Reviving Osmania Universitys Legacy: ఓయూ పునర్వైభవం కోసం కలిసి నడుద్దాం..
ABN, Publish Date - Aug 24 , 2025 | 01:02 AM
దేశంలో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు మొదలు ఎన్నో విశ్వవిద్యాలయాలు సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషించాయి..
దేశంలో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు మొదలు ఎన్నో విశ్వవిద్యాలయాలు సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషించాయి. 108 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయా రంగాల్లో అత్యంత క్రియాశీలక మేధావులను, నాయకత్వాన్ని అందించి ప్రపంచ చరిత్రలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా సామాన్యులు సైతం విద్య, పరిశోధనల్లో భాగస్వాములయ్యే అవకాశాలు దక్కాయి. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ఐటీ విప్లవంతో కూడిన ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడుకునే బాధ్యత మనందరిది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు ప్రఖ్యాతి కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం... ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయం నాయకత్వం వహించటమంటే.... ఈ నేల, ఈ గాలి, ఈ జ్ఞాన నిధికి వారసులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావటం. ఓయూ నుంచే ఎదిగిన ఓ ప్రపంచస్థాయి తత్వవేత్త పద ప్రయోగం చేసినట్లు... ఓయూ క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే, అంటే ఓయూతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైనా ప్రభుత్వ రంగ విద్యను కాపాడుకునే బాధ్యత ఉంది. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే చురుకైన, మేధోసంపత్తి కలిగిన విద్యార్థులకు ఆదెరువుగా ఉన్న ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల పురోగతి అనివార్యం. ఆధునిక ప్రపంచ గమనంలో ఏర్పాటైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల పోటీని ఎదుర్కొని నిలవాలంటే.... సమకాలీన స్థితిగతులకు అనుగుణంగా ఆలోచన, కార్యాచరణ మనదగ్గరుండాలి. ప్రభుత్వాలు సహా భాగస్వాములందరినీ కలుపుకుని ప్రైవేటుకు దీటుగా మన విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచీకరణ తర్వాత ప్రభుత్వరంగ విద్యకు అనేక పరిమితులు ఏర్పడ్డాయి. మారుమూల పల్లెల్లోనూ ప్రైవేటు విద్య అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్య పేదలకు అందకుండా పోయే ప్రమాదం సమీప భవిష్యత్తులోనే ఉంది. ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులోనూ ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలంటే.... ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలను కాపాడుకునేందుకు ఓ వ్యూహం, ఎత్తుగడ అవసరం.
విశ్వవిద్యాలయాలు మేధో చర్చకు నిలయాలుగా ఉండటం చరిత్ర నేర్పిన పాఠం. యూజీసీ నిబంధనావళి ప్రకారం విశ్వవిద్యాలయాల పరిశోధనల ఫలితాల ద్వారా ప్రభుత్వ పథకాలను రూపొందించుకోవాలని ఎన్నోసార్లు ఉద్ఘాటించారు. కనుక మన చర్చలన్నీ నిర్మాణాత్మకంగానే ఉండాలి. కానీ, కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ముందూ వెనకా ఆలోచించకుండా.... ఆవేశకావేశాలకు లోనుకావటం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాల దిశను మార్చలేము. ఈ సందర్భంలో తన సాహిత్యానికి నాలుగుసార్లు పులిట్జర్ బహుమతి పొందిన అమెరికన్ రచయిత రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పిన... ‘‘విద్య అంటే మీ కోపాన్ని లేదా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం కాదు, ఏదైనా వినయంతో వినగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం’’ అనే మాటలు గుర్తొస్తున్నాయి. రాజకీయ కారణాలు, వ్యక్తిగత అవసరాలతో చేసే నినాదాల పట్ల విద్యార్థులు, పరిశోధకులు అప్రమత్తంగా ఉండాలి. వాస్తవిక విషయాలను అర్థం చేసుకుని మసలుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరగాలి. గుడ్డిగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వాన్ని అడ్డుకోవడం, వ్యతిరేకంగా నినదించటం వల్ల జరిగే నష్టాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించడమంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని బహిష్కరించటం కాదు. తద్వారా జరగాల్సిన మేలు కన్నా కీడే ఎక్కువ. అయితే.