Cold War History: భూతాలు సృష్టికర్తలనూ ధిక్కరిస్తాయి
ABN, Publish Date - May 20 , 2025 | 03:03 AM
అమెరికా యొక్క పాత్ర, ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగేలా చేయడంలో ప్రధానమైనది. 1980లలో పాకిస్థాన్‌లో లఘుపాటి యుద్ధాల వల్ల అమెరికా తన సామ్రాజ్యవాద ప్రవర్తనతో అనేక దేశాల రాజకీయాలను ప్రభావితం చేసింది.
‘ప్రజల జ్ఞాపకశక్తి చాలా స్వల్పం’ అనే మాట మనం తరచూ వింటూంటాం. దీన్నొక బలహీనతగా రాజకీయ నాయకులు భావిస్తారు. ప్రజలు దీన్ని అధిగమించలేరనీ, అందుకే పాత వాగ్దానాలను విస్మరిస్తున్నా, గతంలో చేసిన ఘోర తప్పులను చేయలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నా నెగ్గుకు రాగలుగుతున్నామనీ నమ్ముతారు. నిత్యజీవన సమరంలో ఏదోరకంగా బండి నెట్టుకు రావటానికే శక్తులన్నీ కూడదీసుకుంటున్న సగటు మనిషి విస్తృత సమాజంలో జరిగే పరిణామాలను ఒక లెక్క ప్రకారం గుర్తుపెట్టుకోలేడు. వాటి ఆధారంగా మంచిచెడులపై అన్ని సందర్భాల్లోనూ స్పందించలేడు. బహుళపార్టీ ప్రజాస్వామ్యంలో సైతం కపటత్వానికీ, మోసానికీ, వాగ్దాన భంగతకూ ఈ బలహీనతే ప్రధానకారణం. సాధ్యమైనంతవరకూ సాధారణ ప్రజలను వర్తమానంలోనే ఉంచి చరిత్ర స్పృహలేకుండా చేయటంలోనే దారుణాలన్నీ విస్మరణకు గురవుతాయి. వాటికి కారణమైన రాజకీయ పార్టీలూ, వ్యక్తులూ పాపంలో తమకు వాటాలేదన్నట్లుగా వ్యవహరిస్తూ పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు. పహల్గాం దారుణం తర్వాత భారత్–పాక్ మధ్య సాగిన సైనిక దాడులు, ప్రతిదాడులను ప్రస్తావిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. భారత్–పాక్ మధ్య నెలకొన్న వైషమ్యాల్లో అమెరికా పాత్ర లేనేలేదనీ వాటితో తమకున్న సంబంధం ఏమిటనీ ప్రశ్నించారు. మే 9న ఈ ప్రకటన చేసి 10వ తేదీకల్లా మాటమార్చి భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణకు తమ మధ్యవర్తిత్వమే కారణమని చెప్పుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే భారత్–పాక్‌ల మధ్య సైనిక సంఘర్షణలను ఆపివేసి అణుయుద్ధ ప్రమాదం నుంచి ప్రపంచాన్నే రక్షించానని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. మొత్తం వ్యవహారంలో అమెరికా పాత్ర ఎంతో ఇప్పుడే చెప్పలేం. కాలం గడిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. యుద్ధ సమయాల్లో ప్రభుత్వాలు అసలు విషయాలన్నిటినీ చెప్పవు. పాక్షిక సత్యాలనే చెబుతాయి. విజయగాథలనే ఎక్కువగా వినిపిస్తాయి. వైఫల్యాలను విస్మరిస్తాయి. తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తాయి. నిష్పాక్షికంగా చరిత్రను పరిశీలిస్తే భారత్–పాక్ మధ్య సంఘర్షణలకు దోహదం చేస్తున్న ప్రతివిషయంలోనూ అమెరికా పాత్ర గణనీయంగానే కనపడుతుంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్నే తీసుకుంటే అమెరికా నిర్వహించిన పాత్రను తక్కువచేసి చూడలేం. 