Mahanadu Significance: లోకేశ్‌కు పట్టం
ABN, Publish Date - Jun 01 , 2025 | 01:16 AM
తెలుగుదేశం పార్టీ 2025లో కడపలో నిర్వహించిన మహానాడు లోకేశ్ నాయకత్వాన్ని ధృవీకరించింది. లోకేశ్ తాత్కాలిక నూతన దశలో పార్టీలో పట్టు సాధించడంలో విజయవంతమయ్యారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నదన్నట్టుగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. జగన్‌రెడ్డి పాలనలో అనేక ఇబ్బందులు పడ్డ కార్యకర్తల్లో ప్రభుత్వంపై ఆశలు, ఆకాంక్షలు అధికంగా ఉన్నందున ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియా వేదికగా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడానికి సైతం తెలుగు తమ్ముళ్లు వెనుకాడలేదు. దీనికితోడు కొన్ని ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలుకాకపోవడంతో ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఏర్పడిందా? అన్న అనుమానం రాజకీయ పరిశీలకుల్లో కూడా ఏర్పడింది. ఇదంతా చూసి ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత మొదలైందని, నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారం తనదేనని జగన్‌రెడ్డి ఆశలు పెంచుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కడప మహానాడు రుజువు చేసింది.
రాజకీయ పార్టీలు సమావేశాలు జరుపుకోవడం కొత్త కాదు. అయితే తెలుగుదేశం పార్టీ నిర్వహించుకునే మహానాడుకు ప్రత్యేకత ఉంటుంది. అది ఒక పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు.. అదొక ఉద్విగ్నభరిత సన్నివేశం. తెలుగు ప్రజలతో విడదీయరాని బంధం కూడా. వేలాది మంది పార్టీ ప్రతినిధులతో క్రమం తప్పకుండా మహానాడును ఒక పండుగలా జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మహానాడు నిర్వహణను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా, లేకపోయినా మహానాడును క్రమశిక్షణతో నిర్వహించగలగడం ఆ పార్టీ ప్రత్యేకత. పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు గండిపేటలోని పార్టీ కార్యాలయం వద్ద మహానాడు నిర్వహించే వారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేది. పెళ్లిళ్లు, పేరంటాలకు హాజరైనట్టుగా పార్టీ ప్రతినిధులు ముస్తాబై ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ, విశాఖలో నిర్వహించిన మహానాడుకు జాతీయ నాయకులు హాజరయ్యారు. నాటి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు మహానాడు వేదికగా ఉండేది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం పార్టీ ప్రతినిధులకు ఒక అనుభూతిని మిగిల్చేది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ప్రస్తుత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కుడి భుజంగా వ్యవహరిస్తూ మహానాడు నిర్వహణలో కీలక పాత్ర పోషించేవారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మూడో తరం ప్రవేశించింది. కడపలో నిర్వహించిన మహానాడు బాధ్యతను మూడవ తరానికి చెందిన లోకేశ్ చేపట్టారు. ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ముగింపు రోజున నిర్వహించే బహిరంగ సభకు జనం భారీగా హాజరవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగా, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని, ప్రభుత్వంపై ప్రజల భరోసా సన్నగిల్లలేదని రుజువైంది. ప్రభుత్వం పట్ల సానుకూలత విషయం పక్కనపెడితే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నదన్నట్టుగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. జగన్‌రెడ్డి పాలనలో అనేక ఇబ్బందులు పడ్డ కార్యకర్తల్లో ప్రభుత్వంపై ఆశలు, ఆకాంక్షలు