ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kondapolam Novel: తెలుగు నేల దాటుతున్న కొండపొలం

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:54 AM

మేత దొరకని కాలంలో గొర్రెలను నెలా నెలన్నర పాటు నల్లమల అడవుల్లో మేపటానికి పోయే గొర్ల కాపర్ల జీవితం చుట్టూ అల్లిన నవల ‘కొండ పొలం’. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ఈ నవల 2019 ‘తానా’ నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని గెలుచుకుంది.

మేత దొరకని కాలంలో గొర్రెలను నెలా నెలన్నర పాటు నల్లమల అడవుల్లో మేపటానికి పోయే గొర్ల కాపర్ల జీవితం చుట్టూ అల్లిన నవల ‘కొండ పొలం’. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ఈ నవల 2019 ‘తానా’ నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని గెలుచుకుంది. 2021లో క్రిష్‌ దర్శకత్వంలో సినిమాగా కూడా వచ్చింది. ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘Bloomsbury’ ఈ నవలకు ఇంగ్లీష్‌ అనువాదాన్ని జూన్‌ 3న విడుదల చేసింది. ఈ సందర్భంగా నవలను అనువదించిన నరసింహ కుమార్‌ తో ‘వివిధ’ జరిపిన సంభాషణ ఇది:

‘కొండపొలం’ నవల అనువదించాలీ అని ఎందుకు అనిపించింది?

‘కొండ పొలం’ నవలకి మొట్ట మొదటి సమీక్ష, తెలుగులో కంటే ముందే, నేను ఇంగ్లీష్‌లో ఫేస్‌బుక్‌లో రాశాను. అందులో ఇంత గొప్ప నవల, అందులో వర్ణించబడిన జీవన విధానం, ప్రకృతి పట్ల వెలిబుచ్చిన భారతీయ జీవన దృక్పథం – ఇంకా ఎక్కువమందికి చేరాలంటే, ఆంగ్లంలోకి అనువదిస్తే బాగుంటుంది అని రాశాను. నా సమీక్షకు కృతఙ్ఞతలు తెలుపుతూ వెంకటరామి రెడ్డి గారు ‘ఆ పని మీరే ఎందుకు చేయకూడదు,’ అన్నారు. అలా ఈ అనువాదానికి బీజం పడింది.

మనిషి–ప్రకృతుల మధ్య సంఘర్షణ గురించి ఇతర భాషల్లో చాలా నవలలు వచ్చాయి. హెర్మన్‌ మెల్విల్ ‘మోబి–డిక్’, హెమ్మింగ్వే ‘ది ఓల్డ్ మాన్ అండ్ ద సీ’ లాంటి రచనల్లో మనిషి ప్రకృతితో యుద్ధం చేస్తాడు. ఈ రెండు నవలలు పాశ్చాత్య దృక్కోణానికి archetypes (మూల రూపాల) వంటివి. ఈ భూ ప్రపంచంలో మనిషే ఉత్తమ జీవి, మనిషి తన ఆధిపత్యం కోసం మిగిలిన జీవరాశులను ఎక్స్‌ప్లాయిట్‌ చేయడంలో ఏ తప్పూ లేదు – అన్న దృక్పథం యిది. ‘కొండ పొలం’ నవల ఇందుకు విరుద్ధంగా ప్రకృతి పట్ల భారతీయ తత్వచింతనను పరిచయం చేస్తుంది.