1980లకు ముందు కూడా భారత ఉపఖండంలో మతతత్వాలు ఉన్నాయి. హిందూ–ముస్లింల మధ్య సంఘర్షణలకు లక్షలమంది బలైపోయారు. ముస్లింలను ప్రత్యేక జాతిగా పేర్కొంటూ వారి కోసం పాకిస్థాన్ ఏర్పడాలనే వాదమూ, హిందువుల ఆధిపత్యమే చెల్లుబాటు కావాలనే సిద్ధాంతమూ అనేక రూపాల్లో వ్యక్తమై విపరీత సంఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. దీన్ని అతికష్టం మీద అధిగమించి భారత్‌లో లౌకిక రాజ్యాంగాన్ని, ఆధునిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచగలిగారు. మతప్రాతిపదికగా పాకిస్థాన్ దేశంగా ఏర్పడినా లౌకిక రాజ్యాంగాన్ని, ఆధునిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరుచుకోలేక తొలి నుంచీ సంక్షోభాల్లో, నియంతృత్వాల్లో కూరుకుపోయింది. కశ్మీర్ సమస్యపై 1980ల వరకూ భారత్–పాక్‌ల మధ్య మూడు యుద్ధాలు జరిగినా ఇస్లామిక్ తీవ్రవాదం వ్యవస్థీకృతంగా మారి, విపరీత సిద్ధాంత ప్రచారంతో, టెర్రరిస్టు చర్యలతో పెనుసమస్యగా పరిణమించలేదు. 1979లో ఆఫ్గానిస్థాన్‌లో రష్యను సేనల ప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా–రష్యాల మధ్య 1945 నుంచి కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం (కోల్డ్‌వార్) అప్పటి నుంచి కీలకమలుపు తిరిగింది. రష్యను సేనలను ఆఫ్గాన్ నుంచి పారదోలటానికి అమెరికా అనుసరించిన వ్యూహం, చేపట్టిన చర్యలు ప్రపంచచరిత్రనే రక్తసిక్తం చేశాయి.
ఆల్‌ఖయదా, ముజాహిద్దీన్, తాలిబాన్ లాంటివే కాదు ఇంకా వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తూ అనేక దేశాలను కుదిపివేస్తున్న టెర్రరిస్టు ముఠాలన్నీ అమెరికా ఆఫ్గాన్ వ్యూహం నుంచే ప్రాణం పోసుకున్నాయి. ఆ వ్యూహం అమలుకు కార్యక్షేత్రంగా పాకిస్థాన్ మారిపోయింది. అక్కడి సైనిక నియంతృత్వాన్ని ఆ వ్యూహమే బలోపేతం చేసింది. పాకిస్థాన్ సమాజాన్ని సైనిక ఉక్కుచట్రంలో బంధించింది. మతం ఆధారంగా తీవ్రవాదాన్ని సృష్టించటం సాపేక్షికంగా తేలిక. కానీ అది బలపడిన తర్వాత దాన్ని నియంత్రించటం చాలా కష్టం. అగ్రరాజ్యాలు అత్యాధునిక ఆయుధాలను తయారు చేయొచ్చు. మానవరహిత ఆయుధాలతో మారణహోమాలను సృష్టించొచ్చు. కానీ హృదయాల్లో పాతుకుపోయిన భావాలను పెకలించటం కష్టమైన పని. మతతత్వ భూతాలకు ప్రాణంపోసిన తర్వాత అవి స్వతంత్రజీవుల్లా వ్యవహరిస్తాయి. సొంత లక్ష్యాలను ఏర్పరచుకుంటాయి. అలా వ్యవహరించబట్టే ఆల్‌ఖయదా చేతుల్లో అమెరికా కనీవినీ ఎరగని దారుణాన్ని, భయోత్పాతాన్ని చవిచూసింది. పాకిస్థాన్‌కూ ఈ గతి తప్పటంలేదు. అమెరికా కోసం ఆఫ్గానిస్థాన్‌లో, కశ్మీర్ కోసం భారత్‌లో తీవ్రవాదులను తయారుచేసి పులిమీద స్వారీ చేస్తోంది. చివరికి ఆఫ్గానిస్థాన్ నుంచే తీవ్ర అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోంది. బలూచీస్థాన్‌పై పట్టును కోల్పోతోంది. తాను సృషించిన తాలిబన్లలోని ఒక శాఖే పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ అమెరికా చరిత్రకారుడు స్టాన్లీ వోల్‌పర్ట్ 2010లో పేర్కొన్న ప్రకారం ముస్లిం టెర్రరిస్టులు అధికంగా ఉన్న దేశం పాకిస్థానే. డబ్బులు, ఆయుధాలు ఇచ్చినంత మాత్రాన తీవ్రవాద సిద్ధాంతానికి ప్రాచుర్యం లభించదు. దాన్ని మించి చేయగలగాలి. అమెరికా అదీ చేసింది. ఇస్లాం గొప్పమతమనీ, అది తీవ్ర ప్రమాదంలో పడిందనీ, దేవుడిని నిరాకరించే కమ్యూనిస్టుల చేతుల్లోకి అఫ్గానిస్థాన్ వెళ్లిపోయిందనీ, ప్రతి ముస్లిమూ పవిత్రయుద్ధాన్ని (జిహాద్) చేయాల్సిన పరిస్థితి వచ్చిందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది.
