ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kerala Cargo Ship Sinking: సాగర విపత్తు

ABN, Publish Date - May 28 , 2025 | 06:10 AM

కేరళ తీరానికి సమీపంలో లైబీరియా కార్గోనౌక మునిగిపోవడంతో సముద్రంలో చమురు, రసాయనాల లీకేజీ కలుషిత ప్రభావాలు కలిగించాయి. ఈ ఘటనతో మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం ఏర్పడి, సముద్రజీవ రాశికి తీవ్ర ప్రమాదం ఏర్పడింది.

కేరళ సముద్రతీరానికి 38 నాటికల్‌ మైళ్ళదూరంలో, ఆరేబియా సముద్రంలో శనివారం ప్రమాదానికి గురైన లైబీరియా కార్గోనౌక క్రమంగా ఒరుగుతూ ఆదివారం పూర్తిగా మునిగిపోయింది. నౌకలోని వందలాది కంటైనర్లు సముద్రంలో పడిపోయి, చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీకవుతూండటమే కాక, పెద్దసంఖ్యలో కంటైనర్లు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. చేపలవేటను నిషేధించి, మత్స్యకారులను సముద్రంలోకి వెళ్ళకుండా ఆపగలిగినప్పటికీ, విస్తరిస్తోన్న చమురుతెట్టును కట్టడిచేయడం, విషపూరిత రసాయనాల‍ ప్రభావాన్ని ఉపశమింపచేయడం పెద్ద సవాలుగా మారింది. కేరళ రాష్ట్రప్రభుత్వం దేశ, విదేశీ నిపుణుల సాయంతో దుష్ర్పభావాలను అరికట్టాలని నిర్ణయం తీసుకుంది. నాలుగువందల యాభై మెట్రిక్‌ టన్నుల డీజిల్‌, ఫర్నెస్‌ ఆయిల్‌తో పాటు కాల్షియం కార్బైడ్‌ వంటి విషరసాయనాలను సైతం ఈ నౌక రవాణా చేస్తున్నందున పలురకాల ప్రమాదాలను, సమస్యలను కూడా నిపుణులు ఊహిస్తున్నారు. తీరప్రాంతవాసులకు ప్రమాద తీవ్రతను తెలియచేసి వివిధ తీరాలకు కొట్టుకువస్తున్న కంటైనర్లను తాకవద్దన్న హెచ్చరికలు కూడా అధికారులు చేశారు. తీరానికి వందలమీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధనను సైతం విధించారు. తీరరక్షకదళం, నావికాదళం కలగలసి ఈ కార్గోనౌకలోని 24మంది సిబ్బందినీ రక్షించడంతో పాటు, చమురుతెట్టు వ్యాప్తివేగాన్ని నియంత్రించేందుకు డోర్నియర్‌ విమానం ద్వారా ఆయిల్‌ స్పిల్‌ డిస్పర్సెంట్స్‌ వినియోగం కూడా వెంటనే జరిగింది. రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. చమురువ్యాప్తి, కంటైనర్లు కొట్టుకురావడం వంటి పరిణామాలపై రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటోంది. ఆశించినంత వేగంగా నియంత్రణ, నివారణ చర్యలు సాగకపోవడానికి కూడా రుతుపవనాలు కారణమవుతున్నాయి. టైర్‌–2 కేటగిరీ ప్రమాదం కాబట్టి, ఇటువంటి సందర్భాల్లో జాతీయస్థాయి సంస్థలు చేయాల్సినవన్నీ చేస్తున్నాయి. నియంత్రణ, ఉపశమన చర్యలతో కాలుష్యాన్ని ఎంతగా కట్టడి చేయగలిగినప్పటికీ, సముద్ర జలాల్లో కలిసిపోతూ, లోతుల్లోకి జారిపోతున్న విషాన్ని వడగట్టడం అసాధ్యమైన విషయం. రాబోయేరోజుల్లో సముద్రజీవులమీదా, పర్యావరణంమీద ఈ ఉపద్రవం ప్రభావం హెచ్చుగా ఉండేమాట నిజం.


మత్స్యకారుల జీవనోపాధికి కొంతకాలం ఆటంకం తప్పదు. ప్రమాదకర రసాయనాలు నీళ్ళలో కరిగి, చేపల్లోకి చేరతాయి కనుక, అనేక నెలలపాటు ప్రభావిత ప్రాంతాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. సముద్రజీవరాశికి ఈ కార్గోనౌక చేసిన అపారనష్టం అంచనాలకు అందనిది. అతి తక్కువ కాలుష్యంతో దేశంలో కేరళ బీచ్‌లకు మంచిపేరుంది, పర్యాటకానికి అవన్నీ పెట్టింది పేరు. ఆ జలాల్లో కాలుష్యం వ్యాప్తిని నివారించేందుకు, సాధ్యమైనంత అధికంగా శుద్ధి జరిపేందుకు మన నిపుణుల సలహాలూ సూచనలతో పాటు, అంతర్జాతీయ సంస్థల సాయం కూడా తీసుకోవాలి. ఇప్పుడున్న విధానాలన్నీ ఉపరితలంలోనే తప్ప, లోతైన శుద్ధి చేయలేవన్న వాదన ఉన్నప్పటికీ, ఖర్చుదారీపని అని వెనకాడకుండా పర్యావరణానికీ, జీవరాశికీ జరిగిన ఈ అన్యాయాన్ని చేతనైనంతమేరకు సరిదిద్దాల్సిందే. సముద్రజలాల్లో చమురు పారబోయడమే కాక, ప్రమాదకర రసాయనాలతో జలాలను విషపూరితం చేసి, సముద్ర, తీరప్రాంత జీవవైవిధ్యాన్ని ముప్పులో ముంచిన ఘటన ఇది. కొన్ని రకాల సముద్రజీవులకు సంతానోత్పత్తికి అనువైన కాలం కూడా ఇదే. అందువల్ల, అన్ని రకాల నష్టాన్ని నిర్దిష్టంగా గణించి, అంతర్జాతీయ చట్టాలకు లోబడి సదరు సంస్థనుంచి నష్టపరిహారాన్ని సాధించడం గురించి కూడా ఆలోచించాలి. సముద్రంలో వాతావరణ పరిస్థితులు తలకిందులైనప్పుడు, పరస్పరం ఢీకొన్నప్పుడు ఓడలు తిరగబడటం సహజం. సముద్రపునీరు లోపలకు చొరబడి ఈ కార్గోనౌక ఒరిగిపోవడానికీ, అంతిమంగా మునిగిపోవడానికీ ఏయే కారణాలు దోహదం చేశాయో నిర్ధారణ జరగాలి. దాదాపు ముప్పై సంవత్సరాలుగా తిరుగుతున్న ఈ ఓడ నిర్వహణ సక్రమంగా ఉన్నదా, అత్యంత ప్రమాదకర రసాయనాలతో భారీ సరుకురవాణాకు ఇది తగినదేనా? అన్నవి తేలాలి. శక్తిసామర్థ్యాలకు మించిన అదనపు బరువుతో అది ప్రయాణం చేసిందా అన్నదీ ముఖ్యమే. ప్రమాదాలు అకారణంగా ఏమీ జరగవు. కార్యకారణసంబంధాలను నిగ్గుతేల్చగలిగినప్పుడు, ఇటువంటి ఘటనలను కొంతమేరకైనా నివారించవచ్చు.

Updated Date - May 28 , 2025 | 06:11 AM