ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

pensioner: పెన్షనర్లకు న్యాయం చేయాలి

ABN, Publish Date - Jul 15 , 2025 | 02:06 AM

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు...

టీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన పెన్షనర్లు–వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. పెన్షనుదారులను విధులు ముగిసిన సంవత్సరం, పదవీ విరమణ తేదీ, లేదా నియమాల ఆధారంగా వేర్వేరు వర్గాల్లో ఉంచటం వల్ల ఒకే విధిగా సేవ చేసినవారు వేర్వేరు లాభాలు పొందే అవకాశం ఉంది. సీనియర్ పెన్షనర్లకు తక్కువ, జూనియర్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితులు ఏర్పడతాయి. సమాన విధులు నిర్వహించిన వారికి సమాన పెన్షన్ రావాలని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులు ఇచ్చినా, ఈ చట్టం ఆ ఆదేశాలను బైపాస్ చేసేలా తయారైందని పెన్షన్‌దారులు అభిప్రాయపడుతున్నారు.

1979లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పాలసీని అమలు చేసింది. దీని ప్రకారం, 1979 మే 31 తర్వాత పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కొత్త పెన్షన్ లబ్ధిని వర్తింపజేస్తామని తెలిపింది. అంతకుముందు పదవీ విరమణ పొందిన వారికి ఈ పెన్షన్ సౌకర్యాలు వర్తించవని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ డి.ఎస్. నకారా అనే పెన్షన్‌దారు, మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ‘‘పెన్షన్ అనేది సౌకర్యం కాదు, అది ఒక హక్కు. ఉద్యోగ సమయంలో చెల్లించిన సేవలకు ప్రతిఫలంగా ఇచ్చే సామాజిక భద్రత, విభజన అసమంజసం... పెన్షన్ విధానంలో మార్పులు, పెంపులు అన్నీ అంతకుముందు పదవీ విరమణ పొందినవారికీ వర్తించాలి.’’ అని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

పెన్షనుదారుల హక్కులకు, భద్రతకు ముప్పు తలపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ‘పెన్షనర్ల వర్గీకరణ చట్టం’పై రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అమలుతో వేతన సవరణ, అరియర్స్, కరువుభత్యాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో పెన్షన్‌దారులకు అన్యాయాలు జరుగుతున్నాయని పెన్షన్‌దారుల సంఘం పేర్కొంది. పెన్షన్‌దారుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపుతో, ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారుల సంఘం ప్రధానమంత్రికి ఒక వినతిపత్రాన్ని పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పెన్షన్‌దారుల సంక్షేమానికి అనేక చొరవలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో స్పందించి కేంద్రం దిశానిర్దేశం చేసిన చట్టాల వల్ల రాష్ట్ర పెన్షన్‌దారులకు తలెత్తిన సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని పెన్షన్‌దారులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తి లేఖలో పెన్షనర్లకు 12వ పీఆర్‌సీ అమలు, 35 శాతం మధ్యంతర భృతి, తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ, కమ్యుటేషన్ కాల పరిమితి 15 నుంచి 11 సంవత్సరాలకు తగ్గించడం వంటివి ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు నెం.315లో మార్పులు చేసి కుటుంబ పింఛను అమలులో న్యాయం చేయడం, యూజీసీ స్కేల్స్‌లో సేవ చేసిన వారికి హక్కుల అమలు, 10వ పీఆర్‌సీ నిర్ణయించిన మేరకు అంత్యక్రియ ఖర్చులు కొనసాగించడం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు వెంటనే చెల్లించడం, వేతన సవరణ బకాయిలు, కరువు ఉపశమనం బకాయిలు విడుదల చేయడం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పూర్తిగా చెల్లించడం వంటివి ఉన్నాయి. పెన్షన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య బీమా కార్డులు అందరికీ పరిమితుల్లేకుండా జారీ చేయాలని కూడా కోరారు.

దేశ నిర్మాణానికి ప్రధాన శక్తిగా పని చేసిన పెన్షన్‌దారుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి, వారికి సరైన న్యాయం చేయాలి.

-టి.ఎం.బి. బుచ్చిరాజు ప్రధాన కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారుల సంఘం

Updated Date - Jul 15 , 2025 | 02:06 AM