Writer Jayamohan: రచన ప్రశ్నతో మొదలవ్వాలి
ABN, Publish Date - Aug 18 , 2025 | 06:32 AM
తమిళ రచయిత జయమోహన్ గారిని బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్‌లో చూసినప్పుడు ఒక సీనియర్ రచయిత లాంటి వేషభాషలు ఏం కనిపించలేదు. ఒక నార్మల్ సీనియర్ పర్సన్ లాగే అనిపించారు.
తమిళ రచయిత జయమోహన్ గారిని బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్‌లో చూసినప్పుడు ఒక సీనియర్ రచయిత లాంటి వేషభాషలు ఏం కనిపించలేదు. ఒక నార్మల్ సీనియర్ పర్సన్ లాగే అనిపించారు. నార్మల్ సీనియర్ పర్సన్స్‌కి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని భేషజాలు ఉంటాయి, ముఖ్యంగా కొత్త తరం పట్ల ఒక చిన్నచూపు ఉంటుంది. కానీ, జయమోహన్ నా ఊహలు అన్నింటినీ తారుమారు చేశారు. సింపుల్, ఫ్రెండ్లీ, సులభంగా మాట కలపగలిగే వ్యక్తి. మూడో రోజు ఉత్సవం ముగిశాక అందరూ వీడ్కోళ్లు చెప్పుకొని వెళ్ళిపోతుంటే, నాకు ఈ ఉత్సవం నుంచి ఒక పరిపూర్తి కావాలనిపించింది. ఆయనతో, ఇలా గుంపులో నిల్చొని కాకుండా, ఒక ముఖాముఖి చర్చ చెయ్యాలనిపించింది. ఆయన్ని అడగ్గానే చాలా మామూలుగా ‘ఒకే ష్యూర్’ అన్నారు. రాత్రి సెంట్రల్ యూనివర్సిటీ తమ్ముళ్ళు లిఖిత్, హర్ష, ఝాన్సీ పబ్లికేషన్స్ శ్రీదివ్యలను వెంటేసుకుని, లైట్లు ఆర్పేసిన కారిడార్‌లో ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని ఆయన గదికి చేరుకున్నాను. తలుపు తీయగానే ఎదురుగా టేబుల్ ముందు కూర్చుని జయమోహన్ నవ్వుతూ కనిపించారు. దండం పెట్టి ఎదురుగా ఉన్న మంచం మీద కూర్చున్నాను. మేమంతా సెటిల్ అయ్యాక జయమోహన్ మాట్లాడం మొదలైంది.
ముందుగా, తెలుగు సాహిత్యంతో మీకు ఉన్న పరిచయం ఏంటి?
తెలుగులో నాకు బాగా నచ్చిన నవల అల్పజీవి. విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి) గారి ఆ నవల ఎంతో గొప్ప రచన. నేను వివిధ భారతీయ భాషలలో వచ్చిన నవలల్ని పరిచయం చేస్తూ తెలుగు నుంచి ‘అల్పజీవి’ నవలని పరిచయం చేశాను. అలాగే నాకు చలం రచనలు కూడా ఇష్టం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం నాకు ఎంతో ఇష్టం.
అసలు మీరు ఎందుకు రాస్తారు? డబ్బు, పేరు, కీర్తి ఇలాంటి వాటి కోసమా లేక ఒక కథ చెప్పాలనే, లేదా మీ లోపల ఉన్నదాన్ని వ్యక్తపరచాలనే ఓ బలమైన కోరిక వల్లనా?
ఇండియాలో రచయితగా మీరు బతకలేరు. రచన ఒక ఉద్యోగంగా అయ్యే పరిస్థితి లేదు. నేను ఇరవై ఏళ్ళు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేసి, నాకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాక నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను.
ఇంత సుదీర్ఘకాలం రచయితగా కొనసాగడం, ఇంత విస్తృతంగా రాయడం ఎలా సాధ్యం అయింది?
(ఆయన పేరు మీద మూడు వందల పైనే పుస్తకాలు ఉన్నాయి!) ఎవరైనా రచయిత ఎక్కువ కాలం రచయితగా కొనసాగాలంటే ఆరోగ్యకరమైన శరీరం ఉండడం ముఖ్యం. నేను నా శరీరాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తాను. ఆహారపు అలవాట్లు, నిద్రా, కాలకృత్యాలు అన్నీ పెర్ఫెక్ట్‌గా ఉంటాయి. నాకు ఇప్పుడు 63ఏళ్ళు. ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. నేను అలోపతి మందులు కూడా అంత త్వరగా తీసుకోను, మత్తు కలిగించే ఎలాంటి మాదక ద్రవ్యాలూ ఎప్పుడూ తీసుకోలేదు. రచయితకి తన శరీరం పట్ల శ్రద్ధ ఉండాలి.
