Kuppili Padma: ప్రతీ రోజూ ముప్పై పైనే ఉత్తరాలు వచ్చేవి
ABN, Publish Date - May 19 , 2025 | 12:58 AM
‘అమృతవర్షిణి’ పుస్తకానికి సంబంధించిన రచయితకు వచ్చిన అనేక స్పందనలు, పాఠకుల నుంచి మద్దతు మరియు విశేషమైన ప్రశంసలతో ఆమె సాహిత్య ప్రస్థానం కొనసాగింది. ఈ పుస్తకం ప్రింటింగ్, కవర్ డిజైన్ నుండి పబ్లిషింగ్ వరకు ఎన్నో అనుకోని సంఘటనలతో ప్రజాదరణ పొందింది.
‘‘సువిశాలంగా విస్తరించుకుని ఉన్న నా ఒంటరితనపు సామ్రాజ్యానికి చక్రవర్తినైతే అయ్యాను కానీ మంత్రిలేక బాధపడుతున్నాను – రారాదూ!’’ అంటూ టీనేజ్‌లో ఒక ప్రేమలేఖని రాసి ఆంధ్రజ్యోతికి పంపిస్తే, పురాణం సుబ్రహ్మణ్య శర్మ ప్రచురించారు. ఆ తర్వాత ‘మయూరి’ పత్రికవారు ఒక కాలమ్ రాయమంటే వారం వారం ఒక ప్రేమలేఖని ‘అమృతవర్షిణి’ పేరుతో రాశాను. వాటిని సంపుటిగా ప్రచురించాలని ఇన్నర్ టెక్స్‌ట్ రెడీ చేస్తుంటే అక్కడక్కడా బొమ్మలుంటే బాగుండుననిపించింది. వ్యక్తిగతంగా అస్సలు పరిచయం లేని ఆర్టిస్ట్ గోపి గారికి ఫోన్ చేసి కొన్ని బొమ్మలు కావాలని అడిగాను. చదివాక నచ్చితేనే వేస్తానన్నారు. టెక్స్‌ట్ పంపించాను.
మూడు రోజులు తర్వాత గోపీగారు పంపిన కవర్ తెరచి చూసి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఒకటో రెండో బొమ్మలు పంపిస్తారనుకుంటే ప్రతి లేఖకీ ఒక బొమ్మ, భలే అందంగా! వారికి థాంక్స్ చెప్పాలని కాల్ చేస్తే వారన్నారు, ‘‘ఒక్క బొమ్మతో ఆగలేకపోయానండి... ఎంత బాగా రాసారు! ఎన్నిసార్లు చదివానో! కాలమ్‌గా వచ్చినప్పుడు చూడలేదు... అందుకే నచ్చితేనే వేస్తానన్నాను. చలం గారి తరువాత ప్రేమ లేఖలు వేస్తుంది మీరేనేమో,’’ అన్నారు. అమ్మాయిల్లో ఇదే మొదటి సంపుటా అని అడిగాను. తనకు తెలిసినంత వరకు ఇదే మొదటిదన్నారు.
బొమ్మలతో లేఅవుట్ రెడీ. కవర్ పేజీ ఫిక్స్ చెయ్యాలి. ఏ బొమ్మా నచ్చేది కాదు. ఒకరోజు నల్లకుంటలో ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతుంటే తలుపులు తెరిచున్న ఒక ఇంటి ముందుగదిలో గోడమీదున్న ఒక క్యాలెండర్ ఆకర్షించింది. చొరవ చేసి లోపలికి వెళ్ళాను. అక్కడున్నవారు ఏం కావాలని అడిగారు. ఆ కాలెండర్ కవర్‌ను పుస్తకానికి కవర్ పేజీగా వేద్దామని ఉందని, ఆ క్యాలెండర్ ఎక్కడ దొరుకుతుందని అడిగాను. ‘‘మాదేనండి. కొత్తదైతే ప్రింటింగ్‌కి బాగుంటుంది’’ అంటూ కొత్త క్యాలెండర్‌ని తెప్పించారు. అప్పుడడిగాను ‘‘ఇదేం ఆఫీస్’’ అని. ప్రింటింగ్ ప్రెస్ అన్నారు. ఈ పుస్తకం ప్రింట్ చేస్తారా అని అడిగాను. ‘‘చేయొచ్చు, కవర్ డిజైన్ చేయడానికి మీకు తెలిసిన వాళ్ళున్నారా,’’ అని అడిగారు. ఎవ్వరూ తెలియదంటే, ‘ఫినిషింగ్ పాయింట్’ వారితో మాటాడారు. వారి యువ డిజైనర్స్ కవర్ డిజైన్ చేశారు. అలా 1993 శ్రావణ మాసపు జల్లుల్లో ‘అమృతవర్షిణి’ కురిసింది.
ఆవిష్కరణ ఆసక్తి లేదు. పత్రికల్లో చక్కని సమీక్షలొచ్చాయి. విశాలాంధ్ర వారి బస్సు ఏ ఊర్లోకి వెళ్ళినా... వెళ్ళీవెళ్ళగానే క్షణాల్లో ‘అమృతవర్షిణి’ని కొనుక్కోవటంతో రెండు వేల కాపీలు చాలా త్వరగా అమ్ముడైపోయాయి. పాఠకుల్లో చక్కని డిమాండ్ ఉండటంతో తిరిగి ప్రచురిస్తూ ఉండేదాన్ని. ‘అమృతవర్షిణి’ని చదివి చేరా మాస్టారు గారు భావుకురాలివంటే; మునిపల్లె రాజు గారు, శ్రీపతి గారు ‘అమ్మాయి చలం’ అని మెచ్చుకున్నారు. ఒక ట్రైన్‌లో కలిసినప్పుడు కేశవరెడ్డి గారు ‘అమృతవర్షిణి’ అని పలకరించటం, చండీదాస్ గారు కొన్ని లేఖల్ని ప్రస్తావిస్తూ మాట్లాడటం, ప్రేమలేఖల్ని ప్రచురించి మొదటి అమ్మాయివని హరిగారు అనడం, వాసుదేవరావు గారు ఆత్మీయంగా ఆటోగ్రాఫ్ అడగటం అజంతా గారు మెచ్చుకున్నారని వారింటికి తీసుకెళ్ళి ‘అమృతవర్షిణి’ అని పరిచయం చెయ్యటం... ఇలా ఎందరో సాహితీ వేత్తల ప్రశంసలు... మరో వైపు పాఠకుల నుంచి ప్రతీ రోజూ దాదాపు ముప్పై పైనే ఉత్తరాలు వచ్చేవి. దేశదేశాల్లో ఉన్న అనేకమంది సాహిత్య అభిమానులు అప్పట్లో ఈ పుస్తకాన్ని ఎంతో ఇష్టంగా చదివామనీ; అపురూపంగా దాచుకున్నామనీ; ఆమెరికాకో మరో దేశానికో చదువు కోసమో, ఉద్యోగం కోసమో వెళ్తున్నప్పుడు వాళ్లు తీసుకెళ్లిన అతి కొద్ది పుస్తకాలలో ‘అమృతవర్షిణి’ ఒకటనీ; కొంతమందైతే ఒక్క ‘అమృతవర్షిణి’ని మాత్రమే తీసుకెళ్లామనీ... ఇలా నా మొదటి పుస్తకం ‘అమృతవర్షిణి’ నాకెన్నో అందమైన జ్ఞాపకాల్ని, అపురూపమైన అభిమానుల్ని ఇప్పటికీ విరబూయిస్తోంది.
Updated Date - May 19 , 2025 | 01:00 AM