ఆఫ్గాన్‌లో పవిత్రయుద్ధానికి తరలిరావాల్సిందిగా రకరకాల రూపాల్లో ముస్లింలకు పిలుపునిచ్చింది. అరబ్బు, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాల నుంచే గాక యూరపు నుంచి కూడా ముస్లింలు తరలివచ్చారు. అయితే ఆఫ్గానిస్థాన్ నుంచి పొట్టచేతబట్టుకుని పాక్‌కు తరలివచ్చిన 40 లక్షల మందితో పోల్చితే వీళ్ల బలగం చాలా తక్కువ. తరలి వచ్చిన వారిలో అనువైన లక్షలాది వ్యక్తులకు ఆయుధాలు, డబ్బుని సమకూర్చి రష్యాసేనలపై మెరుపుదాడులకు శిక్షణ ఇచ్చారు. ఐఎస్‌ఐ, సీఐఏ నేతృత్వంలో శిక్షణశిబిరాలు ఏర్పాటయ్యాయి. కొత్త మదరస్సాలు, మతప్రచార సంస్థలూ పుట్టుకొచ్చాయి. వీటిల్లోనే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నూరిపోశారు. ఆఫ్గాన్ యుద్ధం కోసం పాకిస్థాన్‌కు అమెరికా 1980ల్లో 10 బిలియన్ డాలర్లను ఇచ్చింది. అప్పటికి కొన్ని నెలల ముందు పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీసిన మిలటరీ నియంత జియా ఉల్ హక్‌పై వ్యతిరేకత కూడా మొదలైంది. ఆఫ్గాన్‌లో పవిత్రయుద్ధం జియా గతిని మార్చివేసింది. 11 ఏళ్ల జియా నియంతృత్వ పాలనలో ఇస్లాం తీవ్రవాదం ఎప్పుడూలేని రీతిలో బలపడింది. అమెరికా తన మీద ఆధారపడటాన్ని అలుసుగా తీసుకుని పంజాబ్‌లో ఖలిస్థానీ తీవ్రవాదాన్ని కూడా జియా ఎగదోశాడు. అమెరికా సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో అన్నివైపులా దాడులకు గురైన రష్యాసైన్యం 1989 చివరినాటికి ఆఫ్గాన్ నుంచి వైదొలగింది. రష్యన్ల బెడద తొలగిన తర్వాత తీవ్రవాదులు కశ్మీర్‌లోకి అడుగుపెట్టటం ప్రారంభించారు. అప్పటికే కశ్మీరీ ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి పోయింది. ఆర్టికల్ 370 కల్పించిన ప్రత్యేకతలన్నీ అప్పటికే చాలా భాగం తొలగిపోయాయి.
