Lightning Protection: పిడుగు నుంచి రైతులను రక్షించండి
ABN, Publish Date - Jun 18 , 2025 | 02:03 AM
వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులపై పిడుగులు పడడం, వారు తాము నమ్ముకున్న చేనులోనే పాణాలు వదలడం బాధాకరం. ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు విత్తుతున్న రైతులపై పిడుగుపడి ఇటీవల ఆరుగురు చనిపోయారు, పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు.
వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులపై పిడుగులు పడడం, వారు తాము నమ్ముకున్న చేనులోనే పాణాలు వదలడం బాధాకరం. ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు విత్తుతున్న రైతులపై పిడుగుపడి ఇటీవల ఆరుగురు చనిపోయారు, పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి హృదయ విదారక సంఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. విపత్తులను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. కానీ జాగరూకతతో వ్యవహరిస్తే భారీ ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు. సహజసిద్ధమైన వానలు దూరమైన తరువాత అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికంతటికీ కారణం మారిన వాతావరణ పరిస్థితులు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల మందికి పైగా పిడుగుపడి చనిపోతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల ఇపుడు వాన కంటే ముందే ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. దీంతో జనంతో పాటు గొర్రెలు, మేకలు, ఆవులు వంటి మూగజీవాలు పిడుగుపాటుకు బలైపోతున్నాయి. ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్న పిడుగుపాటు నుంచి పేద రైతాంగాన్ని కాపాడాలి. ఇందుకు ప్రభుత్వాలు శాస్త్ర, సాంకేతిక రంగాలను విరివిగా ఉపయోగించుకోవాలి. ప్రతి గ్రామంలోని చేలలో ‘లైట్నింగ్ కండక్టర్లు’ ఏర్పాటు చేయాలి. ఇవి పిడుగు పడినపుడు అధిక విద్యుదావేశం గ్రహించుకొని భూమిలోకి పంపిస్తాయి. ఇవి ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. పట్టణాలలో ప్రభుత్వ భవనాలపైన ఈ లైట్నింగ్ కండక్టర్లను విధిగా ఏర్పాటుచేస్తారు. మరి పల్లెలలో, వ్యవసాయ క్షేత్రాలలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? పిడుగు పడక ముందు తీసుకునే జాగ్రత్త చర్యలను ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి.
గ్రామీణాభివృద్ధికి వేల కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతాంగం ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ‘దామిని యాప్’ ద్వారా సేవలందిస్తోంది. అది ఎంతమందికి చేరుతున్నదో తెలియదు. వాతావరణ శాస్త్రవేత్తలు నలభై నిమిషాల ముందు ఎక్కడ పిడుగు పడుతుందో చెప్పవచ్చని అంటున్నారు. కాని ఖచ్చితత్వం మీద సందేహం కల్గుతోంది. ఇస్రో ‘ఎర్త్ నెట్‌వర్క్’ సహకారంతో ముందస్తు సమాచారం ద్వారా అధికారులను అప్రమత్తత చేస్తుంది. కాని అధికార యంత్రాంగం కదలడం లేదు. విపత్కర పరిస్థితులలో ప్రజలే తగిన రక్షణ చర్యలు తీసుకొని తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి.
– బి. వేణుగోపాల్‌రెడ్డి, ఆదిలాబాద్
Updated Date - Jun 18 , 2025 | 02:11 AM