ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: విలువలు కోల్పోతున్న కోల్‌కతా

ABN, Publish Date - Jul 02 , 2025 | 02:18 AM

బ్రిటిష్‌ సామ్రాజ్యంలో రెండో మహానగరంగా వర్థిల్లి నవ భారత జాగృతికి ఆలంబనగా నిలిచిన నాటి కలకత్తా నేడు కోల్‌కతాగా నవ జీవన నిర్మాణ సామర్థ్యాన్ని కోల్పోయి నాగరీక విలువలను నిర్వీర్యపరుస్తోంది.

బ్రిటిష్‌ సామ్రాజ్యంలో రెండో మహానగరంగా వర్థిల్లి నవ భారత జాగృతికి ఆలంబనగా నిలిచిన నాటి కలకత్తా నేడు కోల్‌కతాగా నవ జీవన నిర్మాణ సామర్థ్యాన్ని కోల్పోయి నాగరీక విలువలను నిర్వీర్యపరుస్తోంది. భారతావని మేధో, సాంస్కృతిక, ఆర్థిక హృదయంగా నీరాజనాలు అందుకున్న బెంగాల్‌ రాజధాని, రాజ్యాధినేత్రి మమతా బెనర్జీ రాజనీతిజ్ఞతకు, ప్రజాహితంలో పథ నిర్దేశకత్వానికి కాకుండా పాలనా అస్తవ్యస్తతకు పదే పదే వార్తల కెక్కుతోంది. ఇందులో తాజా ఘట్టమే దక్షిణ కోల్‌కతాలోని ఒక న్యాయకళాశాల ప్రాంగణంలో విద్యార్థినిపై పైశాచికత్వం, ఈ అమానుషాన్ని ఆసరాగా చేసుకున్న రాజకీయుల విశృంఖల స్వార్థ క్రీడలు. దక్షిణ కలకత్తా న్యాయ కళాశాలలో గత నెల 25న మొదటి సంవత్సరం విద్యార్థిని ఒకరిపై మూకుమ్మడి అత్యాచారం జరిగింది. కోల్‌కతా నగరమూ సమస్త బెంగాలీ సమాజమూ ఈ దురాగతానికి దిగ్భ్రాంతి చెందాయి. నగరంలోని ఆర్‌జీ కర్‌ వైద్యకళాశాలలో యువ డాక్టర్‌ ఒకరు అత్యాచారం, హత్యకు గురై ఏడాది కూడా కాకముందే న్యాయకళాశాలలో చోటు చేసుకున్న దురాగతం అందరినీ నివ్వెరపరిచింది. ఆగ్రహపరిచింది. ఆందోళనలకు పురిగొల్పింది. పాలక ప్రతిపక్షాలు యథావిధిగా తమ చాణక్యాలు ప్రదర్శిస్తున్నాయి. అందునా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణమిది. నిందితులు పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌తో సంబంధమున్న వారు కావడంతో ముఖ్యమంత్రి మమత రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బీజేపీ నిజనిర్ధారణ సంఘాన్ని పంపించింది.

బెంగాల్‌ కంచుకోటను జయించేందుకై ఈ ఘటనను పూర్తిగా ఉపయోగించుకునేందుకు ఆ పార్టీ అన్ని విధాల సమయాత్తమవుతోంది. మన సమాజంలో మహిళలపై హింసాకాండ వ్యవస్థాబద్ధమైనది. దీన్ని నివారించేందుకు చట్టాలు చాలా ఉన్నాయి. అయితే వాటిని అమలుపరచడంలో చిత్తశుద్ధి చూపుతున్నారా? ఈ బాధ్యతారాహిత్యం కారణంగానే చిన్నారులు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినవారు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. 2012లో సమస్త భారతీయులను కలవరపరిచిన నిర్భయ ఉదంతంతో అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చారు. చిత్రమేమిటంటే ఆ చట్టాలు వచ్చిన తరువాత అత్యాచారాల సంఖ్య మరింతగా పెరిగిపోయింది. శిక్షలకు గురవుతున్న సంబంధిత నేరస్తుల సంఖ్య మాత్రం ఎప్పటిలానే తక్కువగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతోంది? ఒక విద్యార్థిని మానహాని భయం లేకుండా విద్యాలయానికి వెళ్ల లేని పరిస్థితికి, ఒక గృహిణి వైద్యం నిమిత్తం నిర్భయంగా ఆసుపత్రికి వెళ్లలేని అగత్యానికి ఎవరు బాధ్యులు? పాలకులేనా? తప్పకుండా. అయితే సమాజానికి నైతిక బాధ్యత లేదూ? కోల్‌కతాలో దాదాపు ఏడాది క్రితం ఒక ప్రభుత్వాసుపత్రిలో సంభవించిన హత్యాచారం, ఇప్పుడు న్యాయకళాశాలలో చోటుచేసుకున్న దురాగతం రెండిటి వెనుక ప్రభుత్వ పాలనా వైఫల్యమూ, విశాల సమాజ నైతిక దౌర్బల్యమూ ఉన్నాయి. ఒప్పుకుని తీరాల్సిన కఠోర వాస్తవాలివి. ఒక మహిళ ప్రభుత్వాధినేతగా ఉన్న సమాజంలో ఈ ఘోరాలు పదే పదే జరగడమేమిటి? మహిళలు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా బజారులలో తిరగగలిగిన నాడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ అన్నారు.

అలా తిరగలేని దుస్థితిని కేవలం ఒక వర్తమాన పరిణామంగానే కాకుండా చారిత్రక కోణంలో కూడా వివేచించవలసి ఉన్నది. ‘భారతదేశంలో తొలి ఆధునిక మానవుడు’ రామమోహన్‌ రాయ్‌ నడయాడిన గడ్డ బెంగాలీ సమాజం. దారుణమైన సతీసహగమన దురాచారాన్ని రూపుమాపేందుకు ఫలవంతమైన కృషి చేసిన మానవతామూర్తి ఆయన. మహిళాభ్యుదయానికి విశేష దోహదం చేసిన రామమోహన్‌ రాయ్‌ స్ఫూర్తి కాలానుగుణంగా సమాజ జీవితంలో ప్రతిఫలిస్తుందా? బెంగాలీల అభిమాన ఆట ఫుట్‌బాల్‌ను నడి రాత్రి వీధుల్లో ఆడాలనే బెంగాలీ యువతుల కలలు కలలుగా మిగిలిపోని రోజులు వచ్చేనా? అటువంటి శుభదినాల రాకతో మాత్రమే బెంగాల్‌ జీవనవాహిని భ్రష్టత్వాన్ని వదిలించుకుని భవ్యత్వాన్ని సంతరించుకుంటుంది. అలా జరగాలన్నదే ప్రతి భారతీయుడి ఆకాంక్ష.

Updated Date - Jul 02 , 2025 | 02:19 AM