గొల్ల, యానాదుల దృక్కోణంలో చెప్పటంతో కథనానికి, వర్ణనలకు ఒక ప్రామాణికత అబ్బింది. నీటి వెతలు, చందనం దొంగల సమస్య, గ్రామాల్లో కుల రాజకీయాలు, ప్రజలు నమ్మే అవధూతలు, దేవతలు, దేవుళ్ళు, వన్యమృ గాలు, రకరకాల చెట్లు, ఔషధ మొక్కలు... ఒక్క మాటలో చెప్పాలంటే, మనకు ఎంతో దగ్గరగా ఉన్నా అస్సలు పరిచయంలేని ఒక జీవన శైలిని మనకు చేరువగా తీసుకువస్తుంది. ఒక కొత్త, మార్మిక లోకం లోకి తీసుకెళ్తుంది. కథా నాయకుని అద్భుతమైన క్యారెక్టర్ ఆర్క్ కనబడుతుంది. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలూ ఉన్నాయి. ఇలాంటి వివిధ పార్శ్వాల సార్వత్రిక విలువలు ఉన్న కథ తెలుగులో రావడం మన అదృష్టమైతే, దాన్ని వేరే భాషల్లోకి తీసుకువెళ్లడం మన బాధ్యత అని నేను భావిస్తాను.

స్థానీయ అంశాలు బాగా ఎక్కువ ఉన్న ఈ నవలను అనువదించటంలో ఎదురైన సవాళ్లు ఏమిటి?

ఈ నవల అనువదించటంలో ఎదురైన ముఖ్యమైన సవాలు– నల్లమల పరిసర ప్రాంతాల్లో వాడే జాతీయాలు, పలుకుబడులు, సామెతలు, culture specificity (సాంస్కృతిక విశిష్టత) ఉన్న పేర్లు (ఉదా: ఓబులం, కాశి నాయన) లాంటి వాటిని నాన్‌–తెలుగు పాఠకులకు అర్థమయ్యేలా, కానీ ఆంగ్లంలో కృతకంగా ఉండకుండా, అలాగే కథ, వర్ణన, పాత్రల ఆత్మ (soul)కి భంగం కలగకుండా చూసుకోవడం. బ్రౌణ్య నిఘంటువు, సూర్యరాయాంధ్ర నిఘం టువు ఉపయోగపడ్డాయి. నేను కడప జిల్లావాడిని కావడం, నంద్యాల, మహానంది, అహోబిలం, శ్రీశైలం ప్రాంతాలతో అనుబంధం ఉండడం కూడా పనికి వచ్చింది. అవసరమైనప్పుడల్లా, రచయితతో ఫోన్‌లో మాట్లాడగలగడం ఒక పెద్ద ఆసరా. ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఒక జీవ శాస్త్ర నిపుణునితో, ఒక తత్వవేత్తతో చర్చించినట్టు ఉండేది. కొన్ని విషయాల్లో ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర పుస్త కాలు గమనించి, ఆ పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసెస్) పాటించడానికి ప్రయత్నించాను. ఉదాహరణకి నల్లమల అడవుల్లో ప్రతి కొండకి, కోనకి, వాగుకి, వంకకి, పచ్చిక బయళ్ళకు, రాళ్ళగుట్టలకు, స్థానికంగా పేర్లు ఉంటాయి. ఆ పేర్లను కొన్ని చోట్ల అలాగే ఉంచడం, కొన్ని చోట్ల ఇంగ్లీషు లోకి అనువదించడం ద్వారా ఆ స్థానిక నామంలో ఉండే కవితాత్మకత పాఠకులకి తెలియబర్చడం చేశాను.

అంతర్జాతీయ పబ్లిషర్‌ ‘బ్లూమ్స్‌బరీ’ని మీ అనువాదంతో ఎలా అప్రోచ్‌ అయ్యారు?