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు వేరే పద్ధతులున్నాయి. రాజకీయంగా ఏవైనా భిన్నాభిప్రాయాలుంటే అందుకు వేరే వేదికలను వినియోగించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థకు దిక్సూచిగా, పెద్దన్నగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిస్థితి గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ప్రతి సందర్భంలోనూ ‘రాజకీయ నాయకత్వాన్ని అడ్డుకుంటాం, బహిష్కరిస్తాం’ లాంటి నినాదాలు గత పదేళ్లలో ఎక్కువగా విన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఉస్మానియా విశ్వవిద్యాలయం పట్ల సమాజంలో తప్పుడు అభిప్రాయాన్ని కల్గించే అవకాశం ఉంది. ఇది జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, న్యాక్ గుర్తింపుపై ప్రభావం చూపుతుంది. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో సీటు పొందాలంటే ఇప్పుడున్న ప్రమాణాల ప్రకారం మన దేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లను, న్యాక్ గుర్తింపులను ప్రమాణంగా తీసుకుంటారు. ఫలితంగా ఇక్కడ చదువుకునే తెలంగాణ భూమి పుత్రుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తిరిగి పునర్వైభవం తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజంపై ఉంది. వర్సిటీ పరిధిలో ఉన్న 730కి పైగా కళాశాలల్లో మూడున్నర లక్షల మంది విద్యార్థులు దాదాపు 175 విభిన్న కోర్సుల్లో విద్యాభాసం చేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తుకోసం అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఇందుకోసం విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఓ కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తూ ఓయూను అభివృద్ధి పథంలో నడిపించే పంథాను అనుసరించాలి. ఇప్పటికే పదమూడేళ్లుగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు లేక రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వ సహకారంతో అధిగమించాలి. ఏటికేడు ఆచార్యుల పదవీ విరమణలతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో క్రమేణా అధ్యాపకుల సంఖ్య ఐదో వంతుకు చేరింది. అవసరం మేరకు సదుపాయాలు లేక సమాజ సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొంత వెనకబడ్డా.. ఆధునిక పోటీని తట్టుకుని నిలబడగలిగాయి. క్లిష్ట పరిస్థితుల్లోనూ జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగుల్లో ఉస్మానియా తనదైన స్థాయిని దక్కించుకుంది. ఇక్కడి అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థుల కృషి, పట్టుదలే ఇందుకు కారణం. వారు పరిమిత వనరులతోనే పోటీ ప్రపంచాన్ని నెగ్గుకుంటూ అత్యుత్తమ ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు పచ్చజెండా ఊపటంతో పాటు అధ్యాపకుల పదవీవిరమణ వయస్సు 65 ఏళ్ళకు పెంచటం శుభపరిణామం. ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్క ఓయూకే రూ.542 కోట్ల బ్లాక్ గ్రాంట్‌తో పాటు మౌలికవసతుల కల్పనకు రూ.100 కోట్లు అదనంగా కేటాయించటం ద్వారా ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ విధానం స్పష్టమైంది. ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు విశ్వవిద్యాలయాల్లో పర్యటించటం ద్వారా మౌలికవసతుల కల్పనకు అవకాశం ఏర్పడింది.
ఏ దేశ అభివృద్ధి కొలమానమైనా ఆ దేశ విద్యావ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మెరుగైన, నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యావ్యవస్థ కలిగిన దేశాలు, ప్రాంతాలు సమగ్రాభివృద్ధిలోనూ ముందు వరుసలో ఉంటాయి. అందుకే రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం తపిస్తున్న ముఖ్యమంత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయ పర్యటనను స్వాగతిద్దాం. రానున్న కాలంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే బృహత్తర కార్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్నీ భాగస్వామ్యం చేద్దాం. ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా ఉన్నత విద్యలో నైపుణ్యాలను మెరుగుపరుద్దాం. పరిశోధనలను పరుగులు పెట్టిద్దాం. అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, నియామకాల బాధ్యతను ప్రభుత్వం ముందు ఉంచుదాం. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రపంచ యవనికపై ఎగరేద్దాం. ప్రపంచ ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ పబ్లిషర్ దివంగత మాల్కం ఫోర్బ్స్ చెప్పినట్లు.... ‘విద్య యొక్క ఉద్దేశ్యం ఖాళీ మనస్సును విశాల మేధస్సుతో భర్తీ చేయడం’.
-ప్రొఫెసర్ కుమార్ మొలుగరం వైస్ ఛాన్స్‌లర్,
ఉస్మానియా విశ్వవిద్యాలయం
Updated Date - Aug 24 , 2025 | 01:02 AM