ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt Whip Adhi Srinivas: బీజేపీ విషకౌగిలిలో బీఆర్‌ఎస్‌...

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:59 AM

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రాజకీయాలు బలహీనపడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనం అవ్వనున్న చర్చలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ కుమార్తె కవిత ఈ విషయాన్ని బహిర్గతం చేసి రాజకీయ పరిణామాలను కుంభకోణం చేసింది.

రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు... ఆత్మ‌హ‌త్య‌లే అనే నానుడి ఉంది. నాయ‌కుల ప‌రంగానే కాదు, పార్టీల‌కూ అది వ‌ర్తిస్తుంది. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్ర‌య‌త్నాలు చేశారంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత ప్ర‌క‌ట‌న‌తో అది మ‌రోసారి రుజువ‌యింది. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌) మ‌నుగ‌డ‌ను కాపాడే స్థితిలో కేసీఆర్‌, ఆయన కొడుకు, అల్లుడు ఇక ఎంత‌మాత్రం లేర‌నేది క‌ళ్ల ముందు క‌న‌ప‌డుతున్న స‌త్యం. చేయి క‌లిపిన పార్టీల‌నే కాదు, సంక్షోభంలో ఉన్న పార్టీల‌ను క‌బ్జా చేయ‌డంలో బీజేపీకి ఉన్న ఘన చ‌రిత్ర‌ను చూస్తే బీఆర్ఎస్ క‌థ త్వ‌ర‌లోనే కంచికి చేరేట్లే క‌నిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగి, బీజేపీతో స్నేహం చేసి చివ‌ర‌కు క‌నుమ‌రుగైన పార్టీలు వివిధ రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకోవ‌డానికి నానా అగ‌చాట్లు ప‌డుతున్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.


భూమి పుత్రుల సిద్ధాంతంతో మ‌హారాష్ట్రలో ఆవిర్భ‌వించిన పార్టీ శివ‌సేన‌. మ‌రాఠా ఆత్మ‌గౌర‌వానికి ఒక‌ప్పుడు ప్ర‌తీక‌గా నిలిచిన పార్టీ. శివ‌సేనాధిప‌తి బాల్ ఠాక్రే ఇచ్చిన సీట్ల‌కు సంతృప్తిప‌డ‌డ‌మే త‌ప్ప, నోరు తెరిచి ఒక్క సీటు అద‌నంగా అడ‌గ‌లేని స్థితి బీజేపీది ఒకప్పుడు. కానీ ఠాక్రే మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుమారుడు ఉద్ధ‌వ్ ఠాక్రే ముఖ్య‌మంత్రి కావ‌డాన్ని బీజేపీ జీర్ణించుకోలేక‌పోయింది. ఒక‌నాడు త‌మ ఉనికికి, త‌మ విస్త‌ర‌ణ‌కు కార‌ణ‌మైన శివ‌సేనను ముక్క‌లు చేసింది. చీలిక వ‌ర్గం నేత‌ను కొద్ది రోజులు ముఖ్య‌మంత్రిని చేసి, త‌ర్వాత ఎన్నిక‌ల్లో ప‌క్క‌న ప‌డేసింది. ఇప్పుడు రెండు శివ‌సేన‌ల‌తో ఆ పార్టీల ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారిపోయింది. పంజాబ్ రాజ‌కీయాల్లో చోటే లేని బీజేపీని అక్కున చేర్చుకున్న పార్టీ శిరోమ‌ణి అకాలీద‌ళ్‌. ఒక‌నాడు అకాలీద‌ళ్ విదిల్చే రెండు, మూడు ఎంపీ సీట్ల‌తో సంతృప్తి చెందిన బీజేపీ, నెమ్మ‌దిగా ఆ పార్టీలో అంత‌ర్గ‌త త‌గాదాలు రాజేసి కావ‌ల్సినంత ల‌బ్ధి పొందింది. వందేళ్ల‌ పైబ‌డిన చ‌రిత్ర క‌లిగి, ద‌శాబ్దాల‌ పాటు పంజాబ్ రాజ‌కీయాల‌ను శాసించిన‌ అకాలీద‌ళ్, ఇప్పుడు పంజాబ్‌లో ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. బంగ్లాదేశ్‌ వ‌ల‌స‌దారుల‌కు వ్య‌తిరేకంగా అస్సాంలో ప్రారంభ‌మైన ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియ‌న్ (ఆసు) త‌ర్వాత కాలంలో ‘అస్సాం గ‌ణ ప‌రిష‌త్‌’గా ఆవిర్భ‌వించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలిసారిగా అధికారంలోకి వ‌చ్చిన ప్రాంతీయ పార్టీ. అస్సాంలో వేళ్లూనుకోవ‌డానికి ఏజీపీ చెంత‌న చేరిన బీజేపీ, క్ర‌మంగా ఆ పార్టీ శ్రేణుల‌ను, నాయ‌కుల‌ను చెంత‌న చేర్చుకొని, చివ‌ర‌కు ఆ పార్టీ ఉనికికే ఎస‌రు పెట్టింది. బీజేపీ కుటిల రాజ‌కీయాల‌కు ప్ర‌త్య‌క్ష ఉదాహర‌ణ‌ ఏజేపీ ప‌త‌నం. బీజేపీ విష కౌగిలిలో చిక్కిన ప్రాంతీయ పార్టీల ప‌రిస్థితికి ఈ మూడు చ‌క్క‌ని ఉదాహర‌ణ‌లు. ప్ర‌స్తుతం వాటి బాట‌లోనే బీఆర్ఎస్ ప‌య‌నం సాగుతోంది.


