First Female Prime Minister: ఐరన్‌లేడీ నీడలో జపాన్
ABN, Publish Date - Oct 23 , 2025 | 04:09 AM
జపాన్‌లో చీటికీమాటికీ ప్రధానులు ఎందుకు దిగిపోతారన్నది వేరే చర్చ కానీ, మంగళవారం ఆ దేశం తన తొలి మహిళా ప్రధానిని ఎన్నుకొని చరిత్ర సృష్టించింది. పురుషాధిక్య రాజకీయాలకు మారుపేరైన జపాన్‌లో నూటముగ్గురు...
జపాన్‌లో చీటికీమాటికీ ప్రధానులు ఎందుకు దిగిపోతారన్నది వేరే చర్చ కానీ, మంగళవారం ఆ దేశం తన తొలి మహిళా ప్రధానిని ఎన్నుకొని చరిత్ర సృష్టించింది. పురుషాధిక్య రాజకీయాలకు మారుపేరైన జపాన్‌లో నూటముగ్గురు పురుష ప్రధానుల తరువాత, సనే తకైచీకి గద్దెనెక్కే అవకాశం దక్కింది. ఆ దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడూ, అధికార పార్టీ ఎల్‌డీపీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న స్థితిలోనూ ఈమె చేతిలో అధికారం పెట్టి తోటివారంతా అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలివరకూ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా నేతృత్వంలో ఆ పార్టీ ఎగువసభ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూడడంతో, ఉభయసభల్లోనూ బలం మరింత క్షీణించింది. ఏడాదిమాత్రమే పదవిలో కొనసాగిన ఆయన విధిలేక రాజీనామా చేయడంతో ఈ రక్షకురాలు కావలసివచ్చింది. ఈ నెలారంభంలో అనేకమంది దిగ్గజాలను ఓడించి ఎల్‌డీపీ నేతగా ఆమె ఎన్నికకావడమే నిజానికి ఒక చరిత్ర. ఐదేళ్ళలో నాలుగోప్రధానిగా ప్రజలముందుకు వచ్చిన అరవైనాలుగేళ్ళ ఈ అతివాద నాయకురాలు రాజకీయంగానూ, ఆర్థికంగానూ చేయాల్సింది చాలా ఉంది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి తలెత్తిన వివాదంతో ఎల్‌డీపీకి సుదీర్ఘకాలంగా మద్దతు ఇస్తున్న కొమిటో పార్టీ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు కొత్త ప్రధాని మరో మితవాద పార్టీని భాగస్వామిగా తెచ్చుకొని పార్లమెంట్‌లో స్వల్పమెజారిటీతో గట్టెక్కేశారు. మాజీ ప్రధాని షింజో అబే ఆర్థికవిధానాలను సమర్థించే ఈ మాజీ ఆర్థికమంత్రికి ఐరన్‌లేడీగా ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రభుత్వం తన భారీ వ్యయంతో పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలనే ఈమె బ్యాంక్ ఆఫ్ జపాన్‌ను పిసినారిగా తరచూ ఆడిపోసుకొనేవారట. ఆమె అనుసరించబోయే ఆర్థికవిధానాలు ఏమిటన్నవి సుస్పష్టం. తదనుగుణంగానే ఆమె తానుమెచ్చిన మరో మహిళను ఆర్థికమంత్రిగా తెచ్చిపెట్టుకుంటారన్నదీ నిజమే అయింది. అయితే, పరమ ఛాందస జపాన్ సమాజంలో మహిళల హక్కులు, వారి నెలసరి సమస్యల గురించి కూడా బహిరంగంగా మాట్లాడే ఈ మహిళా ప్రధాని తన మంత్రివర్గంలో పెద్దసంఖ్యలో మహిళలకు స్థానం కల్పిస్తారన్న ఆశలు మాత్రం తలకిందులైనాయి. ఇరవైమంది మంత్రివర్గంలో ఆమె ఇద్దరికి మాత్రమే చోటిచ్చారు. దీంతో ఆమె మహిళా పక్షపాతి కాదంటూ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో మళ్ళీ చక్కర్లు కొట్టడం ఆరంభించాయి.
