ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

M R Srinivasan: అణుశక్తి పరిశోధనల పథనిర్దేశకుడు

ABN, Publish Date - May 30 , 2025 | 05:46 AM

ఎమ్.ఆర్. శ్రీనివాసన్ భారత అణు శక్తి పరిశోధనలో ప్రముఖ శాస్త్రవేత్తగా గరిష్ట సేవలు అందించారు. ఆయన భారతదేశపు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

టీవలే భారతదేశం ఇద్దరు అణు విజ్ఞానవేత్తలను కోల్పోయింది. వారిలో ఒకరు ఆర్‌. చిదంబరం కాగా, మరొకరు ఎమ్‌.ఆర్‌ శ్రీనివాసన్‌. మే 20న శ్రీనివాసన్‌ ఊటీలో కన్నుమూశారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ అయిదవ చైర్మన్‌గా శ్రీనివాసన్ సేవలు అనుపమానమైనవి. హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్, హెచ్.ఎన్. సేత్నా, రాజా రామన్న తర్వాత భారతదేశపు అణుశక్తి పరిశోధనలకు శ్రీనివాసన్ బాధ్యత వహించారు. వియన్నాలోని అంతర్జాతీయ సంస్థలోనూ సేవలందించారు. మనదేశంలో అణుశక్తి వాడకం సురక్షితమైనదని పబ్లిక్ డిబేట్ ప్రారంభించిన తొలి శాస్త్రవేత్త. ఎమ్.ఆర్.ఎస్.గా ప్రఖ్యాతులైన మాలూరు రామస్వామి శ్రీనివాసన్ 1952లో కెనడాలోని మ్యాగ్గిల్ యూనివర్సిటీలో చేరి ‘కంబషన్ ప్రాబ్లమ్స్ ఇన్ గ్యాస్ టర్బైన్స్’పై పరిశోధన చేశారు. 1954లో పీహెచ్‌డీ పట్టా పొందారు. 1955లో భారతదేశానికి తిరిగి వచ్చి పాతికేళ్ల వయసులో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా నేతృత్వంలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ’లో శాస్త్రవేత్తగా చేరారు. అప్పటికే నిర్మాణంలో ఉన్న భారతదేశపు తొలి అణు రియాక్టర్ ‘అప్సర’లో చురుకుగా పని చేశారు. 1959లో తొలి అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆసియాలో రష్యా తర్వాత మనదేశంలోనే అటామిక్ పవర్ స్టేషన్ విజయవంతంగా ప్రారంభమైంది.


దీనికి శ్రీనివాసన్ చేసిన కృషి చాలా ఉంది. అనంతర కాలంలో మద్రాసులో అటామిక్ పవర్ స్టేషన్ చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌గానూ శ్రీనివాసన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. 1974లో పవర్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ డివిజన్ డైరెక్టర్‌గానూ, 1984లో న్యూక్లియర్ పవర్ బోర్డ్ చైర్మన్‌గాను బాధ్యతలు స్వీకరించారు. 1987లో భారతదేశపు అటామిక్ ఎనర్జీ కమిషన్ అయిదవ చైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీగా, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్‌గానూ సేవలందించారు. శ్రీనివాసన్‌ హయాంలో తలపెట్టిన 18 న్యూక్లియర్ పవర్ యూనిట్స్‌లో ఏడు ప్రారంభం కాగా, మరో ఏడు నిర్మాణంలో, మిగిలిన నాలుగు ప్రణాళికల స్థాయిలోనూ ఉన్నాయి. 1990లో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత రెండేళ్ల పాటు వియన్నాలోని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సీనియర్ అడ్వైజర్‌గా కొనసాగారు. మనదేశంలో ఎనర్జీ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి 1996–98 మధ్యకాలంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. 2002–2004తో పాటు 2006–2008 కాలంలోనూ ‘నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్’ సభ్యులుగా ఉన్నారు. అలాగే కర్ణాటకలో ‘హయ్యర్ ఎడ్యుకేషన్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌’గా రెండేళ్లపాటు సేవలందించారు. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేటర్స్ వ్యవస్థాపక సభ్యుడైన శ్రీనివాసన్‌ను 1984లో పద్మశ్రీ, 2015లో పద్మవిభూషణ్ వరించాయి. పదవీ విరమణ అనంతరం ఆయన ఊటీలో స్థిరపడ్డారు. శ్రీనివాసన్ మొత్తం మూడు పుస్తకాలు రచించారు. వాటిలో ‘ఫిషన్ టు ఫ్యూషన్: ది స్టోరీ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్’ ప్రముఖమైనది. శ్రీనివాసన్ భార్య గీత. ఆమె ఇంటాక్ సంస్థ నీలగిరి చాప్టర్ కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. వీరికి శారద, రఘువీర్ సంతానం. భారత్‌, అమెరికాల మధ్య అణు ఒప్పందం జరిగినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. వాటికి మద్రాసులో ఆయన జవాబులు చెప్పిన తీరు నేటికీ ఎంతోమందికి గుర్తుండిపోయే అంశం. భారతదేశపు సంస్కృతీ సంప్రదాయాల మూలాలు తెలిసిన కర్మయోగి వంటి శాస్త్రవేత్త ఎమ్.ఆర్.శ్రీనివాసన్.

- ఎన్‌. హంసవర్ధిని

Updated Date - May 30 , 2025 | 05:47 AM