US Wealth Inequality: కుబేరుల బిల్లు
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:38 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలల బిల్లు ఉభయసభల ఆమోదాన్నీ సాధించింది. సెనేట్‌లో ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక ఓటుతో గట్టెక్కిన ఒన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రతినిధుల సభలో నాలుగు అనుకూల ఓట్లు అదనంగా సాధించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలల బిల్లు ఉభయసభల ఆమోదాన్నీ సాధించింది. సెనేట్‌లో ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక ఓటుతో గట్టెక్కిన ‘ఒన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’, ప్రతినిధుల సభలో నాలుగు అనుకూల ఓట్లు అదనంగా సాధించింది. బిల్లును వ్యతిరేకిస్తూ హాకీం జెఫ్రీస్ లాంటివారు గంటలకొద్దీ ప్రసంగాలు దంచినా, అనవసరపు జాప్యం తప్ప, అంతిమంగా ట్రంప్ కోరుకున్నదే జరిగింది. ఏదో వ్యతిరేకించాలి కదా అన్నట్టుగా డెమోక్రాట్లు వ్యవహరించారే తప్ప, ఈ బిల్లు ఎంత వివక్షాపూరితమైనదో, ప్రజావ్యతిరేకమైనదో తెలియచెప్పే ప్రయత్నం వారు చేయలేదనీ, నిరసనలు ర్యాలీలతో ప్రజాక్షేత్రంలో ఆ పనిచేసివుంటే రిపబ్లికన్లమీద మరింత ఒత్తిడి పెరిగేదని సామ్యవాదులు సణుగుతున్నారు. పైకి శత్రువుల్లాగా కనిపిస్తారు తప్ప ధనికులకు మేలు చేకూర్చే విషయంలో ఈ రెండుపార్టీల మధ్యా పెద్ద తేడా కనిపించదు. అమెరికా భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయబోతున్న ఈ బిల్లులోని మంచిచెడులు, పేద, మధ్యతరగతికి ఒనగూరే అపారనష్టం ఇత్యాదివి వెనక్కుపోయి, పార్టీల పరంగానే ఓటింగ్ జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ ఇద్దరు తప్ప, బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తారనుకున్న కొందరు రిపబ్లికన్లు ఆఖరునిముషంలో ట్రంప్‌కే జై కొట్టారు. బిల్లు సెనేట్ ఆమోదం పొందిన తరువాత కూడా ఆరోగ్యపథకాల్లో కోతలు మరీ హెచ్చుగా ఉన్నాయంటూ అభ్యంతరాలు పెడుతూవచ్చినవారు కూడా ట్రంప్ ప్రత్యక్ష హెచ్చరికలకు, ఆయన అభిమానుల ఆన్‌లైన్ బెదిరింపులకు దిగిరాకతప్పలేదని మీడియా అంటోంది. ఓటింగ్‌కు ముందు ప్రతినిధుల సభ స్పీకర్ తన ప్రసంగంలో కమ్యూనిస్టులను తిట్టిపోసి, భగవంతుడిపట్ల విశ్వాసాన్ని గుర్తుచేసి తనవంతు పాత్ర ప్రశస్తంగా పోషించారు. ఒకప్పటి ఆప్తమిత్రుడు, తన విజయసారథి ఎలాన్ మస్క్‌నే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశంనుంచి గెంటేస్తానన్న ట్రంప్ తన పార్టీవారినంతా ఏకతాటిమీద నడిపించగలిగారు.
వెయ్యిపేజీల ఈ బిగ్ బిల్లును ఎంతమంది ప్రజాసేవకులు పూర్తిగా చదివారో తెలియదు కానీ, అమెరికా చరిత్రలోనే అంతపెద్ద బిల్లుమీద సంతకం చేస్తున్నందుకు ట్రంప్‌మాత్రం తెగముచ్చటపడిపోతున్నారు. అమెరికా పుట్టి 250సంవత్సరాలయిన సందర్భంలోనే ఈ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందడం శుభసూచకమని, ఇక దేశానికి తిరుగు ఉండదనీ, తన ఏలుబడిలో ఆర్థికంగా బలపడుతున్న అమెరికా ఇక రాకెట్‌లాగా దూసుకుపోతుందని చెప్పుకొస్తున్నారు. తాను తిరిగి అధికారంలోకి రావడానికి భూరి విరాళాలతో తనకూ పార్టీకీ సహకరించిన తోటికుబేరులను మూడు ట్రిలియన్ డాలర్ల పన్ను మినహాయింపులతో అతిభారీగా ఆదుకుంటున్నందుకు తెగమురిసిపోతున్నారు. అమెరికా సమాజంలో ఎగువ ఇరవైశాతంమీద తన ఈ ఖరీదైన ప్రేమకారణంగా దేశఖజానాకు వచ్చిపడిన లోటు పూడ్చడానికి అట్టడుగు ఇరవైశాతాన్ని శిక్షిస్తున్నాడాయన. వారికి అందాల్సిన వైద్యానికీ, ఆహారానికీ ట్రిలియన్ డాలర్ల కోతపెడుతున్నారు. ప్రవాసులు పంపే సొమ్ముమీద పన్ను విధించారు. ఒకపక్క స్వయంగా తానే యుద్ధాలు చేస్తూ, మరోపక్క నోబెల్‌శాంతి కోసం అర్రులు చాస్తున్న అమెరికా అధ్యక్షుడు ఈ బిల్లుద్వారా అదనంగా మూడువందల బిలియన్ డాలర్లు సమకూర్చుకొని, ఆయుధాలమీదా, అంతర్గత భద్రతను పరిరక్షించే పేరిట ఉద్యమాల అణచివేతమీదా ఖర్చుచేస్తారు. కూలిపనులు చేసుకోవడానికి వచ్చే వలస కార్మికులను అడ్డుకోవడానికీ, లోపలివారిని బయటకు గెంటేయడానికీ వాడతారు. ఈ ‘ఏలియన్స్’ ఏరివేతకు వీలుగా సమస్త వ్యవస్థలనూ ఆధునికీకరిస్తారు. కార్మికులకంటే, ఉద్యోగులకంటే కార్పొరేట్ సంస్థలు తక్కువ పన్ను చెల్లించే అమెరికాను చూడాలనుకుంటున్నారు ట్రంప్.
ఘనమైన అమెరికాను గతపాలకులు ముంచేశారని, విదేశాలతో సుంకాలయుద్ధాలనుంచి, స్వదేశంలో ఉద్యోగాల పీకివేతవరకూ తాను చేస్తున్నందంతా దేశాన్ని తిరిగి ఉన్నతంగా నిలబెట్టేందుకేనని ట్రంప్ చెప్పుకుంటారు. అమెరికా అప్పునీ, లోటునీ బూచిగా చూపి, ఖర్చు తగ్గించే పేరిట ఉపాధికీ, సంక్షేమానికీ ఎసరుపెడుతూ వచ్చారు. శుద్ధ దండుగ, వృధా అంటూ తనకు గిట్టని అనేక పథకాలు, కార్యక్రమాలు నిలిపివేసి, విదేశీసాయాలకు కోతవిధించాడు. ఎలాన్‌మస్క్‌ను అదేపనిమీద నియమించి, అనంతరం తనకు అడ్డుతగులుతున్నందుకు ఆయననూ గెంటేశారు. సంక్షేమానికి కోత విధించి, ధనికులకు మేతవేసి, రక్షణరంగ బడ్జెట్‌ను ట్రిలియన్ డాలర్లకు పెంచి, దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసే డర్టీ బిల్ ఇది.
Updated Date - Jul 05 , 2025 | 12:38 AM