మగాళ్ళు గుర్రాల్లా కష్టపడి సంపాదించాలనీ, ఆడవాళ్ళు వారికి వెన్నుదన్నుగా నిలవాలనీ, అలాగే, పెళ్ళయిన జంట ఒకే ఇంటిపేరుతో వ్యవహరించాలనే వాదనలు చేసే ఈమెనుంచి విప్లవాలు ఆశించలేమని కొందరు విమర్శలు చేస్తున్నారు. మహిళల్లో కంటే పురుషుల్లోనే అధిక క్రేజ్ ఉన్నందున, స్త్రీ పక్షపాతిగా కనిపించి పార్టీలోని మిగతా నాయకులను, జపాన్ పురుషాధిక్య సమాజాన్ని ఆమె ఇబ్బంది పెట్టదల్చుకోలేదేమో. ఒక స్త్రీ ఈ అత్యున్నత స్థానాన్ని అధిరోహించడానికి 120 సంవత్సరాలు పట్టిన చోట, ఆమె పార్టీ సైతం మహిళాప్రాతినిధ్యాన్ని వెనకపట్టుపట్టించిన స్థితిలో తక్షణ పరిష్కారాలు అసాధ్యం. అంతర్గత వైరాలు, ఆధిపత్యపోరుతో సతమతమవుతున్న ఆమె పార్టీ ఒక్కటిగా లేదు. ప్రజలు కూడా ఎల్‌డీపీ పట్ల సానుకూలంగా లేరు. జపాన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న స్థితిలో, దేశీయంగా కొత్త ప్రధాని చేపట్టబోయే సంస్కరణలతో పాటు, అమెరికా అధ్యక్షుడి కరుణాకటాక్షాలు కూడా ఎంతో ముఖ్యం. పేరుకు మిత్రదేశమే అయినప్పటికీ, భారీ సుంకాలతో డోనాల్డ్ ట్రంప్ జపాన్‌మీద కూడా కక్షతీర్చుకున్నారు. తదనంతరం వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ, ట్రంప్ ఒత్తిడిమేరకు దిగుమతులు కూడా పెంచుకున్న జపాన్ ఎగుమతులు పడిపోయి కుదేలైంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోవడంలో భాగంగా, ట్రంప్ తనకు నచ్చినచోట ఖర్చుచేయగలిగేందుకు వీలుగా ప్రభుత్వనిధుల్లో 550 బిలియన్ డాలర్లు పెట్టుబడిపెట్టేందుకు జపాన్ గతంలో అవగాహన కుదర్చుకుందట. ఈ నెలాఖరులో జపాన్ వస్తున్న ట్రంప్ ఆ విషయాన్ని గుర్తుచేయవచ్చు. వ్యక్తిగత స్నేహాలే దౌత్య సంబంధాలను నిర్ణయించే ట్రంప్ వైఖరి కొత్త ప్రధానికి తెలియనిదేమీ కాదు. ఈనెలారంభంలో ఆమె ఎల్‌డీపీ నేతగా ఎన్నికకాగానే జపాన్ నుంచి శుభవార్త అందింది అంటూ తనలాగానే మరో మితవాది మిత్రదేశానికి నాయకత్వం వహిస్తున్నందుకు ట్రంప్ సంతోషించారు. అమె ఎంతో తెలివైనదనీ, గౌరవనీయురాలనీ ప్రశంసించారు. ఎంతోకాలంగా ఆశిస్తున్న ప్రధాని స్థానాన్ని మూడోప్రయత్నంలో కానీ దక్కించుకోలేకపోయిన తకైచీని ట్రంప్ సైతం ఇబ్బందిపెట్టకపోవచ్చు.
Updated Date - Oct 23 , 2025 | 04:09 AM