Emesco Vijaykumar: మరలిపోయిన మనసు మాంత్రికుడు
ABN, Publish Date - Jul 02 , 2025 | 02:32 AM
ఆయన సినీ నటుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, కాని ఆయన్ని వినటానికి వందలాదిగా జనం వస్తారు. నిశ్శబ్దంగా వింటారు. కొందరయితే చిన్న పుస్తకం తెచ్చుకొని చెప్పినవి శ్రద్ధగా రాసుకుంటారు. ఆయనతో సంభాషించటానికి ఉవ్విళ్లూరుతారు.
ఆయన సినీ నటుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, కాని ఆయన్ని వినటానికి వందలాదిగా జనం వస్తారు. నిశ్శబ్దంగా వింటారు. కొందరయితే చిన్న పుస్తకం తెచ్చుకొని చెప్పినవి శ్రద్ధగా రాసుకుంటారు. ఆయనతో సంభాషించటానికి ఉవ్విళ్లూరుతారు. ఆయన మనసుతో మాట్లాడగలిగిన మనిషి, మనసు మర్మాన్ని తెలుసుకున్న మాంత్రికుడు. మాటలతో వైద్యం చేయగల డాక్టర్. ఆయనే బి.వి. పట్టాభిరామ్. సుమారు మూడు దశాబ్దాల పాటు ఇంద్రజాలికుడిగా, హిప్నాటిస్టుగా, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌గా, రచయితగా... తను పని చేసిన ప్రతి రంగం లోనూ అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి పట్టాభిరామ్. ఆయనతో నా ప్రయాణం సుమారు 30 ఏళ్లు. ఈ కాలంలో ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఆయనతో మాట్లాడేవాడిని. వివిధ సామాజిక అంశాల గురించి చర్చించేవాళ్లం. మొన్న ఆదివారం వాళ్ల అబ్బాయి, కోడలు, మనవరాళ్లు, భార్య జయగారితో గంటసేపు గడిపాం. ‘‘ఈరోజు ఆయన లేడు’’ అనేది నాకు వెలితిగా అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల కుటుంబాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగులో అత్యధిక పాఠకాదరణ కలిగిన రచయితగా సుమారు 25 ఏళ్లుగా ఆయన కొనసాగుతున్నారు. 2002 సెప్టెంబర్‌లో నేను, పట్టాభిరామ్ కలిసి ఢిల్లీ వెళ్ళాం. పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు ఉదయం అల్పాహారానికి పిలిచారు.
ఆయనతో చాలా సమయం సరదాగా గడిపాం. పీవీగారు చిన్న పిల్లాడిలా మ్యాజిక్‌లు చూస్తూ చప్పట్లు కొట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పట్టాభిరామ్‌ని పీవీగారు మ్యాజిక్ రహస్యాలు అడిగారు. ‘‘అయ్యా, ఇవీ రాజకీయల్లోలాగానే, వ్యూహం ముందే తెలిసిపోతే ఇంద్రజాలికుడు విఫలం అవుతాడు’’ అని నవ్వుతూ తప్పించుకున్నారు పట్టాభిరామ్. అలాంటిదే మరో సంఘటన: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పట్టాభిరామ్, నేను ఒకరోజు సాయంకాలం కాలక్షేపానికి కూర్చున్నాం. పట్టాభిరామ్ కొన్ని మ్యాజిక్‌లు చేశారు. మంగళంపల్లి, సిరివెన్నెల ఆ మ్యాజిక్‌ల వెనకాల లాజిక్ చెప్పమని పట్టుపట్టారు. దానికి పట్టాభిరామ్ చెప్పిన సమాధానం ఇప్పటికీ నాకు గుర్తుంది: ‘‘సంగీతం, సాహిత్యం మీకు ఎంత తెలిస్తే అంతగా ఎంజాయ్ చేస్తారు, మ్యాజిక్ మాత్రం మీకు ఎంత తెలియకపోతే అంత ఎంజాయ్ చేస్తారు’’ అని ఠక్కున సమాధానం చెప్పారు. అదే ఆయన సమయస్ఫూర్తి. మ్యాజిక్‌లో ఉండే సమయస్ఫూర్తిని--ఆయన కౌన్సిలింగ్‌లోనూ అద్భుతంగా ఉపయోగించేవారు. మా అమ్మాయి శారద సైకాలజీ కౌన్సిలర్. ఆయన దగ్గర కొంతకాలం శిక్షణ తీసుకుంది. తరువాత ఆయనతో కలిసి కొంత ప్రాక్టీస్ కూడా చేసింది. పట్టాభిరామ్ కౌన్సిలింగ్ శైలి సాంప్రదాయికమైంది కాదనీ, ఒక విలక్షణమైన ఆకర్షణ శక్తితో ఆయన తన మాటల్ని ఎదుటివాళ్ల మెదడులోకి జొప్పిస్తారనీ ఆమె చెప్పేది.
