువనేత నారా లోకేష్ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి ఇప్పటికే పార్టీ ఆమోదం తెలిపింది.
సీనియర్ల అనుభవాన్ని వదులుకోకుండానే పార్టీ పునర్‌నిర్మాణం చేయడం అసాధ్యమేమీ కాదు. తెలుగుదేశం పార్టీ మొదట్నుంచీ మూల సిద్ధాంతాలను మార్పు చేయకుండానే, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను, కాలానుగుణంగా వస్తున్న మార్పులను గమనంలోకి తీసుకొని తదనుగుణమైన మార్పుల్ని క్రమంగా చేసుకొంటూ ముందుకు సాగడం వల్లనే భారతదేశంలోనే.. క్యాడర్ బేస్‌డ్ (కార్యకర్తల పునాది) గల పార్టీగా పేరుపడింది. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణుల శక్తి సామర్థ్యాలను గరిష్టంగా ఉపయోగించుకొనేందుకు పార్టీ క్యాలెండర్‌ను ప్రకటించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ‘కడప మహానాడు’ తెలుగుదేశం పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం నింపుతుందని, రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆశించవచ్చు.
టి.డి. జనార్థన్, విక్రమ్ పూల
ఇవి కూడా చూడండి
నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి
Updated Date - May 27 , 2025 | 01:20 AM