నేను అనువాదం మొదలు పెట్టినప్పుడే, ఒక ప్రఖ్యాత పబ్లిషర్ అయితేనే ఈ నవల ఎక్కువమంది నాన్‌–తెలుగు పాఠకులకు చేరుతుంది కాబట్టి, ఆలస్యమైనా సరే ఆ దిశగానే ప్రయత్నం చేయాలని అనుకున్నాను. పబ్లిషింగ్ రంగంలోని ఒక మిత్రుని సలహా మేరకు ప్రపోజల్ తయారు చేసుకుని, ముందుగా ఒక బ్లూమ్స్‌బరీ ఎడిటర్‌ని ఫోన్ ద్వారా సంప్రదించి, తర్వాత నా ప్రపోజల్‌ పంపాను. కలిసి వచ్చిన విషయం ఏమంటే, బ్లూమ్స్‌బరీ వాళ్ళు భారతీయ భాషల్లో నుంచి మంచి పుస్తకాలు ఎన్నుకుని అనువాదం చేయించాలీ అన్న ఆలోచనలో ఉన్నప్పుడే, కాకతాళీయంగా నేను వారిని సంప్రదించాను. బ్లూమ్స్‌బరీ ఇండియా టీంలో చదివిన అందరికీ ఈ నవల నచ్చింది. కానీ, కాంట్రాక్టు బ్లూమ్స్‌బరీ యుకె సంస్థ చేతుల్లో ఉంటుంది, కాబట్టి అఫిషియల్‌గా నాకూ రెడ్డిగారికి ఆఫర్ ఇవ్వటానికి కొన్ని నెలలు పట్టింది. బ్లూమ్స్‌బరీ సంస్థ తెలుగు నుంచి ప్రచురిస్తున్న మొదటి నవల ఇదే. దీని వలన, ఇదే మార్గంలో మరిన్ని తెలుగు పుస్తకాలు కొత్త పాఠకులని ఏర్పర్చుకుంటాయని నా ఆశ.

ఎడిటింగ్‌ ప్రాసెస్‌ ఎలా జరిగింది?

ఫిక్షన్, ముఖ్యంగా నవలలకు ఎడిటింగ్ ప్రాసెస్ చాలా విస్తృతంగా వుంటుంది. బ్లూమ్స్‌బరీ సంస్థలో చీఫ్ ఫిక్షన్ ఎడిటర్ శివప్రియ మొదట మాన్యుస్క్రిప్ట్‌ మొత్తం చదివి, నోట్స్ పంపారు. ఈ మొదటి దశలో ముఖ్యంగా నవల స్ట్రక్చర్‌ గురించి చర్చించాం. నేను ఎక్కువ ఫుట్‌నోట్స్ వాడాను. వాటిని తీసేసి కథనంలో భాగంగా ఎలా కూర్చాలో ఎడిటర్‌ మంచి సలహాలు ఇచ్చారు. తరువాత దశలో, మొదట ఒక ఎడిటర్ మొత్తం నవలని ఎడిట్ చేస్తూ, ఒక్కోసారి రెండు మూడు అధ్యాయాల చొప్పున పంపించడం, నేను ఆ ఎడిట్స్‌ని ఒప్పుకోవడం, లేదా ఒప్పుకోకపోవడం, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా సమాధానాలు, సందేహాలకు క్లారిఫికేషన్స్ – ఇలా కొన్ని నెలలపాటు నడిచింది. ఈ ప్రక్రియ తరువాత ఇంకో ఎడిటర్ లైన్ బై లైన్ ఎడిట్స్ చేయగా, వారితో కలిసి నేను ఫైనలైజ్ చేశాను. శివప్రియ మళ్ళీ చివరిలో ఒకసారి, తానూ, తన టీం మెంబర్‌తో కలిసి ఇంకొక రివ్యూ చేసి, ఇంకొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక్కోసారి ఒక్క సామెత వారికి అర్థం అయ్యేలా చెప్పడానికి రెండు ఫోన్ కాల్స్ అవసరం అయ్యేవి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు నన్ను మరింత ఆలోచింపజేసి, నవలకి మంచి బిగువు వచ్చింది. ఈ క్రమంలో ముద్రణ ఆలస్యమైనా, పనిలో వారికి ఉన్న నిబద్ధత, ఓపిక, రచయిత పట్ల అనువాదకుల పట్ల వారు చూపించిన గౌరవం – ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఎడిటింగ్ ప్రాసెస్‌లో భాగంగా పబ్లిషర్‌ ఒక ముగ్గురు ప్రముఖ రచయితలకి ఇచ్చి అభిప్రాయం అడిగారు. వారిలో ఒకరు ‘గోట్ డేస్’ నవలా రచయిత బెన్యామిన్‌ (ఈ నవల తెలుగులో ‘మేక జీవితం’గా అనువాదమైంది). ముగ్గురు రచయితలూ పుస్తకానికి గొప్ప ప్రశంసలు ఇచ్చారు.