బీజేపీ, బీఆర్ఎస్‌ల స్నేహం ఈనాటిది కాదు. 2009లో ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్ పూర్వ‌రూపం), సీపీఐ, సీపీఎంలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డాయి. బీజేపీ ఒంట‌రిగా బ‌రిలో నిలిచింది. ఇక్క‌డ కాంగ్రెస్‌, బీజేపీని వ్య‌తిరేకించిన మ‌హాకూట‌మిలో నేత‌గా ఉన్న కేసీఆర్, రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసీ ముగియ‌గానే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జ‌రిగిన అద్వానీ స‌భ‌లో బీజేపీ వేదిక‌పై ప్ర‌త్య‌క్షం అయ్యారు. ఉక్కు మ‌నిషి అద్వానీ ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని, త‌మ పార్టీ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మి గెల‌వ‌డంతో కేసీఆర్ తోక‌ముడిచారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం కాంక్ష‌తో మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హించిన‌ప్పుడు కేసీఆర్‌, ఆ పార్టీ శ్రేణులు దూరంగానే ఉన్నాయి. సోనియాగాంధీ ఆశీస్సుల‌తో ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. నాటి నుంచి ప‌దేళ్ల పాటు బీజేపీ, బీఆర్ఎస్ ర‌హ‌స్య దోస్తీ కొన‌సాగింది. న‌రేంద్ర మోదీకి, తనకు మధ్య ఎంత బ‌ల‌మైన బంధం ఉందో ఎవ‌రికీ తెలియ‌దంటూ ఢిల్లీ వేదిక‌గా కేసీఆర్‌ మాట్లాడిన వీడియోలు ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో ఉన్నాయి.


2018 శాస‌న‌స‌భ ముంద‌స్తు ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మైన వేళ రాష్ట్రంలోని అయిదుగురు బీజేపీ శాస‌న‌స‌భ్యుల్లో న‌లుగురు (గోషామ‌హల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మిన‌హా) జి.కిష‌న్‌రెడ్డి, డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్, చింత‌ల రామ‌చంద్రారెడ్డి, ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. ప్ర‌భాక‌ర్... కేసీఆర్‌తో హ‌ఠాత్తుగా భేటీ అయ్యారు. త‌మ‌పై బ‌ల‌హీన అభ్య‌ర్థులను నిల‌పాల‌నే ఒప్పందాన్ని వారు కేసీఆర్‌తో చేసుకున్నార‌ని నాడు మీడియా కోడై కూసింది. వాజపేయీ విగ్ర‌హం, స్మృతిచిహ్నం ఏర్పాటు కోస‌మే కేసీఆర్‌ను క‌లిశామని నాడు బీజేఎల్పీ నేత‌గా ఉన్న డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు. అలాగే మూడు రైతు వ్య‌తిరేక బిల్లుల విష‌యంలోనూ లోక్‌స‌భ‌లో బీజేపీకి మ‌ద్ద‌తుగా బీఆర్ఎస్ ఎంపీలు నిలిచారు. ఆ బిల్లుల‌కు దేశ‌వ్యాప్తంగా ఉప్పెన‌లా వ్య‌తిరేక‌త రావ‌డంతో రాజ్య‌స‌భ‌లో ప్లేటు ఫిరాయించారు.


ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ అప్పుల‌కుప్ప‌లా మారింది. అన్ని రాజ‌కీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మొద‌లు గ్రామ స్థాయి స‌ర్పంచుల వ‌ర‌కు న‌యానోభ‌యానో లొంగ‌దీసుకొని బీఆర్ఎస్‌లో క‌లిపేసుకొని రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను కేసీఆర్ పూర్తిగా క‌లుషితం చేశారు. అంతులేని అక్ర‌మాలు, అవినీతిలో రూ.ల‌క్ష‌ల కోట్ల‌ను కేసీఆర్ కుటుంబం గ‌డించింది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ కుమార్తె ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో చిక్కుకొని జైలుపాల‌యింది. మ‌రోవైపు రాష్ట్రంలో అధికారం పోవ‌డం, వివిధ పార్టీల నుంచి వ‌చ్చినవారు త‌మ సొంత గూళ్ల‌కు చేర‌డంతో క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌డింది. ముంద‌స్తు ఒప్పందంలో భాగంగా త‌మ ఓట్ల‌ను బీజేపీకి మ‌ళ్లించ‌డంతో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ సున్నా సీట్ల‌కే ప‌రిమిత‌ మైంది. రాజ‌కీయంగా ప్రాబ‌ల్యం కోల్పోవ‌డం, కుమార్తె మ‌ద్యం కేసులో జైలుపాలు కావ‌డం, కాళేశ్వ‌రం అవినీతిలో తనతో పాటు అల్లుడు హ‌రీశ్‌రావు నిండా మునిగి ఉండ‌డం, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చిక్కుకోవ‌డంతో, కేసీఆర్ త‌న పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ విష‌యాన్నే క‌విత బ‌య‌ట‌పెట్టారు. బీఆర్ఎస్ విలీనానికి రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నాయ‌కులుగా చ‌లామ‌ణీ అవుతున్న కేసీఆర్ ర‌హ‌స్య మిత్రులు సైతం అండ‌దండ‌లు అందించ‌డంతో ఆ ప్ర‌క్రియ ముందుకు సాగింది. కానీ క‌విత ఒక్క‌ సారిగా ఆ విష‌యం బ‌య‌ట‌పెట్ట‌డం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాటిని నిర్ధారించ‌డంతో ఇప్పుడు రెండు పార్టీల నేత‌లు గుమ్మ‌డికాయ‌ల దొంగ‌ అంటే భుజాలు త‌డుముకున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకుంటారా, లేక కొన‌సాగిస్తారా అనేది పూర్తిగా ఆ పార్టీ అంత‌ర్గ‌త విష‌యం. అయితే త‌మ‌కూ బీజేపీకి ఉన్న ఒప్పందం ఏమిటి? విలీనం చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది? ఇరు పార్టీల నుంచి చ‌ర్చ‌ల్లో ఎవ‌రు పాల్గొన్నారు, విలీనం ఉందా లేక మిత్రప‌క్షాలుగా కొన‌సాగుతారా? త‌మ‌ది జాతీయ పార్టీ అని కేసీఆర్ ప్ర‌క‌టించారు కనుక పొత్తు తెలంగాణ వ‌ర‌కేనా లేక దేశ‌మంతా ఉంటుందా?... వీటిపై రాష్ట్ర ప్రజలకు ఇటు కేసీఆర్, అటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి స్ప‌ష్ట‌తనివ్వాలి.

-ఆది శ్రీ‌నివాస్‌ విప్‌,

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం

Updated Date - Jun 03 , 2025 | 12:59 AM