అధికంగా ఉన్నందున ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియా వేదికగా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడానికి సైతం తెలుగు తమ్ముళ్లు వెనుకాడలేదు. దీనికితోడు కొన్ని ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలుకాకపోవడంతో ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఏర్పడిందా? అన్న అనుమానం రాజకీయ పరిశీలకుల్లో కూడా ఏర్పడింది. ఇదంతా చూసి ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత మొదలైందని, నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారం తనదేనని జగన్‌రెడ్డి ఆశలు పెంచుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కడప మహానాడు రుజువు చేసింది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. అతి క్రియాశీలకంగా వ్యవహరించే కొద్ది మంది మాత్రం అతిగా వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతోంది. శాసనసభ్యులపై కార్యకర్తలకు కోపం ఉన్నప్పటికీ ఆ కోపం పార్టీ మీద కాదని రుజువైంది. కడప వంటి చోట మహానాడు నిర్వహించినా వసతులు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా వేలాది మంది కార్యకర్తలు తరలి రావడమే ఇందుకు నిదర్శనం. ముగింపు సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం హైలైట్. నిజానికి కడప జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేరు. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు మీద ప్రేమ తగ్గకపోయినా స్థానిక ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే మహానాడు విజయవంతం కావడానికి ఇవేమీ అడ్డు రాలేదు. ఇదే ఈ మహానాడు ప్రత్యేకత! ఈ మహానాడులో మరో మూడు నాలుగు ప్రత్యేకతలూ కనిపించాయి. కార్యకర్తల మనోభావాలను గుర్తించిన అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో కోవర్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత అప్పటి వరకు వైసీపీలో అధికారం చెలాయించి తమను ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు ఎమ్మెల్యేల చుట్టూ చేరి అధికారం చెలాయిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యేల పంచన చేరుతున్న కోవర్టుల కారణంగానే పల్నాడు జిల్లాలో ఇటీవల ఇద్దరు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వచ్చింది. ఈ కారణంగానే ఒక పథకం ప్రకారం పార్టీలో చేరుతున్న కోవర్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ శాసనసభ్యులను పరోక్షంగా హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించడానికి ఎటువంటి చర్యలు చేపడతారో చూడాలి. అదే సమయంలో ఎమ్మెల్యేలను కట్టడి చేయవలసిన అవసరాన్ని ఈ మహానాడు గుర్తుచేస్తోంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్‌రెడ్డి ఓడిపోవడానికి ఆయన మాత్రమే కారణం కాగా, ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంటూ ఏర్పడితే అందుకు శాసనసభ్యులే ప్రధాన కారణం కాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజల్లో భరోసా సన్నగిల్లలేదు కనుక ప్రజలు ప్రస్తుతానికి సర్దిచెప్పుకొంటున్నారు. ఈ దశలో ఎమ్మెల్యేలను కట్టడి చేయని పక్షంలో దాని ప్రభావం పార్టీపై పడుతుంది. ఈ అంశాన్ని వక్తలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించకపోయినా ఈ మహానాడు ద్వారా పార్టీకి అంతర్లీనంగా అందిన సందేశం ఇదే. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ప్రస్తుతానికి సానుకూలంగా ఉన్నారు. మిగతా నాలుగేళ్లు కూడా ఇదే సానుకూలత కొనసాగాలంటే పార్టీ నాయకత్వం కొన్ని విరుగుడు చర్యలు తీసుకోవాల్సిందే.
రాటుదేలిన లోకేశ్!
