Peoples Poet: పోరుపాటల జలపాతం.. కలేకూరి
ABN, Publish Date - May 17 , 2025 | 03:44 AM
కలేకూరి ప్రసాద్ అనేది ఒక ప్రముఖ ప్రజాకవి, వీరనాయకుడిగా, ప్రజాసాహిత్యాన్ని పెంపొందించి, దళిత, బహుజన, ఆదివాసీ సమూహాలకు గళాన్ని అందించిన వ్యక్తి. ఆయన రచనల ద్వారా విప్లవోద్యమాలకు, ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రేరణ పొందినట్టుగా ఆయన జీవితం ప్రతిభ చూపించింది.
అరుదైన ప్రజాకవి కలేకూరి ప్రసాద్. వెలివాడలో రగిలే కన్నీటి మంటల నిప్పురవ్వలతో వర్తమాన సాహిత్యాన్ని వెలిగించి, అంటరాని బతుకుల్లో పిడికెడు ఆత్మగౌరవాన్ని ప్రసరించిన సాంస్కృతిక సమరయోధుడు ఆయన. ‘‘నేను జనసమూహాల గాయాన్ని/ గాయాల సమూహాన్ని’’ అంటూ తన సృజన నైజాన్ని ప్రకటించి దళిత, బహుజన, ఆదివాసీ సమూహాల గాయాలకు గొంతునిచ్చి మూడు దశాబ్దాల పాటు పీడిత ప్రజావాణిని వినిపించిన కవన పిల్లనగ్రోవి కలేకూరి. అందుకే గాయాలనే స్వర మాతృకలుగా మార్చుకొని విప్లవ, దళితోద్యమాల దారిలో పెను చేతనా ప్రవాహమై, పోరుపాటల జలపాతమై ప్రతిధ్వనించాడు. అధికార పీఠాలకు, అధినాయకత్వానికి శాశ్వత ప్రతిపక్షంగా రచయిత వ్యవహరించాలని చెప్పిన కలేకూరి, అత్యంత ప్రభావశీలమైన, స్ఫూర్తివంతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. పాత్రికేయునిగా, కవిగా, విమర్శకునిగా, అనువాదకునిగా కలేకూరి నిశితమైన దార్శనిక దృష్టితో ఈనాటి అస్తిత్వ ఉద్యమాల విస్తృతికి, తదనుగుణమైన సాహిత్యపరిపుష్టికి ‘పెన్నుదన్ను’గా నిలిచాడు. యువక, శబరి, నవత, కవన తదితర కలం పేర్లతో ప్రసిద్ధమైన కలేకూరి దేవవర ప్రసాద్... లలితా సరోజినీ, శ్రీనివాసరావు దంపతులకు 1962 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించాడు. డిగ్రీ చదువుతున్నప్పుడే రాడికల్ విద్యార్థి సంఘ రాజకీయాల వైపు ఆకర్షితుడై కొంతకాలం ప్రజాయుద్ధ తీరాల్లో సంచరించాడు. విప్లవోద్యమ కార్యకలాపాలకు అరుణోత్తేజంతో అంకితమయ్యాడు.
కారంచేడు, చుండూరు సంఘటనల నేపథ్యంలో కలేకూరి ప్రస్థానం గుణాత్మకమైన మలుపు తిరిగింది. ‘దళిత మహాసభ’ రగిలించిన ఆత్మగౌరవ పోరాటాన్ని అందిపుచ్చుకొని అణగారిన జీవితపు సన్నని సందుల్లోకి చొచ్చుకొని పోయాడు. త్వరత్వరగా రాయాల్సింది రాసి, సత్వరం చేయాల్సింది చేసి 2013, మే 17న సెలవంటూ వెళ్లిపోయాడు. విప్లవోద్యమ నేపథ్యం, విప్లవ సాహిత్యభావజాల వెలుగుల్లో కలేకూరి ప్రజాసాహిత్యం దిశగా చూపు సారించాడు. ‘యువక’ పేరుతో ఆయన రాసిన పాటలు అనేక ప్రజాస్వామ్య పోరాటాలకు సాంస్కృతిక సామర్థ్యాన్ని అందించాయి. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!’, ‘భూమికి పచ్చని రంగేసినట్టు’, ‘కుమిలిపోయినా నలిగిపోయినా’, ‘పల్లెపల్లెనా దళిత కోయిల’, ‘దళితాకాశపు ధృవతార’ లాంటి హృద్యమైన పాటల ద్వారా కలేకూరి సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేశాడు. కారంచేడు మారణకాండ నేపథ్యంలో తన మిత్రులతో కలిసి కలేకూరి రాసిన ఒగ్గుకథ ఈ ఉద్యమానికి ఎంతో ఉత్తేజాన్ని అందించింది. ‘పిడికెడు ఆత్మగౌరవం’ నుండి ‘అతడొక నిబద్ధ వజ్రాక్షరం’ వరకు కలేకూరి రాసిన కవితలు ఉన్నతమైనవి. అనువాదకునిగా ప్రసాద్ చారిత్రాత్మకమైన కృషి చేశాడు. అపారమైన భాషా పాండిత్యంతో, మేధోశక్తితో అనేక గ్రంథాలు తెలుగులోకి తర్జుమా చేసి అనువాదకునిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. మాదిగ దండోరా ఉద్యమానికి సంఘీభావం తెలియజేసి, నాయకుల్లోని మాల వ్యతిరేక ధోరణుల్ని నిర్మొహమాటంగా విమర్శించాడు. ‘నీది ధర్మపోరాటం/ నీ రణక్షేత్రానికి నా శ్వాస కాపలాగా పెడుతున్నానని’ తెలంగాణ ప్రజల చేతిలో చేయి వేసి బాస చేశాడు. ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన రాజకీయ, సాంస్కృతిక ఉద్యమం నిర్మించాలని కలేకూరి కన్న కలని సాకారం చేయాల్సిన అవసరమెంతైనా ఉంది.
– డాక్టర్ కోయి కోటేశ్వరరావు
(నేడు కలేకూరి ప్రసాద్ వర్ధంతి)
Updated Date - May 17 , 2025 | 03:46 AM