ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Constitutional Conscience: సైద్ధాంతిక పోరులో న్యాయకోవిదుడు

ABN, Publish Date - Aug 20 , 2025 | 05:56 AM

గోవా తొలి లోకాయుక్తగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని నియమించాలనుకుంటున్నాను..

గోవా తొలి లోకాయుక్తగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని నియమించాలనుకుంటున్నాను’ అని 2013లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ అధికారులకు, పాలక పార్టీ నేతలకు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ‘అదేమిటి సార్, ఆయన ఆలోచనా విధానానికీ మన ఆలోచనా విధానానికీ ఏ మాత్రం సరిపడదు. ఆయన బీజేపీ భావజాలం అంటే ఇష్టపడరు. పైగా స్వతంత్రంగా ఆలోచిస్తారు’ అని పార్టీ నేత ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘లోకాయుక్త పదవిలో అలా స్వతంత్రంగా ఆలోచించేవారే కావాలి. నిక్కచ్చిగా, నిజాయితీగా వ్యవహరించేవారే ఆ పదవిని సరిగా నిర్వహించగలరు. అలాంటి పదవుల్లో ఉన్నవారు సిద్ధాంతాలకు అతీతంగా ఉండాలి. నేను ఎంతో మంది న్యాయమూర్తుల పేర్లను, వారి నేపథ్యాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను’ అని మనోహర్ పరిక్కర్ జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఫోన్ చేశారు. ‘మిమ్మల్ని లోకాయుక్తగా నియమించాలనుకుటున్నాను. దయచేసి ఆ పదవి స్వీకరించండి’ అని అభ్యర్థించారు. తన ఆలోచనా విధానం వేరని, తాను స్వతంత్రంగా వ్యవహరిస్తానని సుదర్శన్‌రెడ్డి చెప్పినా పరిక్కర్ వినలేదు. ‘అవన్నీ నాకు తెలుసు..’ అని ఆయన చెప్పారు. దీనితో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గోవా లోకాయుక్త చట్టం ప్రతినొకదాన్ని తెప్పించుకుని అధ్యయనం చేశారు. అందులో ఎన్నో లోపాలున్నాయని, ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం ముఖ్యమంత్రిని విచారించే అధికారం లోకాయుక్తకు లేదని తెలుసుకున్నారు. ఆ చట్టాన్ని సవరిస్తేనే లోకాయుక్త పదవిని ఆమోదిస్తానని చెప్పారు. అందుకు పరిక్కర్ ఆమోదించడమే కాక ముఖ్యమంత్రిని కూడా దాని పరిధిలో చేర్చడంతో ఇక కాదనలేక జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆ పదవిని స్వీకరించారు. తన సిబ్బందిని తానే నియమించుకుంటానని చెప్పినా పరిక్కర్ అంగీకరించారు. లోకాయుక్త పదవి స్వీకరించిన తర్వాత ఆయన మొదట మనోహర్ పరిక్కర్‌పై వచ్చిన ఆరోపణలనే విచారణకు స్వీకరించి సీఎంను తన కార్యాలయానికి పిలిపించారు. పరిక్కర్ ఏ మాత్రం సంకోచించకుండా ఎటువంటి మందీ మార్బలం లేకుండా వచ్చి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల లోకాయుక్త పదవిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎక్కువ కాలం ఉండలేదు. అయితే తాము నియమించిన వారందరూ తమకు జీ హుజూర్‌గా ఉండాలని భావించే నేటి రాజకీయ నాయకుల్లో ఎందరు మనోహర్ పరిక్కర్ లాగా ఉంటారు? ఎందరు జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి లాగా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు?

ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించింది. ఇవాళ ఒక చారిత్రక నేపథ్యంలో జరుగుతున్న ఎన్నిక ఇది. కొద్ది రోజుల క్రితం వరకు ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ దన్‌ఖడ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజీనామా చేశారు. ఈ హఠాత్పరిణామం, ఇప్పటి వరకూ ఒక రాజ్యాంగ హోదాగా భావిస్తున్న ఉప రాష్ట్రపతి పదవి విలువపై చర్చకు దారితీసింది. మరో రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ పనితీరుపై దాదాపు నెలరోజులుగా వర్షాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. ప్రజల ఓట్లనే కొల్లగొడుతున్నారంటూ ప్రతిపక్షాలు వీధి ఆందోళనలకు దిగాయి. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీకి నిలబెట్టేందుకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసింది. అయితే నెగ్గుకు రాగలదని చెప్పలేం. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఈ పోటీని సంకేతాత్మక సైద్ధాంతిక పోరుగా మార్చేందుకు, తమ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని ఆ కూటమి నేతలు భావిస్తున్నట్లు కనపడుతోంది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గతంలో ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా బాటలో నడిచిన న్యాయకోవిదుడు. గోలక్‌నాథ్ కేసులో అప్పటి సీజే కోకా సుబ్బారావుకు బాసటగా నిలిచి ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించడానికి వీల్లేదని జస్టిస్ హిదయతుల్లా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించినా సరే, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కుదించే హక్కు దానికి లేదని, ఎందుకంటే పార్లమెంటు కూడా రాజ్యాంగం ప్రకారం ఏర్పడినదేనని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా. ఆయన నిర్వహించిన ఉపరాష్ట్రపతి పదవికి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని పోటీ చేయించేందుకు ఇండియా కూటమి నిర్ణయించడం విశేషం.