ఈ విషయం అలా ఉంచితే, ఈ మహానాడులో లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడవ తరం ప్రతినిధిగా పార్టీ బాధ్యతలు మోయగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించగలిగారు. మహానాడులో ప్రసంగించిన లోకేశ్‌ను నిశితంగా గమనిస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం కనిపించింది. గతంలో కొంత తొట్రుపాటు కనిపించేది. తెలుగు భాషపై అంతగా పట్టు కూడా ఉండేది కాదు. ఇటీవల ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లోకేశ్ కలుసుకోవడం, ప్రధాని వారితో రెండు గంటలపాటు గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్‌కు కొన్ని సూచనలు చేయడంతో పాటు ఆయనలో తాను గమనించిన మార్పు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మీలో పరిణతి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మీ ప్రసంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును నేను గమనించాను. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు ఆసువుగా ఉపన్యసిస్తున్నారు’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో చంద్రబాబు నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా లోకేశ్‌కు ప్రధాని సూచించారు. ప్రధాని పరిశీలన నిజమే. గతంతో పోలిస్తే లోకేశ్ ఇప్పుడు రాటుదేలారు. నిజం చెప్పాలంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉండవు. ఆయనకు అంతటి వాగ్ధాటి లేదు. 2019కి పూర్వం తెలుగులో మాట్లాడటానికి తొట్రుపడిన లోకేశ్, ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. లోకేశ్ భాష కూడా బాగా మెరుగైంది. అదే సమయంలో ఆయనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్ కూడా అందుకు అనుగుణంగా మారింది. సాధన వల్లనే ఇది సాధ్యమై ఉంటుంది. వర్తమాన రాజకీయాలలో లోకేశ్‌కు ఎదురైనన్ని అవమానాలు మరే ఇతర నాయకుడికీ ఎదురవలేదు. జగన్ అండ్ కో ఒక పథకం ప్రకారం లోకేశ్‌ను కించపరిచే విధంగా ప్రచారం చేశారు. పప్పు అని అవమానించారు. ఆయన భాషను హేళన చేశారు. చివరికి ఆయన పుట్టుకపై కూడా జుగుప్సాకరంగా మాట్లాడారు. మామూలుగా అయితే ఇన్ని అవమానాలు ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోతాం. అయితే లోకేశ్ వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కదిలారు. తానేమిటో రుజువు చేసుకోవడానికి అహరహం కృషి చేశారు. బాడీ షేమింగ్‌కు గురైనప్పటికీ బాధపడకుండా ఆహార నియంత్రణ పాటించడం ద్వారా విమర్శకుల నోళ్లు కట్టేశారు. రాజకీయాలలో నంబర్ 2గా ఉన్న వారిని టార్గెట్ చేసుకోవడం సహజం. ఎన్టీఆర్ ఉన్నప్పుడు నంబర్ 2గా ఉన్న చంద్రబాబును కూడా అప్పటి కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేశారు. ఆయనపై నిత్యం ఆరోపణలు చేసేవారు. చివరికి చర్మ సంబంధమైన సమస్య వచ్చి చికిత్స తీసుకున్నప్పుడు కూడా అవమానించారు. అయితే లోకేశ్‌కు ఎదురైనన్ని అవమానాలు చంద్రబాబుకు ఎదురవలేదు. తనపై వస్తున్న ఆరోపణలకు చంద్రబాబు వెరవకుండా కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా ఎన్టీఆర్‌కు వారసుడిగా నిలిచారు. 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు, ఆ తర్వాత సురక్షితమైన కుప్పం నియోజకవర్గానికి మారారు. లోకేశ్ అలా చేయలేదు. సంక్లిష్టమైన మంగళగిరి నుంచి మొట్టమొదటిసారి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఉండాల్సింది కాదు అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, మంగళగిరిలో 1983 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మూడు నాలుగు పర్యాయాలు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ లోకేశ్ మరో సురక్షిత నియోజకవర్గం వెతుక్కోకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా పట్టుదల ప్రదర్శించి గత ఎన్నికల్లో తాను ఓడిన మంగళగిరి నుంచే 91 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆయనలోని ధైర్యానికి, పట్టుదలకు ఇదొక నిదర్శనం. ఈ నేపథ్యంలో కడపలో జరిగిన మహానాడులో లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేశ్ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్లో కూడా లోకేశ్ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురైన చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడంలో లోకేశ్ పట్టుదలతో కృషి చేశారు. దీంతో ఆయనపై కార్యకర్తల్లో భరోసా ఏర్పడింది. ఇప్పుడు ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందడమే లోకేశ్ ముందున్న కర్తవ్యం. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం, అంటే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజామోదం పొందే ప్రయత్నాలను ఆయన ఇప్పటికే మొదలెట్టారు. పార్టీ వ్యవహారాల్లో ఆయనకు చంద్రబాబు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలను లోకేశ్‌కు పూర్తిగా ఎందుకు అప్పగించకూడదు అన్న ప్రతిపాదన కూడా అంతర్గతంగా చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నందున పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని లోకేశ్‌కు అప్పగిస్తే తప్పేమిటి? ఇవాళ కాకపోయినా రేపైనా తానే వారసుడు కదా? చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నప్పుడే పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయనకు అప్పగిస్తే నాయకత్వ మార్పిడి సాఫీగా జరిగిపోతుంది కదా? అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ప్రజామోదం ఉన్నంత వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మూడో తరం ప్రతినిధిగా లోకేశ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు అన్న అభిప్రాయం ఉంది. లోకేశ్‌కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టినా చంద్రబాబు నాయుడు నీడలోనే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ తదుపరి వారసుడిగా లోకేశ్‌ను ఇప్పుడే ప్రకటించాలని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నారు. అయితే చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఆయనను పక్కనబెట్టి నాయకత్వం చేపట్టానన్న అపప్రథ తనకు చుట్టుకోకూడదన్న అభిప్రాయంతో లోకేశ్ ఉన్నట్టు చెబుతున్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉన్నంత వరకు ఆయనను ధిక్కరించే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పదమూడేళ్లు మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగగా, చంద్రబాబు ముప్పై ఏళ్లకు మించి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ముప్పై ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తాను నిలబడటమే కాకుండా పార్టీని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యవేక్షణలో లోకేశ్ పార్టీ బాధ్యతలను చేపడితే ఇటు కార్యకర్తలు, అటు ప్రజలకు కూడా భరోసా ఏర్పడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుకు సంబంధం లేదు అన్న అభిప్రాయం కలగకుండా పార్టీ ప్రెసీడియం ఏర్పాటు చేసి దానికి ఆయనను చైర్మన్‌గా పెట్టుకోవచ్చునన్న అభిప్రాయం కూడా ఉంది.
అస్సలు తగ్గేదేలే..!
ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేశారో గానీ నాలుగు దశాబ్దాలు గడచినా ఆ పార్టీ చెక్కు చెదరలేదు. ఇప్పుడు పార్టీలోకి కొత్త తరం వచ్చింది. వారందరికీ పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. చంద్రబాబు నిన్నటి తరానికి చెందినవారు. లోకేశ్ ఈ తరానికి చెందినవారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు సాచివేత ధోరణి అవలంబిస్తారు. లోకేశ్ మాత్రం ఈ తరానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే సమయంలో సీనియర్లు, అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలను స్వీకరిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అనడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. 2029లో ఏ కారణం వల్లనైనా జగన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో లోకేశ్‌కు తెలుసు. అయినా తగ్గేదేలే అన్నట్టుగా ఆయన అడుగులు వేస్తున్నారు. లోకేశ్ చేతుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. చంద్రబాబు మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీని లోకేశ్ నడిపించడానికి నిజానికి ఇదే సరైన తరుణం. ఇప్పుడు పార్టీ బలంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రిపై ప్రజల్లో కోపం ఇంకా పోలేదు. నాయకత్వ మార్పిడికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుంది? తెలంగాణలో కేసీఆర్ కూడా పార్టీ నాయకత్వాన్ని కుమారుడు కేటీఆర్‌కు బదలాయించాలని అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమించారు. అయితే కేసీఆర్ నీడ నుంచి ఆయన బయటపడక ముందే ఎన్నికలు రావడం, పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యకర్తలతో