ఎమెస్కో ప్రచురించిన ‘మైండ్ మ్యాజిక్’ చరిత్ర సృష్టించినా, ‘కష్టపడి చదవొద్దు – ఇష్టపడి చదవండి’ లక్షలాది కాపీలు అమ్మినా, ఆయన రచించిన సుమారు 100 పుస్తకాలు ఎంతో విజయవంతమైనా దాని వెనకాల పట్టాభిరామ్ విలక్షణమైన ఆకర్షణ శక్తి ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణగారు, పట్టాభిరామ్, నేనూ ఒక సమావేశంలో కలిసాం. ‘‘అయ్యా అందరినీ ఇరుకునపెట్టే ప్రశ్నలతో ఇబ్బందిపెట్టే మీరు, పట్టాభిరామ్‌తో ‘ఓపెన్ హార్ట్’ కార్యక్రమంలో ఆయనకి ఒక్క ఇబ్బందికరమైన ప్రశ్నా వేయలేదు’’ అన్నాను నేను రాధాకృష్ణగారితో. దానికి సమాధానంగా రాధాకృష్ణగారు, ‘‘కొంతమందిని మనం ఇబ్బందిపెట్టకూడదు, వాళ్లను అలా ఉండనివ్వాలి,’’ అంటూ పట్టాభిరామ్ భుజం మీద చేయివేసి దగ్గరికి తీసుకున్న సంఘటన నాకు ఇంకా గుర్తుంది. పట్టాభిరామ్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే చిన్న సంఘటన ఒకటి ఇక్కడ పంచుకోవాలి. అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సుమారు 3000 మందికి పైగా విద్యార్థులు, 300 మందికి పైగా అధ్యాపకులు, సిబ్బంది పట్టాభిరామ్‌ని వినటానికి యూనివర్శిటీ కాన్వొకేషన్ హాల్‌లో గుమిగూడారు.
గంటసేపు ఆయన అనర్గళంగా ప్రసంగించారు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రశ్నలు వేసే సమయం ఆసన్నమైంది. ఒక విద్యార్థి లేచి ‘‘దేశభక్తి అంటే ఏమిటి?’’ అని అడిగాడు. ఆయన ఆ కుర్రాణ్ణి ముందు వరుసలోకి వచ్చి కూర్చోమని చెప్పారు. ‘‘అందరూ వెళ్లిపోయేదాక ఇక్కడే కూర్చో నీకు సమాధానం చెబుతాను’’ అన్నారు. సమావేశం ముగిసింది. ఆయన వేదిక దిగి ఆ కుర్రాడి దగ్గరకు వెళ్ళి, ‘‘బాబు, అందరూ వెళ్లిపోయారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం’’ అన్నారు. ‘‘సర్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి?’’ అని అడిగాడు ఆ కుర్రాడు. ‘‘సరే, బయటకు పోతున్నాంగా లైట్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేసి రా,’’ అంటూ బయటకు నడిచారు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆ కుర్రాడు అడిగాడు. అప్పుడు పట్టాభిరామ్ అన్నారు గదా: ‘‘ఇప్పుడు నువ్వు చేసిన పనే దేశభక్తి అంటే. అందరూ వెళ్లాక చివరికి వెళ్లేవాళ్లు గదిలో లైట్లు ఆర్పివేయటం, రోడ్డుమీద చెత్త పారేయకుండా ఉండటం, ఎక్కడన్నా నీరు వృథాగా పోతుంటే దాని గురించి పట్టించుకోవటం... ఇదే దేశభక్తి. దేశభక్తి అంటే మనం బాధ్యతగా ఉండటం’’. ఈ మాట చెప్పిన పట్టాభిరామ్ ఇప్పుడు తన బాధ్యతను పూర్తిచేసుకొని తనకున్న శక్తిమేరకు లక్షలాదిమందిలో స్ఫూర్తిని నింపి నిష్క్రమించారు. మన పట్ల, సమాజం పట్ల సానుకూల దృక్పథంతో ఉండటమే ఆయనకు మనం ఇచ్చే నివాళి.
- ‘ఎమెస్కో’ విజయ్‌కుమార్
Updated Date - Jul 02 , 2025 | 02:35 AM