ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indias Semiconductor Revolution Begins: దేశంలో సెమీకండక్టర్ విప్లవం మొదలైంది

ABN, Publish Date - Sep 02 , 2025 | 12:30 AM

కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఒక గది మొత్తాన్నీ నింపేసే భారీ యంత్రాల్లా ఉండేవి. ఇప్పుడు మీ వేలి గోరుకన్నా చిన్నదైన చిప్ లోపల అనంతమైన శక్తి దాగి ఉంటుంది....

కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఒక గది మొత్తాన్నీ నింపేసే భారీ యంత్రాల్లా ఉండేవి. ఇప్పుడు మీ వేలి గోరుకన్నా చిన్నదైన చిప్ లోపల అనంతమైన శక్తి దాగి ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లు, కార్లు, రైళ్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్‌లు మొదలుకొని ఫ్యాక్టరీ యంత్రాలు, విమానాలు, అంతరిక్షంలో సంచరించే ఉపగ్రహాల దాకా ఇవే నడిపిస్తున్నవి. ఇదంతా సెమీ కండక్టర్ల మాయాజాలం! ఒక దేశం ప్రగతిపథంలో సాగాలంటే వృద్ధికి తోడ్పడే కీలక రంగాలపై పట్టు సాధించాలి. ఉక్కు, విద్యుత్తు, టెలికాం, రసాయనాలు, రవాణా, సెమీకండక్టర్లు వంటి రంగాలు దీనికి పునాదులు. వీటిలో సెమీకండక్టర్ల పాత్ర అత్యంత ప్రధానం. కర్మాగారాలు, వంతెనలు, రైల్వే రంగాల్లో ఉక్కు ప్రాథమిక అవసరం. అదే తరహాలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సెమీకండక్టర్లు మూలాధారాలు. చిప్‌లు లేనిదే ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయదు. డేటా ప్రాసెసింగ్ సహా కృత్రిమ మేధ మనజాలదు. పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు ఉండవు. రక్షణ రంగం సురక్షితంగా ఉండదు. అందువల్ల, సెమీకండక్టర్ల రంగంలో బలోపేతం కావడమనే అంశానికి పరిశ్రమను మించిన ప్రాధాన్యం ఉంటుంది.

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు సెమీకండక్టర్లే నేడు కేంద్రకంగా మారాయి. చిప్ తయారీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో స్వల్ప అంతరాయాలు కూడా ప్రపంచమంతటా అలజడి రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో అరుదైన లోహాలపై అన్ని దేశాలూ దృష్టి సారిస్తున్నాయి. కీలక వనరులపై నియంత్రణ ప్రపంచ శక్తి సమీకరణాల్లో ఎంత ప్రాముఖ్యతను ఇవ్వగలదో ఈ పరిణామం స్పష్టం చేస్తున్నది. దేశంలో ప్రస్తుతం 65 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులున్నారు. మన ఎలక్ట్రానిక్స్ తయారీ ఇప్పుడు ఏటా రూ.12 లక్షల కోట్లకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మనం కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, డేటా సెంటర్లు నెలకొల్పడంతోపాటు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని కూడా చేపడుతున్నాం. ఈ విధంగా డిమాండ్–ఆవిష్కరణ రెండింటా కనిపిస్తున్న పెరుగుదల ద్వారా ప్రపంచ సెమీకండక్టర్ విలువ శ్రేణిలో భారత్‌ తనదైన స్థానం సంపాదించుకోనున్నది. సెమీకండక్టర్ల విషయంలో మన దేశం దశాబ్దాలుగా అనేక అవకాశాలు కోల్పోయిందన్న మాట మనకు వినిపిస్తోంది. కానీ, ఇకపై ఆ పరిస్థితి మారనున్నది. ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ కింద దేశంలో 10 సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు ఆమోదముద్ర పడింది. వాటి నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలోనే తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ ఆవిష్కృతం కాగలదని మనం సగర్వంగా చాటగలం. గుజరాత్‌లోని సనంద్‌లోగల ఒక యూనిట్‌లో ఇప్పటికే ప్రయోగాత్మక ఉత్పత్తి మొదలు కావడంతో ఏడాదిలోగా వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని అంచనా. ఈ కర్మాగారాలు, సరఫరా శ్రేణులకు మద్దతు దిశగా అప్లైడ్ మెటీరియల్స్, లామ్ రీసెర్చ్, మెర్క్, లిండే.. వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ దీర్ఘకాల అభివృద్ధిపై ప్రధానమంత్రి కేంద్రీకృత దృష్టిని ఈ దృక్పథం ప్రతిబింబిస్తోంది.