సంబంధాలను పటిష్ఠం చేసుకోవడంలో కేటీఆర్ విఫలమయ్యారు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కనుక కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన సోదరి కవిత వ్యతిరేకిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో తాను పనిచేయనని ఆమె ప్రకటించారు. చంద్రబాబుకు ఈ సమస్య లేదు. లోకేశ్‌కు కూడా సోదరుడో, సోదరో ఉండి ఉంటే నాయకత్వం కోసం పోటీ పడేవారేమో? దివంగత రాజశేఖరరెడ్డి, కేసీఆర్ కుటుంబాలలో అన్నాచెల్లెళ్లు అధికారం కోసం పోటీ పడటాన్ని చూస్తున్నాం. చంద్రబాబుకు లోకేశ్ ఒక్కడే వారసుడు కనుక ఈ బెడద కూడా లేదు. కాలూ చేయీ సరిగ్గా ఉన్నప్పుడే అన్నీ చక్కదిద్దుకోవాలని అంటారు. చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ మానసికంగా, శారీరకంగా ఆయన దృఢంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కొత్త తరం నాయకుడిని అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. శషభిషలకు స్వస్తి చెప్పి లోకేశ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. తదుపరి ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడే పార్టీ బాధ్యతలను లోకేశ్ చేపడితే ఎన్నికల నాటికి మరింత రాటుదేలుతారు. లోటుపాట్లు ఏవైనా జరిగినా సరిదిద్దడానికి చంద్రబాబు ఉండనే ఉంటారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవారు విజయవంతమైన దాఖలాలు పెద్దగా లేవు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు ఈ విషయమే ప్రస్తావిస్తూ.. లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి ఇంతకు మించిన తరుణం ఏముంటుంది? అని ప్రశ్నించారు. శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే బాధ్యతను లోకేశ్ సమర్థవంతంగా నిర్వహించారు. శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ ఉండటం గమనార్హం. ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయినప్పటికీ లోకేశ్ తొట్రుపడకుండా ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో లోకేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు, ఆయనలో సరుకు ఉందని ప్రతిపక్ష ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి లోకేశ్ కూడా సుముఖంగా ఉన్నందున ఆయనకు ముందస్తు అభినందనలు చెబుదాం. 2029లో పార్టీ మళ్లీ విజయం సాధించాలంటే పార్టీపరంగా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలపై లోకేశ్ వెంటనే దృష్టి పెట్టాలి. చంద్రబాబులో మొహమాటం ఎక్కువ. లోకేశ్ అలా కాదని, కరాఖండీగా వ్యవహరిస్తారని అంటున్నారు. తండ్రిని మించిన తనయుడు అని రుజువు చేసుకోవాలన్న పట్టుదల కూడా ఆయనలో కనిపిస్తోంది. అన్నీ మంచి శకునములే అన్నట్టుగా పార్టీ నియమావళికి అనుగుణంగా నాయకత్వ మార్పిడికి చంద్రబాబు శ్రీకారం చుడతారా? లేదా? అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. పార్టీలో కట్టుతప్పుతున్న నాయకులను, శాసనసభ్యులను కట్టడి చేసే విషయంలో కూడా చంద్రబాబుకు మొహమాటం అడ్డు వస్తోంది. ఇది అంతిమంగా పార్టీకి నష్టం చేస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించడం అవసరం. మహానాడులో ఉపన్యాసాల ద్వారా లోకేశ్ ఇప్పటికే తండ్రి కంటే చాలా మెరుగు అని రుజువు చేసుకున్నారు. నాయకత్వం అప్పగిస్తే పార్టీలో క్రమశిక్షణను మరింతగా ఆయన పాదుగొల్పగలరని నాయకులు అంగీకరిస్తున్నారు. తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఢోకా ఉండదని లోకేశ్ ఇప్పటికే రుజువు చేసుకున్నారు. కడప మహానాడుతో ఈ విషయం రుజువైంది. కడప మహానాడు వేదికగా లోకేశ్‌కు నాయకత్వం అప్పగించే విషయం తెర మీదకు వచ్చింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తలబడుతున్న వైసీపీ అధినేత జగన్‌రెడ్డి సొంత జిల్లా కడప అయినందున మహానాడులోనే ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయమై ప్రకటన చేసి ఉంటే బాగుండేదని కూడా కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు లోకేశ్ మాత్రమే కనుక చంద్రబాబు కనుసన్నల్లోనే నాయకత్వ మార్పిడి జరగడం వాంఛనీయం అని తెలుగుదేశం శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి నాయకత్వ మార్పిడికి నిర్ణయం జరిగిపోయింది. ముహుర్తం ఖరారు కావడమే మిగిలి ఉంది. సో.. లోకేశ్‌కు ముందస్తు శుభాకాంక్షలు చెబుదాం!
Updated Date - Jun 01 , 2025 | 01:18 AM