Dynastic Politics: ప్రజాస్వామ్య త్రాసులో మోదీ, ఇందిర
ABN, Publish Date - Jun 27 , 2025 | 05:24 AM
ఈ జూన్ తొలినాళ్లలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తన దైనందిన ట్వీట్‌లలో Emergency@11 అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. అధికారంలో ఉన్నవారు వివిధ తప్పులు, పొరపాట్లు, నేరాలకు పాల్పడ్డారని ఆ పోస్ట్‌లలో ఆయన ఆరోపించారు.
ఈ జూన్ తొలినాళ్లలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తన దైనందిన ట్వీట్‌లలో Emergency@11 అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. అధికారంలో ఉన్నవారు వివిధ తప్పులు, పొరపాట్లు, నేరాలకు పాల్పడ్డారని ఆ పోస్ట్‌లలో ఆయన ఆరోపించారు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి ఈ జూన్ ఆఖరివారంలో యాభై సంవత్సరాలు పూర్తవనున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం తప్పక ఉపయోగించుకుంటుందనే తెలివిడితోనే జైరామ్ రమేశ్ ఆ హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు. తద్వారా, ఇందిర అమలుపరిచిన ఎమర్జెన్సీ రెండేళ్ల కంటే తక్కువ కాలంలోనే ముగిసిందని, మోదీ నిరంకుశాధికార పాలన ఒక దశాబ్దానికి పైగా విస్తరించి, కొనసాగుతోందని రమేశ్ అభిప్రాయపడ్డారు. ఇందిర ప్రధానమంత్రిత్వ కాలంలో నేను యుక్తవయస్కుడినయ్యాను. మోదీ ఏలుబడి రోజుల్లో వృద్ధాప్యంలోకి ప్రవేశించాను. నా వ్యక్తిగత అనుభవాలు, విద్యా విషయిక పరిశోధనల ఆధారంగా ఇందిర, మోదీ పరిపాలనా తీరుతెన్నులను తులనాత్మకంగా విశ్లేషించేందుకు ఈ కాలమ్‌ను ఉద్దేశించాను. రెండు భిన్న భావజాలాల నేపథ్యమున్న ఈ ఇరువురు ప్రధానమంత్రుల పరిపాలనల మధ్య ఐదు పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. తొలుత ప్రస్తావించవలసిన సామ్యం– ఇందిర వలే మోదీ సైతం రాజకీయ అధికారాన్ని తన వ్యక్తిపూజను పెంపొందించడానికి పూర్తి స్థాయిలో వినియోగించారు. పార్టీ, ప్రభుత్వం, రాజ్యం, జాతికి తానే సర్వస్వమని, వాటి మూర్తీభవించిన రూపమే తాను అన్న ప్రచారాన్ని ప్రోత్సహించారు. ఇందుకు పన్నుల రూపేణా ప్రజలు చెల్లించిన సొమ్మును విచ్చలవిడిగా వినియోగించారు. రెండోది–ప్రజాస్వామిక పాలనకు కీలకమైన రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచేందుకు ఇందిర వలే మోదీ సైతం దీక్షగా పనిచేశారు. ‘నిబద్ధ న్యాయవ్యవస్థ’ ‘నిబద్ధ ఉద్యోగ స్వామ్యం’ గురించి మొట్టమొదట మాట్లాడిన దేశ పాలకురాలు ఇందిర.
మోదీ ఆ భావాలను అంగీకరించారు; తన సొంత రీతుల్లో అమలుపరిచారు. మోదీ లాంఛనంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించకపోయినప్పటికీ రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యం పట్ల ఇందిర వలే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సత్యాలు, వాస్తవాలను వెల్లడించవద్దని పత్రికారంగాన్ని ఇందిర బెదిరించారు; అబద్ధాలు చెప్పాలని మీడియాను మోదీ బలవంతపెట్టారు. మూడవది– మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన మంత్రిని ‘సమానులలో ప్రథముడు’గా పరిగణిస్తారు. అమెరికా అధ్యక్షుడు వలే మన ప్రధానమంత్రి సర్వాధికారాలు చెలాయించేందుకు ఆస్కారం లేదు. అయితే ఇందిర తన కేబినెట్ సహచరులతో చర్చలు, సంప్రదింపులతో కాకుండా ఏకపక్ష నిర్ణయాలతో పాలన చేశారు. అధికార బాధ్యతల నిర్వహణలో ఆమె కేవలం ఒకే ఒక్క వ్యక్తి సలహాలు తీసుకునేవారు, పాటించేవారు. ఆ ఏకైక వ్యక్తి తొలుత పీఎన్ హక్సర్ కాగా ఆ తరువాత సంజయ్‌గాంధీ. ఇందిర వలే మోదీ సైతం ఒకే ఒక్క వ్యక్తిని సంప్రదిస్తారు, అతడి సలహాలనే తీసుకుంటారు. ఆ ఒకే ఒక్కడు అమిత్ షా. షాను మాత్రమే మోదీ విశ్వసిస్తారు. అమిత్ షా సైతం తన బాస్ వలే అపారదర్శక, నిరంకుశ పాలనాపద్ధతులకు అనుకూలుడు. నాల్గవది– ఇందిర వలే మోదీ సైతం భారతీయ సమాఖ్య పాలనా విధానాన్ని నిస్సారం చేశారు. కాంగ్రేసేతర పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించేందుకు ఇందిర రాజ్యాంగ అధికరణ 356ను విచక్షణారహితంగా ప్రయోగించేవారు; పక్షపాత రహితంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన గవర్నర్లను బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు లేదా విధేయంగా చేసుకునేందుకు మోదీ సర్కార్ ఉపయోగించుకుంటోంది. ఐదవది– తన పాలనను సుస్థిరం చేసుకునేందుకు దేశ ప్రజలలో తీవ్ర జాతీయవాద భావోద్వేగాలను మోదీ రగిలించారు. భారతీయుల ఆకాంక్షలను తాను మాత్రమే నెరవేర్చగలనే భావాన్ని ప్రజల మనస్సుల్లో పాదుకొల్పేందుకు ఇందిర వలే మోదీ కూడా పార్టీని, రాజ్య వ్యవస్థను, మీడియాను పూర్తిగా ఉపయోగించుకున్నారు. శ్రుతిమించిన దేశభక్తిని రెచ్చగొట్టడం ద్వారా తనపై వస్తున్న విమర్శలు దురుద్దేశపూర్వకమైనవని, వాటి వెనుక విదేశీ ప్రభుత్వాల ప్రమేయముందని మోదీ పదే పదే ఆరోపిస్తుంటారు. ఈ విషయంలో ఇందిర మరింత ముందుకు వెళ్లి మహోన్నత దేశభక్తుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను ‘పాశ్చాత్య దేశాల ఏజెంట్’ అని ఆరోపించారు. ఇందిర నియంతృత్వ పద్ధతులలో పాలించినప్పటికీ రాజ్యాంగం నిర్దేశించిన బహుళత్వ భారత్ భావనను మనసా వాచా కర్మణా సమర్థించారు.
దేశ పౌరసత్వాన్ని భాష, మతం, జాతి పరంగా నిర్వచించని విశాల భావన అది. జవహర్‌లాల్ నెహ్రూ నిస్సందేహంగా నియమబద్ధమైన లౌకికవాది. ఆయన సైతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఒక ముస్లిం నాయకుడు ముఖ్యమంత్రిగా నియమితుడు అయ్యేందుకు దోహదం చేయలేకపోయారు. తండ్రికి భిన్నంగా ఇందిర తన పాలనలో నలుగురు ముస్లిం నేతలను ముఖ్యమంత్రి పదవిలో నియమించారు. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం సిక్కు మతస్తులు అయిన తన అంగరక్షకులను తొలగించేందుకు ఆమె నిర్ద్వంద్వంగా నిరాకరించారు. ఇందిరకు పూర్తిగా భిన్నమైన పాలకుడు నరేంద్ర మోదీ. మెజారిటీవాదాన్ని మినహాయింపులు లేకుండా విశ్వసించే నాయకుడు. సహచర స్వయం సేవక్‌ల వలే హిందూ రాష్ట్ర నిర్మాణానికి దీక్షాదక్షతలు చూపుతున్న పాలకుడు. ఆయన సంకల్పించిన హిందూ రాష్ట్రంలో దేశ రాజకీయాలు, సాంస్కృతిక విలువలు, పాలనా పద్ధతులు ఎలా ఉండాలో పూర్తిగా మితవాద హిందువులు మాత్రమే నిర్ణయిస్తారు, నిర్దేశిస్తారు. ఈ హిందూ రాష్ట్రంలో ముస్లింలే కాకుండా క్రైస్తవులు సైతం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిందే. మోదీ 11 సంవత్సరాల పాలన ఆయన నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఎంత కపటమైనదో బయల్పరిచింది. బీజేపీ 2014, 2019, 2024 సార్వత్రక ఎన్నికలలో లోక్‌సభకు పంపించిన 800 మందికి పైగా ప్రజాప్రతినిధులలో ముస్లిం సభ్యుడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు! ఇందిర నికార్సయిన లౌకికవాది. మెజారిటేరియన్ మోదీకి పూర్తిగా భిన్నమైన నాయకురాలు. ఇక వారిరువురి మధ్య ఉన్న మరో ప్రధాన వ్యత్యాసం ఆమెకు అపకీర్తిని తెచ్చింది. అత్యవసర పరిస్థితి కాలంలో పార్టీలోను, ప్రభుత్వంలోను సంజయ్‌గాంధీని తనకు వారసుడుగా ప్రకటించారు. 1980లో విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆ తరువాత ఆమె తన పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీని తనకు వారసుడుగా రాజకీయాలలోకి తీసుకువచ్చారు. అలా వారసత్వ రాజకీయాలను ఆమె కొనసాగించారు. ఈ అపాయకరమైన ఆచరణ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైనది.
