Poet Jadhav Ambadas: నకిలీ నవ్వు
ABN, Publish Date - Jun 16 , 2025 | 02:53 AM
చిన్నప్పుడు నాన్న ఇంటినొదిలి వేరే ఊరికి రెండు నెలల పాటు హమాలి పనికెళ్ళినప్పుడు హోరు వర్షంలో ఇంటి ఇనుపరేకులెక్కడ ఎగిరిపోతాయోనని మంచం కింద దాక్కున్నప్పుడేనా లేలేత నవ్వు నరికేయబడింది...
చిన్నప్పుడు నాన్న
ఇంటినొదిలి వేరే ఊరికి
రెండు నెలల పాటు
హమాలి పనికెళ్ళినప్పుడు
హోరు వర్షంలో
ఇంటి ఇనుపరేకులెక్కడ ఎగిరిపోతాయోనని
మంచం కింద దాక్కున్నప్పుడే
నా లేలేత నవ్వు నరికేయబడింది
నాలుగో తరగతిలో
హాస్టల్ నుండి బాసర లోని
శ్రీజ్ఞాన సరస్వతీదేవిని దర్శించడానికెళ్ళినప్పుడు
అక్కడి పెన్ను పుస్తకాలను తీసుకుంటే
చదువు బాగొస్తుందని
కొనుక్కొచ్చామని స్నేహితులందరు
ఆటోలో మాట్లాడుకుంటుంటే
రిక్త హస్తాలతో ఉన్న నాకు
చదువు రాదని నవ్వుతున్న వాళ్ళ మొహాలు
నా నవ్వును అయస్కాంతంలా లాక్కున్నాయి
ఇల్లు కట్టినప్పుడు
పది సంవత్సరాలుగా పెంచుతున్న
మేకలన్నింటినీ అమ్మినా కూడా
అప్పులైనందుకు
మా తండానొదిలి
కట్టిన ఇల్లునొదిలి
పిన్నివాళ్ళ తండాకు వలసెళ్ళినప్పుడు
నా నవ్వు మా తండా లోనే ఉండిపోయింది
నచ్చిన అంగీని
షాపు లోనే వదిలేసొచ్చినప్పుడు
నా నవ్వు ఆ తెల్లని అంగీ లోనే మెరుపైపోయింది
ఇంటరైనా ప్రైవేటు కాలేజీలో చదవాలని
ఎండకాలమంతా మేస్త్రి పనికెళ్ళి
సంపాదించిన పైసలన్నింటినీ
కాలేజీలో ఫీజు కట్టినప్పుడు
నా నవ్వు ఫీజు కౌంటర్ దగ్గరే ఉరేసుకుంది
మిత్రుల దగ్గర అప్పులు చేసి
నచ్చిన పుస్తకాలను తీసుకుంటున్నప్పుడు
షాపులో నాకేసి చూస్తున్న పుస్తకాలను
వదిలేసొచ్చినప్పుడు వాటిని తీస్కెళ్ళేంత వరకు
నా నవ్వును బయానాగా ఇచ్చేస్తుంటాను
బాధ్యతలు
నచ్చిన చదువుకు ఫుల్‌స్టాప్
పెట్టించి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించటానికి
బలవంతం చేసినప్పుడు
నా నవ్వు పూర్తిగా కాల్చివేయబడింది
మొహమ్మీద
నవ్వును అతికించడానికి
ప్రయత్నించినప్పుడల్లా
పదేపదే విఫలమవుతుంటాను నకిలీ నవ్వేమో?
ఎంత ప్రయత్నించినా అధిక సమయంపాటు
అతకబడటం లేదు
-జాధవ్ అంబదాస్
94902 31380
Updated Date - Jun 16 , 2025 | 02:54 AM