భూముల కొనుగోలు, ఉద్యోగాల్లో స్థానికత మినహా మిగతా ప్రత్యేకతలంటూ ఏమీలేవు. ఆర్థికాభివృద్ధి అంతంతమాత్రంగానే జరిగింది. 1947, 1965, 1971లో భారత్–పాక్ మధ్య జరిగిన యుద్ధాలు, అంతర్గత అసంతృప్తుల వల్లా 1975 నాటికే సైన్యం ఇతర బలగాలు కలిపి 5 లక్షలకు పైగా భద్రతాదళాలు కశ్మీర్‌లో తిష్ఠవేశాయని వోల్‌పర్ట్ పేర్కొన్నారు. అధికార లెక్కల ప్రకారమే 1990–95 వరకూ 13000 మంది భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారనీ, అనధికార లెక్కల ప్రకారం ఆ సంఖ్య 50,000 దాకా ఉండొచ్చని కూడా వోల్‌పర్ట్ పేర్కొన్నారు. 2001 సెప్టెంబర్ 11 ఘటనల తర్వాత ‘వార్ ఆన్ టెర్రర్’ పేరుతో ఆఫ్గాన్‌పై అమెరికా మొదలుపెట్టిన యుద్ధంతో పాకిస్థాన్‌కు మరోసారి 10 బిలియన్ల డాలర్లు వచ్చిపడ్డాయి. ఆల్‌ఖయదా తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చిన తాలిబన్లు ఆఫ్గాన్‌లో 1996లోనే అధికారంలోకి వచ్చారు. రష్యన్ వ్యతిరేక ఆఫ్గాన్ యుద్ధంలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితితో అనాథలైన పిల్లల నుంచి తాలిబాన్లు తయారయ్యారు. ఛాందస ముల్లాల నేతృత్వంలో కుటుంబ ప్రేమలు లేకుండా కరడుకట్టిన మధ్యయుగాల భావాలతో పెరిగిన తాలిబన్లకు... ఆధునిక నాగరికతతో వచ్చిన ప్రతి సాంకేతిక సౌకర్యంతో పాటు సంగీతం, శిల్పం, చలనచిత్రం ఇస్లాంకు విరుద్ధంగానే కన్పించాయి. అట్లాంటి తాలిబన్లతో యుద్ధం ఆరంభించి, 2.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి మధ్యలోనే అమెరికా కాడి కింద పడవేసింది.
2021 నాటికి ఆఫ్గన్ నుంచి పూర్తిగా వైదొలగి తాలిబన్లకు తిరిగి అధికారాన్ని అప్పగించింది. ఒకసారి అగ్రరాజ్యం చేతిలో ఓడిపోయిన గెరిల్లాలు రెండోదఫా అదే రాజ్యంపై 20 ఏళ్లపాటు యుద్ధరంగంలో నిలబడి విజయం సాధించటం ప్రపంచంలోనే అరుదనీ ప్రముఖ జర్నలిస్టు అహ్మద్ రషీద్ వ్యాఖ్యానించారు. ఏ కోణం నుంచి చూసినా ఇస్లాం తీవ్రవాదం బలపడటంలో అమెరికా ఆధిపత్య దాహం నిర్వహించిన పాత్ర విస్మరించలేనది. అమెరికా అండతోనే భారత్‌తో పాక్ రెండుసార్లు యుద్ధానికి తలపడింది. రెండు కీలక ఒప్పందాల్లో (సీఈఎన్‌టీఓ, ఎస్‌ఈఏటీఓ) పాక్‌ను అమెరికా భాగస్వామిని చేసుకోవటంతో కశ్మీర్ సమస్యపై భారత్ పట్టువిడుపుల్లేకుండా వ్యవహరించాల్సి వచ్చింది. చరిత్ర ఇంకో వాస్తవాన్ని కూడా మన కళ్ల ముందు ఉంచుతోంది. రణతంత్రంలో సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించినా కశ్మీరీ ప్రజల హృదయాలను గెలవటం అంతకంటే ముఖ్యమనే ఆధునిక చరిత్ర చెబుతోంది. రాష్ట్రహోదాను పునరుద్ధరించటం అందుకు మొదటిమెట్టు కావచ్చు. నియంత్రణరేఖను అంతర్జాతీయ సరిహద్దుగా మార్చటానికి ఇతరదేశాల మద్దతు సంపాదించటం మరో మెట్టూ కావచ్చు! వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఆ ప్రయత్నం కొంత జరిగింది. వైషమ్యాల కాలం ముగిస్తేనే జనాకర్షక నినాదాలు తొలగి నిబ్బర ఆలోచనలతో నిజమైన అడుగులు పడతాయి. శత్రు పరివేష్టితం ఎప్పటికీ శ్రేయస్కరం కాదు.
Updated Date - May 20 , 2025 | 03:05 AM