మీరు ఒక రచనని ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుని మొదలుపెడతారా? లేక ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు ఇది మంచి రచన అవుతుందని మొదలుపెడతారా?
రచన ఎప్పుడూ idea (ideology అనే మాటని ఆయన idea అన్నారు)తో మొదలు అవకూడదు. నీకు ఆల్రెడీ తెలిసిందాన్ని నిరూపించడం కోసం అన్నట్టుగా రచన చెయ్యకూడదు. రచన ప్రశ్నతో మొదలు అవ్వాలి. ఇప్పుడు తెలుగులో వచ్చిన ‘తెల్ల ఏనుగు’ నవలే తీసుకుంటే, అది ఒక ప్రశ్నతో మొదలైంది? ఈ దేశంలో దళితులు తెల్లవాళ్ళ పాలనను సపోర్ట్ చేశారు. ఎందుకంటే, దేశీయ రాజసంస్థానాలతో పోల్చుకుంటే, బ్రిటిష్ పాలనలో వాళ్ళకి గౌరవప్రదమైన జీవితం దొరికింది. కానీ అదే తెల్లవాడు కొన్ని కోట్లమంది చనిపోయే కరువుకు కారణం అయ్యాడు. ఆ కరువులో కళ్ల ముందు అన్ని వేలమంది చనిపోతూ ఉంటే ఏ చదువుకున్న బ్రాహ్మడూ దాని గురించి రాయలేదు. వీటన్నింటికి కారణం ఏంటి అనే ప్రశ్నతో ఈ నవల మొదలైంది. నవల చివరిలో నాకు దొరికిన సమాధానం ఎలాంటిదైనా కావొచ్చు. కానీ, ఆ సమాధానాన్ని అన్వేషిస్తూనే నా రచన నడుస్తుంది.
ప్రస్తుతం తెలుగులో అస్తిత్వ వాద ఉద్యమాలు బలంగా ఉన్నాయి. ఎంతోమంది వివిధ నేపథ్యాల నుంచి వచ్చి రచనలు చేస్తున్నారు. ఒక వాదన ఏంటంటే– ఎవరి గురించి వాళ్లే రాసుకోవాలని, వేరే వాళ్ళు రాయడం అన్నది సరైనది కాదని. దాని గురించి మీరేం అంటారు?
ఎవరి గురించి వాళ్ళు రాసుకోవడం మంచిదే. కాకపోతే మనం మనుషులు గానే ఎంతో వైవిధ్యం ఉన్న వాళ్ళం. మన పక్కనున్న వ్యక్తి గురించే మనకు తెలీదు. అలాంటప్పుడు వేరే వాళ్ళ గురించి నేను ఎలా రాయగలను? నేను రాసింది అంతా నా ఊహే అవుతుంది, లేదా నా అవగాహన అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన రచనలు అన్నీ అలా వచ్చినవే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది– మనకు తెలీని దాని గురించి రాస్తున్నప్పుడు మనకు ఉండాల్సింది అవగాహన మాత్రమే కాదు empathy కూడా. వేరే జీవితో మనకు, ‘తానే నేను’ అన్నంతగా సహానుభూతి కలిగినప్పుడే మనం రాయగలం. ఇది ఒక నేపథ్యం కలిగిన వ్యక్తి మరొక నేపథ్యం గురించి రాసేటప్పుడూ ఉండాలి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి రాసేటప్పుడూ ఉండాలి. తమిళంలో వెల్లలార్ అనే కవి అంటాడు ‘‘నీళ్ళు లేక ఎండిపోయిన మొక్కను చూస్తే, నా మనసుకి ఎంతో కష్టంగా ఉంటుంది’’ అని. ఒక మొక్కతో కూడా మనల్ని మనం ఎంపతైజ్ చేసుకోగలిగినప్పుడు, వేరే నేపథ్యం కలిగిన వ్యక్తులతో ఎందుకు చేసుకోలేం?
క్రాఫ్ట్ గురించి మాట్లాడదాం, మీరు ఒక కల్పనని విస్తృతం చేసి, ఒక పెద్ద నవలగా రాయడం కోసం ఎలాంటి పద్ధతిని పాటిస్తారు?
