Gaza Humanitarian Crisis: మరణిస్తున్న మానవత
ABN, Publish Date - May 24 , 2025 | 05:33 AM
ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న గాజాలో అమానుష యుద్ధ చర్యలతో పసిపిల్లల వరకూ ప్రాణాలు తీస్తున్న దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆకలి, అస్త్రాలను మారణాయుధాలుగా మార్చి గాజా ఖాళీ చేయాలని నెతన్యాహూ ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాజా మొత్తాన్ని ఖాళీచేయిస్తాం, పసిపిల్లలను కూడా వదిలేది లేదంటూ ఇజ్రాయెల్ పాలకులు చేస్తున్న ప్రకటనలు, తదనుగుణంగా మరింత హెచ్చుస్థాయిలో అమానుషంగా సాగుతున్న దాడులు మానవత్వం ఉన్నవారి మనసులు కలిచివేస్తున్నాయి. అత్యంత ఘోరమైన, క్రూరమైన పరిస్థితులను గాజా ఎదుర్కొంటున్నదని, కాస్తంత దయతలచాలని ఇజ్రాయెల్ ప్రధానిని ఐక్యరాజ్యసమితి అధినేత బతిమాలుతున్నారు. గురు,శుక్రవారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 140మంది పాలస్తీనియన్లు చనిపోతే, ఆకలి మరో నలభైమందిని చంపేసింది. ఆయుధాలతో పాటు ఆకలిని కూడా మారణాయుధంగా ప్రయోగించి ప్రాణాలు తీస్తున్న నెతన్యాహూను అమెరికా మాత్రమే ఆపగలదన్నట్టుగా మిగతాప్రపంచం, మరీముఖ్యంగా అరబ్‌దేశాలు చేతులెత్తేయడం ఆశ్చర్యం, అమానుషం. దాదాపు వందరోజులైంది గాజాలోకి ఆహారం అడుగుపెట్టి. వేలాదిమంది పిల్లలు చావుఅంచున ఉన్నా ఇజ్రాయెల్ అధినేతకు మనసు కరగ లేదు. గాజాలో ప్రవేశం కోసం సరిహద్దుల్లో నిరీక్షిస్తున్న ఆహారపు ట్రక్కులను ఆయన లోపలకు రానివ్వలేదు. అస్త్రాలతో పాటు, ఆకలిని కూడా వాడి ఒక్క పసిగుడ్డును కూడా గాజాలో మిగలనివ్వకుండా మొత్తం ఖాళీచేయించే దిశగా ఆయన పావులుకదుపుతున్నాడు. గాజాను స్వాధీనం చేసుకొని, ఖాళీచేయించి, దానిని ఒక టూరిస్టు రిసార్టుగా మార్చేందుకు అమెరికాకు అప్పగించడం కోసమే ఈ ఊచకోత కొనసాగుతోందన్నది స్పష్టం. కాల్పుల విరమణ ఒప్పందం చక్కగా అమలుజరుగుతూ, తనవద్ద ఉన్న బందీలను అనుకున్నప్రకారం హమాస్ సవ్యంగా అప్పగిస్తున్న దశలో, అమెరికా అధ్యక్షుడు తన మనసులో మాట చెప్పడం, ఆ కాస్తంత శాంతినీ బద్దలు కొడుతూ, ఒక అర్థరాత్రివేళ ఇజ్రాయెల్ మారణాయుధాలతో విరుచుకుపడి ఒకేరోజు ఏకంగా ఆరువందల మందిని హతమార్చడం చూశాం. అలా ఆరంభమైన ఆ ప్రయత్నం నానాటికీ మరింత దుర్మార్గంగా, అమానుషంగా అమలు జరుగుతోంది. ట్రంప్ కళ్ళలో ఆనందం చూడటానికి, ఆయన అనుమతితోనే ఈ మారణకాండను మళ్ళీ మొదలెట్టానని అప్పట్లో చెప్పిన నెతన్యాహూ ఇప్పుడు అదే ఆప్తమిత్రుడి కోరికమీద కాసిన్ని ఆహారధాన్యాలు గాజాలోకి అనుమతించాలని నిర్ణయించుకున్నారు.
ఆకలిచావుల చిత్రాలు చూడటానికి ట్రంప్ దొరవారు ఇష్టపడకపోవడంతో కడివెడు అవసరమైనచోటకు ఒక గరిటెడు పంపడానికి నెతన్యాహూ సరేనన్నారు. ఐదునెలల తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహూ గాజా మొత్తం ఖాళీ అయ్యేదాకా యుద్ధం ఆగదంటూ ఒకేఒక్కముక్కలో అసలు విషయాన్ని తేల్చేశారు. అమెరికా అధ్యక్షుడి ఆలోచన అద్భుతం, అమోఘం అని తెగమెచ్చుకుంటూ, ఇది పశ్చిమాసియా తీరుతెన్నులనే మార్చేస్తుందన్నారు. లక్ష్యసాధనలో కచ్చితంగా విజయం సాధిస్తామని, ఏడాదిన్నరలోనే అనుకున్నది సాధిస్తానని అంటున్నారు. ఇప్పటికే ఓ అరవైవేలమంది సామాన్యులను ఊచకోతకోసి, సగటున రోజుకోవందమందిని హతమారుస్తున్న నెతన్యాహూ ఈ లక్ష్యసాధనకోసం మరింత దుర్మార్గంగా ప్రవర్తించబోతున్నారని అర్థం. ఇజ్రాయెల్‌మీద దాడిచేసిన హమాస్‌ను దుంపనాశనం చేస్తానంటూ ఆరంభించిన ఈ యుద్ధాన్ని ఆయన ఇంకా అవేమాటలు వాడుతూ మరో అవసరం కోసం కొనసాగిస్తున్నారు. లక్షలాదిమంది ప్రాణాలను, జీవితాలను ఇజ్రాయెల్‌కు బలిపెట్టిన హమాస్‌ను ఇప్పటివరకూ నెతన్యాహూ ఎంతమేరకు దెబ్బతీయగలిగారో తెలియదు కానీ, గాజామొత్తం నామరూపాల్లేకుండా పోయింది. కంటిఎదుట కన్నబిడ్డలు కన్నుమూస్తున్నా ఏడ్చే ఓపికలేని తల్లులు, ఆకలితో మరణిస్తున్న పిల్లలూ వృద్ధులతో స్మశానంలాగా మారిన గాజాలో ఒక్క ఆస్పత్రిని కూడా మిగలనివ్వలేదు నెతన్యాహూ. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలకు కాస్తంత మనసుకరిగి, ఆగ్రహం కలిగి, వాణిజ్యచర్చలను బందుపెట్టినందువల్ల ఇజ్రాయెల్ అధినేత ఈ కాస్తంతైనా దిగివచ్చి, నాలుగుమెతుకులు అందించడానికి ఒప్పుకున్నాడు. అంతేకాని, గాజావాసులకు కడుపునిండా అన్నంపెట్టి, పుట్టినచోటే ఉండనిచ్చే ఆలోచన తనకు లేదని ఆయన తేల్చేశాడు. అగ్రరాజ్యాధినేత అభీష్టానికి అనుగుణంగా, ఆకలితో పూర్తిగా చావనివ్వకుండా ఉంచి, ఆయుధాలతో మిగతాపని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన.
Updated Date - May 24 , 2025 | 05:33 AM