ఎందుకంటే సుదర్శన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న నాలుగున్నరేళ్ల కాలంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలు చాలా వాటిని తప్పుపట్టారు. ‘సహజవాయువు ప్రజలకు చెందుతుంది. దాన్ని వెలికితీసే కాంట్రాక్టర్ రిలయన్స్ కావచ్చు కాని దాని ధర ప్రభుత్వం నిర్ణయించాల్సిందే’నని విస్పష్టంగా తీర్పు చెప్పిన బెంచ్‌లో ఆయన ఉన్నారు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి రప్పించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక నేరస్థులపై ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. వారిపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను నియమించాలని ఆదేశించారు. ‘ద కేసెస్ దట్ ఇండియా ఫర్ గాట్’ (భారతదేశం మరిచిపోయిన కేసులు) అన్న పుస్తకంలో ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు చింతన్ చంద్రచూడ్ ప్రస్తావించిన పది ముఖ్యమైన తీర్పుల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు కూడా ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లను ఆదివాసీలతోనే తుదముట్టించేందుకు ఏర్పర్చిన సల్వాజుడుంను రాజ్యాంగ వ్యతిరేకమని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సంచలన తీర్పు ఇచ్చారు. సామాన్యులను, ముఖ్యంగా చదువు రాని అమాయక ఆదివాసీ యువతను హింసాకాండకు పాల్పడేందుకు ప్రోత్సహించకూడదని, ఇలాంటి అనైతిక మార్గాలను రాజ్యాంగ విలువలు అనుమతించబోవని ఆయన విస్పష్టీకరించారు. నిజానికి పీయూసీఎల్ లాంటి పౌర హక్కుల సంస్థలో ఉన్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఈ కేసును విచారించకూడదని ఒక అజ్ఞాత లేఖ వచ్చినప్పటికీ ఇరు పక్షాల న్యాయవాదులు ఆయన ఈ కేసును విచారించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించడం విశేషం. 45వ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు ఏడు ప్రతిపక్షాలు సమర్పించిన పిటిషన్‌పై రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న నాటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకునేముందు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి న్యాయసలహాను తీసుకున్నారు. ఇప్పుడు అదే ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్‌రెడ్డి పోటీలో ఉండడం యాదృచ్ఛికం.

జగదీప్ దన్‌ఖడ్ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంపిక చేయడంలో ఆశ్చర్యం లేదు. మామూలుగా ఆయితే వాజపేయి – అడ్వాణీ తరానికి చెందిన వారందరినీ తప్పించి తన టీమ్ వ్యక్తిని నియమించుకోవడం మోదీకి పరిపాటి. అయితే ఇటీవలి కాలంలో కీలకమైన పదవుల్లో ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్నవారిని నియమించి ఆ సంస్థను సంతృప్తిపరిచే ప్రయత్నాలను మోదీ చేయడం మారుతున్న పరిస్థితులకు నిదర్శనం. ‘బీజేపీకి ఆ అండదండలు అవసరం లేదు’ అని పార్టీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా గత ఏడాది అన్నప్పుడున్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులకూ తేడా కనిపిస్తోంది. రాధాకృష్ణన్ సామాన్య వ్యక్తి కాదు. ఆయన 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఆర్ఎస్ఎస్‌కు అంకితమయ్యారు. ‘సంఘ్‌’ తిరుప్పూర్ టౌన్ సంఘ చాలక్‌గా తర్వాత జిల్లా సంఘ్ చాలక్‌గా పనిచేసిన తర్వాత 1974లో ఎమర్జెన్సీకి ముందు జనసంఘ్‌లో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు రాధాకృష్ణన్ అటల్ బిహారీ వాజపేయికి సహాయకుడుగా ఉన్నారు. బీజేపీ భావజాలానికి ఆయన నిబద్ధత తిరుగులేనిది. తమిళనాడులో 19 వేల కిలోమీటర్ల పాటు యాత్ర చేసి తమిళనాడులో బీజేపీ అంటే రాధాకృష్ణన్ అనేంతగా కృషి చేశారు. 1998లో రాధాకృష్ణన్ పోటీ చేసిన కోయంబత్తూర్ నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు బీజేపీ నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ వచ్చినప్పుడే ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల సభలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాంబులు పేలి 85 మంది మరణించారు. ఒక పత్రికా విలేఖరికి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఆడ్వాణీ కోయంబత్తూర్‌కు ఆలస్యంగా వచ్చారు. ఆయనను రిసీవ్ చేసుకునేందుకు రాధాకృష్ణన్ విమానాశ్రయానికి వచ్చారు. వారిద్దరూ సకాలంలో సభకు చేరుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. సంఘ్‌ను రాధాకృష్ణన్ కోయంబత్తూర్‌లో బలోపేతం చేసినందుకే తీవ్రవాదులు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారనేది స్పష్టమయింది. ఆ ఎన్నికల్లో కోయంబత్తూర్‌లో హిందూ ఓట్లు సంఘటితమై రాధాకృష్ణన్ అఖండ మెజారిటీతో గెలిచారు.

రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడమే కాదు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా మోదీ తన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని రూపొందించడంలో నెహ్రూ, పటేల్ లాంటి నేతల మేధస్సును ప్రశంసించడంతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను కీర్తించారు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్‌ను తన ఆత్మగా అభివర్ణించినప్పటికీ ఎర్రకోటపై ఎప్పుడూ ఆ సంస్థను కొనియాడలేదు. ఆర్ఎస్ఎస్‌ను అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ(ఎన్జీవో)గా మోదీ అభివర్ణించడం ఆశ్చర్యకరం. మోదీ అభిప్రాయం ఎలా ఉన్నా, ఎన్జీవోగా మాత్రమే ఉండేందుకే సంఘ్ ఇష్టపడుతుందా అన్నది ప్రధానం.

-ఎ. కృష్ణారావు (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Aug 20 , 2025 | 05:56 AM