మీరు చేయాలనుకుంటున్న ఇతర ప్రాజెక్టులు ఏమిటి?

ప్రస్తుతం సన్నపురెడ్డి గారిదే ‘ఒంటరి’ నవల అనువాదం మొదలుపెట్టాను. దానితో పాటు, నాకు ఇష్టమైన అమెరికన్ రచయిత, నోబుల్ గ్రహీత సాల్ బెల్లో రాసిన ‘Seize the Day’ అన్న నవలికని తెలుగులో రాస్తున్నాను. ‘బోయ కొట్టములు పండ్రెండు’ అన్న ఒక చారిత్రక నవలని అనువదించాలని వుంది. ఇవన్నీ గాక నా సొంత కథల పుస్తకం తేవాలని ఉంది.

  • బాకీ తీర్చుకొంటున్నా!

నాకిది కొత్త అనుభూతి. కొండపొలం నవల మొదట్నించీ కొత్త కొత్త అనుభూతుల్ని అందిస్తూనే వుంది. దృశ్యాల్ని వాక్యాలుగా మార్చి పేజీల్లో పొదిగించి నవలగా తీర్చిన దాన్ని, తిరిగి దృశ్యాలుగా మార్చి సినిమాగా రూపాంతరం చెందించి పాఠకుల్ని ప్రేక్షకులుగా మార్చటం చూశాను. ఇప్పుడు మళ్లీ నేను చూసిన నవలల్లోని గొర్లకాపరుల జీవితాలకు సంబంధించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తం కావడాన్ని చూడబోతున్నాను. ‘మోబిడిక్’, ‘ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’ వంటి నవలల్లో ప్రకృతి మీద పైచేయి సాధించేందుకు మనిషి చేసిన యుద్ధాల్ని చూశాను. సోవియట్ రష్యా సాహిత్యంలో యుద్ధం కలిగించిన విధ్వంసాల నేపథ్యంలో అక్కడి ప్రజల బతుకు పోరాటాల్ని చూశాను. అమెరికన్ సాహిత్యంలోని నీగ్రోల బానిస సంకెళ్ళ చిటపటలు విన్నాను. మంగోలియా భూముల్లో శిరసెత్తిన ఆత్మాభిమానం జగజ్జేతగా జెండా ఎగరేయడం చదివాను. జపాన్ చైనా నేలల జెన్ తాత్విక జీవన విధానాన్ని చూశాను. ఇతర భాషల్లోంచి మన భాషలోకి అనువాదమై ప్రపంచపు నలుమూలల్లోని మట్టి వేదనల్లి మన చెవుల దాకా తెచ్చి వినిపించిన అనువాద సాహిత్యాన్ని చిన్నతనాన్నించి చదువుతూనే వున్నాను. వివిధ ప్రాంతాల్లో పుట్టిన సాహిత్యం నాకెంతో లోకజ్ఞానాన్ని ఇచ్చింది. అక్కడి రచయితల గొంతుకలు నాకు కొత్త చూపునిచ్చాయి. కొత్త ఆలోచనల్ని ఇచ్చాయి. కొత్త నైపుణ్యాలను ఇచ్చాయి. జీవిత కాలం పాటు ఆ ప్రాంతాలకూ, ఆ మనుషులకూ బాకీ పడ్డదాన్ని తిరిగి ఇవ్వటంలో భాగంగానే నా ‘కొండపొలం’ నవల ‘Tiger Lessons’గా ఆంగ్లానువాదమై తెలుగు నేలను దాటి ఇతర భాషా ప్రాంతాలకు వెళుతున్నదని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అనువాద మిత్రుడు నరసింహ కుమార్‌కూ, బ్లూమ్స్‌బరీ ప్రచురణ కర్తలకూ నా కృతజ్ఞతలు.

- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

Updated Date - Jun 09 , 2025 | 12:54 AM