ఏ కోణంలో చూసినా విధానం, పెట్టుబడులు అత్యంత ప్రధానం. అయితే, భారత్‌కు నిజమైన సానుకూలత దాని ప్రజానీకంలోనే ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ డిజైన్ శ్రామిక శక్తిలో భారత్‌ వాటా 20 శాతం కాగా, ఒక అంచనా ప్రకారం వచ్చే దశాబ్దారంభం నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్‌ నిపుణుల కొరత 10 లక్షలకు పైగా ఉంటుంది. ఈ అంతరాన్ని పూరించే దిశగా భారత్‌ నేడు ముందడుగు వేస్తున్నది. ఎందుకంటే– 350 పరిశ్రమలు, అంకుర సంస్థలలో 60వేలకు పైగా వినియోగదారులు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చే అంతర్జాతీయ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) ఉపకరణాలను వాడుతున్నారు. ఈ మేరకు 2025లోనే వీటి వాడకం 1.2 కోట్ల గంటల స్థాయిని దాటింది. ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు లభించడంతో అంకుర సంస్థలు భారత చిప్ డిజైన్ వ్యవస్థను శక్తిమంతం చేస్తున్నాయి. ఈ మేరకు ఐఐటీ–మద్రాస్‌ దేశీయంగా రూపొందించిన ‘శక్తి’ ప్రాసెసర్‌ సాయంతో ‘మైండ్‌గ్రోవ్ టెక్నాలజీస్’ సంస్థ ‘ఐఓటీ’ చిప్‌లను రూపొందిస్తోంది. ఇక ‘నేత్రసేమి’ అనే మరో అంకుర సంస్థ ఇటీవలే రికార్డు స్థాయిలో రూ.107 కోట్ల నిధిని సమీకరించుకోగలిగింది. దేశంలోని సెమీకండక్టర్‌ డిజైన్‌ రంగంలోనే ఇది అత్యంత భారీ వెంచర్‌ క్యాపిటల్‌ సమీకరణ. ఈ రంగంపై పెట్టుబడిదారులలో పెరుగుతున్న విశ్వాసానికి ఇదొక నిదర్శనం. ‘డిజైన్ సంధానిత ప్రోత్సాహకం’ (డీఎల్‌ఐ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనేక అంకుర సంస్థలకు చేయూత లభిస్తోంది. మొహాలీలోని సెమీ కండక్టర్ లాబొరేటరీ (ఎస్‌సీఎల్‌)లో 17 విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు ఇప్పటికే 20 చిప్‌లను తయారు చేశారు. రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని చిప్‌లను వారు ఆవిష్కరించగలరు. ఈ విధమైన నైపుణ్యాభివృద్ధి భారతదేశాన్ని సెమీ కండక్టర్ పరిశ్రమలో పటిష్ఠమైన స్థానంలో నిలబెడుతుంది. ఈ మేరకు యువ ఆవిష్కర్తల స్వప్న సాకారం దిశగా ‘ఎస్‌సీఎల్‌’ ఆధునికీకరణ చేపట్టారు. ఈ విధంగా భారత ప్రతిభ క్లాస్‌రూమ్‌ నుంచి క్లీన్‌రూమ్‌ వైపు మళ్లగలదనే భరోసా లభిస్తోంది. భారత యువతరం ప్రతిభపై ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మేరకు ‘లామ్ రీసెర్చ్’ సంస్థ దేశంలోని 60వేల మంది ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వనుంది. అలాగే అప్లైడ్ మెటీరియల్స్, ఏఎండీ, మైక్రోచిప్‌ సంస్థలు పరిశోధన–ఆవిష్కరణల కోసం 101 కోట్ల డాలర్ల పెట్టుబడికి హామీ ఇచ్చాయి. మరోవైపు ఐఐఎస్‌సీ, ఐఐటీలు తదితర సంస్థల భాగస్వామ్యంతో ప్రయోగశాల నుంచి తయారీ ప్రతిభగల (ల్యాబ్–టు–ఫ్యాబ్) బలమైన కార్మికశక్తి రూపకల్పనకు భరోసా లభిస్తోంది.

సెమీకండక్టర్ల రంగంలో భారత్ పురోగమనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిలో ఒక భాగం. డిజిటల్ మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటు పౌరులకు సాధికారతను ఇచ్చిన డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఇది శ్రీకారం చుట్టుకుంది. ఇండియా స్టాక్, యూపీఐ, ఆధార్, టెలికాం నెట్‌వర్కులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి భారతీయుడి వేలికొసలకు చేర్చాయి. ఈ పురోగమనానికి సమాంతరంగా మన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి వ్యవస్థను కూడా బలోపేతం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, పరికరాల కోసం తయారీ వ్యవస్థను రూపొందిస్తున్నాం. నేడు ప్రారంభమయ్యే సెమికాన్ ఇండియా సమ్మిట్ 2025, ఈ ప్రయాణానికి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి ఈ రోజు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం 48 దేశాల నుంచి 500 మందికి పైగా ప్రపంచ పారిశ్రామిక నాయకులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అనిశ్చితితో సతమతమవుతున్న ప్రపంచానికి స్థిరమైన భారత్ ఆశాకిరణం కాబట్టి, ప్రపంచం మన తలుపు తడుతోంది. ఇందులో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా దేశాల ప్రత్యేక పెవిలియన్లు అర్థవంతమైన సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రపంచవ్యాప్త పరిశ్రమల ప్రతినిధులు, యువ ప్రతిభావంతుల మధ్య ‘బి 2బి’ చర్చలు, అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్యాలు ఏర్పడే వీలుంటుంది. రాబోయే దశాబ్దంలో మన సెమీకండక్టర్ యూనిట్లు పరిపక్వతతో పాటు పరిమాణం రీత్యా ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. తద్వారా సెమీకండక్టర్ విలువ శ్రేణి మొత్తానికీ భారత్‌ ఒక పోటీతత్వ కూడలిగా నిలిచేందుకు సిద్ధమవుతోంది.

-అశ్వినీ వైష్ణవ్‌ కేంద్ర రైల్వే,

ఎలక్ట్రానిక్స్‌ & ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల మంత్రి

Updated Date - Sep 02 , 2025 | 12:30 AM