భారతదేశ పురాతన రాజకీయపక్షాన్ని ఇందిర ఒక కుటుంబ సంస్థగా మార్చివేయడం ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆదే విధంగా వ్యవహరించేందుకు ప్రోత్సాహం కల్పించింది. శివసేన, డీఎంకే, అకాలీదళ్, టీఎమ్‌సీ అధినేతలు తమ తమ రాష్ట్రాల పేరు ప్రతిష్ఠలు పెంపొందించేందుకు ప్రథమ ప్రాధాన్యమిచ్చేవారు. ఇప్పుడు ఠాక్రే, కరుణానిధి, బాదల్, బెనర్జీ కుటుంబాల పాలనను శాశ్వతం చేసేందుకు మాత్రమే వారు ప్రాధాన్యమిస్తున్నారు! మోదీ తల్లిదండ్రులు రాజకీయాలలో లేరు. ఆయనకు పిల్లలు లేరు. ఇది మోదీకి ఒక గొప్ప అనుకూలతను సమకూర్చింది. ఎన్నికలలో ఆయన విజయానికి తోడ్పడుతోంది. ప్రధానమంత్రి పదవి విషయంలో ఆయనకు ప్రత్యర్థి అయిన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యక్తిగతంగా ఎంత సౌశీల్యుడు, సమున్నతుడు అయినప్పటికీ రాజీవ్, సోనియాగాంధీల కుమారుడు, ఇందిరాగాంధీ మనవడుగా మాత్రమే గౌరవాదరాలు పొందుతున్నారు. మోదీ స్వయం కృషితో ఎదిగిన రాజకీయ నాయకుడు అని, రాహుల్ కేవలం కుటుంబ వారసత్వంతో సమున్నత పదవికి పోటీపడుతున్న నాయకుడు అనే భావన ప్రజల్లో బలంగా ఉందన్న విషయం విస్మరించలేనిది. ఇది, గత మూడు సార్వత్రక ఎన్నికలలో బీజేపీకి విశేషంగా తోడ్పడింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల వంశపారంపర్య రాజకీయాల కారణంగానే మోదీ పార్టీ ప్రాభవ ప్రాబల్యాలు పెరుగుతున్నాయి. ఇదొక కఠోర వాస్తవం. హిందూ మెజారిటేరియన్ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు కూడా ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు సుముఖంగా లేరు. ఇందిర ప్రధానమంత్రిత్వంలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ పరిణామాలలో ఒకటైన ‘వంశపారంపర్య అధికార హానికర ప్రభావం’ వర్తమాన భారత రాజకీయాలపై కొనసాగుతూనే ఉంది.
స్వతంత్ర భారతదేశ ప్రధానమంత్రులలో నిరంకుశత్వ స్వభావం సహజ ప్రవృత్తిగా ఉన్న ఇద్దరు ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ. ఎవరి పాలన ఎక్కువ చెడ్డది? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. స్వతంత్ర వెబ్‌సైట్‌లు, ప్రాంతీయ దిన పత్రికలు సత్యాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పగలుగుతున్నాయి. మే 2014 అనంతరం మితిమీరిన రాజకీయ జోక్యంతో మన రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి బాగా తగ్గిపోయింది. అధికారులు, దౌత్యవేత్తలు పాలకులతో చాలా వరకు రాజీపడ్డారు. ఉన్నతన్యాయ వ్యవస్థ స్వల్పంగా రాజీపడింది. పన్ను వసూళ్ల సంస్థలు, దర్యాప్తు సంస్థలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు తమ రాజకీయ యజమానులకు మరింతగా ‘నిబద్ధమయ్యాయి’. అలాగే ఎన్నికల సంఘం కూడా. బాగా ఆందోళనకరమైన విషయమేమిటంటే మోదీ పాలనలో మత సంకుచితత్వం బాగా పెచ్చరిల్లిపోతోంది. నిరంకుశాధికారితతో మెజారిటీవాద ధోరణుల కలయిక నరేంద్ర మోదీ పాలనాశైలి అత్యంత నష్టదాయక లక్షణంగా ఉన్నది. ఈ నష్టం తీవ్రమైనది, విస్తృతమైనది. ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ అంతిమంగా నిష్క్రమించిన తరువాత కూడా పరిస్థితులను బాగుపరిచి పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు దశాబ్దాల కాలం పట్టవచ్చు.
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - Jun 27 , 2025 | 05:28 AM