బహుశా ప్రపంచంలో అతిపెద్ద నవల నేనే రాసానేమో. ‘వెన్మురసు’ (మహాభారతం కథ) ఇరవై నాలుగు వేల పేజీల నవల. వెయ్యి పేజీల నవలలు, ఐదు వందల పేజీల నవలలు కూడా ఓ పది దాకా రాసాను. నా దృష్టిలో కాల్పనిక రచయితకి సాహిత్య పఠనం చాలా ముఖ్యం. క్లాసిక్స్ అనే రచనల్ని 15 నుంచి 20 మధ్య వయసులోనే చదవాలని అంటాను. అప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ మనసులో ముద్రించుకుపోతాయి. నా కూతురు తన పదిహేనవ ఏట టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’ చదివింది. పూర్తి అయిన తర్వాత అందులో ఓ ప్రధాన పాత్ర చనిపోయినందుకు ఏడ్చింది కూడా, తన ఏడుపు ఆపడం కోసం ఒక డ్రెస్ కొనివ్వాల్సి వచ్చింది. ఇప్పుడు తను చాలా మంచి రచయిత్రి అయింది. నా కొడుకు కూడా అంతే. విస్తృతమైన పఠనం మన ఊహాశక్తిని పెంచుతుంది. అలాగే మనం రాస్తున్న సబ్జెక్ట్ కోసం చేసే స్టడీ కూడా చాలా ముఖ్యం (ఇక్కడ ఆయన సోషియాలజీ, పొలిటికల్ ఎకానమీకి సంబంధించిన కొంతమంది రచయితల పేర్లు చెప్పారు). అలాగే నేను నా మనసులో ఎప్పుడూ కథల కోసం ధ్యానం చేస్తూ ఉంటాను. చటుక్కున ఒక మెరుపు మెరుస్తుంది. వెంటనే రాసేస్తాను.
రచనలో డెప్త్ అంటే ఏంటి? ఒక థ్రిల్లింగ్ రీడింగ్ అనుభవాన్ని ఇచ్చే పాపులర్ నవలకి, క్లాసిక్ నవలకి ఈ ‘డెప్త్’ విషయంలోనే తేడా చెప్తుంటారు.
‘డెప్త్’ అంటే ఒక రచనని అనేక కోణాల నుంచి తరచి చూడగలగడమే అంటాము. గొప్ప రచనలు అన్నింటిలోనూ ఈ లక్షణం ఉంటుంది. నేను ఇప్పటికి ఎన్నోసార్లు టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’ చదివాను. చదివిన ప్రతిసారీ అందులో ఒక కొత్త కోణం కనిపిస్తుంది. పాపులర్ రచనల్లో ఆ లక్షణం ఉండదు. చదివినంతసేపు బాగుండొచ్చు గానీ చదివిన తర్వాత మర్చిపోతాం. ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు మా అమ్మాయి ఒక పాపులర్ నవల చదివి, దిగివెళ్లిపోతున్నపుడు ఆ పుస్తకాన్ని సీట్ లోనే వదిలేసింది. ‘‘ఎందుకు?’’ అని అడిగితే, ‘‘షెల్ఫ్‌లో దాచుకునేంత గొప్ప పుస్తకం కాదులే నాన్న,’’ అంది. ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుతూ– చివరిలో ఓ రెండు ప్రశ్నలు అడిగాను.
రచనల్లో cliche లని ఎలా అవాయిడ్ చేయ్యాలి? నేను రాస్తున్న కథల్లో ఒకేలాంటి సందర్భాలు వస్తున్నాయి.
వాటిని నేను cliche లు అనను. అది పెద్ద తప్పేం కాదు. నువ్వు చెప్తున్న విషయం, కథ కొత్తదా కాదా అనేదే ముఖ్యం. కానీ కథలో మనం వాడే వ్యక్తీకరణాలు, ఉపమానాలను రిపీట్ చెయ్యకూడదు. వెన్మురసు నవలలో కొన్ని వేల ఉపమానాలను వాడాను, రిపీట్ చెయ్యకుండా.
రచనలో పాఠకులని రంజింప చెయ్యడం కోసం అన్నట్టుగా ఏమైనా చేస్తారా?
No. I write to amuse myself. (‘‘నా ముచ్చట కోసం నేను రాస్తాను’’ అనే ఈ మాటతో ఆయన మనసు దోచుకున్నారు. నేనూ నమ్ముతాను.)
ఆయనతో మాటల్లో సమయం తెలీకుండానే గడిచిపోయింది. రాత్రి అంతా అలా ఆయన మాట్లాడుతుంటే వింటూనే ఉండాలని అనిపిస్తున్నా, అంత పెద్దాయనను ఇంక ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఓ పరవశం లాంటి భావనతో బయటికి వచ్చేశాను. వేలు ఖర్చుపెట్టి ‘‘రైటింగ్ మాస్టర్‌క్లాస్’’ లకు అటెండ్ అయ్యేవాళ్ళు నాకు తెలుసు. ఇక్కడ నాకు అలాంటి మాస్టర్ క్లాస్ ఇలా ఊరికినే జరగడం ఆహా ఏమి నా భాగ్యం అనుకుంటూ గదికి వచ్చి నిద్రపోయాను.
ఇంటర్వ్యూ
-ప్రసాద్ సూరి & 91336 08072
Updated Date - Aug 18 , 2025 | 06:37 AM